Previous Page Next Page 
డేంజర్ డేంజర్ పేజి 20

   
    "మీ గుర్తు ఏమిటి కాబ్ వెబ్ అనటమేనా ఇంకేమయినా వుందా?"    
    "ఒక్కొక్కళ్ళకి ఒక్కోగుర్తు. అందరికీ ఓకే గుర్తు కాబ్ వెబ్."    
    గోమతి కీర్తి వడిలోంచి లేచింది. "ఇప్పుడే వస్తా నీకో తమాషా చూపుతాను" అని చెట్లచాటుకి వెళ్ళింది.    
    "తమాషా ఏమిటో?" అనుకుంది కీర్తి.    
    హటాత్తుగా ఓ చెట్టు చాటునుంచి వచ్చింది గోమతి. చేతిలో పిస్టల్ వుంది. అదిచూసి చటుక్కున లేచినుంచుంది కీర్తి.    
    "చేతులు పైకెత్తు మహాశయా! పిచ్చి వేషాలు వేస్తే పిస్టల్ పేలుతుంది." పిస్టల్ ని తమాషాగా కిందకీ పైకీ ఆడిస్తూ అంది గోమతి.    
    కీర్తి మెల్లగా చేతులు పైకెత్తింది.    
    "ఏమిటిది? ఈ పిస్టల్ ఎక్కడిది?" తీవ్రంగా చూస్తూ అడిగింది కీర్తి.    
    "పిస్టల్ నాది కాబట్టినాదగ్గరే వున్నది. పిస్టల్లో గుళ్ళున్నాయి. అవిగురితప్పవు. ఒక్కసారి దేముణ్ణి స్మరించుకో."    
    కీర్తికి అనుమానం వచ్చింది "ఎవరునీవు?" అంది.    
    "స్పైడర్ ముఠాలో మనిషినని నన్నే బోల్తా కొట్టించబోయావు కదూ." కధంతా అడ్డంతిరిగింది. అమాయకంగా భయస్తురాలిలా వుండే గోమతి స్పైడర్ ముఠాలో వ్యక్తామె.    
    "ఏంటో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు కమల్ మహాశయుడు?"    
    "దేముణ్ణి స్మరించుకోమన్నావుగా స్మరించు కుంటున్నాను."    
    "చాలా గొప్పపని చేస్తున్నావు అడిగిందానికి కయినా సరీగా జవాబు చెప్పు నీ వెవరు? సి.ఐ.డి. వా ప్రవేటు డిటెక్టివ్ వా? ఇన్ స్పెక్టర్ వా?"    
    "నిజం చెపితే చంపనా?"    
    "ఎలాగు చంపటం ఖాయం. నిజం చెప్పి చచ్చిపోతే బాగుంటుందని..."    
    "నిజం చెపుతాను. అబద్దమాడకుండ నాకు చెప్పు. నా కధ కట్టు కాదని ఎలా తెల్సుకున్నావు?"    
    మాటలతో కాలయాపన చేసి తప్పించుకోడానికి ఉపాయం ఆలోచిద్దామని కీర్తి చూస్తున్నది.    
    "అయితే విను రెండు ముక్కల్లో చెపుతాను" అని గోమతి గీరగ తలెగరేసి చెప్పటం మొదలుపెట్టింది.    
    గోమతి చేతిలో పిస్టల్ మాత్రం సూటిగా కీర్తి వైపు గురి పెట్టబడి వుంది.
    
                                       14
    
    "విమాన ప్రమాదంలో నాకేం దెబ్బలు తగలలేదు. స్పృహ మూడు రోజులు పోయింది. ఆడపిల్లలా నీముందు నటించాను అంతే. నీవు రావటం చూసి ఆ రోజు చెట్టెక్కి పడుకున్నాను. అంతకు రెండు గంటల క్రితమే, తెలివొచ్చింది నాకు. ఆ పై కధ నీకు నాకు తెల్సిందే. ఇహ పోతే నీ కట్టుకధ ఎలా తెల్సిందంటావు నీ మీద నాకు మొదటినుంచీ అనుమానమే. నీవు మామూలు మనిషివి కాదు మా ముఠాలో వాడివి కాదు. పైగా నీవు పెట్టె గాలించటం రహస్యంగ పరిశోధన నా కళ్ళ పడ్డాయి. పోలీసుశాఖ మనిషని అనుమానించాను. సమయం రాలేదు గాబట్టి తొందరెందుకని ప్రాణం తీయకుండా ఆగాను. చచ్చిన సాలెపురుగుని గుర్తుగా మేం పెట్టుకోలేదు. కాబ్ వెబ్ మా గుర్తు. చిన్న రాగిరేకు మీద కాబ్ వెబ్ అంటే సాలెగూడు డిజైన్ వుంటుంది. ఆ రేకుని కాలిస్తే తప్ప డిజైన్ కనబడదు. కాని బిళ్ళపై ఆకారాన్ని బట్టి మేం గుర్తించగలం. నీకట్టుకధలో బాస్ నివాసం కాబ్ వెబ్ అని....బాస్ వద్ద యంత్రముందని చాలా కోతలు కోశావు."    
    గోమతి మాటల కడ్డం తగిలి "నన్ను చంపితే ఏమొస్తుంది? నీ విక్కడ నుంచి ఎలా బైట పడగలవు? బాజారావు సహాయంతో పారిపోదామనా?" అంది.    
    "బాజారావు" అంటూ వికటంగా నవ్వింది గోమతి.    
    "ఎందుకా నవ్వు?"    
    "మీ తెలివి తక్కువకి నిన్నటి దాకా బాజారావునీ నమ్మాను అతను మోసగాడని తెల్సింది. మా స్పైడర్ రహశ్యాలు చాలా కనుక్కున్న బాజారావు నీ మీద అనుమానం కల్గించి నాకు దగ్గరయ్యాడు. అదీ బయటపడింది. నీవు ముందు తర్వాత అతను నాచేతిలో చావాల్సిందే."    
    "బాజారావు ఎవరు?"    
    "నీలాంటివాడే మాటలతో కాలయాపన చేస్తున్నావ్ టైమయింది ఒకటి...రెండు....మూడు..." అంటూ పిస్టల్ పేల్చింది గోమతి.    
    చటుక్కున క్రిందకు వంగింది కీర్తి.    
    పిస్టల్ పేలలేదు.    
    గోమతి తెల్లబోయింది.    
    ఎక్కడ నుంచి ఊడి పడ్డాడో బాజారావు వచ్చాడు అతని చేతిలో రివాల్వర్ వుంది.    
    "మిస్ గోమతి పిస్టల్లో గుండ్లు నేనే తీసేశాను. ఈగల్ని దోమల్ని చంపినంత తేలికగా మనుషులని చంప గలవనిముందే వూహించి జాగ్రత్త పడ్డాను. ఊ....పిచ్చి వేషాలు వేయకు కాస్త కదిలావా ప్రాణం హరీ అంటుంది నేనెవరినని ఇదేమిటనీ ఆశ్చర్య పోతున్నావు కదూ! స్పైడర్ ముఠా వాళ్ళనివెన్నాడుతూ బయలుదేరిన ఇంటలి జంట్ శాఖలో ముఖ్య వ్యక్తిని మీ ఇరువురి కధలూ విన్నాను. నా కధ వినిపిస్తాను విను. కొన్నాళ్ళ క్రితం స్పైడర్ ముఠాలోచేరి వాళ్ళ గుట్టు మట్లు సగంలాగాను. మధ్యలో అనుమానించిన స్పైడర్ నన్ను బంధించాడు. అతనెన్ని బాధలు పెట్టినా నేనెవరైనది చెప్పలేదు. అదేసమయంలో తప్పించుకుని వాళ్ళ ముఠాలో వ్యక్తి వేషం ధరించాను. పారిపోయి బయటకు రావటానికి వాళ్ళ వాడినే నుకుని నాకు కొన్ని సామానులిచ్చి విమానప్రయాణానికి ఏర్పాటు చేశాడు. నాతోబాటు మరికొందరు బయలుదేరారు. విమానం ఎక్కేముందు మన అధికార్లకి నే తప్పించుకున్న సమాచారం వీళ్ళ ఆచూకీ తెలిపాను. తప్పించుకున్న నేను వాళ్ళ అసలు మనిషిని కానని స్పైడర్ ముఠావాళ్ళు కనిపెట్టి వుంటారు. వాళ్ళ వారందరూ మారువేషాలతో ఇతర దేశాలు బయలుదేరారు. నేనెవరైనదీ ఏ వేషంలో వుందిఎలా తెల్సుకోటం? అందుకే వాళ్ళవారితో పాటు నన్ను కూడా సజీవంగా చంపటానికి విమాన ప్రమాదం తలపెట్టారు. పౌడరు చల్లితే మంటలు రావటం స్పైడర్ ముఠావాళ్ళకి తెల్సు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS