Previous Page
వాసన లేని పూలు పేజి 22

 

    "అయ్యో తల్లీ, రాజు బాబు అక్కడున్నట్లు ఇప్పుడేగా తెలిసింది! వీళ్ళ అభిమానాలూ, వంశ గౌరవాలూ మంటగలవనీ! పెంచిన పేమ నేను చంపుకోలేను. పద తల్లీ. నేనూ వస్తాను" అన్నది రంగమ్మ.

                             *    *    *    *
    రాజు కళ్ళు తెరిచాడు. జ్వరం తగ్గి పోయింది. నీరసం తప్ప ఇప్పుడు శరీరంలో యే బాధ లేదు. తుఫాను భీభత్సం అనంతరం సముద్రంలో కనిపించే ప్రశాంతి వంటి అనుభూతి అతన్ని ఆవరించింది, వేళకు సరిగ్గా గ్లూకోజు, పళ్ళ రసం కలిపి అందిస్తుంది వనజ. రాజు మౌనంగా త్రాగుతున్నాడు. ఇద్దరి మధ్యా మాటల్లేవు. వనజ ప్రశ్నలకు ఔను, కాదని మాత్రం సమాధానాలు చెప్పక తప్పటం లేదు.
    "మీ ఇంటికి టెలిగ్రాం ఇచ్చాం" అని వనజ చెప్పినప్పుడు , రాజు సమాధానమేమీ చెప్పలేదు. పైకి చెప్పక పోయినా, ఈ ఊరు నించి బయట పడటానికి అతను ఇప్పుడు సిద్దంగానే ఉన్నాడని వనజ గ్రహించింది. ఆమెకేమీ బాధ అనిపించలేదు.బహుశా ఇవ్వాళో, రేపో వాళ్ళంతా వస్తారు.  తాను చేయగలిగింది కూడా ఏమీ లేదు. కాలమే పరిస్థితుల్ని తన చేతిలోకి తీసుకొని నడిపిస్తుంది. అందుకనుగుణంగా తనూ నడవక తప్పదు.
    భాస్కరం బజారు కెళ్ళి ఇంకా రాలేదు. చీకటి పడింది. వనజ లైటు వెలిగించి రాజుకు మందు ఇచ్చింది. చప్పున స్నానం చేసి, వంటింట్లో సామానంతా ఎక్కడి వక్కడ చక్కగా సర్దేసి స్నానం చేసింది. వనజ మెట్రిక్ పాసైనప్పుడు జయమ్మ చిన్న ఉంగర మొకటి బహుమానంగా ఇచ్చింది. ఇప్పుడు అరిగిపోయి రాళ్ళన్నీ ఊడి అసహ్యంగా ఉంది. ఎన్నాళ్ళ నుంచో పెట్టె అడుగున పడి వున్న దాన్నిప్పుడు బయటకు తీసి వేలికి పెట్టుకొంది. తన గుద్దల సంచి పక్క గదిలో పెట్టి , ఆ ఇంటావిడతో ఏదో మాట్లాడుతుండగా వచ్చారు వాళ్ళు. ఇద్దరు స్త్రీలు ఒక పురుషుడు . ముందుగా అతను కారు దిగి లోనికి వెళ్ళి మళ్ళీ అంతలోనే బయటికొచ్చి "ఇదే ఇల్లు రాజు లోపలున్నాడు" అన్నాడు. ఆడవాళ్ళు కూడా కారు దిగి ఆదుర్దాగా లోపలి కెళ్ళారు. డ్రైవరు చిన్నవీ, పెద్దవీ చాలా సామాన్లు దింపి లోపలకు మోస్తున్నాడు.
    "మీ ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చినట్లుందే , అన్నది ఇంటావిడ.
    "చుట్టాలు కాదమ్మా. ఇంటి వారే" వనజ సమాధాన మిచ్చింది.
    బజారు లైట్లు ఇంకా వెలిగించ లేదు. బయటంతా చీకటిగా ఉంది. అణచుకోలేని ఉత్కంట , ఏదో ప్రేరేపించగా వనజ వరండాలో కెళ్ళి చీకటి మరుగున నిలబడి కిటికీ లోంచి లోనికి చూడసాగింది. రాజు నిద్రపోతున్నాడు. పద్మ వెళ్ళి రాజు పక్కలో కూర్చుని, ఆప్యాయంగా అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ "బావా" అన్నది మృదువుగా. రాజు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. శుష్కించి పోయి వున్న అతని ముఖం సంతోషంతో విప్పారింది. "వచ్చావా పద్మా? నువ్విక ఈ జన్మలో ఎప్పటికీ నా ముఖం చూడవను కొన్నాను." అన్నాడు నీరసంగా.
    "ఎందుకనుకోన్నావ్ బావా? ఎవరేమనుకున్నా నువ్వు నా బావవేగా" అంటుంది పద్మ దుఃఖేద్వేగంతో అలాగే చాలా కాలం గడిచిపోయింది. ఇద్దరి మధ్యా మాటా లేమీ లేకుండా. అప్పటివరకూ పద్మకు అవకాశ మిచ్చిన పెద్ద వాళ్ళిద్దరూ లోపలి కొచ్చారు. ఇంటి నలుమూలల పరీక్షించటం పూర్తి చేసి పద్మ మెల్లగా రాజు చేతిని వదిలి పెట్టింది.
    "ఎంత చిక్కిపోయావు నాయనా! ఇప్పుడు వంట్లో ఎలా వుంది బాబూ?' ప్రశ్నించింది రంగమ్మ రాజు కాళ్ళ వేపు కూర్చుంటూ.
    "ఓ, నువ్వూ వచ్చావా రంగమ్మా? ఇప్పుడు బాగానే ఉంది." అన్నాడు రాజు.
    అప్పటివరకూ మౌనంగా నిలబడి ఉన్న పురుషుడు "కనిపిస్తూనే ఉందిగా? చాలా నీరసంగా ఉన్నాడు. మీరిద్దరు ఇవతలికి వచ్చి రాజును విశ్రాంతి తీసుకోనివ్వండి" అన్నాడు.
    నాటకంలో అంతిమ దృశ్యం చూస్తున్న వనజకు ఆ వ్యక్తీ ఎవరో తెలియలేదు. రాజు తండ్రి మాత్రం కాదు, బహుశా పద్మ తండ్రి గారై ఉండాలి!
    పద్మ లోని కెళ్ళి వంటగది లోకి తొంగి చూసింది. అక్కడెవరూ కనిపించలేదు. ఇంకా లోపలికి - దొడ్లోకి వెళ్ళి చూసింది. ఆమె ఎవరి కోసమైతే ఆతృతగా వెతుకుతుందో ఆ వ్యక్తీ ఎక్కడా కనిపించలేదు. "ఇదేమిటి? ఎవరూ లేకుండా రాజు బావను వంటరిగా వదిలేశారేం?' ఆమె ఏమైంది? ఆ భాస్కరం ఏమయ్యాడు?' అనుకోసాగింది. పద్మ తండ్రి కుర్చీలో కూర్చున్నాడు. రంగమ్మ కు ఏం చెయ్యాలో తోచక రాజు వంక చూస్తూ అలాగే నిలబడి పోయింది. అది తమ ఇల్లు కాదనే సంగతి ఆమె కప్పుడు గుర్తొచ్చింది. నిర్మానుష్యమైన ఆ కొత్త ఇంట్లో ముగ్గురూ మూడు రకాల ఆలోచనల్లో పడి కొట్టు మిట్టాడుతూ ఆత్రుతతో దేనికోసమో ఎదురు చూడసాగారు. రాజు మాత్రం తనకేమీ పట్టనట్లు ప్రశాంతంగా నిద్దరోతున్నాడు.
    పద్మ మెల్లగా వరండాలోకి వస్తుంది. వనజకు తప్పించుకునే మార్గమేమీ లేక చప్పున కిటికీ దగ్గర్నించీ ఇవతలి కొచ్చేసింది. పద్మ కంగారు పడుతూ "ఎవరూ?" అన్నది. వనజ పైట చెంగును తల మీదికి లాక్కుంటూ "నేను ఈ ఇంటి పని మనిషినమ్మా. రేపట్నుంచీ పనిలోకి రావడానికి నాకు కుదరదు. ఈ సంగతి అమ్మగారితో చెప్పి పోదామని వచ్చాను." అన్నది.
    "మీ అమ్మగారు ఇంట్లో లేరు" అన్నది పద్మ .
    'సరేలేమ్మా. ఆ అమ్మగారు వచ్చిన తర్వాత మీరు చెప్పండి. చీకటి పడిపోయింది. ఒక్కదాన్నే చాలా దూరం పోవాలి" అంటూ మెట్లు దిగి త్వరత్వరగా చీకట్లో కలిసిపోయింది.
    పద్మ ఆలోచిస్తూ చీకట్లో అలాగే నిలబడి పోయింది. భాస్కరం వచ్చాడు. "ఎంత సేపైంది మీరంతా వచ్చి?' అని ప్రశ్నించాడు.
    "చాలాసేపైంది గాని, రాజు నోక్కడినే అలా వదిలేసి ఎక్కడికి అఘోరించావ్ ?" అడిగాడు పద్మ తండ్రి.
    "అదేమిటి పెదనాన్నా, వనజక్క లేదూ?"
    అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకోటం మొదలెట్టారు. ఏం మాట్లాడాలో ఎవరికీ తోచలేదు. "వనజక్క"అన్న సంభోధన అందర్నీ ఆశ్చర్యన్వితుల్ని చేసి వేసింది. చివరకు పద్మే కాస్త మనసు కూడదీసుకొని "మేమోచ్చేసరికే ఇక్కడెవరూ లేరు. పనిమనిషి కాబోలు వచ్చి, రేపట్నుంచీ పనిలోకి రాలేనని చెప్పి పోయింది." అన్నది.
    "పనిమనిషా? ఈ ఇంట్లో పని మనుషులెవరూ లేరు?' అన్నాడు భాస్కరం.
    పద్మ తెల్లబోయింది. తను ఎవరినైతే అత్యద్భుతమైన వ్యక్తిగా భావించి , పరిచయం చేసుకోవాలని, 'అక్కా" అని మనసారా పిలవాలనీ ఆప్యాయంగా యింటికి తీసుకెళ్ళాలని అంత దూరం నుంచి వచ్చిందో , ఆ అద్వితీయమైన వ్యక్తిని చూసి కూడా గుర్తించ లేకపోయింది? కాని ఎంతో సంస్కారంతో ఉచ్చరించబడిన ఆమె తీయని మాటలు మాత్రం స్పష్టంగా పద్మ చెవుల్లో గింగురుమనసాగాయి.

                                  (సమాప్తం)


 Previous Page

WRITERS
PUBLICATIONS