Previous Page Next Page 
మూసిన తలుపులు పేజి 20


    ఆ మాటలు ఆమె గుండెల్ని పిండి కన్నీటిని రాల్చాయి.
    "వివరంగా చెప్తాను. కూర్చో , బాబూ" అని రాజ్ ను సోఫాలో కూర్చో బెట్టింది ఆమె. రాజ్ కళ్ళు తుడుచుకొన్నాడు.
    అంతలో ఇందిర కాఫీ తెచ్చింది. కాఫీ త్రాగుతూ తన విషయమంతా చెప్పాడు రాజ్.
    "హు. లక్షాధికారి బిడ్డ అయినా ఒకరి దగ్గర ఊడిగం చేయవలసిన ఖర్మ పట్టింది వాడికి. వాడి వారసుడ వైన నువ్వు ఒకరి ఆధారంతో బ్రతుకుతున్నావు. ఈ పాపానికి నాకు నిష్కృతి ఉండదు."
    "ఇందులో నువ్వు చేసేందేమి టత్తయ్య?"
    "అన్నిటికీ కారణం నేనే , నాయనా! వాడికి పెళ్ళయిన మరు సంవత్సరమే నా పెళ్ళి జరిగింది. వాడు చిన్నప్పుడు అల్లరి చిల్లరికా తిరిగేవాడు. అప్పుడప్పుడు ఇంట్లో డబ్బులు దొంగతనంగా పట్టుకెళ్ళి ఊళ్లు తిరిగోస్తుండేవాడు. మా నాన్నగారు చనిపోయేముందు 'అమ్మాయ్ శకుంతలా! ఆస్తి వాడి పేర వ్రాస్తే నీకు చిల్లి గవ్వ దక్కనియ్యాడు. అందుకని అంతా నీపేర వ్రాశాను. వాడిని ఒక దారికి తీసుకురా' అన్నారు. అన్నయ్యంటే నాకు ప్రేమే. కాని డబ్బు నా ప్రేమను నాశనం చేసింది. నా బుద్దిని పెడదారిని పట్టించింది. వాడినొకదారికి తెమ్మన్న నాన్నగారి మాటలు మరిచి వాడి దారినే దుర్భరంగా చేశాను. అంత ఆస్తీ నాదన్న అహంభావంతో రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువు అన్న జ్ఞానం లేకుండా, వాడు నాకన్నా పెద్ద వాడన్న విచక్షణ లేకుండా, కేవలం హోదాతో వాడిపై అధికారం చేలాయించాను. పెద్దింటిదైనా వదిన అనే గౌరవ మివ్వకుండా నీచంగా చూశాను. అది చూసి మా వదిన వాడితో మొర పెట్టుకుంది. కానీ వాడు అన్నీ సహించాడు. ఒకసారి మా వదినను నోటి కొచ్చిన మాట అనేశాను. అది విన్న వాడు సహించలేక నన్ను కేకలేశాడు. నాకోపం మితిమీరి పోయింది. ధనమనే మదం కళ్ళ కడ్డుపడి ఏం చేస్తున్నదీ తెలుసుకోకుండా వారి నిద్దరినీ ఇంట్లో నుండి వెళ్లి పొమ్మన్నాను. అభిమానం గలవాడు కాబట్టి కట్టుబట్టలతో ఇల్లు విడిచాడు. అప్పటికీ నాలో పశ్చాత్తాపం కాలుగలేదు. మావారు నన్ను అసహ్యించుకొన్నారు.
    "అప్పుడనగా ఇల్లు విడిచిన వాడు ఒకసారి నిన్ను తీసుకొని ఇక్కడి కొచ్చాడు. అప్పుడు నువ్వు చిన్న పిల్లాడివి. సామాన్యంగా మానవత్వమున్న ఏ ఆడదీ అన్ని సంవత్సరాల తర్వాత యింటి కొచ్చిన అన్నాను కౌగలించుకొని తన తప్పుకు క్షమాపణ వేడుకొంటుంది. కానీ నేను వాడిని పలుకరించను కూడా లేదు. సరికదా, ఎందుకొచ్చావు అని అడిగాను. అప్పటి నా కర్కశత్వము తలుచుకొంటే  నేనూ ఒక మనిషేనేనా , నాకూ ఒక హృదయం ముండేదా అనిపిస్తుంది. సూటు బూటులతో హాయిగా కాలం గడపవలసిన వాడు చిరిగినా దుస్తులతో కనపడ్డాడు. అందుకు కరిగిపోవలసిన నేను కోపగించుకొన్నాను. వాడే తలుచుకొని ఉంటె ఈ ఆస్తి వాడిదే అయి ఉండేది. కానీ విచిత్ర మేమిటంటే ఆస్తి కదికారి అయినవాడే నన్ను ఒక చిన్న కోరిక అర్ధించాడు. ఆజ్ఞాపించవలసిన వాడు ప్రార్ధించాడు.
    "నా ప్రవర్తనకు కన్నీరు కారుస్తూ "చెల్లాయ్! నీకేన్నడూ నేను ఏ అపకారం తలపెట్ట లేదు. జీవితంలో ఏ కోరికా కోరలేదు. కానీ ఈనాడు ఒకటి అర్ధిస్తున్నాను. వీడు తల్లి లేని వాడు. నేను రోగిష్టి ని. కొద్ది రోజులకు వీడు తండ్రి లేని వాడు కూడా కాబోతాడు. నా గతి ఎలాగైనా కానీ వీడిని నీకప్పగించి పోతాను. పెంచి పెద్ద చెయ్యి" అన్నాడు.
    "ఆ మాటలు చాలు నాలో మానవత్వాన్ని మేలు కొలపడానికి , నా పాపాన్ని బ్రద్దలు చేసే శూలాలవి. కానీ డబ్బు అడ్డుపడి నాలో కరుణను కలిగించలేదు. అతని కోరిక నిరాకరింపబడింది. వెళ్ళిపోయాడు. రాక్షసత్వం, డబ్బు లాలన ఎక్కువగా ఉన్నాయి. వాడికి ద్రోహం తలపెట్టడమే కాకుండా మంచి చెడులు తెలియని నీకు అన్యాయం చేశాను. ఇదీ ఈడుర్మర్గురాలు నీకు మేనత్త యి మరిచి పోలేని చేసిన మహోపకారం."
    అంతవరకూ ఆ విషయాలేవీ తెలియని ఇందిర, లత తల్లి గుణాలను అసహ్యించు కొన్నారు.
    పైకి తియ్యగా కనుపించే ఆడవారిలో ఇంత కుళ్ళు, కాఠిన్యం , స్వార్ధం ఉందా అని ఆశ్చర్యపోయాడు రాజ్. తండ్రికి జరిగిన అన్యాయాన్ని, తండ్రి పడిన కష్టాలు ఊహించుకొని కరిగిపోయాడు . మరికరై ఉంటె ఆమె నసహ్యించుకొని ప్రతీకారాన్ని సాధించాలను కొనేవారు. కానీ రాజ్ తన కోపాన్ని నిగ్రహించుకొని మౌనం వహించాడు.
    "నన్ను అసహ్యించు కొంటున్నావు కదా, బాబూ!' అందామె. అంతకన్నా ఘటైనా సమాధానమే బావ నుండి వస్తుందని ఎదురు చూసిన లత "లేదత్తయ్యా , నీలోని బలహీనత కు జాలి పడుతున్నాను" అన్న రాజ్ పలుకులు  విని ఆశ్చర్య పోయింది. వీళ్ళ మంచితనానికి హద్దులు లేవా అని నివ్వెర పోయింది. నీ విశాల హృదయానికి జోహార్లు బావా అనుకొంది మనసులో ఇందిర .
    "నన్ను క్షమించగలవా , నాయనా!"
    'అదేమీటత్తయ్యా! ఈ లోకంలో జరిగే వాటికి మనం కేవలం నిమిత్త మాత్రులమే. ఏదో శక్తి మనలను ఆడిస్తోంది. అ దుష్తశక్తిని ఎదురు కోలేనప్పుడు ఎన్నో తప్పులు చేస్తుంటాం. ఇందులో నీ తప్పేం లేదు."
    రాజ్ కోపంతో ఏమైనా అంటాడేమోనని ఆశించిందామె. అతని క్షమా  హృదయానికి మరింతగా రోదించింది. అతడికి కోపమోచ్చి ఉంటె ఆమెకు శాంతి కలిగేది. కానీ అది జరుగలేదు.
    "అంతేకాదు. ఇంకా విను. అప్పుడు నేను క్షమార్హురాలను కావని తెలుసు కుంటావు."
    తల్లి నుండి ఇంకా ఏం వినవలసి వస్తుందో నని భయపడ్డారు ఇందిర లత.
    "మావారి తల్లి చనిపోగానే తన ఒక్కగానొక్క చెల్లెలిని తనతోనే ఉంచుకొన్నారు వారు. ఆమె చాలా మంచిది. నేను ఆడబిడ్డనే గౌరవం లేకుండా సూటీపోటీ మాటలతో బాధించాను. అన్నింటినీ సహించింది. ఆమె ఏనాడూ ఈ యింట్లో కడుపు నిండా తిని ఉండలేదు... ఒకసారి మావారి  చిన్ననాటి మిత్రుడెవరో వచ్చారు వారు లేరు. ఆమెకు అతడు బాగా తెలుసు కాబట్టి ఆప్యాయంగా మాట్లాడి పంపించింది. ప్రతుఫలంగా ఆమెకు కులట అనే బహుమానాన్నిచ్చి ఇంట్లో నుండి గెంటేశాను. ఆ రాత్రే ఆమె ఆత్మహత్య చేసుకొంది. తన ప్రియమైన చెల్లెలి చావు చూసి కుమిలిపోయిన వారు ఆమె చావుకు కారణమైనా నన్ను క్షమించగలిగారు. మగవారి లోని క్షమా గుణాన్ని జీవితంలో రెండోసారి అప్పుడు చూశాను.
    అప్పటికీ నా కళ్ళు తెరచు కోలేదు.
    "పాపం-- పండిందంటారు -- అదే కాబోలు. నా ధనం, అధికారం, గర్వం, హోదా నన్ను ఎటు వంటి స్థితికి తెచ్చాయంటే కడకు కట్టుకొన్న భర్తనే అవమానించాను. నేనెన్ని తప్పులు చేసినా క్షమించారు. అభిమానం ఉన్నవాడు అవమానం సహించడు. నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఎక్కడో, ఎవరితోనో సుఖంగా సంసారం చేస్తున్నారని విన్నాను. ఎప్పుడో ఒకసారి వచ్చి తన బిడ్డలను చూచుకొని వెళ్ళుతుంటారు. డబ్బు నావారి నందరినీ దూరం చేసింది. నాకు సుఖాన్ని ఇవ్వలేక పోయింది. ఈ డబ్బును ఇచ్చేస్తాను. తిరిగి నావారంతా నాకు దక్కుతారా? ఊహు? ప్రయోజనం లేదని తెలుసుకొన్నాను. వారి సుఖానికి అడ్డు తగుల కూడదని గుట్టుగా ఉంటున్నాం. అందరినీ దూరం చేసుకొన్న తర్వాత నా కళ్ళు తెరుచు కొన్నాయి. అంతలోపలె జరగవలసిన అనర్ధాలన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు చెప్పు-- నన్ను ఎవ్వరైనా క్షమించగలరా? కన్న బిడ్డలు సైతం అసహ్యించుకునే నా పాపాలకు ప్రాయశ్చిత్తం ముందంటావా?"
    "నీ ప్రాయశ్చిత్తమే నీ పాపాలకు ప్రాయశ్చిత్తమత్తయ్యా! చేసినదేదో చేశావు. చేసిన దానికి విచారిస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు. మానవులమైన మనం విచారించ కుండా ఉండలేము. అన్నీ మరిచిపో."
    "ఎవరి శిక్షణ లో పెరగకుండానే నువ్వు ఇన్ని మంచి గుణాలను అలవరుచు కొన్నావు. నేను నీకు చేసిన అన్యాయానికి ఫలితంగా ఒక కోరిక కోరుతాను. అంగీకరిస్తావా?"
    "అజ్నాపించే అధికారం, వయస్సు ఉండగా అర్దిస్తావేమిటత్తయ్యా!"
    "నేనా అర్హతను పోగొట్టుకున్నాను, బాబూ! నువ్వు ఇప్పటి నుండి ఇక్కడే ఉండిపోవాలి."
    'ఔను, బావా!" అంది తన ఉత్సాహంతో.
    "అంగీకరించండి" అంది ఇందిర.
    "క్షమించండి. ఇప్పట్లో అది అసాధ్యమే. కానీ ఎప్పుడో ఒకసారి తప్పక ఇక్కడే ఉండి పోవలసి వస్తుంది. అప్పుడు తప్పక ఉంటాను.'
    "నా ఈ ఒక్క కోరిక తీరే ఆశగూడా లేదా?"
    "క్షమించత్తయ్యా! ఇప్పుడు నేను నిస్సహాయుడ్నీ . అలోచించి ఆనందరావు గారి అంగీకారాన్ని తీసుకోవాలి. అంతకన్నా ప్రస్తుతం నేనేం చెప్పలేను."
    "సరే. నీ యిష్ట ప్రకారమే చెయ్యి. కానీ నీకోసం ఒక ముసలి అత్తయ్య. ఆమె కుటుంబం ఎదురు చూస్తుంటారని మరిచి పోవద్దు."
    "ఏమంటారు?" అని అడిగాడు రాజ్, ఆనందరావు గారిని.
    "ఏం చెప్ప మంటావోయ్? ముసలితనం లో ఒక్కగానొక్క కోరిక పెట్టుకొన్న ఆమెను నిరాశ పరచడం ఇష్టం లేదు. వారి కోరిక తీర్పు. రక్త సంబంధపు మమకారాన్ని అర్ధం చేసుకో గలిగి ఈ మాట చెపుతున్నాను. తన పాపాపకు అంతిమ దశలో నైనా ఆమె మనసుకు శాంతిని ప్రసాదించు. అది చెయ్యగలిగితే చాలు."
    "అలాగే" అన్నాడు రాజ్ ఆనందంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS