Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 20


    ఆ రాత్రి ఈ ప్రహసనం నలుగురు ఐదుగురికే తెలిసినా తెల్లవారేసరికి ప్లేగువ్యాధిలా వూరంతా వ్యాపించింది. కొందరు తెలివైనవాళ్ళు దీన్ని అటూ ఇటూ తిప్పి ఆలోచించారు.

 

    'కొంపదీసి రమణి ఆనందరావుని లేపలేదు కదా' అని వాళ్ళు సత్యానికి చాలా దగ్గరగా వచ్చేశారు. ఇది విన్నవాళ్ళు కూడా నిజమే కాబోలని సెకండ్ థింకింగ్ లో పడ్డారు. ఇలా ఊర్లో సగం జనం నిజాన్ని ఖచ్చితంగానే ఊహించారని రమణికి తెలిసేసరికి వారం రోజులు పట్టింది. అదంతా ఊహలవరకే పరిమితం అయిపోయింది గానీ లేకుంటే తన బ్రతుకేంగాను.  

 

    ఆమె చాలా బాధపడిపోయింది. రాత్రి ఓ ఆడపిల్ల వచ్చి చేయి వేస్తే దెయ్యమని హడలిపోయే ఆనందరావుకి సరైనవిధంగా బుద్ధి చెప్పాలని ఆమె ఆలోచనలో పడింది. అలా ఆలోచిస్తున్న ఆమెకి ఓ మంచి ఐడియా తట్టింది.

 

    తరుణ్ తను చెబుతున్న సంఘటనని మధ్యలో ఆపాడు. దాహంగా అనిపించడంతో మంచినీళ్ల కోసం లోపలి గదిలోకి వెళ్ళాడు.

 

    తనని దెయ్యంగా భావించి, నలుగురి మధ్యా అల్లరిపాల్జేసిన ఆనందరావుకు రమణి ఎలా బుద్ధి చెప్పిందో తెలుసుకోవాలన్న కుతూహలాన్ని ఆపుకోలేకపోతోంది మౌనిక. మరీ ఇంట్రెస్ట్ చూపిస్తే ఎబ్బెట్టుగా వుంటుందని అతడు వెళ్ళిన వైపు కాకుండా కిటికీలోంచి చూస్తోంది.

 

    తన నెత్తిమీద సూర్యుడ్ని ఎత్తుకోవడంతో చెట్లు అణిగిపోయినట్లు వాటి తాలూకు నీడలు అతి కురచగా కనిపిస్తున్నాయి. రాత్రిపూట ఫ్లూ జ్వరం పోవడానికి ఉపవాసం వుండి నీరసించినట్లు గాలి సోమరిగా వీస్తోంది.

 

    టైం పన్నెండు దాటినట్లు అనిపించింది ఆమెకి.

 

    ఛెళ్ళున కొరడాతో కొట్టినట్లు తను లైబ్రరీకి వెళ్ళలేదన్న విషయం గుర్తొచ్చింది.

 

    దాంతో మనసంతా బాధతో మూలిగింది.

 

    ఆమె లైబ్రరీకి వెళ్ళకపోవడం తరుణ్ కూడా గుర్తించాడు. అతనికి కావాల్సింది అదే. పాత దురాచారాలకు తిరిగి ప్రాణంపోసి వాటిని పరమౌతృష్ణ ధర్మాలుగా ప్రచారం చేయడానికి శిక్షణ పొందుతున్న అమ్మాయిల్ని తిరిగి మామూలు అమ్మాయిలుగా చేయాలని అతడు నిర్ణయించుకున్నాడు.

 

    మొదట మౌనికని మళ్ళీ ఈ ప్రపంచంలో పడేయాలని అతని కోరిక సంవత్సరకాలపు శిక్షణలో ఆమెకీ, ఈ ప్రపంచానికీ మధ్య వున్న లంకె తెగిపోయింది. దాన్ని తిరిగి కలపాలి.

 

    అయితే ఇదంతా ఒక్కక్షణంలోనో, ఒక్కరోజులోనో అయ్యేపని కాదు. నెమ్మదిగా ఈ ప్రపంచంలోని తీపిని జీవితానికి అద్దాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే అతడు ఆ సంఘటనని చెబుతున్నాడు.

 

    ఆమె అడిగితే మిగిలిన బాగం చెప్పాలనుకున్నాడు. అందుకే మంచి సస్పెన్స్ లో దాన్ని ఆపాడు. కొంచెం అటూ ఇటూగా ఆమె కూడా అదే ఆలోచిస్తోంది. తనై అడగడం బావుండదు. అతను చెబితేనే వినాలి. ఇంతకీ రమణి ఆనందరావుకి ఎలా బుద్ధి చెప్పిందో తెలుసుకోవాలన్న కుతూహలం ఆమెను ఒక్క దగ్గర నిలవనీయడంలేదు. అందుకే ఆమె కాలు అటూ ఇటూ కదుపుతూ నిలుచుంది.

 

    "అబ్బ! మీ ఇడ్లీలు అరగనట్టున్నాయి. ఇంత టైమైనా ఆకలి వేయటం లేదు."

 

    ఆమెకు అప్పుడు గుర్తొచ్చింది అతనికి మధ్యాహ్నం భోజనం తెప్పించాలని. ఆలస్యమయితే అన్నం వుండదు. అందుకే ఆమె కైవల్య గదికి వచ్చింది.

 

    అప్పుడే భోజనానికి బయలుదేరబోతున్న కైవల్య మౌనికను చూసి "భోజనం తీసుకొద్దామనే అనుకుంటున్నాను. ఆరోగ్యం ఎలా వుంది?" అనడిగింది.

 

    మౌనిక ఎందుకో తడబడింది. అబద్ధమాడటం చేతకాని విషయం మరి.

 

    "ఫరవాలేదు. నా భోజనం తీసుకొచ్చేసేయి"

 

    "అలానే"

 

    కైవల్యతోపాటు నడిచి తన గది దగ్గరకొచ్చింది.

 

    అతను అక్కడున్న పుస్తకాలను పరిశీలిస్తున్నాడు. ఆమె రావడంతో చూస్తున్న పుస్తకాన్ని పక్కకు పెట్టి "చెప్పాపెట్టకుండా ఎక్కడి కెళ్లారు?" అన్నాడు.

 

    "మీ భోజనం కోసం"

 

    "మీ భోజనం అంటున్నారు - మరి మీకు?"

 

    "మీరు తినండి. నాకు ఆకలిగా లేదు."

 

    "అదేం కుదరదు - మీరిప్పుడు తిని తీరాల్సిందే."

 

    "నాకు ఉపవాసాలు ఉండటం అలవాటే."

 

    "నేనూ వుండగలను. మీరు తింటే తప్ప తినను."

 

    ఆమెకి ఎందుకో కళ్ళు చెమర్చాయి. ఎంతకాలమైంది యిలాంటి ఆప్యాయతను రుచిచూసి.

 

    కన్నీళ్ళు కార్చడం ఎంత హాయిగా వుంది! కన్నీటికి ఒక కొస ఆనందమైతే మరో కొస దుఃఖం. అందుకే ఆ రెంటికీ కన్నీళ్ళే వస్తాయి.

 

    ఒద్దు మౌనికా! ఇలాంటి భావోద్వేగాలకు లోనుకావద్దు. గతం మర్చిపోవద్దు. ఏమయింది సంవత్సర కాలపు శిక్షణ? మళ్ళీ లౌకిక బంధాలకు లోను కావద్దు. అవి నిన్నెంత హీనస్థితికి నెట్టేశాయో అప్పుడే మర్చిపోయావా? అభిమానాలు, ఆప్యాయతలూ వద్దు. వాటికోసం అర్రులు చాస్తే చివరకు మిగిలేది దుఃఖమే. అందుకే చాంచల్యం వద్దు.

 

    ఆమె కిటికీ వైపు తిరిగి కన్నీళ్ళు తుడుచుకుంది. తిరిగి మామూలుగా వుండటానికి ప్రయత్నించింది.

 

    "మౌనికా!"

 

    ఎవరో పిలుస్తున్నారు. ఒక్కక్షణం ఒళ్ళంతా భయంతో జలదరించింది. వచ్చిందెవరు?

 

    కిటికీలోంచి చూసింది - కైవల్య.

 

    హమ్మయ్య అనుకుంటూ మెట్లు దిగి కైవల్య చేతిలోని భోజనం ప్లేటును తీసుకుని చిన్నగా నవ్వింది.

 

    కైవల్య వెళ్ళేవరకూ అక్కడే వుండి తిరిగి గదిలోకొచ్చింది. భోజనం ప్లేటును అతని ముందర పెట్టింది.

 

    "చెప్పానుగా ఫిఫ్టీ ఫిఫ్టీ - అలాగయితేనే తింటాను" అని పైనున్న ప్లేటులో సగం అన్నం, కూరలు సర్దాడు.

 

    ఆమె వైపు చూస్తూ "రండి, మీ మహిళాసదన్ కూరలు తినాలంటే మనం ఏం తింటున్నామో తెలియనంత డీప్ గా మాట్లాడుకోవాలి" అన్నాడు.

 

    ఇక వాదించి లాభం వుండదని తెలిసి, అతని ముందుకి స్టూల్ లాక్కుని ప్లేటందుకుందామె.

 

    అలాంటి భోజనం తినటం రెండవసారి కాబట్టి అతనికి వుదయం వున్నంత యిబ్బందిగా లేదు.

 

    ఇద్దరూ భోజనం ముగించారు.

 

    అతను రెండు రోజులుగా ఆ డ్రస్ లోనే వున్నాడని ఆమె గ్రహించింది. కానీ అతనికివ్వడానికి యింకో డ్రస్ ఏదీ? ఆమె గబగబా లోపలికెళ్ళి తన సూట్కేసుని తెరిచింది. చీరలు, జాకెట్లు తప్ప అందులో మరేం లేవు. నిరాశతో ముందు గదిలోకొచ్చింది.

 

    "మీరు కట్టుకోవడానికి ఏం బట్టలు లేవే" అంది అతనివైపు చూస్తూ.

 

    "ఏం ఫరవాలేదు. అంతగా అవసరమైతే మీ చీర కట్టుకుంటాను. తప్పేం లేదుగా? ప్రస్తుతానికి వీటితోనే వుండగలను" అన్నాడు తరుణ్.               


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS