Previous Page Next Page 
దేవదాసు పేజి 20

    దేవదాసు ఆశ్చర్యపోయి లేచి కూర్చున్నాడు. కేవలం నన్ను చూడాలనే ఆశతోనే ఆగి వున్నావా? కాని ఎందుకు?" అన్నాడు.
    ఒక అభిప్రాయం. నీవు నన్ను చాలా ఏవగించుకొంటున్నావు. యెన్నడూ ఇంతగా నన్ను ఎవరూ ఏవగించుకొనలేదు. బహుశా ఇందు వల్లనే. నీకు ఇప్పుడు జ్ఞాపకం వుందో, లేదో అది నేను చెప్పలేను. కాని నాకు బాగా జ్ఞాపకం వున్నది. ఏమిటంటే ఏ రోజైతే నీవు మొట్ట మొదట ఇక్కడకు వచ్చావో ఆ రోజే నీ మీద నా దృష్టి పడింది. నీవు ధనవంతుల బిడ్డవని నాకు తెలుసు. అయితే ధన లోభంతో నేను నీ వైపుకు మొగ్గలేదు. నీ కన్న ముందు ఎంతోమంది వ్యక్తులు ఇక్కడకు వచ్చారు, వెళ్ళారు. కాని ఎవరిలోనూ ఇంత తేజస్సు చూడలేదు. నీవు రావడంతోనే నన్ను గాయపరచావు. ఒక అయాచితమైన ఉపయుక్తమైన కాని అనుచితమైన వ్యవహారం ప్రారంభించావు. ఏవగింపుతో మొహం మలుపుకున్నావు. చివరకు వేడుక మాదిరిగా కొంత యిచ్చి వెళ్ళిపోయావు. ఈ విషయాలన్నీ నీకు గుర్తు వస్తున్నాయా?
    దేవదాసు మౌనం వహించాడు. చంద్రముఖి మళ్ళీ చెపుతూ వుంది. ఆ రోజు నుంచే నీ మీద నా దృష్టి పడింది. నేను నిన్ను ప్రేమించడమూ లేదు, ద్వేషించడమూ లేదు. ఒక కొత్త వస్తువును చూసినపుడు ఎలాగైతే అది మనసులో ఎల్లప్పుడు గుర్తు వుంటుందో, అలాగే నిన్ను కూడా చూసి ఏ విధంగానూ మరవలేకపోయాను. నీవు వచ్చినప్పుడు చాలా భయంతోనూ,సావధానంగానూ వుండేదాన్ని. కాని రాకపోతే కొంచెం బాగుండేది కూడా కాదు. తరువాత ఎలా మతి భ్రమించిందో తెలియదు కాని ఈ రెండు కళ్ళకు అన్ని వస్తువులూ ఒకే విధంగా కన్పించసాగాయి. నేను పూర్వం కన్నా పూర్తిగా మారిపోయాను. నేను పూర్వం ఎటువంటి దాన్నిగా వుండేదాన్నో ఇప్పుడు అటువంటి దాన్నిగా లేను. తఃరువాత నీవు మద్యం తాగడం ప్రారంభించావు. మద్యం అంటే నాకు చాలా అసహ్యం. ఎవరైనా మద్యం త్రాగి ఆ మైకంలో వుంటే నాకు అతడి మీద చాలా కోపం వచ్చేది. కాని నీవు కైపులో వున్నా కోపం వచ్చేది కాదు. చాలా దుఃఖం కలిగేది."
    ఇదంతా చెప్పి చంద్రముఖి దేవదాసు పాదాలమీద చేతిని వుంచి అశ్రుపూరిత నయనాలతో "నేను చాలా అధమురాలను, నా అపరాధాలను దృష్టిలో వుంచుకోవద్దు. నీవు ఎంతగా మాటలు చెపుతూ నన్ను ఏవగించుకొంటూ వుండేవాడివో అంతగా నేను నీ దగ్గరకు రావాలని కోరుకునే దాన్ని. చివరకు నిద్రపోయిన మీదట_"వుండనివ్వు, ఈ మాటలు చెప్పను, చెపితే కోప్పడిపోతావు" అన్నది. దేవదాసు ఏమీ అనలేదు. కొత్తగా జరిగే సంభాషణ అతనికి వేదనను కలిగిస్తూ వుంది. చంద్రముఖి చాటుగా కళ్ళు తుడుచుకుని "మేము ఎంతో సహించేవాళ్ళమనీ, నిందలనూ, అవమానాలనూ జఘన్య అత్యాచారాలనూ, ఉపద్రవాలనూ, వాటికి సంబంధించిన విషయాలనూ సహించగలమనీ ఒకరోజు నీవు అన్నావు. ఆ రోజు నుంచే నాకు చాలా అభిమానం కలిగింది_అప్పుడే నేను అంగడిని మూసివేశాను."
    దేవదాసు కూర్చొని "అయితే యీ జీవితం ఎలా గడుస్తుంది?" అని అడిగాడు.
    "అది మొదటనే చెప్పేశాను గదా!" అన్నది చంద్రముఖి.
    "ఈ సంగతి ఆలోచించు. ఒకవేళ అతడు నీ డబ్బు అంతా సొంతం చేసుకుంటే?"
    చంద్రముఖి భయపడలేదు దీనికి. శాంతంగానూ, సహజంగానే చేసుకున్నా ఆశ్చర్యపడవలసిన పనిలేదు. ఆపద వచ్చినప్పుడు నీ దగ్గర నుంచి కొంచెం బిచ్చం అడుగుదామని కూడా ఆలోచించే వున్నాను." అన్నది.
    దేవదాసు ఆలోచించి "అది తరువాత అడిగి తీసుకో. యిప్పుడు మరెక్కడికైనా వెళ్ళడానికి ప్రయత్నించు" అన్నాడు.
    రేపే ప్రయత్నిస్తాను. మురుగు కూడా అమ్మి ఒకసారి దుకాణదారుణ్ని కూడా కలుసుకుంటాను."
    దేవదాసు పాకెట్ లో నుంచి వందేసి రూపాయలవి అయిదునోట్లు తీసి దిండు క్రింద బెట్టి "మురుగులు అమ్మవద్దు, కేవలం దుకాణదారుణ్ని కలుసుకో. కాని వెళ్ళేది ఎక్కడికీ? ఏదైనా తీర్ధస్థానానికా?"
    "కాదు దేవదాస్! తీర్ధాలమీద, ధర్మంమీద నాకు ఎక్కువ శ్రద్దలేదు. కలకత్తా నుంచి ఎక్కువ దూరం వెళ్ళను. చుట్టుప్రక్కల ఏ పల్లెటూరికైనా వెళ్ళి వుంటాను."
    "ఏదైనా మంచి ఇంట్లో దాసీ పని చేస్తావా?"
    చంద్రముఖి కళ్ళు మళ్ళీ అశ్రుపూరితాలయ్యాయి. కళ్ళు తుడుచుకుని, యిష్టం లేదు. స్వతంత్రంగా, స్వేచ్చగా వుంటాను. దుఃఖం అనుభవించడానికి ఎందుకు వెళ్ళాలి? కాయకష్టం ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు కూడా చేయలేను. ఎక్కువగా పెనుగులాడితే చిందర వందరై పోతాను" అన్నది.
    దేవదాసు విషణ్ణ వదనంతో కొంచెం నవ్వి "అయితే పట్టణానికి దగ్గరగా వుంటే మళ్ళీ ప్రలోభంలో పడిపోగలవు. మనిషి మనసు విశ్వసించదగినది కాదు" అన్నాడు.
    ఈసారి చంద్రముఖి వదనం వికసించింది. నవ్వింది. మళ్ళీ అన్నది. "యీ మాట నిజం. మనిషిని విశ్వసించలేము. కాని ఇప్పుడు నేను ప్రలోభంలో పడను. స్త్రీలలో లోభం అధికంగా వుంటుంది. ఇది నేను ఒప్పుకుంటాను. దేనిమీద లోభం వుందో దాన్నే స్వేచ్చగా వదిలి వేసినపుడు నేను ఇక భయపడవలసిన పనిలేదు. అకస్మాత్తుగా ఏ ఆవేశంలోనో వదిలివేస్తే అప్పుడు జాగ్రత్త పడవలసిన అవసరం వుంటుంది. కాని ఇంత దీర్ఘకాలం వదిలేసి వున్నాను. అందుకు ఒక్కరోజు కూడా పశ్చాత్తాపం కలగలేదు. నేను చాలా సుఖంగానే వున్నాను."
    దేవదాసు తల వూపి "స్త్రీల మనస్సు చాలా చంచలమయినది. విశ్వసనీయమయినది కాదు" అన్నాడు.
    ఈసారి చంద్రముఖి కొంచెం జరిగి పూర్తిగా దగ్గరకు వచ్చి కూర్చున్నది. చేయి పట్టుకొని "దేవదాస్!" అన్నది.
    దేవదాసు ఆమె ముఖం వైపు చూస్తూ వున్నాడు. ఈసారి నన్ను తాకవద్దని అనలేకపోయాడు.
    చంద్రముఖి కళ్ళు స్నేహభావంతో విస్ఫారితములైనాయి. కొంచెం కంపిస్తున్న కంఠంతో అతడి చేతులను తన ఒళ్ళోకి లాగుకొని "నేడు ఆఖరు రోజు, కోపించవద్దు. ఒక మాట నిన్ను అడగాలనే అభిలాష ఉన్నది_"అని చెప్పి కొంతసేపు దేవదాసు ముఖం వైపు చూసి "పార్వతి నిన్ను చాలా లోతుగా గాయపరిచిందా?" అన్నది.
    దేవదాసు కనుబొమలు ముడుచుకుని_ "ఈ సంగతి ఎందుకు అడుగుతున్నావు?" అన్నాడు.
    చంద్రముఖి చలించలేదు. శాంతంగా, దృడంగా అన్నది_"నాకు పని ఉంది.నేను నిజం చెపుతున్నాను. నీకు దుఃఖం కలుగజేస్తూ నాకూ దుఃఖం కలుగుతుంది. ఇది తప్ప బహుశా నాకు చాలా విషయాలు తెలుసు. మధ్య మధ్యలో మద్యం కైపులో నీ నోటినుంచి అటువంటి మాటలు అనేకం విన్నాను. అయినా కూడా పార్వతి నిన్ను మోసగించిందనే మాట నేను విశ్వసించలేకపోతున్నాను. పైగా నిన్ను నీవే స్వయంగా మోసగించుకున్నావని నా మనస్సులో అనిపిస్తున్నది దేవదాస్. వయసులో నేను నీకన్నా పెద్దదానిని. ఈ ప్రపంచంలోని విషయాలు చాలా చూశాను, విన్నాను. నా మనసులో ఏమనిపిస్తుందో నీకు తెలుసా? ఇందులో నీదే పొరపాటని నేను దృడచిత్తంతో చెపుతాను. స్త్రీలు చంచలమైన , అస్థిరమైన చిత్తం గలవారని చెప్పి స్త్రీలను ఎంతగా నిందిస్తున్నారో, అంత నిందకు వాళ్ళు అర్హులు గారు! నిందించేవాళ్ళూ మీరే, ప్రశంసించేవాళ్ళూ మీరే. మీ మగవాళ్ళ మనసుల్లోకి ఏది వస్తే దాన్ని సహజంగానే అనేస్తారు. కాని వాళ్ళు అలా చేయలేరు. తమ మనసులోని విషయాన్ని వెల్లడించలేరు. వెల్లడించినా కూడా జనులందరూ బాగా అర్ధం చేసుకోలేరు. ఎంచేతనంటే చాలా అస్పష్టంగా వుంటుంది. మీ తర్కం ముందు అది అణగిపోతుంది. మళ్ళీ అదే నింద ప్రజల నోట స్పష్టంగానూ, స్పష్టతరంగానూ వినిపిస్తుంది."
    చంద్రముఖి కొంచెం ఆగి తన కంఠస్వరాన్ని బాగా సరిచేసుకొని చెప్పింది_"ఈ జీవితంలో చాలా రోజుల వరకు ప్రేమ వ్యాపారము చేశాను. కాని కేవలం ఒక్కసారి మాత్రమే ప్రేమించాను. ఆ ప్రేమ విలువ చాలా గొప్పది. దానివిలువ అనేక బోధలు లభిస్తాయి. ప్రేమ ఒకటి రూపం మీద వ్యామోహం, మరొకటి తెలుసుగదా? ఈ రెండింటిలో పెద్ద గందరగోళం వుంది. పురుషులే ఎక్కువ గందరగోళపరుస్తారు. రూపం మీది మోహం మీలోకంటే మాలో చాలా తక్కువగా వుంటుంది. ఇందు వలన మేము మీలాగా అమాంతంగా ఉన్మత్తులం కాము. మీ పురుషులువచ్చి తమ ప్రేమను చూపిస్తారు. అనేక భావాలు వెల్లడిస్తారు. అప్పుడు మేము మౌనం వహిస్తాము. ఎన్నోసార్లు మీ పురుషుల మనస్సుకు దుఃఖం కలిగించడానికి సిగ్గుపడతాము. దుఃఖం కలుగుతుంది, సంకోచం కలుగుతుంది. ముఖం చూస్తే ఒకవేళ రోత కలిగినా అప్పుడు కూడ సిగ్గుచేత నేను నిన్ను ప్రేమించడం లేదని చెప్పలేము. తరువాత ఒక బాహ్య ప్రణయం యొక్క అభినయం ప్రారంభమవుతుంది. ఏ రోజైనా అది అంతమైపోయినప్పుడు పురుషులు స్థిరం లేనివారై ఎంత విశ్వాసఘాతిని అంటారు. అప్పుడు అందరూ ఆ మాటనే వింటారు. దానినే విశ్వసించనారంభిస్తారు. మేము అప్పుడు కూడా మౌనంగానే వుంటాము. మనసులో ఎంతో క్లేశం వుంటుంది. కాని అది ఎవరు చూడబోతారు?" దేవదాసు ఏమీ అనలేదు. ఆమె కూడా చాలాసేపటివరకు నిశ్శబ్దముగా ముఖం వైపు చూస్తూ వుంది. తరువాత మళ్ళీ చెప్పింది_"ఒకవేళ ఏదైనా వుంటే బహుశా కొద్దీగొప్పా మమత ఉత్పన్నమౌతుంది. అదే ప్రేమ అని స్త్రీలు మనసులో ఆలోచిస్తారు. శాంతంగానూ, ధైర్యంగానూ సంసారంలోని పనులు చేస్తూ వుంటారు. దుఃఖకాలంలో ప్రాణాన్ని పణంగా పెట్టి కూడా సహాయపడతారు. అప్పుడు మీరు బాగా ప్రశంసిస్తారు. అందరినోట ఎన్నోసార్లు ధన్యురాలు, ధన్యురాలు అని వినిపిస్తుంది. కాని అప్పటివరకు ఆమె ప్రేమ యొక్క వర్ణ_పరిచయం కూడా ఆరంభం కాదు. ఆ తరువాత ఒకవేళ ఏదైనా ఆ శుభముహూర్తంలో తన హృదయంలో సహించలేని వేదన కారణముగా విలవిలలాడుతూ వాకిలి బయటికి వచ్చి నిలబడితే (ఈ మాట అని ఆమె దేవదాసు ముఖం వైపు తీవ్రంగా చూసి అన్నది ) మీరు అరిచి "ఛీ!ఛీ! కళంకినీ" అని గోలపెడతారు. హఠాత్తుగా దేవదాసు, చంద్రముఖి నోటిని చేతితో అణచి పెట్టి "చంద్రముఖీ, ఇదేమిటి?" అన్నాడు. చంద్రముఖి నెమ్మదిగా చేతిని తొలగించుకొని "భయపడకు దేవదాస్. నేను నీ పార్వతి సంగతి చెప్పడం లేదు" అన్నది.             


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS