నిన్న రెడ్డి, ఇవ్వాళ ఇన్స్ పెక్టర్! వనజ మనస్సేందుకో కీడు శంకించసాగింది. కాని అతని మాటలు వింటుంటే ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదనే నమ్మకం మాత్రం చిక్కింది. మనసు స్థిమిత పర్చుకొని "చెప్పండి" అన్నది.
ఇన్స్ స్పెక్టర్ దగ్గరలోనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. "నాకు చెప్పదలచు కొన్నదేమిటో సూటిగా చెప్పటం అలవాటు. నా మాటలు కాస్త కఠినంగా విన్పించినా నువ్వేమీ అనుకోవద్దు." నాకు కాస్త--"
వనజ మధ్యలోనే అడ్డు తగిలి "దయచేసి మీరు చెప్పదలచుకొన్న దేమిటో త్వరగా చెప్పి వెళ్ళిపొండి." అన్నది అసహనంతో.
"చెప్తాను. నాకు మీ గురించి చాలా సంగతులు తెలుసు. రాజును గురించి నీకు తెలియని సంగతులు కూడా చాలా తెలుసుకొన్నాను. అతనికి నిన్ను పోషించే శక్తి లేదు. ఇంటి దగ్గర్నుంచి ఒక్క పైసా కూడా రాదు. ఆ సంగతి బహుశా నీకు తెలిసే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అతన్ని నమ్ముకొని ఉండటం నీకు మంచిది కాదు. ఏదో ఒకరోజున అకస్మాత్తుగా నిన్ను నీ ఖర్మకు వదిలేసి , ఇంటికి వెళ్ళి తలిదండ్రుల చాటున దాగొంటాడు."
"మీరు చెప్పదలుచుకొన్నది ఇదే ఐతే ఇక మీరు వెళ్ళిపోవచ్చు. ఇవి నాకు తెలియనివి కాదు" అన్నది వనజ కటువుగా.
'అంతేకాదు వనజా, మరొక విషయం కూడా చెప్పటానికి వచ్చాను. మా ఇంటి సంగతులు తెలియనివేమీ కాదు. నా గురించి రకరకాల పుకార్లు కూడా వినేవుంటావు. అవి పూర్తిగా అబద్దమని చెప్పలేను. కాని వాటన్నిటికీ కారణమేమిటో తెలుసా? నా భార్య రోగిష్టిది నేను అందరి లాగే మనిషిని. నాకూ కోర్కెలు ఉన్నాయి. ఇవ్వాళ దాపరికం లేకుండా అన్ని చెప్పదలుచుకొన్నాను, సవ్యంగా తీరని కోర్కెలు తీర్చుకోటానికి అపసవ్య మార్గాలు చాలా తొక్కాను. కాని నిన్ను చూశాక నా మనసు మారిపోయింది. సరే, అదంతా వదిలేయ్. ఇప్పుడు -- నీకిష్టమైతే నీ పోషణ భారమంతా నేను వహిస్తాను. లోపమేమీ జరుగనివ్వను, నాతొ వచ్చి వుండగలవా?'
వనజకు కోపమేమీ రాలేదు. అతని మీద జాలి మాత్రం కలిగింది. బయట నించి ఎవరో తలుపు కొడుతున్నారు.
"మీకు ధైర్యమేమీ తక్కువ కాదు. నేను వోప్పుకొంటానని అసలు మీరెలా అనుకొన్నారు. మీ అవసరం తీర్చటానికి నేనే అక్కర్లేదు. గత్యంతరం లేక పతితలై , కుళ్ళు కొంపల్లో మ్రగ్గిపోతున్న స్త్రీలు-- నాకంటే ఎంతో అందమైన వాళ్ళు-- ఎంతోమంది ఈ ఊర్లోనే ఉన్నారని విన్నాను. వారిలో ఒకర్ని తెచ్చుకోండి. కనీసం ఒక్క దీనురాలైనా రక్షించబడుతుంది. బయట పాలమనిషి కాబోలు తలుపు కొడుతుంది. ఇక మీరు వెళ్ళండి" అన్నది.
ఇన్స్ పెక్టర్ పైకి లేచాడు. 'సరే, ఇప్పటికిప్పుడే ఒక నిశ్చయానికి రానక్కరలేదు. ఏనాటి కైనా మనసు మార్చుకొంటే మాత్రం నేను నిన్ను కోరుతూనే ఉంటానని మాత్రం గుర్తుంచుకో అంటూ తలుపు తెరిచాడు. ఎదురుగా రాజు నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు చింత నిప్పుల్లా మండి పోతున్నాయి. శరీరమంతా వణికిపోతున్నది. వనజా, ఇన్స్ పెక్టర్ కూడా నోట మాటలేకుండా బొమ్మల్లా నిలబడి పోయారు. జట్కా వాడు కాబోలు రాజుకు ఆసరాగా నిలబడి ఉన్నాడు. ఇన్స్ పెక్టర్ పక్కకు తొలగి రాజుకు దోవ యిచ్చాడు. రాజు వనజ వంకా, ఇన్స్ పెక్టర్ వంకా ఒక్క క్షణం ఎగాదిగా చూసి, కణతలు నొక్కుకుంటూ, త్రాగిన వాడిలా తూలుతూ వెళ్ళి చాప మీద పడిపోయాడు.
"ఏమైందండీ యేమైంది?' వనజ ఆతృతగా ప్రశ్నించింది.
'అయ్యగారికి జరమోచ్చింది అమ్మయ్యా. ఆఫీసు నుంచి తీసుకోస్తున్నాను. నాకు బాడుగ ఇప్పించడమ్మయ్యా నేను వెళ్ళిపోతాను." అన్నాడు జట్కావాడు.
ఇన్స్ పెక్టర్ తటపటాయిస్తూ కొంచెం సేపు అక్కడే నులబడి "కంగారు పడవద్దు. దగ్గర్లోనే నాకు తెలిసిన డాక్టర్ ఒకడున్నాడు. ఇప్పుడే అతన్ని పంపిస్తాను.' అంటూ వెళ్ళిపోయాడు.
రాజుకు స్పృహ లేదు. శరీరమంతా సలసల కాగిపోతుంది. వనజకు కంగారు ఎక్కువైంది. చన్నీటితో గుడ్డ తడిపి రాజు నుదుటి మీద వేసింది. డాక్టర్ వచ్చాడు. రోగిని పరీక్ష చేసి "స్పృహ తప్పి పోవాల్సినంత జ్వరమేమీ కాదు, మరెందుకు స్పృహ తప్పిందీ అర్ధం కావటం లేదు. కాని ఆదుర్దా పడవలసిన అవసరమేమీ లేదు.' అంటూ ఒక ఇంజెక్షన్ చేశాడు. ఇంకా కొన్ని మందులకు చీటీ రాసి ఇస్తూ "ఈ మందులు తెప్పించండి. నేను మరో గంటలో వస్తాను. ఈలోపున రోగిని ఏవిధంగానూ డిస్టర్బ్ చెయ్యవద్దు" అంటూ వెళ్ళిపోయాడు.
వనజ పక్కింటి పిల్లవాణ్ణి బ్రతిమాలి డబ్బూ, మందు చీటీ ఇచ్చి బజారుకు పంపింది. లోపలికొచ్చి పమిట చెంగుతో మెల్లగా విసుర్తూ రాజు ప్రక్కనే కూర్చుంది. అతను పిలిచినా కళ్ళు తెరవడం లేదు. మధ్య మధ్య కలవరిస్తున్నాడు. "క్షమించు నాన్నా- అక్కయ్యా-- పద్మా వెళ్ళి పోవద్దు -- నేనేం పాపం చేశానని --" వనజ గుండె పగిలేట్టు ఏడుస్తూ , వెయ్యి దేవుళ్ళని ప్రార్ధిస్తుంది. ఓ అరగంట కు కలవరింతలు తగ్గిపోయాయి. రాజు కళ్ళు తెరిచాడు. హటాత్తుగా మిరుమిట్లు గొలిపే కాంతి కళ్ళ బడినట్లు బాధగా రెప్ప లాలార్చుతూ చుట్టూ చూడటానికి ప్రయత్నించసాగాడు. ఆతృతతో అతని ముఖంలోకి చూస్తున్న వనజ కంట బడింది. కొద్ది కాలం ఆమె ముఖం మీద చూపి నిల్పి "వనజా ఎంత పని చేశావ్? నేనేం లోపం చేశానని?" అన్నాడు అతి ప్రయత్నం మీద. వనజ నోరు విప్పక ముందే మళ్ళీ స్పృహ తప్పిపోయాడు. వనజ బలవంతాన ఏడ్పు ఆపుకుంటూ, 'అయ్యో, నేనే పాపమూ చెయ్యలేదండీ. మీరే నాకు దైవమని భావిస్తున్నాను. భగవాన్, భగవాన్ ఈ విషయం మీకెలా తెలియజేప్పను?" అంటూ విలపించసాగింది. అత్యంత వేదనాభరితమైన ఆమె మాటలు వినే స్థితిలో లేడు రాజు. మళ్ళీ అర్ధరహితమైన కలవరింతలు మొదలు పెట్టాడు.
.jpg)
16
రెండు రోజులు గడిచాయి. రాజుకి తెలివి రాలేదు. వనజ అయోమయవస్థలో రాజుకు సేవలు చేస్తుంది. డాక్టరు మూడు పూటలా వచ్చి చూసి పోతున్నాడు. "ఆదుర్దాపడవలసిన పని లేదు. కాని స్పృహ రావటానికి ఇంకా టైము పడుతుంది. ఇతని మనసుకేదో పెద్ద "షాక్ తగిలింది. అదేమిటో తెలుసుకో గలిగితే నా పని సులభమై పోతుంది." అన్నాడు. వనజ తిండీ తిప్పలు కూడా లేకుండా రాజుని కనిపెట్టి ఉంటోంది. రెండవరోజు మధ్యాహ్నం కాబోలు ఎవరో ఒక కుర్రవాడు బయట నిలబడి "రాజు గారుండేది ఇక్కడేనా?" అని అడుగుతున్నాడు.
వనజ బయటికొచ్చి "ఔను బాబూ. ఏం కావాలి?" అన్నది.
"ఆఫీసు కెళ్ళి అడిగితె మూడు రోజుల్నించీ రావటం లేదని తెలిసింది. జ్వరంతో ఇంటి కెళ్ళారని చెప్పారు. వారిని చూసిపోదామని వచ్చాను.' అన్నాడు భాస్కరం.
"లోపలకు రా బాబూ."
అతను వనజను చూడటం ఇదే మొదట. కాని చూడకముందే పెద్దవాళ్ళు చెప్పుకొంతుంటే అమెంటే ఒక విధమైన దురభిప్రాయం కూడా ఏర్పరచుకొన్నాడు. మత్తెక్కించే అద్వితీయమైన సౌందర్యంతో చలాకీగా , అసాధారణంగా ఉంటుందని మనసులో అతనికొక అపోహ ఉండేది. కాని తానిప్పుడు చూస్తున్న సౌమ్య స్త్రీమూర్తి కి తన మనసులోని కాముకి రూపానికి ఎక్కడా పోలిక లేదు. తానిప్పుడు చూస్తున్న వ్యక్తీ ఒక సామాన్య గృహిణి. కాని ఆ ముఖంలో ఆ మాటల తీరులో అనిర్వచనీయమైన ఆకర్షణ మాత్రం ఏదో ఉంది.
భాస్కరం లోపలి కొచ్చి రాజు ప్రక్కన కూర్చున్నాడు. రోగి పరిస్థితి అడుగనవసరం లేకుండానే తెలుస్తుంది. బల్ల మీద రకరకాల మందు సీసాలు చాలా ఉన్నాయి. ఇంట్లో పేదరికపు చిహ్నాలు కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నా, మందుల్లో గాని, రోగి శుశ్రూష లో గాని లోపమేమీ జరగటం లేదని గ్రహించాడు. రోగి ఉన్న గది హాస్పిటల్ గదిలా పరిశుభ్రంగా ఉంది. రోగి సేవలో ఆ అపరిచిత యువతి ఎంత కృశించి పోయిందో, ఆమె కళ్ళ చుట్టూ వలయాలేర్పరచుకొన్న చీకటి రేఖలే తెలుపుతున్నాయి. హటాత్తుగా అతనికి వనజ యెడల అత్యంత సద్భావమేర్పడింది.
"నన్ను మీరెరుగరు. వీరు అక్కగారు నాకు పెద్ద తల్లి గారౌతారు మీకేమీ అభ్యంతరం లేకపోతె వీరికి కొంచెం నిమ్మళించే వరకూ నేను తరచుగా ఇక్కడకు వచ్చి పోతుంటాను." అన్నాడు భాస్కరం.
వనజ తల మీది నుంచీ పెద్ద భారం దించి నట్లైంది. ఈ సమయంలో రెండవ మనిషి ఎంత అవసరమో వనజకు తెలుసు తేలిక పడ్డ హృదయంతో నిట్టురుస్తూ " అంతకన్నానా బాబూ. అసలు ఇక్కడే ఉండు" అన్నది.
భాస్కరం తనను గురించిన వివరాలన్నీ చెప్తూ కూర్చుండి పోయాడు. డాక్టరు వచ్చి గ్లూకోజ్ ఎక్కించాడు. నాడి పరీక్షించి సంతృప్తిగా తల ఊపాడు.
భాస్కరం 'డాక్టరు గారూ, మీరు రోగిని శ్రద్దగా చూడండి. మీ ఫీజు విషయంలో గాని, అవసరమైన మందుల విషయంలో గాని మీరు సంకోచించవలసిన పని లేదు, ఎంత డబ్బు ఖర్చైనా సరే. కావాల్సిన మందులన్నీ రాసేవ్వండి. తెస్తాను." అన్నాడు.
ఇప్పుడు అవసరమైన మందులన్నీ వాడటం లేదని మీరెందు కనుకొంటున్నారు? కావలసినవన్నీ వీరు తెప్పించనే తెప్పించారు. ఇతనికి మందుల కన్నా సరైన శుశ్రూషె ముఖ్యంగా కావలసింది." అన్నాడు డాక్టరు.
'అలాగైతే ఏదైనా మంచి నర్శింగ్ హోమ్ లో చేర్పించమంటారా?"
డాక్టరు నవ్వాడు. వనజ వేపు చూపిస్తూ "వీరిప్పుడు చేస్తున్న సేవకన్నా ఏ నర్సూ ఎక్కువ సేవ చెయ్యలేరు. ఇక్కడ వీరు చూపించే శ్రద్దా ఆత్మీయతా నర్సింగ్ హోమ్ లో ఉండవు. అవసరం లేదు. రోగికి ఇక ఏ క్షణంలో నైనా స్పృహ రావచ్చు" అన్నాడు.
భాస్కరం మౌనమైన చూపుల్తోనే తన కృతజ్ఞత తెలియ జేశాడు వనజకు. అతని బెంగతీరి పోయింది. వనజ చేతుల్లో రాజు బావకేమీ లోపం జరగదనే నమ్మకం కలిగింది.
"కొంచెం సేపు వారి దగ్గర కూర్చో బాబూ. చప్పున నీకు వంట చేసి వస్తాను.' అన్నది వనజ.
'అవసరం లేదక్కా, ఇప్పుడా ప్రయత్నమేమీ చెయ్యవద్దు. మనిద్దరికి హోటలు నుంచే భోజనం తీసుకొస్తాను." అన్నాడు భాస్కరం. ఆశించని ఆ ఆత్మీయ సంభోధనకు వనజ హృదయం పులకరించింది. కళ్ళ వెంట ఒకటి రెండు ఆనంద భాష్పాలు , రాలాయి. ఆ హృదయ వేగాన్ని కప్పి పుచ్చుకోవటానికి ప్రయత్నిస్తూ "ఇప్పుడు నువ్వు వచ్చాక నాకెంత ధైర్యంగా ఉందొ తెలుసా బాబూ? ఇక వారికేమీ ఫర్వాలేదు" అన్నది.
వనజ రెండు రోజుల్నుంచీ సరిగా భోజనమే చెయ్యలేదు, భాస్కరం హోటల్నుంచీ తెచ్చిన దానిలోనే రెండు ,మెతుకులు తిన్నది. "ఇవ్వాళ అయినా నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో అక్కా. రాజు బావ దగ్గర నేను కూర్చుంటాను." అన్నాడు భాస్కరం.
'అక్కర్లేదు బాబూ. నాకు మాత్రం నిద్ర పడుతుందా యేమిటి? నీకు అంత ఓపిక ఉంటె ఇద్దరమూ కబుర్లు చెప్పుకొంటూ కూర్చుందాం." అన్నది వనజ.
భాస్కరం శిధిలావస్థలో నున్న పడక కుర్చీలో కూలబడ్డాడు. వనజ ఒక చిరుగుల చాప, దిండూ తెచ్చుకుని రాజు పక్కనే వేసుకొన్నది. గదిలో శుభ్రంగా తుడిచి పెట్టబడిన లాంతరు దీప్తివంతంగా వెలుగుతోంది. భాస్కరం సాయంకాలం నుంచి తన మనసులోని మాటనొకదాన్ని వనజతో చెప్పాలని తహతహలాడుతున్నాడు. 'అక్కా నా మనసులోని సంగతి ఒకటి నీతో చెప్పాలని ఉంది. ఏమీ అనుకోవు కదా?" అన్నాడు.
"చెప్పు బాబూ. నీ అక్క దగ్గర నీకు సంకోచమెందుకు?" వనజకు ప్రకాశం గుర్తొచ్చాడు. వాడిది అదే వయసు. వాడూ పాలిటెక్నిక్ లో ఇంజనీరింగు చదువుతున్నాడు.
"నిన్ను చూడక ముందు నీ గురించి నాకు చాలా దురభిప్రాయం ఉండేది."
