Previous Page Next Page 
వాసన లేని పూలు పేజి 21

 

    వనజ చిరునవ్వు నవ్వుతూ "ఇప్పుడు లేదా?' అని అడిగింది.
    "నిజం చెప్తున్నాను. ఇప్పుడు లేదక్కా" అన్నాడు భాస్కరం.
    "ఆ అభిప్రాయం నీకే కాదు బాబూ, చాలా మందికి ఉన్నది. చదువు కొన్నవాళ్ళూ సంస్కార వంతులూ అనబడే వారి చేతనే మేమెంతో హీనంగా చూడబడ్డాం, మొదట కమలా నగర్ లో మేమొక పెద్ద ఇంట్లో ఉండేవాళ్ళం చుట్టూ అందరూ ఆఫీసర్లూ. గొప్ప గొప్ప చదువులు చదువుకొన్న లేక్చరర్లూ ఉండేవారు. వాళ్ళెవరూ మీ రాజు బావతో స్నేహం చేసేవారు కాదు. మధ్యాహ్నం వేళల్లో వీధిలో ఆడవారంతా ఒకచోట చేరి కబుర్లు చెప్పుకొంటుండేవారు, వాళ్ళంతా నన్ను గురించి ఏమేమి చెప్పుకోనేవారో ఆ భగవంతుడికే తెలియాలి. అంతకాలం అక్కడ ఉన్నా నన్నొక తోటి స్త్రీగా కూడా ఆప్యాయంగా పలకరించిన పాపాన పోలేదు. నిజం చెప్పాలంటే ఈ పేటలోని పేదజనమే కాస్త హృదయమున్న వాళ్ళు. మా ఇంటి పక్కనే ఒక రాక్షస కుటుంబం కాపురముండేది .-- అదంతా ఎందుకులే బాబూ అక్కడ నరకాన్ని అనుభవించానంటే నమ్ము?"
    "అంతేనక్కా, ఈ లోకమే అంత? నిన్ను చూస్తుంటే నాకొక ఇంగ్లీషు సామెత గుర్తొస్తుంది Intimacy breeds contempls." కాని అది నీ విషయంలో మాత్రం తప్పు. సరే కాని, అక్కా నీకు ఇంగ్లీషు వచ్చా?"
    వనజ నవ్వుతూ "రాదు బాబూ" అన్నది. భాస్కరం జాలిగా వనజ వైపు చూస్తూ "నేను చెప్పిన సామెతకు అర్ధమేమిటంటే......" అంటూ దాన్ని తెలుగులో కి అనువదించి చెప్పటానికి నానా అవస్థ పడసాగాడు. వనజ అతని అవస్థ చూసి , దానికి అర్ధం తెలుగులో తనే చెప్పి "అంతేనా బాబూ?" అన్నది.
    'ఔనక్కా , సరిగ్గా చెప్పావ్? కాని నీకు ఇంగ్లీషు రాదన్నావుగా. అన్ని అబద్దాలు." అన్నాడు.
    "అది సరే గాని బాబూ. నాకొక సంగతి చెప్తావా?"
    "అడుగక్కా?"
    "మీ రాజు బావకు పద్మ అనే మరదలున్నదని నీకు తెలుసా?"
    "అదేమిటక్కా?" పద్మక్క నాకు తెలియకపోవటమేమిటి? మా పెద్దమ్మ కూరురేగా అన్నాడు.
    "ఆ అమ్మాయి వీరిని చాలా ప్రేమించేదట కదూ?"
    భాస్కరానికి నిజం చెప్పి వనజను నొప్పించటం ఇష్టం లేదు. అలా అని అబద్దమూ చెప్పలేక పోయాడు చివరకు. "అదంతా ఇప్పుడెందుకులే అక్కా" అన్నాడు.
    "కాదు బాబూ. నాకు చాలా అవసరం నిజం చెప్పు"
    భాస్కరం కొంచెం సేపు లోలోపలే తర్కించుకొని "నిజమే, బహుశా నీకంటే ఎక్కువగా  కూడా రాజు బావని ప్రేమించింది. కాని ఐ ఎప్పటి సంగతో కదా?' అన్నాడు. అన్నాడే గాని తన మాటలు వనజను బాధిస్తాయోమోనని భయపడ సాగాడు. వనజ మనస్సులో ఎటువంటి భావపరంపర చెలరేగిందో గాని, దాన్ని అణు మాత్రం కూడా బయటికికాన్పించనీయలేదు. "టెలిగ్రాం ఇచ్చి ఆ అమ్మాయిని ఇక్కడకు పిలిపించగలవా తమ్ముడూ?" అని అడిగింది.
    భాస్కరానికి కలిగిన ఆశ్చర్యానికి మేరలేక పోయింది. కుర్చీలోంచి నిటారుగా లేచి కూర్చుంటూ "నీకేమన్నా పిచ్చా ఎమిటక్కా? టెలిగ్రాం ఇస్తే వాళ్ళంతా వస్తారు. రాజు బావను ఇక్కడుండనీయరు . ఇప్పుడెంత అవసరమేమొచ్చింది?" అన్నాడు.
    "నీకు తెలియదులే బాబూ. రేపు ఉదయం టెలిగ్రాం ఇస్తావు కదూ?"
    భాస్కరం జవాబు చెప్పలేదు. రాత్రింబవళ్ళు నిద్ర లేకపోవటం వల్ల అక్కకు బుర్ర సరిగా పనిచేయటం లేదు. లేకపోతె లేనిపోని కష్టాలను కొని తెచ్చుకొని, రాజు బావను పోగొట్టుకోవాలను కుంటుందా?" అని అనుకోసాగాడు.
    "పలకవెం బాబూ ఈ అక్క కోర్కెను చెల్లించలేవా?' అని ప్రాధేయపూర్వకంగా అడిగింది.
    "సరే అలాగే ఇస్తాను గాని కాసేపు నిద్రపో అక్కా' అన్నాడు.
    వనజ ఆలోచిస్తూ పడుకొంది. గత జీవితమంతా కళ్ళ ముందు మెదలసాగింది. తాను చదువుకొన్నది ప్రపంచ జ్ఞానముంది. జీవితంలో తనకు కావాల్సిందేమిటో తనకు తెలుసు. విధికి ఎదురు నిలిచి పోరాడగలననే ధైర్య ముండేది. తరతరాలుగా , నిరంతరం తన వంశంలో కరాళ నృత్యం చేస్తూ వున్న దారిద్య దేవతని పారద్రోలి తమకు కావాల్సిన వన్నీ సమకూర్చుకోగలనన్న ధీమా ఉండేది. తన తరంలో తన అక్క జయమ్మ చెయ్యలేని పని తాను చెయ్య గలనని నమ్మింది. ధనవంతుల ఇంటి కోడలై , సుఖంతో పాటు గౌరవ మర్యాదలను కూడా పొందాలని ఆశించింది. కాని అదంతా ఇంతకూ ముందు. ఇప్పుడా ఆత్మబలం గాని ధైర్యం కాని లేదు. ఉన్నత మార్గానికి నిరోధకంగా, మానవ సంఘంలో ఎన్ని శక్తులైతే ఉన్నాయో, అవన్నీ ఆమెకు వ్యతిరేకంగానే పనిచేశాయి. నిరంతరంగా వస్తూన్న కులమత భేదాలు, అసహజమైన సంఘ నియమాలకూ బాధ్యతలకూ కట్టుబడి పోయిన రాజు, రెడ్డి, ఇన్స్ పెక్టర్ -- వీళ్ళందరూ తనకు ప్రతి బంధకాలుగా నిలిచారు. తన చదువూ, బుద్ది బలమూ అందమూ ఏదీ కొరగాకుండా పోయింది. లాభం లేదు? తాను కేవలం ఒక అబల అశక్తురాలు! విధి తన నొసట వ్రాసిన వ్రాత తప్పించుకొనే మార్గమేమీ లేదు.
    తెల్లవారింది. భాస్కరం కాఫీ తాగి పోస్టాఫీసుకు వెళ్ళాడు. వనజ ఇన్నాళ్ళ నుంచీ , జాలి అనేది లేకుండా కఠిన సంకల్పంతో దాచి వుంచిన డబ్బంతా బాంకు నుంచి తెప్పించి ఒక కవర్లో పెట్టి రాజు తల కింద ఉంచింది. చేయించుకున్న నగలన్నీ ఒక చిన్న అట్ట పెట్టెలో పెట్టి రాజు బట్టలుండే సూట్ కేస్ లో భద్రంగా దాచింది. ఆ నిమిషంలో రాజుతో తనకున్న అర్ధార్ధ సంబంధం పుటుక్కున తెగిపోయింది . తనకు అవసరమయిన బట్టలు మాత్రం కొద్దిగా ఒక చిన్న సంచిలో పెట్టుకుని భాస్కరం యివ్వబోయిన టెలిగ్రాం ఫలితానికి ఎదురు చూడసాగింది.

                                    17
    టెలిగ్రాం చేత బట్టుకొని వంటింట్లో పని చేసుకొంటున్న తల్లి వద్దకు పరిగెత్తింది పద్మ. "రాజు బావ అనంతపురం లోనే ఉన్నాడట ! సుస్థీగా ఉందని భాస్కరం టెలిగ్రాం ఇచ్చాడు."
    పద్మ తల్లి కమలమ్మ ఒక నిట్టుర్పూ విడిచింది. "నాన్నగారికి కబురు చేద్దాం. పాలేర్ని పిలువ్ పద్మా" అన్నది తల్లి.
    "నాన్నగారితో పాటు మనం కూడా వెళ్దామమ్మా"
    "అదేమిటమ్మా, అక్కడకు నువ్వెలా వెళ్తావ్?"
    "ఏమమ్మా! ఎందుకు వెళ్ళకూడదు?" రాజు బావా నాకేమీ కాడా?' అన్నది బాధగా.
    కమలమ్మ హృదయం లోలోపల విలవిలలాడింది చిన్నప్పట్నుంచీ తామంతా కలసి, దూరదృష్టి లేకుండా బుద్దిహీనమైన పరసోక్తులతో వారిద్దరి మధ్యా, ఒకరకమైన మధురానుబంధాన్ని కల్పించారు. "పద్మ నీ పెళ్ళాం రా! - ఒరే , రాజూ, పద్మ రణ పెంకి , రేపు పెళ్ళయిన తరువాత దానితో ఎలా వేగుతావో యేమిటో , -- పద్మా, కాబోయే శ్రీవారికి ఇప్పట్నుంచే సేవలు ప్రారంభించావా యేమిటి?...." చుట్టాలు పక్కాలు స్నేహితులు , ఇంట్లో వాళ్లు కూడా చిన్నప్పట్నుంచీ అంటూ వచ్చిన ఈ మాటలు, వారి లేత హృదయంలలో ఎటువంటి ముద్ర వేసేదీ ఎవరూ గ్రహించ లేకపోయారు. దాని ఫలితాన్ని ఇప్పుడు కమలమ్మ కళ్ళారా చూడవలసి వచ్చింది. కాని ఇప్పుడు ఎవరైతే మాత్రం చేయగలిగిందేముంది? "నీకు తెలియదమ్మా, ఈ పరిస్థితుల్లో నువ్వు అక్కడకు వెళ్ళటం బాగుండదు.' అన్నది పద్మతో.
    "ఏమైనా సరే, నేను వెళ్ళ వలసిందే? రంగమ్మ ను తీసుకొని వెళ్తాను" అన్నది దృడ సంకల్పంతో తమ్ముడంటే ఉన్న ప్రేమ కమలమ్మ నోరు మూసివేసింది. వద్దని అనలేకపోయింది. రంగమ్మ వచ్చాక ఆమె ముందు తన మనసులోని అవేదన్నంతా వెళ్ళగ్రక్కింది. "వీళ్ళందరికీ మతుల్లేక పొతే నీకూ లేదా రంగమ్మా" చిన్నప్పట్నుంచీ రాజు బావను పెంచి పెద్ద జేస్తావే ఆ ప్రేమంతా ఏమైంది? నువ్వూ చూస్తూ ఊరుకొంటావా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS