13. "విశ్వకర్మ ని | ర్మించిన లంకను
రావణుండు పా | లించెడు లంకను |
రామదూత ఒక - వానరోత్తముడు
రుద్రరూపుడై | దహియించినాడు |
ప్రళయ భయానక - సదృశమాయెను
సాగరమున లం | క మునిగిపోయెను |"
అనిదెల్పె త్రిజట - స్వప్న వృత్తాంతము
భయకంపితలై | రి రాక్షసీ గణము ..... ||శ్రీ||
14. "ఇక చాలు మీరు - సీతను దూరుట
చల్లగ పలుకుడు - ఇక మీదట |
ప్రాధేయపడుడు - అభయమిమ్మని
ఆపదల నుండి - రక్షింపుమని |
లేకుండిన మి | మ్మందరి తోడ
చంపక మానడు - శ్రీరఘు వీరుడు |"
అనిదెల్పె త్రిజట - మంచి మాటల
రాక్షస వనితల - బ్రతుకు బాటల .... ||శ్రీ||
15. "నే కలగన్నది - నిజమౌ గాక
సీతాదేవికి - మంచి కాలమిక |
ఈ పద్మాక్షికి - ఈ శుభాంగికి
ఎడమ కన్నదే - అదరుచుండేగా |
ఎడమ భుజము తొడ - అదరుచుండెగా
రాముడు రాగల - శుభ సూచనగా |"
అనిదెల్పె త్రిజట - మంచి మాటల
రాక్షస వనితల - బ్రతుకు బాటల .... ||శ్రీ||
16. "సీతా మాత మ | హా పతివ్రత
భువికి బోలిన - క్షమా దేవత |
మహా విష్ణువు - శ్రీరాముడు
సర్వలోకముల - పూజనీయుడు |
సీతారాముల - స్వాగత గీతిక
పలుకుచున్నదదే - పక్షి గొంతుక |"
అని పల్కు త్రిజట - మాటలు వినుచూ
రాక్షస వనితలు - నిద్ర దూగిరి .... ||శ్రీ||
__: 27 వ. స. సంపూర్ణము :__
28వ. సర్గ
సీత :-
1. "రావణుండు నా | కు ఒసగిన గడువు
రెండు నెలలలో - తీరిపోవు |
ఈలోపున రా | ముడే రాకున్న
నాకేమున్నది - మరణము కన్న
రావణుచేత - మడియుట కన్న
నాకై నేనే - పోవుట మిన్న |"
అని శోకించుచు - జానకి తూలెను
రాక్షస వనితల - క్రూర వలయమున ..... ||శ్రీ||
2. "మారీచుడు తన - పన్నాగమున
రామలక్ష్మణుల - చంపి యుండునా |
నా దౌర్భాగ్యమే - లేడి రూపమున
మమ్మీరీతిగ - దూరము చేసెనా |
కడకీనాటికి - ఇంత విషమైన
కరవయ్యె నాకు - లంకాపురమున |"
అని శోకించుచు - జానకి తూలెను
రాక్షస వనితల - క్రూర వలయము ..... ||శ్రీ||
3. "హృదయ తాపమున - జానకి తూలుచు
శోక భారమున - గడగడ వణకుచు |
జరిగి జరిగి అ | శోక శాఖలను
ఊతగా గొని - మెల్లగ నిలిచి |
శ్రీరాముని కడ | సారి తలచుకొని
తన మెడ జడలో - ఉరిబోసికొని |
ప్రాణత్యాగము - చేయబూనగా
శుభ శకునములు - తోచె వింతగా ..... ||శ్రీ||
__: 28 వ. స. సంపూర్ణము :__
29 వ. సర్గ
1. మీను కదపిన - పద్మము వోలె
నీరజాక్షికి - ఎడమ కన్నదరె |
పురుషోత్తముని - ప్రేమ కౌగిలిలో
చుంబనలందిన - ఎడమ భుజమదరె
శ్రీరఘురాముని - అనురాగమున
కలసి మెలసిన ఎడమ తొడ అదరె |
శుభ శకునోదయ - కాంతులు విరిసె
చిరునగ వొలుకగ - జానకి గాంచె .... ||శ్రీ||
__:29 వ. స. సంపూర్ణము :__
