Previous Page Next Page 
ప్రసన్నకుమార్ సర్రాజు కథలు 2 పేజి 20


    మూర్తి ఇందిరా మొహమొహాలు చూసుకున్నారు. అప్పుడే వైస్ ప్రిన్సిపాలుట ఆటే వెడుతూ ఆమెను పలకరించాడు.
    "ఏంటి సార్! ముప్పై కొత్త బెత్తాలు శాంక్షన్ చెయ్యమని అర్జీ పెడితే ఇరవయే ఇచ్చారు? ఈ పాత బెత్తాలతో ఎంత అవస్థ పడుతున్నానో తెలుసా?" అంది గోముగా. వైస్ ప్రిన్సిపాల్ "నే చెప్తాలే స్టోర్ కీపర్ కి" అని అనునయించి వెళ్ళిపోయాడు.
    మూర్తి , ఇందిరా , వంశీ అక్కణ్ణుంచీ కదిలారు.
    "అవునూ!... పుష్యగామీ! ఒకటీ రెండు తప్పులు సరే. ఆ కుర్రాడి టీచర్ బయట కెళ్ళిన టైములో వాళ్ళు "భూత్' గురించి మాట్లాడుకున్నట్లు ఆమెకెలా తెలిసిందీ?" అడిగాడు మూర్తి.
    పుష్యగామి కిలకిలా నవ్వుతూ 'అదే సార్ మా కార్పోరేట్ కాలేజీ ఆధునిక టెక్నాలజీ! బెంచీల కింద రహస్యంగా మైకులుంటాయి. స్టూడెంట్స్ మాట్లాడుకునే మాటల్ని రహస్యంగా ట్రాప్ చేస్తారు. టీచర్ కి వెంటనే చెప్తారు. ఆవిడ శిక్షిస్తుంది" అంది.
    "అవునూ! ఆ శిక్షేడో ఆవిడే అమలు చేయొచ్చుగదా!" అడిగింది ఇందిర.
    "లేదండీ.... ఆవిడే కాదు చాలామంది టీచర్లు అహింసా మార్గాలలో నడుస్తుంటారు. అందరూ అహింసా వాదులే. అందుకని 'వెళ్ళి కొట్టించుకురా' అని మర్యాదగా విద్యార్ధి చేసిన తప్పులు స్లిప్పులు రాసి, కొట్టుడు గదికి పంపిస్తారు" అంది పుష్యగామి , మూర్తి, ఇందిరా భారంగా నిట్టుర్చారు.
    హాస్టల్ వార్డెన్ అనుమతి తీసుకుని లోపలికెళ్ళారు. మూడు అంతస్థులున్నాయి.
    "హాస్టల్ లో పిల్లలున్నారేమిటి? క్లాసులు జరుగుతున్నాయి కదా!" అన్నాడు మూర్తి.
    "వీళ్ళు సప్లిమెంటరీ స్టూడెంట్స్ . మళ్ళీ పరీక్షలు రాయాలి" అంది పుష్యగామి.
    ఒక్కోగది చూసుకుంటూ వెడుతున్నారు. రూమ్స్ తలుపులు మూసి వున్నై గానీ విండోస్ తెరిచే వున్నై. వాటికి కటకటాలలాగా ఇనుపచువ్వలున్నై . వీళ్ళ అలికిడి విని రూముల్లో పిల్లలు వచ్చి , కటకటాలు పట్టుకుని, అభావంతో చూస్తున్నారు. కొందరి వదనాలు దిగులుగా వున్నాయి. కళ్ళకింద నల్లటి చారలు. కొంతమంది పిల్లలకు భూతద్దాల కళ్ళజోళ్ళున్నాయి.
    "వీళ్ళ క్లాసుల కెళ్ళరా?" అడిగాడు వంశీ.
    "వీళ్ళు పగలంతా హాస్టల్లో చదువుకుని, రాత్రి భోజనాలు అయ్యాక నైట్ క్లాసులకి వెడతారు."
    "నైట్ క్లాసులా!"
    "అవునండీ .... ఇరవై నాలుగ్గంటలూ చదివితే గానీ బాగా మార్కులు రావు గదా! ర్యాంకులు రాకపోతే మా కాలేజీకి ఎంత అప్రదిష్ట? నైట్ క్లాసుల కెళ్ళి మూడు గంటలకు వచ్చి , ఎంచక్కా నిద్రపోయి మళ్ళీ నాలుగ్గంటలకు లేచి, చదువుకుంటారు. మా హాస్టల్ వార్డెన్ చాలా స్ట్రిక్టు. అన్ని రూముల్లోనూ బెల్లులు పెట్టించింది. కరక్టుగా తెల్లవారు ఝామున నాలుగ్గంటలకు తన రూములో బటన్ నొక్కుతుంది. ఆ శబ్దానికి పెద్ద పులైనా బెదురుతూ లేవాల్సిందే" చెప్పింది గొప్పగా.
    "పోన్లే .... ఓ గంటయినా నిద్రపోనిస్తున్నారు "గొణుక్కున్నాడు మూర్తి. అది వినిపించింది పుష్యగామికి.
    "అసలు మనిషికి రెండు మూడు గంటల కంటే నిద్ర అనవసరం సార్. ఎన్టీ రామారావు గారు రాత్రి పన్నెండింటికీ పడుకుని, మళ్ళీ తెల్లవారు జామున మూడింటికే నిద్రలేచి పనుల్లోకి దిగిపోయేవారట. ఎక్కడో చదివాను" అంది.
    'అవును. అందుకే ఆ మహానుభావుడు 'దిగి' పోయాడు" అన్నాడు మూర్తి.
    "ఆ మాత్రం పెద్ద వయసు వారికి మూడు గంటల నిద్ర చాలితే, పిల్లలు - వీళ్ళకి గంట నిద్రచాలు గదా!" అంది పుష్యగామి.
    మూర్తి, ఇందిరా , ఏమీ అనలేదు.
    వరండా చివరి వరకూ వెళ్ళి "ఇక వెడదాం" అని తిరిగొస్తుంటే రూముల్లో పిల్లలు విండో నుంచీ వెనక్కి తిరిగి , తమ స్టడీ టేబుల్స్ దగ్గర కెడుతుంటే మూర్తి గమనించాడు. వాళ్ళ హాస్టల్ యూనిఫాం తెల్లచోక్కాల వెనుక నెంబర్లున్నాయి.
    మూర్తి తెల్లబోయి "ఆ నెంబర్లేమిటి?" అన్నాడు. పుష్యగామి చిరునవ్వుతో "ఇంతమంది పిల్లల పేర్లు గుర్తుపెట్టుకోవడం పాపం వార్డెన్ గారికి కష్టం కదా సార్! అందుకనే ఈ ఏర్పాటు" అంది.
    అంతా కిందకి దిగారు. "ఔట్ " గేటుని సమీపిస్తుంటే లోపలే రెండు గదులున్నాయి. గేటుకి కొంచెం దూరంగా. ఒక గది ముందు ఇద్దరు తాళ్ళు పేనుతున్నారు. ఒకడు ఆ తాళ్ళని ఆరడుగుల చొప్పున కట్ చేసి ఓ పక్కన మోపులా పెడుతున్నాడు.
    "ఎందుకా తాళ్ళు?" అడిగాడు మూర్తి. పుష్యగామి మొహమాటంగా నవ్వి , "ఒక్కోసారి ..... స్టూడెంట్లు సైకలాజికల్ గా పరీక్షలకు భయపడి ..... అప్పుడప్పుడు.... అదే వెరీ రేర్ గా సూసైడ్లు చేసుకుంటారు గదండీ? మా కార్పోరేట్ కాలేజీల హాస్టళ్ళ లో అన్నీ ఖరీదైన దుప్పట్లూ, బెడ్ షీట్లూ వుంటాయి. అవి పాడైపోతే మాకు చెడ్డ పేరు గదండీ .... అందుకని"' అంది పుష్యగామి.
    
    "ఇక చాల్లే పోదాం పదండి బావా ...." అప్పటివరకూ ఆ పిల్ల చెయ్యి పట్టుకుని ఉన్న వంశీ ఆమెకు దూరంగా జరిగి అన్నాడు. గేటులోంచీ బయటకు వస్తూ ఓరగా చూశాడు మూర్తి ఆ రెండోగది వేపు. 'ఉరి వేసుకునే గదికి దారి' అని బాణం గుర్తుతో ఓ బోర్డుంది మొక్కల మధ్య.....

                                          * * *

    ఆ రోజు ఆదివారం మూర్తి ఆలోచిస్తూ పడక్కుర్చీలో కూర్చున్నాడు.
    అమెరికా వాళ్ళు అంతరిక్షంలో వాడే ప్రత్యేకమైన పెన్ను ఆ వాతావరణానికి అనుకూలంగా..... అంటే లోపల సిరా కక్కకుండా, పాళీ ఒంకర పోకుండా సిరాబుడ్డితో పనిలేకుండా, బాల్ పాయింటయితే లీకవకుండా, దృఢంగా, అన్ని వాతావరణ పరిస్థితులనూ తట్టుకునే విధంగా తయారు చేయడానికి రెండేళ్ళ సమయమూ, రెండుకోట్ల డాలర్లూ ఖర్చు పెట్టారట.
    అదే సమయంలో అదే అవసరం కోసం, రష్యన్లు సింపుల్ గా పెన్సిల్ వాడారట.
    నవ్వుకున్నాడు. పిల్లలే తెలివితేటలూ, వాళ్ళ జ్ఞాపకశక్తి, సామర్ధ్యమూ చాలాభాగం వాళ్ళ వంశవృక్షంలో వుంటుంది. ఐన్ స్టీన్ ఏ కార్పోరేట్ కాలేజీల్లో చదివాడు? న్యూటన్ కి ఏమి డిగ్రీలున్నాయి? బాల్యాన్నీ ప్రకృతినీ హాయిగా అనుభవించే వయసులో, ఆనందమంటే ఏమిటో తెలియక, ఈ భయంకరమైన పోటీలో, పాపం పిల్లలు.... ఆ హాస్టల్లో పిల్లలను తల్చుకుని మూర్తి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
    "ఇదిగో ఈ ప్రకటన చూడండి" అని పేపరందించింది ఇందిర మౌనంగా టీవీ మీదున్న కళ్ళజోడు ఇచ్చింది మూర్తికి.
    "కనబడుట లేదు. ఈ కింది ఫోటోల్లోని పిల్లలు కిడ్నాప్ చేయబడ్డారు. వీళ్ళు ఒకరుగానీ, ఇద్దరు గానీ లేక మొత్తం పదిమందిగానీ, ఏదో ఒక కాలేజీ రెసిడెన్షియల్ హాస్టల్లో వుండి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆచూకీ తెలిపినవారికి తగిన పారితోషికం ఇవ్వబడును" ....మూర్తి, ఇందిరా ఒకళ్ళనొకళ్ళు చూసుకుని నవ్వుకున్నారు. ఆ నవ్వులో జీవం లేదు.
    
                                                                       * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS