Previous Page Next Page 
కౌగిట్లో జాబిల్లి పేజి 19

    "ఇలా దొంగల్లా పోవటం ఏమిటి? తప్పుకాదా?" అంది గాయత్రి!

    "ఈ రోజు ఒక్కరోజుకి తప్పుకాదు. ఇదో సరదా! ఒక వేళ మనని ఎవరయినా చూచినా ఈరోజు మాత్రం దొంగలు అనుకోరు. పోలీసులకి అప్పగించరు. మందలించి పంపేస్తారు.

    అయినా మనం వెళ్ళేదారిలో ఎవరికి కన్పించే అవకాశం లేదు. ఇంటి కప్పులు ఏటవాలుగా ఉంటాయి.

    సరిగా అడుగులు వేయాలి! ప్రక్కకు పడితే పెంకులు నలిగి చప్పుడు అవుతుంది. ముందుకు తూలితే ఇంటిమీది నించి దొర్లి క్రిందికి పడిపోతారు. జాగ్రత్త" అన్నాడు.

    తనని తాను సంబాళించుకుంటూ మిద్దె కప్పులమీద ముందుకు అడుగులు వేయాలని ప్రయత్నిస్తోంది గాయత్రి! కాని ఆ పని చేయటం ఆమెకు చేతకాలేదు. అక్కడే నిలిచిపోయింది.

    వాల్మీకి ఆమెను రెక్కల మీద పట్టుకుని జాగ్రత్తగా అడుగులు వేయించాడు. చాలా అనుభవం వున్నదానిలాగా వారితో పాటు నడిచింది ఆమని.

    రెండు మిద్దెలు దాటి అవతలకు పోయారు.

    ఇళ్ళ మీదుగా పోవటం నించే వారే ఆ యింటి మీదికి ముందుగా చేరుకున్నారు. తరువాత వీధి మలుపులు అన్నీ తిరిగి యువకులు ఆ ఇంటికి వచ్చారు.

    మిద్దె మీద నక్కి వాల్మీకి, ఆమని, గాయత్రి చూస్తున్నారు.

    దూరంగా ఉన్నప్పుడయితే నేను అంటే నేను అని పోటీపడ్డారు. తీరా యింటిముందుకు వచ్చాక ధైర్యంగా ముందుకు వెళ్ళి గజలక్ష్మి తలుపు తట్టాలంటే కొందరు భయపడ్డారు. మళ్ళీ వారిలో వారికి చర్చలు జరిగాయి.

    పొరుగూరు నించి వచ్చిన ఓ యువకుడికి బాగా పురి ఎక్కించారు.

    అతడు ధైర్యంగా చిల్లరకొట్టు ముందుకు వచ్చాడు.

    పిలువు పిలువు అని మిగిలినవారు ప్రోత్సహించారు.

    రోజులా కన్పించలేదు వాతావరణం. వాకిలి ప్రక్కన ఉండే కిటికీ తలుపులు ఎప్పుడూ గాలికోసం తెరిచి ఉంటాయి. ఇవాళ మూసి ఉన్నాయి.

   
                                     8


    "గజలక్ష్మి గారూ! గజలక్ష్మిగారూ!" అని చాలా నమ్రతాభావం కలిగిన కంఠస్వరాన పిలిచాడు యువకుడు.

    "ఎవరు నాయనా నువ్వు? ఈ వేళప్పుడేమిటి పని?" పడక మీదినించి లేవకుండానే మత్తుగా అడిగింది గజలక్ష్మి.

    "వెచ్చాలు కావాలండీ!" అన్నాడు యువకుడు.

    "ఈ వేళప్పుడు తలుపు తీయడం కుదరదు బాబూ!"

    "చాలా అర్జంటుగా కావాలండీ చుట్టాలు వచ్చారు!" ఈ మాటకు గజలక్ష్మి వెంటనే బదులు చెప్పకుండా కాస్సేపు ఆలోచించింది.

    నిజంగా ఏదయినా అవసరం కావచ్చు! అవకాశం దొరికితే ఇలాంటి అవసరం వచ్చినప్పుడే చెప్పినంతకు కొంటారు. చెవులు పిండి వసూలు చేయవచ్చు! ఆమె లేచి కిటికీ దగ్గరకు వచ్చింది.

    కిటికీ తలుపులు తెరిచింది.

    "ఇలా వచ్చి కన్పించు బాబూ!" అంది. ఆ యువకుడు కిటికీ ఎదురుగా వచ్చి నిలిచాడు. అతని ముఖం చూచి గుర్తించింది ఆమె. పరాయి గ్రామంనించి వచ్చిన వాడు. అతడే చుట్టం చూపుగా వచ్చినవాడు ఎవరో చుట్టాలు వచ్చాడంటాడేమిటి?

    అవును ఇవాళ దొంగలదోపిడి పండుగకదా? అని జ్ఞాపకం వచ్చింది. ఆమె ఆలోచిస్తూ వుండగానే దూరంగా పందిరి క్రింద పొంచివున్నవారు ఆమె తలుపు తీస్తోందని భావించారు.

    ఓ యువకుడు కిసుక్కున నవ్వేయడం, ఒకరిద్దరు హుష్ ష్ అరవకు అనడం కూడా విన్పించిందామెకు.

    "ఓహో అదా సంగతి! ఇహ దయచేయండి. మరొకచోటుకి వెళ్ళి చూపించండి మీ ప్రతాపం" అంటూ ధడేల్న కిటికీ తలుపులు కూడా మూసి వేసిందామె. యువకుడు బాగా నీరసపడిపోయినాడు.

    వెళ్ళి తన వారితో కలిశాడు.

    "పధకమంతా చెడగొట్టారు. ఇంతలోనే నవ్వకపోతే మీ సొమ్మేం పోయింది" అన్నాడు. వారందరూ చర్చించుకుని మరో ఇంటికి పోవడం తప్పనిసరి అనే తీర్మానానికి వచ్చారు.

    ఆమెకు గుణపాఠం చెప్పేందుకు వచ్చిన ఒకే ఒక్క అవకాశం చేయి జారిపోయింది. తిరిగి సంవత్సరం వరకూ రాదు.

    కృంగిపోయి తిరుగుముఖం పడుతున్నారు వారు.

    ఆ సమయంలో ఇంటిమీదినుంచి దుమికి వారి ముందుకు వచ్చాడు వాల్మీకి.

    అలా అతను ప్రత్యక్షమవుతాడని ఎవరూ వూహించలేదు.

    "మీరు అలా నీరసపడిపోకండి! గజలక్ష్మికి మంచి గుణపాఠం చెప్పవచ్చు. అందుకు మంచి దారి వుంది" అన్నాడు.

    యువకులలో జారిపోయిన ఉత్సాహం మళ్ళీ పెల్లుబికింది.

    వారికి తాను ఇంటికప్పు మీది నుంచి వచ్చిన విషయమంతా వివరించాడు. ఇక వారి ఆనందం, పరవళ్ళు తీసింది.

    వెంటనే వీధుల వెంట ఏదో భయంకర ప్రమాద సంఘటన జరుగుతున్నంత వేగంగా పరుగులు తీసింది. అప్పటికే గజలక్ష్మి మిద్దె ఇంటిలోని కరెంటు దీపాలు ఆరినాయి.

    కొద్ది నిముషాల అనంతరం వారంతా చుట్టూ తిరిగి గోడమీదగా రెండు ఇళ్ళ కప్పులు దాటి ఆ యింటిమీదికి వచ్చారు.

    మిద్దె ఇళ్ళకు పైనుంచి గాలి వచ్చేందుకు ఒక ఖానా అమర్చి వర్షం పడకుండా దానిమీద అయిదారు అంగుళాల ఎత్తున నలుచదరపు రాయి అమర్చుతారు. నలుగురూ చేతులు వేయగానే ఆ రాయి నిశ్శబ్దంగా ఊడి వచ్చింది. దానిని చేతుల మీదనే క్రిందికి దింపకుండా అవతలకి నడిపించేశారు.

    మరో ఇంటి చావడిలో వున్న నిచ్చెన గజలక్ష్మి ఇంటి కప్పుమీదికి సునాయాసంగా నడిచివచ్చింది. దాన్ని ఖానాలోంచి ఇంటి లోపలకు దింపారు. చిన్న అలికిడి అయింది.

    కరణం వుంది కాబట్టే గజలక్ష్మి ఇంటిలో దీపాలన్నీ తీసేసింది.

    ఆ చీకటిలో ఆమెకు ఏమీ కన్పించలేదు.

    చీకటిలో ఒక్కొక్కరు ఆ నిచ్చెన మీదుగా ఆమె ఇంటి మధ్య భాగానికి దిగిపోయారు. వారితో పాటుగా ఆమని కూడా దిగింది.

    ఆ వెనుక వాల్మీకి బ్రతిమాలి బామాలి గాయత్రిని తీసుకువచ్చాడు. ఇప్పుడు గజలక్ష్మి ఇంటిమధ్యలో పదిమంది దొంగలున్నారు.

    కాని ఇల్లంతా కటిక చీకటిగా వుంది.

    గాయత్రి ఒక మూల భయంతో ఒదిగి నిలబడింది.

    ఆమని గోడవారగా తడుముకుంటూ తడుముకుంటూ వెళ్ళి కరెంట్ స్విచ్ బోర్డుని పట్టుకుంది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో యువకులు వూగిసలాడుతున్నారు. విజయం సాధించినందుకు ఉత్సాహంతో పొంగిపోతున్నారు. కాని ముందుకు పోయేందుకు గుడ్డి వెలుతురు కూడా లేదు, ఆమని మొత్తం స్విచెస్ ని తడిమి చూచింది.

    అన్నింటిని ఒకేసారి ఆన్ చేసింది.

    ఇల్లంతా ఒక్కసారిగా వెలుగులు నిండాయి.

    అనుకోని ఈ సంఘటనకి కెవ్వుమని అరిచి దుప్పటిని విదిలించుకుని లేచి కూర్చుంది గజలక్ష్మి. ఆమె ఆకృతి అర్ధనగ్నంగా అస్తవ్యస్తంగా వుంది అప్పటికే యువకులు మంచం చుట్టూ మూగారు. ఆమె నిండుగా పైట కప్పుకుందామని వెతుక్కుంటే చీర మడతలు మంచం క్రింద కన్పించాయ, వారు దొంగలా?

    దుప్పటిని తొలగించడం సాధ్యపడదు!

    "బాబూ! మీకు దండం పెడతా! నన్నేమీ చేయకండి" అంది.

    "నిన్ను ఏమీ చేయం. కానీ ఆ దుప్పటిలో వున్న రెండో మనిషి ఎవరో మాకు చూపించాలి" అన్నాడు ఓ యువకుడు.

    ఆ షరతు విని అదిరిపడింది గజలక్ష్మి.

    నిస్సహాయమయిన స్థితి! మంచం దిగేందుకు కాదు కనీసం దుప్పటి తొలగించేందుకే వీలులేదు. అరిచి గోలచేసి సహాయం కోసం ఎవరినయినా పిలిచేందుకు అసలే వీలు కాదు.

    ఈ గడుగ్గాయిలకు ఈ ఇల్లే కావాల్సి వచ్చిందా?

    అయినా కప్పులమీది నుంచి నిచ్చెన్లు వేసుకుని ఇలా ఇళ్ళలోకి జొరబడడం ఏమిటి? అని అడిగేందుకు ఎలా? వారి కట్టెదుటే తన తప్పు బయట పడిపోయింది.

    తాను భర్త చనిపోయిన సంగతి అందరికి చెప్పుకుని కష్టాలు వెళ్ళబోసుకుంటే దిక్కులేని పక్షి కదా అని ఆదిరించింది సుమిత్రాదేవి. నలుగురూ అండగా నిలిచి ఇంతదాన్ని చేశారు.

    తాను ఇలాంటి గ్రంధం సాగించే విషయం నలుగురికి తెలిస్తే ఇంతకాలం ఆదరంగా చూచిన వాళ్ళే నోట్లో ఉమ్మేస్తారు.

    ఇంత మోసగత్తె! ఇంత రంకులాడి అని రాల్చిపోస్తారు.

    వారితో రాజీపడడం మినహాయించి తనకు మరెలాంటి దారులూ మిగిలిలేవని అర్ధం చేసుకుంది గజలక్ష్మి.

    చేతులు రెండు దుప్పటి బయటే వున్నాయి. అవి రెండు జోడించి వాళ్ళకి మ్రొక్కింది. బ్రతిమాలుకుంది.

    "బాబులారా! నాకు అర్ధమయిపోయింది. మీరు దొంగలు కారు. దొంగల దోపిడి పండుగలో తమాషా చేయడానికి వచ్చిన గడుగ్గాయిలు! నా గుట్టు రట్టు చేయకండి.

    నా బ్రతుకు బజారుపాలు చేయకండి. నన్ను నడివీధిలో పడవేయకండి. మీ అందరికీ తినుబండారాలు డబ్బులు యిస్తాను" అందామె జాలిగా.

    "మాకు ఇవ్వదలుచుకున్నదేమిటో చెప్పు" అని ఓ యువకుడు చాలా జబర్ దస్తీగా గద్దించి అడిగాడు.

    బంతి వాళ్ళ చేతిలోనే వుంది కాబట్టి మహదానందంతో వున్నారు.

    దుప్పటి లోపలి వ్యక్తికి తన భవిష్యత్తు అర్ధం కాలేదు    వారితో గజలక్ష్మికి రాజీ కుదిరితే ఇచ్చింది తీసుకుని వెళ్ళిపోతారు. కుదరకపోతే తంటా వస్తుంది.

    వొంటిమీద దుప్పటి తప్ప మరేమీ లేదు!

    ఈ స్థితిలో వున్న తానెవరో వారికి తెలిస్తే బ్రతుకు బస్ స్టాండే!!

    అసలే కోతులు! ఇప్పుడు వారికికొబ్బరికాయ దొరికినట్టు అయింది. అతడు తన భవిష్యత్తు నిర్ణయం కాక దుప్పట్లోనే మెలికలు తిరిగిపోవడం అందరికీ కనిపిస్తోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS