Previous Page Next Page 
ది సెల్ పేజి 20


    "...నెవ్వర్__నాకు జాలి అంటే పరమ అసహ్యం?..." అతని సమాధానంతో నిమిత్తం లేకుండా శ్రీలేఖ మాట్లాడసాగింది.
    "...జీవితంలో నాకు ముగ్గురే ముగ్గురు మగవాళ్ళు తెలుసు. ఒకరు కన్నతండ్రి, నాకు ఊహవచ్చిన తరువాత చనిపోయాడు. రెండు నా అన్న. నా పరిస్థితి చూసి జాలిపడలేదు. తన పరువు పోయిందని అసహ్యించుకున్నాడు. మూడు నా ప్రియుడు. అతడే నా జీవితానికి విలన్! ఆ రూపం, ఆ ఆలోచన నాలోనుండి ఎప్పుడో చచ్చిపోయింది. నాకు ఎదురయ్యే మగవాళ్ళలో నాకు రెండే రూపాలు_సాంప్రదాయాలు కనిపిస్తాయి_వయసు చేత పినతండ్రిగా లేక, అన్నగా. అంతే. నా జీవిత పుటలలో మూడో మగవాడికి స్థానం లేదు. అసలు ఆ ఆలోచనే రాదు.
    ...ఇప్పుడు చెప్పండి మిమ్మల్ని "బాబాయి" అని గౌరవించనా? అన్నా అని ఆప్యాయంగా కౌగిలించుకోనా?...." శ్రీలేఖలో ఆవేదన కట్టలు తెగింది. ఎక్కి ఎక్కి ఏడవసాగింది.
    కొన్ని క్షణాలకి శ్రీలేఖలో ఆవేదన తగ్గినట్లు కన్నీళ్ళు ఇంకిపోయాయి. అప్పటివరకు పరిసరాలను మరిచి మాట్లాడిన శ్రీలేఖ తలెత్తి చూసింది. ఇందాకటి రోమియో అక్కడ కనిపించలేదు. చుట్టూ చూసింది. వడివడిగా వెళుతున్న అతను ఆమె కనుపాప దూరానికి దూరమయ్యాడు.
    శ్రీలేఖ తృప్తిగా నిట్టూర్చింది. శ్రీకాంత్ తో ఏ సమస్యనైతే చెప్పి పరిష్కారం అడగాలనుకుందో ఆ అవసరం లేకుండానే సమస్య పరిష్కారం అయ్యింది.
    ఇక తను నిర్భయంగా ఉద్యోగం చేసుకోవచ్చు. తన కూతుర్ని పోషించుకోవచ్చు.
    అప్పటికి బాగా చీకటి పడింది. ఇంక శ్రీకాంత్ కోసం చూడటం తన ఉనికికే ప్రమాదమనిపించింది. అసలు పెన్ ఫ్రెండ్స్ ని కలుసుకోకుండా వున్నంతవరకే స్నేహం, స్నేహ భావం పెంపొందుతుంది. శ్రీకాంత్ ని కలవకపోవటం ఆ క్షణంలో ఒకందుకు మంచిదే అనిపించింది. కలం స్నేహం కలం స్నేహంగానే వుంచటం మంచిదన్న నిర్ణయానికి వచ్చి వెనుదిరిగింది శ్రీలేఖ.

                                      *    *    *

    ఆ రోజు పోస్టులో వచ్చిన ఉత్తరాన్ని అందుకుంది శ్రీలేఖ. కవరుమీద దస్తూరిని గుర్తుపట్టింది. అది శ్రీకాంత్ శ్రీలేఖకి రాసిన లెటర్. కవరు చించి లెటర్ చదివింది.
    "శ్రీలేఖకు
    శ్రీకాంత్ రాయునది. మొన్న నీకు మనస్తాపాన్ని కల్గించినందుకు క్షమించు. ఆ రోజున నీ ఆవేదనను కళ్ళారా చూశాను. చెవులారా విన్నాను. ఓపికతో ఈ లెటర్ పూర్తిగా చదువు.
    నీకు పెన్ ఫ్రెండ్ గా ఉత్తరాల ద్వారా పరిచయమైనా నేను నువ్వు అర్థం చేసుకున్నంతటి గుణసంపన్నుడిని కాదు. ఉత్తరాలలో నువ్వు చదివింది నా వ్యక్తిత్వం కాదు; నా ఆశయాలు, ఆదర్శాలు కాదు. లెటర్స్ ఆ విధంగా రాయటంలో నాకు నేనేసాటి. ఆ ఆర్టుతోనే ఇప్పటివరకు అనేకుల జీవితాలతో చలగాట మాడాను. అదే జీవితం అనుకుని భ్రమపడ్డాను.
    మొన్న నీదగ్గరకు వచ్చిన రోడ్డు రోమియో రోజు నిన్ను వేధించుకుతింటున్న రోమియో ఎవరో కాదు నేనే. ఆ అవతారం ఆరోజు చాలించి శ్రీకాంత్ గా పరిచయం చేసుకుని ప్రేమపాఠాలు వల్లించి నిన్ను... నా ట్రాప్ లో పడేయాలనే నిన్ను పబ్లిక్ గార్డెన్స్ కి రమ్మని ఇంతకు పూర్వం లెటర్ రాశాను. కాని నీ మనోవేదన, నీ గతం తెలుసుకున్న నాకు, మానవత్వపు విలువల అంచున కొట్టు మిట్టాడుతున్న ఆడపడుచు అనే పదం నాలోని రాక్షసత్వాన్ని వెక్కిరిస్తూ సవాల్ చేసింది"-
    నీకు తెలిసిన ముగ్గురు మగవాళ్ళలో బాబాయిగా గాని, అన్నగా గాని తప్ప నీ హృదయంలో మూడో మగచిత్రం లేదన్న నీ నిర్ణయానికి, ఇప్పటివరకు నీ ఎడల నేను ప్రవర్తించిన తీరుకు సిగ్గుతో తల వంచుకుంటున్నాను. జీవితంలో ఇంకెవ్వరూ నాలాంటి వ్యక్తులు నీకు ఎదురవ్వకూడదని మనసారా కోరుకుంటూ మరోసారి క్షమించమని వేడుకుంటూ...
                                                                                              శలవ్
                                                                                             శ్రీకాంత్"
    లెటర్ పూర్తిగా చదివిన శ్రీలేఖకి జరిగింది, జరుగుతున్నది అంతా ఓ వింతకథలా అనిపించింది. సమాజంలో తను వంటరిగా ధైర్యంగా బ్రతకగలననే నమ్మకం కలిగింది. మనిషిలోని మానవత్వం తాత్కాలికంగా మరుగున పడిపోయినా స్త్రీ అనే పదానికి అర్థం తల్లి చెల్లి అని కూడా ప్రతి మానవుడు మరచిపోనప్పుడు, మానవత్వపు విలువలు మాసిపోవు అనుకుంది శ్రీలేఖ.
    శ్రీలేఖ యధావిధిగా కాన్వెంట్ కి వెళుతుంది_రోజూ కాన్వెంట్ టైమ్ కి, విడిచిపెట్టే టైమ్ కి పోలీసు కానిస్టేబుళ్ళు అక్కడ గస్తీ తిరుగుతున్నారు. సబ్ ఇన్ స్పెక్టర్ కుర్రకారు ఎవరన్నా పోకిరీ వేస్తే నడ్డి విరగగొడదామన్న పట్టుదలతో అటుగా అప్పుడప్పుడు సర్ ఫ్రైజుగా వస్తున్నాడు. అదంతా రోమియోన్ డ్యూటీ అయివుంటుందనుకుంది శ్రీలేఖ.
    శ్రీకాంత్ ఎస్.ఐ. కి రాసిన ఆకాశరామన్న ఉత్తరం విషయం శ్రీలేఖకు తెలియదు.

                                   *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS