Previous Page Next Page 
డేంజర్ డేంజర్ పేజి 21

   
    విమానం మంటలతో కూలింది. నాకు దెబ్బలు తగిలాయి లేవలేకుండా పడిపోయాను. ఈ అడవిజాతి వాళ్ళచేత రక్షించ బడ్డాను. విమానం ఎక్కేముందు మా వాళ్ళతో మాట్లాడి నప్పుడు కొంత సమాచారం వాళ్ళందించారు. మా శాఖలో వ్యక్తుల పేర్లు చెప్పారు. ఒక స్త్రీ, తతిమ్మావారంతా పురుషులు. ఆమె పేరు కీర్తి...."కీర్తి ఇలారా!" అంటూ ఆగి కీర్తి వైపు చూశాడు బాజారావు. కీర్తి ఆశర్యంగా చూసింది.    
    కీర్తి ముందు కొచ్చింది. కీర్తి మగాడు కాదని తెల్సిన గోమతి తెల్లబోయింది.    
    "గోమతి తర్వాత కధవిను. నేను మీ దగ్గరకు చేర్చబడ్డాను. నీవు కీర్తివేమో అని మొదట అనుకున్నాను. మారువేషంలో కీర్తి వుందేమో అని కమల్ మొహ్రాగా వున్న కీర్తిని అనుకున్నాను. ఆ పై మీరు మామూలు విమానంలో ప్రయాణంచేసే ప్రయాణికులు అనుకున్నాను. చివరికి ఒకరుమాత్రం ముఠాలో వ్యక్తయి వుండవచ్చని అనుకున్నాను. ఆరోజుపోట్లాటప్పుడు కమల్ మొహ్రా ఆడపిల్ల మగాడి వేషంలో వుందని అనుమానం వచ్చింది. రాగిరేకు కిందకు జారవిడిచాను, నీవది తీసుకున్నావు. స్పైడర్ ముఠా గుర్తులన్నీ నాకు తెల్సు కాబట్టి నీముఠావాడినని నమ్మించి నినుదగ్గరకుతీశాను నమ్మావు."    
    "రాగిరేకువల్లే గుర్తించావా?" గోమతి గొణుగుతూ అడిగింది.    
    "ఉహు? మీ ఇరువురు వేరువేరుగా స్నానాలు చేసేటప్పుడు చూశాను. అదీ రాగిరేకు తర్వాతన్నమాట. ఇద్దరివద్ద ఆయుధాలున్నాయి ఇద్దరూ ఆడాళ్ళు నీవు స్పైడర్ ముఠా మనిషివని నీ స్నేహం తర్వాత తెల్సుకుని కీర్తి ఎవరన్నది నీ ద్వారానే ఆరా తీశాను. కీర్తి మారు వేషంలో వున్న మా మనిషని తేలింది. మీ రహస్యాలున్న సూటుకేసు, రుమాళ్ళు చిలకలు, ఆల్బం కీర్తి దగ్గరుండటం అదృష్టం, మా కేసు తేలికయింది. కీర్తీ నీవు ఎత్తుకు పై ఎత్తు వేసుకున్నారు. నేనో కామాంధుడిగా కఠినుడిగా నాటకం ఆడాను, కధ ముగిసింది. స్పైడర్ నిర్మించే కాబ్ వెబ్ లో స్పైడరే ఇరుక్కున్నాడు. ఇక్కడ ఎవరికీవారం స్పైడర్ గా మారి కాబ్ వెబ్ నిర్మించాము."    
    "మీ కాబ్ వెబ్ లో ఇరుక్కున్నాము" నవ్వుతూ అంది కీర్తి.    
    గోమతి తన వేలి ఉంగరంలో ఉన్న విషాన్ని తీయబోయింది తినడానికి, ఒక్కంగలో బాజారావు గోమతిని చేరి విషాన్ని క్రిందకు వంచాడు.    
    కీర్తి నా జేబులో రుమాలుంది చూడు దాన్ని గోమతి ముక్కుకి అదిమి పట్టు స్పృహ పోతుంది. ఆలశ్యం అపాయంకి కారణం. గోమతిని తీసుకుని మనం ఇక్కడి నుంచి వెళదాము అన్నాడు బాజారావు.        
    కీర్తి రుమాలు తీసి గోమతి ముక్కుకి అదిమి పట్టింది గోమతి తెలివి తప్పి పరిగింది. కీర్తి గోమతి అక్కడే వుంటే బాజారావు వెళ్ళి సాక్ష్యానికి స్పైడర్ ముఠావాళ్ళ వస్తువులు తెచ్చాడు. ఆ తర్వాత బాజారావు గోమతిని భుజాన వేసుకున్నాడు. బాజారావుకి రూట్ తెల్సు.    
    బాజారావు ముందు నడుస్తుంటే కీర్తి వెనకనేనడుస్తూ ముందుకు సాగారు.    
    "సాలెపురుగు సాలెగూడుని అద్భుతంగా నిర్మిస్తుంది, దానిలో ఈగలు చిక్కుకోవాల్సిందే గాని మనుషులు చిక్కుకోరు" అనుకుంది కీర్తి.
    
                                       15
    
    కుర్చీలోంచి నెమ్మదిగ లేచింది కీర్తి.    
    ఆ సమయంలో అక్కడ వున్న అందరి కళ్ళుకీర్తిమీదనే వున్నాయి. కారణం ప్రస్తుతం అక్కడ కొందరు ప్రముఖులు హాజరయ్యారు.    
    అక్కడ జరుగు తున్నది అభినందన సభ.    
    కీర్తి స్పైడర్ కేసు విషయంలో దిగ్విజయం సాధించిన సందర్భంలో కొందరు పెద్దలు అభినందన సభఏర్పాటు చేసి బఫె పార్టీ పెట్టారు.    
    ఇలాంటి అట్ట హాసాలు కీర్తికి యిష్టం వుండవు. కాని పెద్ద పదవుల్లో వున్న వాళ్ళు కొందరు పెద్ద మనుషులు కాలక్షేపానికి వాళ్ళ గొప్పతనం చాటుకోటానికి పదిమందిని పిలచి ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ ఏర్పాటు చేస్తుంటారు.    
    ప్రస్తుతం యిదో చిన్న ఫంక్షన్ అంతే.    
    బాగా మాటాడ గలిగిన కొందరు కీర్తిని అభినందిస్తూ మాట్లాడారు. అక్కడ మైకు లేదు. ఎవరి కుర్చీలోంచి వారు లేచి నిలబడి మాట్లాడటమే. పార్టీకి వచ్చిన మొత్తం పాతిక మంది దాకా వున్నారు. వారిలో మాట్లాడేశక్తి వున్నవారు నలుగురు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS