Previous Page Next Page 
చీకట్లో నల్లపులి పేజి 20

    షో కేసుల్లో రకరకాల గౌన్లు....రంగు రంగుల గౌన్లు ఉన్నాయి. అవన్నీ రమణికి నచ్చాయి. ఆ గౌన్ల డిజైన్లనీ, రంగు రంగుల పువ్వుల్నీ చూస్తూ ఎవరో మంత్రించినట్లు నిలబడిపోయింది.

    అంతలో ఏదో అలికిడి అయింది.

    రమణి తల అటు తిప్పి చూసింది.

    సరిగ్గా మూడు గజాల దూరంలో...'అతను' నిలబడి ఉన్నాడు!

    అతని కళ్ళు కూడా రమణి వేపే చూస్తునాయి. అవి పులి కళ్ళలా మెరుస్తున్నాయి. ఆశ్చర్యంతో 'అతని' మొహం బాగా పాలిపోయి ఉంది. నిశ్చేష్టుడైనట్టు నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే రమణి గుండె ఝల్లుమని చాలాసేపు కొట్టుకోవటం మానేసింది. అల్లంత దూరంలో అంటే చాలా దగ్గర్లోనే....రాజేశ్వరి ఆంటీ ఉంది. గట్టిగా కేక వేద్దామంటే నోరు పెగలడం లేదు. రమణి కళ్ళలో నీళ్ళు నిండసాగాయి. మెల్లిగా వెనక్కి అడుగులు వెయ్యసాగింది.

    ఒక్కసారి ఎక్కడలేని ధైర్యం తెచ్చుకుని "ఆంటీ" అని గట్టిగా అరిచింది. ఆ కేక విని రాజేశ్వరి పరుగు పరుగున వచ్చింది. ఆమెని రెండు చేతుల్తో చుట్టేస్తూ...

    "అతనే ఆంటీ...అతనే! అతన్ని నేను చూశాను!!" అంది వెక్కిళ్ళు ఆపుకొంటూ.

    "ఎక్కడమ్మా?"

    "అదిగో అక్కడ!" అంటూ చేత్తో చూపించింది.

    అక్కడ ఎవరూ లేరు!


                                  0    0    0


    "మైగాడ్!" అన్నాడు రాజారామ్ టెలిఫోన్ రిసీవర్ పెట్టేస్తూ. అతని మొహం నిండా చిరు చెమట.

    చేతిలోని పేపర్ని టేబిలు మీద పెడ్తూ" ఏమయింది సర్?" అంది భవాని.

    ఫోన్ లో రాజేశ్వరి చెప్పినదంతా ఆమెకు చెప్పాడు. అంతా విని ఆమె ఒకటే మాట అంది:

    "బాడీగార్డ్ లేనిదే రమణి ఎక్కడికీ వెళ్ళడం మంచిది కాదు!"

    "మీరు చెప్పింది నిజమే. కాని షాపులో అంతమంది జనం ఉండగా-రమణిని ఎవరయినా ఏం చెయ్యగలరు?" అన్నాడు రాజారామ్.

    "అలా అనకండి చిన్న సిరంజితో రమణిని గుచ్చితే చాలు. జరగకూడని ఘోరం జరిగిపోతుంది!"

    రాజారం పిడికెళ్ళు బిగుసుకున్నాయి. ప్రపంచం అంతా తనను ఏకాకిని చేసినట్టు ఫీలయ్యారు. ఎప్పుడూ లేనంత నిస్సహాయత అతన్ని ఆవరించుకుంది.

    'చీకట్లో నల్లపులిలా ముక్కూ మొహం ఊరు పేరూ తెలీని హంతకుడు చిన్నారి రమణి ప్రాణాల్తో చెలగాటం ఆడ్తున్నాడు. వాడు పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు. రమణి ఎవరో వాడికి తెలిసిపోయింది. ఎక్కడ ఉంటుందో కూడా వాడికి తెలిసే వుంటుంది. ఈ పరిస్థితుల్లో తను ఒక్క క్షణం అయినా మనశ్శాంతితో ఉండగలడా?' -ఈ ఆలోచన రాగానే రాజారామ్ ఒక్క ఉదుటున లేచాడు. గబ గబ అడుగులు వేస్తూ అప్పారావు గది వేపు వెళ్ళాడు. విసురుగా తలుపు తీశాడు. లోపల ఏదో రాసుకుంటున్న అప్పారావు పెన్నుని టేబిలు మీద పడేసి నిలబడ్డాడు.

    "అప్పారావ్ నేనో విషయం తేల్చుకోవాలని వచ్చాను."

    "ఏమిటది?"

    "నీకు సుందరి బాగా తెలుసు!"

    "నీకు ముందే చెప్పాను. ఆ బీచ్ నాకు తెలీదు...సరే! తెలుపే అనుకో....అయితే ఏమిటి?" అంటూ అప్పారావు రాజారామ్ కి రెండు గజాల దూరంలో నిలబడ్డాడు.

    "నిన్న సాయంత్రం మా అమ్మాయి సుమిత్ర ఇంటికి వెళ్ళింది. అక్కడ ఒకతన్ని చూసింది. అతనే హంతకుడని పోలీసులు అంటున్నారు..."

    "నౌ స్టాపిట్! మీ అమ్మాయి నన్నయితే అక్కడ చూడలేదుగా!"

    "నిన్నిక్కడ చూసిందని నేను అనడం లేదు. కాని అదే వ్యక్తిని కొద్ది నిమిషాల కిందట మా అమ్మాయి ఓ బట్టల షాపులో చూసింది. హంతకుడిలా యధేచ్చగా తిరుగుతున్నంత కాలం మా అమ్మాయి ప్రాణాలకు ముప్పే! వాడినెలాగైనా సరే నేను పట్టుకోవాలి!" అన్నాడు రాజారామ్ అదే తన దృఢ నిశ్చయం అయినట్టు.

    "అయితే నన్నేం చెయ్యమంటావ్?"

    "రమణి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఆ హంతకుడెవరో కనుక్కోవాలంటే సుందరి సంగతి తెలియాలి!"

    "నాకు సుందరి గురించి ఏమీ తెలీదు"

    "అప్పారావ్ నువ్వు అబద్దం చెప్తున్నావ్!

    "షటప్ ఎండ్ గెటౌట్!"

    రాజారామ్ వీరావేశంతో పిడికిలి బిగించి అప్పారావు దవడ మీద చాచి కొట్టాడు. ఆ దెబ్బకి అప్పారావు మెలికలు తిరిగిపోతూ కింద కార్పెట్ మీద పడ్డాడు. ఆ విసురులో రాజారామ్ చెయ్యి టేబిలుకి తగిలి కొద్దిగా గీరుకుపోయింది. చేతిమీద రక్తాన్ని తుడుచుకుంటూ వెనక్కి తిరిగిచూడకుండా బయటికి వచ్చాడు. బయట నిలబడ్డ ఆఫీసు బాయ్ అతన్ని ఆశ్చర్యంగా చూశాడు.

    తన సీట్లో కూర్చుని ఓ సారి చుట్టూ చూశాడు రాజారామ్. అంతలో అంత దూరాన చైర్మన్ రాజభూషణరావు కన్పించాడతనికి. చైర్మన్ తిన్నగా రాజారామ్ దగ్గరికి వచ్చాడు. అతన్ని చూస్తూనే రాజారామ్ గౌరవంగా లేచి నిలబడ్డాడు.

    "ఏం రాజా, ఎలా ఉంది మీ అమ్మాయి?" అనడిగాడు చైర్మన్.

    గౌన్లు ఏవో కొనుక్కుంటానంటే రాజేశ్వరితో పంపించాను రమణిని. 'బేబీస్ యూనివర్స్' బట్టల షాపులో నిన చూసినతను మళ్ళీ కన్పించాడట!"

    "బేబీస్ యూనివర్స్ లోనా? చాలా ఆశ్చర్యంగా ఉంది." అంటూ చైర్మన్ రాజారామ్ టేబిలు మీదున్న సుందరి ఫోటోని చూశాడు. "ఈమేనా సుందరి అంటే?" అన్నాడు.

    రాజారామ్ తలూపాడు.

    "చాలా అందంగా ఆరోగ్యంగా ఉంది. దుర్మార్గురాల్లా కన్పించడం లేదు. ఏమంటావ్? సరే సంగతులన్నీ  నాకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంట." అంటూ ముందుకి నడిచాడు చైర్మన్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS