అతన్ని అనుసరించాడు రాజారామ్.
"మీకో విషయం చెప్పాలి సర్!"
'ఏమిటి'అన్నట్టు చూశాడు చైర్మన్.
"నేనూ అప్పారావు ఇందాక మాట్లాడుకున్నాంసర్. ఇద్దరిలో ఎవరో ఒకరు తప్పుకోవాలి అన్నట్టు అతను మాట్లాడాడు. అది నిజమే అన్పిస్తోంది నాకు కూడా! ఈ విషయమై ఇద్దరం ఘర్షణ పడ్డాం. కొట్టుకున్నాం కూడా!"
చైర్మన్ మొహం అదోలా మారింది.
"అతను కొట్టాడా?"
"లేదు సర్! నేనే కొట్టాను."
"ఏమైంది రాజా?"
తన అనుమానాలు, భయసందేహాలు చైర్మన్ కి చెప్పాలా వద్దా అని కాసేపు తటపటాయించాడు. చివరికి "ఓ పెర్సనల్ ఎఫైర్ లో గొడవ వచ్చింది సర్!"
"రాజా నువ్వు చాలా మంచివాడివి. ప్రతిభ కూడా ఉన్నవాడిని. నీ పనుల్లో వేలు పెట్టి చూపించడానికి ఏ తప్పూ కన్పించదు. ఐ లైక్ యూ! కాని ఆవేశాల్నీ, ఉద్రేకాల్నీ అదుపులో ఉంచుకోవడం మంచిది."
"నిజమే సార్. నేను రాజీనామా ఇచ్చి తప్పుకొందా మనుకుంటున్నాను."
"నేనీ విషయం విరించితో మాట్లాడ్తాను. అంతవరకూ నువ్వు ఆగు!" అంటూ చైర్మన్ ముందుకి నడిచాడు.
రాజారామ్ మళ్ళీ తన సీటు వేపు వెళ్ళాడు. అంతలోనే రమణీ, రాజేశ్వరి వచ్చారు. రమణి రాగానే తండ్రి మేడ చుట్టూ చేతులు వేసింది. భవానిని వాళ్లకు పరిచయం చేశాడు.
"ఏం రమణి నేను నీకు నచ్చానా?" అంది ఇన్ స్పెక్టర్ భావాన్ని.
"ఓ" అంది రమణి.
"మరేం లేదు. ఇవాళ్నుంచీ నేను నీ బాడీగార్డ్ ని. నువ్వు నాతోనే ఆడాలి. నాతోనే పాడాలి. నా మాట వినాలి. ఓకే?"
"ఓకే"
"హల్లో రాజా! హియర్ అయామ్! అంటూ ఇన్ స్పెక్టర్ మహావీర్ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.
"ఏమైంది" అన్నట్టు అందరూ అతని వేపు చూశారు.
"అదేమిటి? ఏమైంది మీ చేతికి?" అన్నాడు మహావీర్.
"మా ఎడిటర్ గారి దవడ వాయగొట్టాను."
"ఇంతకీ సయోధ్య కుదిరిందా మీమధ్య....ఈ దెబ్బతో?" అంటూ చమత్కరించాడు.
"ఏమైందో చెప్తా వినండి. అప్పారావు నిన్నన్నే పత్రిక ఎడిటర్ అయ్యాడు. ఇది వరకూ అతను నాకు అసిస్టెంటుగా పని చేసేవాడు. కొన్నాళ్ళు విజయవాడలో కూడా ఉన్నాడు. అతనికి సుందరి బాగా తెలుసునని నా అనుమానం!"
మీ అనుమానానికి కారణం ఉండాలి కదా?"
"ఉంది. విజయనగర్ కాలనీలో ఫ్యాన్సీ కార్నర్ అని ఓ షాప్ ఉంది. అక్కడా కూల్ డ్రింక్స్, స్టేషనరీ దగ్గర్నుంచి అన్ని రకాల వస్తువులూ దొరుకుతాయి. ఆ షాపు ప్రొప్రయిటర్ పేరు వీరయ్య, సుందరినీ అప్పారావునీ తన షాపులో ఓసారి చూసినట్టు అతను నాకు చెప్పాడు. కావాలంటే మీరతన్ని కనుక్కోవచ్చు. అప్పారావు నడిగితే నాకసలు సుందరి ఎవరో తెలీదు పొమ్మన్నాడు."
"అతనికి సుందరి తెలిసి కూడా, సమాచారం ఇవ్వడం లేదంటే అది నేరం కిందకి వస్తుంది. ఇతని పేరేమిటన్నారు?"
"అప్పారావు"
"పదండి అతనితో మాట్లాడతాను." అంటూ ఇన్ స్పెక్టర్ మహావీర్ లేచాడు.
ఇద్దరూ అప్పారావు గదివేపు నడిచారు. తలుపు తడితే జవాబు లేదు. మహావీర్ గట్టిగా కొట్టాడు. అయినా సమాధానం లేదు. బలం అంతా ఉపయోగించేసరికి తలుపు ధనాలున తెరుచుకుంది.
లోపల దృశ్యం చూసి ఇన్ స్పెక్టర్ మహావీర్ నిశ్చేష్టుడయ్యాడు. రాజారామ్ నిర్ఘాంతపోయాడు.
లోపల కార్పెట్ మీద అప్పారావు బోర్లా పడి ఉన్నాడు. మహావీర్ అక్కడికి వెళ్ళి కింద కూర్చున్నాడు. ఏదో పరీక్ష చేసి నిలబడ్డాడు. రాజారామ్ ని చూస్తూ "చచ్చి పోయాడు" అన్నాడు.
రాజారామ్ కి మతిపోయింది.
"అంత గట్టిగా కొట్టారా మీరతన్ని"
"నేను కొట్టినప్పుడు బోర్లాపడ్డాడు. ఇప్పుడు వెల్లకిలా పడి ఉన్నాడు...
మహావీర్ దృష్టిని ఏదో ఆకర్షించింది. ఇత్తడి పూలకుండీ... ... దాని అడుగున రక్తం...
రాజారామ్ కాలికింద ఏదో గట్టిగా తగిలినట్టయింది. వంగి తీశాడు. చెవి రింగు! 'ఎస్' అన్న ఆకారంలో నీలంరంగు రాళ్ళు...
"ఏమిటది" అన్నాడు మహావీర్."
"చెవి రింగు. ఇలాంటిదే ఒకటి సుమిత్ర యింటిలో నేను చూశాను."
"అప్పారావుని కలుసుకోవడానికి సుందరి వచ్చి ఉంటుంది. అప్పారావు మరింక ఆమె గురించి ఏమీ చెప్పలేడు..."సాలోచనగా ఆగాడు మహావీర్.
"హంతకుడిని మీ అమ్మాయి చూసిన కొద్ది గంటల్లోనే అప్పారావు చావు సంభవించింది. సుందరీ, హంతకుడూ కలిసి ఆపరేట్ చేస్తున్నారన్న మాట. ఒకరు మీ అమ్మాయి వెంట పడ్డారు. మరొకరు అప్పారావు పని పట్టారు!"
ఆ మాటలు వినగానే రాజారామ్ గుండె ఝల్లుమంది!
7
ఆ గది తలుపు తీసుకుని బయటికి వచ్చిన రాజారామ్ ఎదురుగా ఉన్న దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు.
'ఆంధ్రా టైమ్స్, స్టాఫ్ మెంబర్లే కాకుండా, ఇతర దిన పత్రికల రిపోర్టర్లు కూడా అక్కడ పోగయ్యారు.
అప్పారావు గది బయట స్టూల్ వేసుకుని కూర్చునే ఆఫీసు బాయ్ ని దగ్గరకు రమ్మన్నాడు రాజారామ్. వచ్చాక "ఇవాళ అప్పారావు కోసం ఎవరెవరు వచ్చారు? ఎవరెవరు అతని గదిలోకి వెళ్ళారు?" అనడిగాడు.
"మీరు తప్ప ఆ గదిలోకి మరెవరూ వెళ్ళలేదుసార్" అన్నాడతను.
