Previous Page Next Page 
తప్పు పేజి 20

 

                                      10
    గోవింద పెద్ద పెట్టున ఏడవసాగింది. చటర్జీ కి రంపంతో తనని పరోక్షంగా యెవరో చీలికలు చేస్తూ 'ద్రోహి' అంటున్నట్లు వుంది. భార్యని దగ్గరికి తీసుకుని మౌనంగా వుండి పోయాడు. నేనీపని చేసి వుండాల్సింది కాదు. అన్నయ్య పెద్దవాడని అతని కన్నా అనుభవం నాకు లేదనీ అనుకుని వెర్రి భ్రాంతి లో అతను చెప్పినట్లు విని యిలా చేశాను. యిప్పుడు వాడికి మొహం యెలా చూపించను? చిన్నవాడు యేమనుకుంటాడు? నా ఖర్మకి నన్ను వదిలలేయవలసినది మీరు .'
    'గతం గతః, విచారించి లాభం లేదు. నువ్వు యేడవకు. పిల్లల యెదుట తప్పు చేసి పట్టు పడిన దానిలా మాత్రం వుండకు. వాళ్ళకి యెప్పుడూ చులకన కాకూడదు. నిన్ను మాటలనేందుకు. ప్రపంచం , సంఘం అంటూ భయపడి పోకు -- నేనున్నాను.' చటర్జీ పైకి అన్నాడే కాని ఆతను కూడా లోపల భయపడుతున్నాడు గుబులుగా.
    ఉమేష్ మెట్ల మీద చాలాసేపటి నుంచీ నిలుచున్నాడు. అతను పూర్తిగా అన్ని విషయాలూ విన్నాడు. విన్న తరువాత హాల్లోకి వెళ్లాలనీ, దీక్షితుల్ని చూడాలనీ అనుకున్నాడు. అక్కడ తన పాత్ర అనవసరం గా తోచి మెట్లు యెక్కి పైకి తన గదిలో కి వెళ్ళిపోయాడు. ఉమేష్ లో సంచలనం ప్రారంభం అయింది. కృష్ణ మోహిని తన తండ్రి యిద్దరి పెళ్ళి విషయం లో యెందుకు వద్దన్నాడో చెప్పింది. అయన మాత్రం .....అని ఆరోజు నాలుక కరుచుకుంది. పెద్దలు చేస్తే తప్పిదాలు చిన్న వాళ్ళు చేస్తే ఘోర పాపాలూ అన్న మాట. కృష్ణ మోహిని తను చేసుకుంటే వంశానికి కళంకం వస్తుందన్న భావం చటర్జీ మాటల్లో కనిపించిందట.
    ఆయనా, ఆయన తమ్ముడూ యేమాత్రం కీర్త్రి ప్రతిష్టలు తీసుకు వచ్చారు కుటుంబానికి? కృష్ణ మోహిని అందచందాలు , గుణగుణాలు యివన్నీ మెచ్చుకున్న తండ్రి తీరా కార్య రూపంలోకి వచ్చేసరికి కప్పదాటు యెలా వేశాడు. ఉమేష్ మనసు యివాళ నిండుగా, తృప్తిగా , ఆనందంగా వుంది. కృష్ణ మోహిని కి తను అభయ హస్తం యిచ్చాడు ఆ రోజు. సమయం వచ్చేసరికి ఏమై పోతుందోనని భయపడసాగాడు. యిప్పుడు భయం దేనికి కావలసినంత నిశ్చింత. యదేచ్చేగా విచ్చలవిడిగా ప్రవర్తిచేందుకు తనేమీ మూర్కుడు కాదు. మనోమోహిని వుత్తమ యిల్లాలు. ఉపేంద్ర పెద్దమనిషి. యిద్దరి తరుపు నుంచీ కృష్ణ మోహిని ఈ రెండు లక్షణాలు కలుపుకుని పుట్టింది. కాలేజీ లో కృష్ణ మోహిని అందాన్ని స్వంతం చేసుకోవాలని కొందరూ, పెళ్ళాడి ఆ పిల్లతో బ్రతకాలని మరి కొందరూ, ఉపేంద్ర యింటికి పెద్ద మనుషులనీ తల్లి తండ్రులని పంపడం తను ఎరగడూ. మధ్యాహ్నం పన్నెండు గంటలు యెప్పుడో దాటిపోయింది. నాలుగు గంటల వరకూ శ్రీకాంత్ యింటికి రాలేదు. భోజనాల సంగతే అందరూ మరిచిపోయారు.  గోవింద కాఫీ టిఫిన్ చేసి ఉమేష్ కి చటర్జీ కి పెట్టి శ్రీకాంత్ కోసం యెదురు చూడసాగింది. అతను నాలుగున్నర ప్రాంతాలకి వచ్చాడు. తండ్రి గదిలోకి వెళ్ళి 'నన్ను ఫారిన్ పంపండి నాన్నగారు.' అని అడిగాడు.
    యిద్దరికీ అదే వుచితంగా వున్నది. రోగి కోరుకున్నదీ వైద్యుడు యిచ్చినదీ ఒకే మందు అయింది. చటర్జీ పొంగి పోయాడు. కొడుకుని గుండెల్లో కి తీసుకుని ' అలాగే భేటా.'అన్నాడు.
    శ్రీకాంత్ హృదయం అర్ద్రమై పోయింది. 'యిటువంటి తండ్రిని వదులుకుని వెళ్ళలేదు నయం' అనుకున్నాడు.
    శ్రీకాంత్ తనని అనరాని మాటలంటాడనీ, యిన్నాళ్ళూ ఈ రహస్యం చెప్పలేదని నింద వేస్తాడనీ, దూషణం తో ముంచెత్తుతాడనీ, రక రకాలుగా అనుకున్నది గోవింద. శ్రీకాంత్ వంట యింట్లోకి వస్తున్న అలికిడి కి గుండెల్ని దిటవు చేసుకోవాలని ప్రయత్నించి విఫలు రాలైంది.
    శ్రీకాంత్ వచ్చాడు. వచ్చి తల్లి మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద వాలిపోయి ' అమ్మా.... యిన్నాళ్ళూ యింత బాధ ఒక్కదానివే యెందుకు భరించావు. నాతొ చెప్పలేదు దేనికి?' అని మాత్రం అడిగాడు.
    గోవింద నీళ్ళు నిండిన కళ్ళతో కొడుకు వైపు చూసింది. ఆ పిల్లాడి కళ్లల్లో కూడా ఆ క్షణంలో కన్నీళ్లు దోబూచులాడసాగాయి. గోవింద మౌనంగా కళ్లతోనే సందేశాలు పంపసాగింది. 'పరిస్థితులు నన్ను నిలవనీయ లేదు. నేనేం చేయను?'
    అతను మాట్లాడలేదు. గోవింద యిచ్చిన కాఫీ తాగి టిఫిన్ తిని తమ్ముడి గదిలోకి వెళ్ళాడు. ఉమేష్ పై పెదవి మీద కుడి చేతి చూపుడు వేలితో రాసుకుంటూ సోఫాలో కాలు మీద కాలు వేసుకుని శూన్యం లోకి చూస్తున్నాడు. కార్యాన్ని సిద్దించే మార్గాన్ని ఆలోచిస్తున్నా వాడిలా.

                    
    శ్రీకాంత్ వచ్చి తమ్ముడి పక్కన కూర్చుని భుజం మీద చేయి వేసి 'ఏవిట్రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?' అని ప్రశ్నించాడు.
    'మరేం లేదన్నయ్యా '. ఉమేష్ తప్పించుకోవాలనుకున్నాడు. శ్రీకాంత్ వూరుకోలేదు. రెట్టించి మళ్లీ అడిగాడు.
    'మనం అలా బయటికి వెడదాం పద అన్నయ్యా,' అన్నాడు ఉమేష్.
    చటర్జీ యేమీ అనలేదు.
    యిద్దరూ కలిసి బజారు గుండా లైబ్రరీ కి వెళ్లి కాస్సేపు కూర్చుని రెండు మూడు పుస్తకాలు తీసుకుని జోడా మందిర్ వైపు మళ్లారు. మందిర్ లో కూర్చున్నాక ఉమేష్ ప్రారంభించాడు.
    'నిన్నొకటి అడగనా అన్నయ్యా.' అని.
    'ఒకటెం కావలసినన్నీ అడుగు తమ్ముడూ.' అన్నాడు శ్రీకాంత్.
    'లా చదివాక కృష్ణ ని చేసుకోనా, లేక ముందే చేసుకోనా?'
    శ్రీకాంత్ ఆశ్చర్యంతో నోటమాట పెగలలేదు.
    'చెప్పన్నయ్యా.'
    'యింత త్వరగా యిటువంటి నిర్ణయానికి వస్తావని అనుకోలేదు తమ్ముడూ. యెందుకిలా ఆలోచించావు.'
    'యెప్పటికైనా తప్పదు కదన్నయ్యా . నాన్నగారిని యెదిరించి చేసుకోబోయే ఈ పెళ్లి ముందు అయినా, వెనక అయినా అభినందించే వాడివి నువ్వు తప్ప మరెవరూ లేరు.'
    'నాన్నగారి సంగతి యేమో గాని అమ్మ మాత్రం అభినందిస్తుంది తమ్ముడూ.'
    'రేపు వెళ్లి రిజిష్టార్ దగ్గర సంతకం చేసి వస్తాం. ఈ సంగతి నీతో చెప్పాలని పించింది. పెద్దవాడివి నిన్ను వదిలి నేను ముందు పెళ్ళి చేసుకుంటున్నందుకు నన్ను మన్నించాలి.'
    శ్రీకాంత్ మొహం కళ తప్పింది 'నన్ను అంతే అర్ధం చేసుకున్నావా తమ్ముడు. నేను పరాయి వాడినా నిన్ను అభినందించక పోయేందుకు.'
    'చూడన్నయ్యా నేనీ పెళ్ళి చేసుకుంటే నాన్నగారు యింటికి రావద్దంటారు. ఆస్తిలో చిల్లి గవ్వ యివ్వ నంటారు. అవన్నీ నాకు తెలుసు. మరీ మంచిది ఆస్తి నాకు లేకపోయినా నీకు దక్కుతుంది.'
    'అదేం ,మాట'
    'డబ్బు లేకుండా బ్రతకడం చాలా కష్టం అన్నయ్యా. నేను యిలా చేయకపోతే నాన్నగారు స్వంత కొడుకునని పక్షపాతం చూపించే ప్రమాదం వుంది. నేను అందుకే లెక్కచేయడం లేదు.'
    'నువ్వు అంటున్నది యేమిటి తమ్ముడూ'
    'నిజమే అన్నయ్యా.'
    'నాన్న అలాంటి వారు కాదు.'
    'కాదు. కానీ చెప్పలేం. నేను మాత్రం కృష్ణ ని యిప్పుడే పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించు కున్నాను.'
    'మంచిది తమ్ముడు నాకు చాలా సంతోషంగా వుంది .' శ్రీకాంత్ కళ్ళు ఆనందంతో మిరుమిట్లు గొలిపాయి.
    శ్రీకాంత్ తిన్నగా యింటికి వెళ్లి పోదాం అన్నాడు. కాని ఉమేష్ నార్కెల్ డాంగా లో ఆగిపోయాడు. 'యింటికి పద తమ్ముడూ' అన్నాడు శ్రీకాంత్.
    నవ్వాడు ఉమేష్ : 'పంజరం లోంచి బయటపడ్డ పక్షిలా వున్నదన్నయ్యా నా మనసు. తెగించి నప్పుడు యే భయమూ బాధించదన్న మాట. ఈ మాట కృష్ణ మోహిని చెవిన వేయకపోతే ఎలా?'
    'మరి నేనూ రానా? యిద్దరం కలిసే యింటికి వెడదాం. మధ్యలోనే నిజం బయటపడి అవరోధాలు యేర్పడకూడదు' శ్రీకాంత్ అన్నాడు.
    ఉమేష్ కొద్దిగా తల పంకించి క్షణికం ఆలోచించాడు. ఆ తరువాత అన్న చేతిని తన చేతిలోకి తీసికుని 'కోర్టు లో పెళ్లి అంటే నాన్నగారికి యెలాగో అలా తెలిసి పోతుంది. పెళ్లి శాస్త్రోక్తంగా నలుగురు పెద్దల సమక్షంలో జరుగుతే ఏం ?' అన్నాడు.
    అనవసరంగా మావయ్య ని నాన్నగారు మాటల అంటారు. ఆయనకి కూడా చెప్పాము మేము. ఈ ఒప్పందం బాగులేదన్నయ్యా?'
    తమ్ముడి ఆలోచనల్ని అన్న ఆమోదిస్తున్నాడు. తమ్ముడు రెట్టించిన ఉత్సాహం తో అడుగులు ముందుకు వేస్త్గున్నాడు.
    క్రుష్ణమోహిని యింటికి చేరుకునే సరికి చీకటి పడ్డది. తల్లీ తండ్రి కూతురూ కూర్చుని మాట్లాడు కుంటున్నారు. ఇద్దరినీ చూసి 'చిరకాల దర్శనం యేమిటి విశేషం దారి కాని తప్ప లేదు కదా? ' అని అడిగాడు ఉపేంద్ర.
    ఇద్దరూ నవ్వారు. లోపలికి వచ్చి కూర్చుంటుంటే కృష్ణ మోహిని అంది. 'ఇప్పుడు మాత్రం దేనికి రావడం. ఏం అవసరం లేదు. వెళ్ళండి. మా యిళ్ళకి వచ్చి కులం దేనికి పోగొట్టు కొనడం.' అప్పటికే ఆ పిల్ల ముక్కు పుటాలు రోషంతో యెగిరి పడుతున్నాయి.
    ఉమేష్ గుంభనం గా చూస్తూ కళ్లతోనే సందేశాలు వోదార్పు గా పంపుతున్నాడు. అరగంట గడిచాక యిద్దరూ లేచారు 'వెళ్ళి వస్తాం' అంటూ.
    ఉపేంద్ర వీధి వరకూ వచ్చాడు సాగ నంపెందుకు.
    అన్నదమ్ములు యింటి వైపు దారి తీశారు.

                                *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS