Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 20


                                        14


    ఉదయం ఎనిమిదయింది.


    అయినా మంచంమీద నించి లేవాలనిపించలేదు అవంతికి.


    చాలా నీరసంగానూ, లేవలేనంత బలహీనంగానూ వున్నది. కడుపులో భరించలేనంత నొప్పిగానూ వుంది.


    కాఫీ తాగడానికి కూడా లేచి వెళ్ళలేకపోయింది.


    రమణి మెస్ కి వెళ్ళి ప్లాస్క్ తో కాఫీ తీసుకొచ్చి గ్లాసులో పోసి అందించింది అవంతికి.


    నీరసంగా లేచి కూర్చుని రమణి అందించిన కాఫీ గ్లాసుని అందుకొన్నది అవంతి.


    ఆమె మొహం లేత తమలపాకులా వడిలిపోయింది. కాఫీ గ్లాసుని నోటి దగ్గరగా తీసుకోబోతూ ఆగిపోయింది అవంతి. ఆమె గుండెలో చెయ్యి పెట్టి కెలికినట్టయింది.


    ఆమె కళ్ళనిండా నీరు గిర్రున తిరుగుతోంది. మాట్లాడాలంటే గొంతు వణుకుతోంది.


    "ఎంత పాపం చేశానే!" అంది జీరపోతున్న గొంతుతో అవంతి.


    ఆమెకేమిటో దిగాలుగానూ, బాధగానూ వుంది. తనో మనిషిగా ఎలా బతగ్గలుగుతున్నానా! అని అంతర్లీనంగా ఆమె మనసు ఘోషిస్తోంది.


    రమణి ఆమెకేసి నిర్లిప్తంగా చూసింది.


    "ఏది ఎందుకు జరుగుతుందో ఎవరమూ చెప్పలేము జరిగిపోయిన దాన్ని గుర్తు చేసుకొని ఎడ్చి లాభం ఏమిటి చెప్పు. నేనూ ఆ రోజు నీలా ఈ నరకాన్ని అనుభవించిన దానినే. ఆ రోజు నేను నిన్ను చూసుకొని ధైర్యంగా నిలబడగలిగానే కాని నీలా ఇంత సెంటిమెంటల్ గా మాత్రం నేను నలిగిపోలేదు" అంది రమణి ఓదార్పుగా.


    "నన్నెలా నమ్మమంటావు? నన్ను ఓదార్చడానికంటున్నావే కానీ తొలిసారిగా కడుపున పడ్డ బిడ్డని పోగొట్టుకోడానికి ఏ ఆడది ఒప్పుకొంటుంది?" అవంతి భారంగా అన్నది.


    "నువ్విలా ఆలోచిస్తున్నావే కానీ ఒక్కసారి హాస్పిటల్లోకెళ్ళి చూడు. పెళ్ళి చేసుకొని మొగుడూ దండలూ వున్నవాళ్లే ఫామిలీ ప్లానింగ్ పేరుతో అబార్షన్ చేయించుకొంటున్నారు. వాళ్ళందరూ పాపం చేస్తున్నారనా నీ ఉద్దేశ్యం? లెక్కలు కట్టి చూస్తే ప్రపంచ వ్యాప్తంగా రోజుకి లక్షల సంఖ్యలో అబార్షన్ లవుతున్నాయి. ఆ సంగతి వదిలేసి ఇటు మనగురించి ఆలోచిస్తే మనం పెళ్ళికాని ఆడపిల్లలం. మనకున్న హద్దుని పూర్తిగా దాటిపోయి ప్రస్తుతం బతకలేం. అందుకే అసలు ఏమీ జరగనట్లుగా మనం నటించాలి" అంది రమణి.


    "గుడ్ బాగా చెప్పావే. ఇంత పాపం చేసి ఏమీ ఎరుగనట్లు నటించాలా? నటించడానికి ఎంత పెద్ద గుండె కావాలో ఆలోచించావా? ఆ గుండె లేకపోబట్టి మనని ఆడవాళ్ళన్నారు. అసలు ఆడదాని జీవితానికిచ్చి హద్దుల్ని గీచిన ప్రబుద్ధులెవరో తెలిస్తే నిలువునా షూట్ చెయ్యాలనిపిస్తోంది నాకు" కాఫీ గ్లాసుని నోటి దగ్గరగా తీసుకొంటూ అంది అవంతి.


    రమణి అవంతికి దగ్గరకొచ్చి నిలబడింది.


    మనలాంటి నిర్భాగ్యులకీ, దౌర్భాగ్యులకీ కావల్సింది ఆవేశం కాదు ఆలోచన. ఒక్క సంగతి బాగా ఆలోచించు. మనకి ఎవరి అండ దండలూ లేవు. ఆర్థిక పరిస్థితి మెరుగైనదీకాదు. ఈ విషయంలో మనని కన్నవాళ్ళు సైతం సమర్థించరు. ఫ్రెండ్సనే వాళ్ళున్నారనుకొని చెప్పుకొంటే చాటుకెళ్ళి హేళనచేస్తారే తప్ప ఆదరించరు. మన గుండెలోతుల్లోకి తొంగిచూసి మనం పొందే ఆవేదనని ఎవరూ గ్రహించరు. నౌ ది బాల్ ఈజ్ అవుట్ ఆఫ్ అవర్ కోర్టు, ఆ బంతిని మన కోర్టులోకి తీసుకోడానికి కొంత సమయం పడుతుంది. అంతవరకూ మనం నిరీక్షిస్తూ వుండాలి" అన్నది రమణి.


    అవంతి రమణికేసి అదోలా చూసింది. రమణిని ఇన్నాళ్ళూ, ఇన్ని రోజులూ, మామూలు ఆడపిల్లగా అనుకున్నదే కానీ ఆమెలో ఇన్ని ఆలోచనలున్నాయని అవంతికి ఇప్పటివరకూ తెలీదు. కాఫీ తాగిన గ్లాసుని పక్కన పెట్టింది అవంతి.


    "కడుపులో బాగా నొప్పిగా వుంది. ఏమన్నా అవుంతుందంటావా?" అనుమానంగా అడిగింది అవంతి.


    "మరేం భయంలేదు. డాక్టరిచ్చిన మందులు వాడితే తగ్గిపోతుంది. రెండు రోజుల్లో మామూలు మనిషివైపోతావు" అంది రమణి.


    అవంతి మెల్లగా తల వూపింది.


    "చూడు, పరీక్షలు విరుచుకుపడుతున్నాయి. ఇక దృష్టిని అటు మళ్ళించు. టర్న్ ఎవ్విర్ మినిట్ ఆన్ రీడింగ్ బుక్స్" రమణి నవ్వడానికి ప్రయత్నం చేస్తూ అంది.


    "అలాగే!" అంది అవంతి నిర్లిప్త ధోరణిలో.


    ఒకరికి చెప్పడమే కానీ చెప్పించుకొనే అలవాటులేని అవంతి తన మాటలని శ్రద్ధగా వింటూంటే రమణికే ఆశ్చర్యం కలిగింది.


    ఏది ఏమైనా 'అవంతి' మామూలుగా అయితే "అంతేచాలు" అనుకొంది రమణి.


                                         15


    ఆ రోజు లలితాంబకి ఏ విధమైన కార్యక్రమమూ లేకపోవడంతో ఇంటి దగ్గరే వుంది.


    దాంతో ఇంట్లోవాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయిపోయారు ఎవరికి వాళ్ళకే ఓ పెద్దపులి ఇంట్లో తిరుగుతున్నట్టుగా ఉంది.


    లక్ష్మిపతి ఆఫీసులోనే కేసు స్టడీ చేస్తున్నాడు. భారతి తన గదిలో కూర్చుని క్లాస్ బుక్ చదువుతోంది. కానీ దృష్టిని పుస్తకం పైకి సారించలేకపోతోంది.


    వంటమనిషి కిచెన్ వదిలి బయటికి రాలేదు.


    లలితాంబ తోటలో తోటమాలిచేత పాదులు చేయిస్తోంది.


    దానితో సారధికి బాగా బోరు కొట్టేసింది.


    మనస్సు విప్పి మాట్లాడుకోడానికి ఎవరూ లేకపోవడంతో చాలా విసుగ్గా ఉందతనికి. కాస్సేపు భారతితో మాట్లాడితే బాగుండుననిపించింది కానీ 'అత్త' చూస్తే ఇల్లు పీకి పందిరేస్తుంది. ఆ సంగతి సారథికి కొత్తకాదు. అదీగాక భారతి కూడా తనతో అంతంత మాత్రంగానే మాట్లాడుతోంది.


    హైదరాబాదు ఉద్యోగం కోసం వచ్చి నెల దాటింది. ప్రయత్నం ఇంకా ఆరంభంలోనే వుంది. నిజానికి సారథికి అక్కడ ఉండాలని లేదు. డబ్బు ఖర్చయినా ఏ హోటల్లోనో ఉంటే స్వేచ్ఛగా ఉంటుంది. కానీ, మేనమామ ఏమనుకుంటాడోనన్న కారణంగా అక్కడ ఉంటున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS