Previous Page Next Page 
కావేరి పేజి 20

    స్కూటర్ మీద నుంచి దిగకుండానే ఒక కాలు స్కూటర్ మీద మరొక కాలు నేల మీద ఆనించి విలాసంగా కళ్ళజోడుని ఎడమ చేత్తో తీసి పట్టుకుని అడుగుతుంటే విభ్రమంగా చూస్తూ వుండిపోయింది కావేరి.

    "అమ్మాయిగారూ! మీరు ఏ లోకంలో వున్నారు?"

    ఈసారి నాగులు గట్టిగానే అనేసరికి ఉలిక్కిపడింది కావేరి!

    అంతవరకూ ఆ డ్రస్ లో నాగులు చిరంజీవిలాగా, కమలహాసన్ లాగా, భానుచందర్ లాగా, చంద్రమోహన్ లాగా వివిధ రూపాలలో కనిపించేసరికి ఆ భావనలో నుంచి తేరుకోవటం చాలా కష్టమనిపించింది కావేరికి. ఇంతలో ఎంత మార్పు?

    "నేను మీ కోసమే వస్తున్నాను అమ్మాయిగారూ!"

    ఎందుకని అడగలేకపోయింది చేతిలోని కళ్ళజోడు, రంగురంగులతో వున్న షర్టు...అన్నింటికీ మించినది స్కూటర్!...యింత ఆధిక్యత ఎలా వచ్చిందా? అని అనుకున్నది.

    "అమ్మాయిగారూ! మీరేదో ఆలోచించుతున్నారు. నేను మీ కోసమే వచ్చాను! మీకని రంగురంగుల సినిమావాల్ పోస్టర్సుని సినిమాపాటల పుస్తకాలూ తెచ్చాను యివ్వాలని!..."

    నాగులు ఈసారి గట్టిగా అనే సరికి యిహలోకంలోకి వచ్చింది! తన ఏకాగ్రతకి తానే సిగ్గుపడింది.

    "అదికాదు నాగులూ! ఈ స్కూటరేమిటి? నువ్వు నడపటం ఏమిటి? నాకేదో వింతగా వుంది!" అంది కావేరి.

    "వింతే మరి!...యజమానితో కలిసి ఈ స్కూటర్ మీద బస్తీకి వెళ్ళేవాడిని! ఆయనే నన్ను కావాలని తీసుకెళ్ళేవారు. స్కూటర్ ఎలా నడిపేదీ చూసేవాడిని. ఎప్పుడయినా సినిమా హాలు దగ్గిర వదిలి కాబిన్ లో కూర్చొని పేకాట ఆడుకుంటూవుండేవారు. అప్పుడు నేను సినిమా హాలు చుట్టూ ఓ రౌండు వేసేవాడిని స్కూటర్ మీద.

    సినిమా బాక్సులు కోసం నన్నే పంపటం మొదలుపెట్టారు."

    నాగులు అలా చెప్పుతుంటే కనురెప్పవాల్చటం మర్చిపోయి అలాగే చూస్తూ వుండిపోయింది కావేరి.

    ఇంతలో ఎంతగా ఎదిగిపోయాడు నాగులు?...తాను చూసికూడా దగ్గిర దగ్గిర రెండు మూడు నెలలయింది ఇంతలోనే యింత మార్పా?

    "నేను చెప్పుతుంటే ఆశ్చర్యంగా వుందా అమ్మాయిగారూ? నాగులు అడిగేసరికి ఉలిక్కిపడింది కావేరి.

    "అవును!...నా కసలు నోటమాట రావటంలేదు!" అంది.

    "అవకాశం వున్నప్పుడే చొరవ చూపించాలి. చూడాలి! చూసి నేర్చుకోవాలి. వ్యాపారంలో అనుభవం సంపాదించాలి! నేను గొప్పవాడి నయిపోవాలి! ఇదే నా కోరిక. అందుకే యజమాని ఏ వేళ ఏ పని చెప్పినా విసుక్కోకుండా చేస్తుంటారు. ఇప్పుడు మా యజమాని విస్కీ బాటిల్ కొనుక్కుని రమ్మనమని పంపారు....ఇదే సమయమని యిలా వచ్చేశాను. మీకు యివి యిచ్చేసి వెళదామని!"

    "అంటే?...నీకు బ్రాందీలు, విస్కీల సంగతి కూడా తెలుసునా?"

    "ఆఁ. మా యజమానికి ఏ వేళ నయినా తెచ్చి పెట్టేది నేనే! నాకు అన్ని రకాల బ్రాందీల సంగతీ తెలుసు! త్రాగకపోయినాతెలుసుకోవలసిన అవసరం వుందనిపించింది....తెలుసుకున్నాను. నా కోసం మా యజమాని చూస్తూ వుంటారు. నేను వెళ్ళాలి?" అని స్కూటర్ కేస్ లో నుంచి ఓ డజను సినిమా పాటల పుస్తకాలు అయిదారు కలర్ పోస్టర్సు తీసి కావేరికి యిచ్చాడు.

    అమ్మో! నా జయసుధ ఎంత బాగున్నదో?" ఓ పాత పోస్టర్ లోని బొమ్మలు చూసి మురిసి పోయింది కావేరి.

    "జ్యోతి సినిమా పాత పోస్టర్ అది! నిన్నటి నుంచే మొదలు ఆ సినిమా! నాలుగురోజులకని అద్దెకి తెచ్చాం. కాని నిన్న యిసుకవేస్తే రాలని జనం! ఓ వారంరోజులు వుంచవలసి వచ్చేటట్టున్నది! జయసుధ యాక్షన్ అద్భుతం! చెప్పనలవికాదు! వీలుంటే ఈ రాత్రికిరండి సినిమాకి! నేను హాలుదగ్గర వుంటాను. యిప్పటికే ఆలస్యం అయింది! వస్తానమ్మగారూ!" అంటూ స్కూటర్ స్టార్టుచేసి కళ్ళజోడు పెట్టుకుని ఎక్కి వెళ్ళిపోయాడు నాగులు! అలా వెళ్తున్న నాగులుని ఆశ్చర్యంగా చూసింది.

    ఎవరూ రావటంలేదనుకుని సినిమా పాత పోస్టర్సుని క్రింద కూర్చుని నేలమీద పరిచి చూసుకొనసాగింది. ఆ అనుభూతిలో లీనమయి పోయిన కావేరి భుజంమీద చెయ్యి పడగానే ఉలిక్కిపడి తిరిగి చూసింది.

    సుబ్బులు! నవ్వుతూ నిలబడింది. తననూ వాల్ పోస్టర్సు నీ మార్చి మార్చి చూస్తోంది సుబ్బులు!

    "నువ్వా సుబ్బులూ? ఎవరోనని భయపడ్డాను!" అంది కావేరి వాల్ పోస్టర్సుని మడత పెడుతూ!

    "మీ వినయం బావ అనుకుని వుంటావు! అవునా?" పక్కనే కూర్చుంటూ అడిగింది కావాలనే!

    "లేదులే! మనసు బాగోక ఉలిక్కిపడ్డాను!"

    "ఏ? ఎందుకని బాగోలేదూ? మీ అమ్మా నాన్నలకి యిద్దరు కూతుళ్ళు! ఒక కొడుకు! వున్నంతలో ఫరవాలేదు మీకు! చక్కగా చదివించుతున్నారు మీవాళ్ళు! అంతకంటే కావలసినది ఏమున్నది? ఇంకెందుకు మనసు బాగోకపోవటం" కావాలనే అడిగింది.

    "నీకు చెప్పినా అర్ధం కాదులేవే!"

    "ఎందుకు అర్ధంకాదు! నువ్వు చెప్పాలేగాని!"

    కావేరి మౌనం వహించింది.

    "నీ పెళ్ళి మీ బావవినాయకంతో ఖాయమయిందటగా?" సుబ్బులే కావాలని అడిగింది. తన విషయం ఏమయినా తెలిసిందేమో? యిలా అడిగితే చెపుతుందన్న భావంతో.

    "అవునట! మంచి ఎమోషనల్ గా నాటకంలో నా పాత్రని చదువుకుంటున్నాను. అప్పుడు నేనుకాదు వున్నది నాలో జయసుధ ప్రవేశించి అమోఘంగా డైలాగ్సులో నటించేసింది. యింతలో మా అమ్మ మా వినాయకం బావతో నా పెళ్ళి మా కామాక్షి అత్తయ్యే ఖాయం చేసిందట! మంచి రోజు చూసి లగ్నం పెట్టించుతారట!"

    "అదేమిటి? అంత నీరసంగా, నిరుత్సాహంగా మాట్లాడుతున్నావు? ఈ పెళ్ళి నీకు యిష్టంలేదా? ఏమిటి?"

    "మా బావ అంటే యిష్టమేనే! కాని పెళ్లంటేనే యిష్టంలేదు?"

    "ఇంత తొందరగా ఎందుకు నిర్ణయించినదట మీ అత్తయ్య?"

    "అదేనే! నాకూ అర్ధంకావటంలేదు? పిల్లనిస్తానని మా నాన్న వెళ్ళి అడగవలసింది పోయి తనే అడిగేసిందట! యింకేముంది? మా అమ్మ నాన్నకీ ఎక్కడలేని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బులాడిపోతున్నారు. మా అక్కనీ బావనీ రమ్మనమని ఉత్తరం వ్రాస్తానన్నారు?"

    "నీ కేందుకని యిష్టంలేదు పెళ్ళి" తన విషయం కావేరికి తెలిసినందుకు లోలోపలే సంతోషించుతూ అడిగింది.

    "నాకు సినిమా తారవ్వాలని వున్నది! జయసుధలాగా జయప్రదలాగా అగ్రశ్రేణి తారనయి పోవాలనివుంది. తారని అవ్వాలంటే మద్రాసు వెళ్ళాలి! అందరినీ కలుసుకోవాలి! బోలెడన్ని రకాల పాత్రలలో నటించాలని వుంది! యివన్నీ తీరాలంటే ఎలా?"

    "పెళ్ళయిన తరువాత మీ బావని తీసుకుని మద్రాసు వెళ్ళి సినిమాల్లో ప్రయత్నం చెయ్యి! దీనికింత ఆలోచనదేనికి?"

    "మా బావకీ యిష్టం వుండదే? ఎంతయినా తల్లి చాటున కొడుకు కదా? మా అత్తయ్య యిష్టంలేనిదే ఎక్కడికీ తీసుకు వెళ్ళడు! నా కోరిక తీరేది కనిపించటంలేదు! ఏం చెయ్యాలో అర్ధం కావడంలేదు!"

    కావేరి అలా నిట్టూర్చుతుంటే సుబ్బులు మస్తిష్కంలో ఓ వాడి అయినా ఆలోచనకలిగింది. అంతలోనే కామాక్షమ్మమీద వినాయకరావుమీద కోపమూ వున్నది! తనను చేసుకోనిరాకరించిన కామాక్షమ్మ వినాయకరావుమీద పీకలవరకూ నిండిపోయివుంది! తనకే యిష్టంలేదని చెప్పవచ్చునుగా? మా అమ్మని అడగమని చెప్పి చివాట్లు వేయించుతాడా తల్లితో! తనను ఎలా చేసుకోడో చూస్తాను. అప్పుడుగాని అందరితలలూ వంచుకోవు!
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS