Previous Page Next Page 
లేడీ కమెండో పేజి 20

"పైగదిలో వుంది" అంటూ గడివేపు చేయి చూపాడు.
"ఓ.కే! బై అంకుల్"
అంత అకస్మాత్తుగా తన గదిలోకి వచ్ఘిన ధీరజను చూడడంతో విరాగినిలా కూర్చుని వున్న రజని కొత్త వూపిరి వచ్చినట్టు ఫీల్ అయింది.
చట్టుక్కున లేచి ధీరజను కౌగిలించుకుని భోరున విలపిస్తూ__ "నాన్నగారూ..." అంటూ ఏదో చెప్పబోయింది.
ద్వారంవద్ద సత్యమోహన్ నిలబడి వున్నాడు.
"నీ స్నేహితురాలికి ఆరోగ్యం సరిగా వుండడంలేదు ఈ మధ్య. అందుకే కొన్నిరోజులపాటు ఇంటిలోనుంచి ఎటూ కదలవద్దని నేనే చెప్పాను" అన్నాడాయన.
ఆమెను నిర్భందించిన విషయం అర్దమయింది.
సత్యమోహన్ కూతురువేపు హెచ్చరికగా చూసి వెళ్ళిపోయాడు.
"నువ్వు ఏమీ చెప్పవద్దులేవే... నాకంతా అర్దమయింది. రవితేజ నిర్దోషి అని నేను నిరూపిస్తాను. ఆ విషయం నీకు చెప్పి దైర్యంగా వుండమని అనునయించటానికే నేను వచ్చాను. నీకు తెలిసినది ఏమైనా వుంటే నిర్భయంగా నాతో చెప్పు" అంటూ ధీరజ అభయమిచ్చింది.
"మా తొలి పరిచయం విచిత్రంగా అయింది. ద్వేషంతో ప్రారంభమై ప్రేమికులుగా మారిన క్షణాన్నే విధి మా జీవితాలలో ఆడుకుంది. నేను రవితేజను ప్రేమిస్తున్నానని తెలుసుకున్నాడు మానాన్న. మా బావ అభినయ్ ను అల్లునిగా చేసుకొనాలని మానాన్న ఆరాటం. ఎక్కడ ఆస్థి దక్కకుండా పోతుందోనని మా నాన్న తాపత్రయం. ఎలాగైనా సరే రవితేజను నానుండి దూరం చేసి తన మేనల్లుడితోనే నా పెళ్ళి చేస్తానని ఛాలెంజ్ చేశాడు. ఆయన అన్న కొన్ని రోజులకే రవితేజ కటకటాల పాలయ్యాడు" రజని ఏడుస్తూ చెప్పింది.
సత్యమోహన్ అన్నంత పనీ చేశాడని వూహించింది ధీరజ.
తెలివిగా అతనని హంతకుణ్నిచేసి కూతురి ప్రేమకు దూరం చేశాడు.
మరి అసలు హంతకుడు ఎవరు?
ఇంతవరకూ రాజకీయ వూబిలో మాత్రమే రవితేజ చిక్కుకున్నాడని భావించింది. కానీ అతని ప్రేమకూడా అతని పతనానికి పావులా ఉపయోగపడిందని ధీరజకు అర్ధం అయింది.
తన ప్రియుడు నిరపరాధి అని తెలిసినప్పటినుంచీ రజనిలో కొత్త దైర్యం వచ్చింది.
స్నేహితురాలికి చెప్పవలసిన జాగ్రత్తలు చెప్పి బయటకు వచ్చింది ధీరజ.
మరు నిమషంలోనే ధీరజ కైనెటిక్ హోండా రోడ్డు ఎక్కింది.
 
                                             *    *    *    *
సూటిగా వచ్చి తన కైనెటిక్ హోండా__ ముందు పోలీసు కారు ఆగడంతో ఆ ప్రయత్నంగానే షడన్ బ్రేక్ వేసింది ధీరజ.
ఒళ్ళు దగ్గరలేకుండా నడుపుతున్న ఆ పోలీస్ పెద్దమనిషిని ఘాటు అయిన పదజాలంతో దీవించపోతూ.... అంబాసిడర్ లో నుంచి చిరునవ్వుతో దిగుతున్న వ్యక్తిని చూసి ఠక్కున ఆగిపోయింది ధీరజ.
ఏయ్ వీరూ... ఏమైపోయావు ఇన్నాళ్ళు _ కనీసం స్విమ్మింగ్ కు కూడా రావడం లేదు. ప్రతిరోజూ మీ కమిషనర్ ఆఫీసుకు నీ కోసం ఫోన్ చేస్తూనే వున్నాను తెలుసా?" ఆనందంతో అన్నది ఆమె.
"తెలుసులేవోయ్... అందుకేగా ఈ రోజు ఎలాగయినా నిన్ను కలుసుకోవాలి అనుకున్నాను. ఇంటివరకు వెళ్ళికూడా నువ్వు గుర్తుకు వచ్చి నీకోసం వెనుదిరిగి వస్తుంటే... నువ్వే ఎదురు పడ్డావు" అన్నాడు వీరేష్.
"అదిసరే... ఏమిటి ఉన్నట్టుండి అబ్బ్యిగారు అంత బిజీ అయిపోయారు. రోజుకు కనీసం ఒకసారి  అయినా నన్ను కలుసుకొనకుండా వుండలేని పెద్దమనిషి ఏకంగా నెలరోజులకుగానీ కనిపించలేదు అంటే ఏదో ప్రత్యేకమైన విశేషమే ఉండి వుండాలి. యామ్  ఐ రైట్__"
"ధీరజా... అవలిస్తే పేగులు లెక్క పెట్టగల మేధావిని నువ్వు_ నీ ముందు ఒకవేళ ఏదయినా విషయాన్ని దాచాలని ప్రయత్నించినా ఫలితం వుండదు. వెంటనే పసిగట్టేస్తావు నువ్వు. ఒక విధంగా నీ అనుమానం నిజమే... రోడ్డుమీద నిలబెట్టి మాట్లాడేకన్నా అలా ఏదన్నా హోటల్ కు వెళ్ళి మాట్లాడుకుందాం పద... ఇన్ని రోజులనుంచీ బాద్యతతో కూడుకున్న టెన్షన్....మనస్సుకు శరీరానికి విశ్రాంతి అనేదేలేదు" అంటూ అంబాసిడర్ ను ముందుకు దూకించాడు ఏ.సి.పి. వీరేష్.
ధీరజ కైనెటిక్ హోండాతో కారుని ఫాలో చేసింది.
ఇద్దరూ ఖరీదయిన  హోటల్ లోని ఫామిలీరూమ్ లో ఎదురెదురుగా కూర్చున్నాక ధీరజే ముందు పెదవి విప్పింది.
"ఇప్పుడు చెప్పు వీరూ... ఏమిటి అంత బిజీ"
టేబుల్ మీద ఒక చేయి... మరి ఒక చేతిని బుగ్గకు ఆనించి మాట్లాడుతున్న అందమయిన ఆమె ముఖాన్ని చూస్తూ బదులు పలకలేదు అతను.
"ఏయ్... నిన్నే పలకవే!"
"ఏం చెప్పమంటావు డియర్... నీ ముఖం చూస్తుంటే నాకు ఇంకేదీ గుర్తుకు రావడంలేదు"
"ఆ విషయం నాకు తెలుసుకానీ.... నువ్వు కనిపించకపోవడానికి కారణం ఏమిటో ముందు చెప్పు" అతని కనులలోకి సూటిగా చూస్తూ అన్నది ఆమె.
"మా ఇన్ స్పెక్టర్ చేతుర్వేది తెలుసు కదూ నీకు"
"ఓ ఎస్... యాక్సిడెంట్స్ లో చనిపోయాడు కదూ"
"కాదు... ఒక ముఠా చేతిలో చంపపడ్డాడు"
"వాట్..." ఉలికిపడిందామె.
"ఎస్... ఇప్పుడు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లోనే ఉన్నాను. అతను చనిపోకముందు దొంగనోట్ల ముఠా అనుపానులను తెలుసుకున్నాడని నా అనుమానం. బహుశా వాళ్ళకు చెందిన ముఖ్యమయిన సమాచారం అతనికి ఏదో లభించి ఉండాలి. అందుకే అతనని చంపి, యాక్సిడెంట్ సీన్ గా క్రియేట్ చేశారు..."
"ఎవరు వాళ్ళు... కూతుహలంగా అడిగింది ధీరజ.
"అది నాకు తెలిస్తే చేతులు ముడుచుకుని కూర్చుంటానా... వాళ్ళను ఈపాటికి కటకటాల వెనక నిలబెట్టి ఉండేవాడిని. ఎందుకు చంపిందీ  ఎవరు చంపిందీ తెలియాలంటే సైదారాబాద్ లోని గూండాలను ఒక పట్టుపడితే తెలిసిపోతుంది"
"వాట్...అది నేను ఉండే ఏరియానే కదా... నాకు తెలియకుండా సైదాపేటలో దొంగనోట్ల ముఠా  ఒకటి ఉందా... ఆశ్చర్యంగా వుందే... నీదగ్గర ఖచ్చితమయిన ఆధారాలు ఉన్నాయా వీరేష్?"
"ఎస్ ధీరజా... హత్యచేసిన గూండాలు సైదాబాద్ కు చెందిన వాళ్ళని అక్కడ దొరికిన డ్రైక్లింనింగ్ బట్టల పాకెట్  కు వున్న రశీదును బట్టి తెలుసుకోగలిగాను. ఆ షాపులో పనిచేసే వ్యక్తికి ఆ రౌడీ ఎవడో తెలుసంట... కాకపోతే రెండురోజుల నుంచీ అతను పనిలోకి రావడం మానివేసినట్టు తెలిసింది. అతని ఇల్లు ఎవరికీ తెలియదట. అందుకే నా పరిశోధన అంతవరకూ వచ్చి ఆగిపోయింది"
నేనూ ఒక హత్యకేసును పరిశోధిస్తూన్నాను వీరూ... ఎలక్షన్ల హడావుడిలో సైదాబాద్ లో జరిగిన మర్డర్ నీకు గుర్తు వుండే ఉంటుంది. ఆ హత్య చేసింది జయచంద్ర అయితే నేరం మోపబడింది అతని ప్రత్యర్దిమీద. అందుకే సుళువుగా గెలవగలిగాడు..." అన్నది ధీరజ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS