మాధురి విచిత్రంగా చూసింది.
"నేనేం చేసాను మిస్టర్! నేనూ, నా ఫ్రెండ్స్ కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ వుంటే..... ఇలా మా మీద పిచ్చివాడిలా విరుచుకుపడుతున్నది కాక.... నన్నే ఎదురు ప్రశ్నిస్తున్నావే! నథింగ్ ఈజ్ రాంగ్ హియర్... .డు యు ఫాలోమీ?" అంది మాధురి హేళన ధ్వనిస్తోన్న కంఠస్వరంతో.
"ఐ సీ....! మాధురీ! ఒకటిమాత్రం గుర్తుంచుకో.... మనుషుల ప్రాణాలతో ఆడుకునే భయంకరమైన హంతకుడికన్నా సున్నితమైన మనసులతో ఆటలాడుకునే నీలాంటి వాళ్లు చాలా ప్రమాదకరం!" అన్నాడు ప్రశాంత్ కఠినంగా.
ఆమె అతనివైపు ఎగాదిగా చూసి, తన ఫ్రెండ్స్ కేసి తిరిగి, పెదవి విరుస్తూ... అయోమయంగా భుజాలెగరేసింది. ..
వాళ్ల పకపక నవ్వుతుంటే... ఇక అక్క డ ఒక్క క్షణం నిలబడ లేక....
ప్రశాంత్ చరచర నడిచి వెళ్లిపోయాడు క్లాస్ రూంలోంచి!
10
టాంక్ బండ్ దగ్గర సిమెంట్ బెంచ్ మీద కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు ప్రశాంత్. అతని నుదిటి మీద అస్తవ్యస్తంగా పడివున్న వెంట్రుకలు గాలికి మేఘమాలికల్లా జీరాడుతున్నాయి.
అతని మనసంతా అల్లకల్లోలంగా వుంది!
మాధురి చేసిన అవమానం గుర్తుకొస్తుంటే అతని గుండె భగ్గున మండిపోతోంది... .అవమానం! అవమానం! అ... వ... మా... నం....!!
కాలేజీలో ఒక్కక్షణం వుండలేకపోయాడు.
ఎందుకు?....
మాధురి ఎందుకంత నీచంగా బిహేవ్ చేసింది!.... ఒకే ఒక ఆలోచన అతని మస్తిష్కంలో.
కానీ.... అతని ప్రశ్నకి జవాబు అదేరోజు సాయంత్రం.... లభించింది.
బస్ స్టాప్ లో రుక్మిణి కనిపించింది.
ఆమెను చూడగానే తల తిప్పుకున్నాడు ప్రశాంత్.
ఆమె అతనిదగ్గర కొచ్చింది.
"ప్రశాంత్!" పిలిచిందామె సౌమ్యంగా.
తల తిప్పి చూసాడు. "ఏం కావాలి?" అన్నాడు.
"మాధురి ఎంత బాధపడుతుందో తెలుసా?" అందామె.
"వ్వాట్! బాద! ఆమెకు బాధా! ఎదుటివాల్లని బాధపెట్టి ఆనందించే ఆడదానికి 'బాధ' అంటే అసలు అర్దం తెలుసా?....." అన్నాడు ప్రశాంత్.
బస్ కోసం నిల్చున్న ఒకరిద్దరు తమవైపే చూడటం గమనించిన రుక్మిణి గొంతు తగ్గించి మెల్లిగా అంది.
"ప్రశాంత్!డోంట్ బీ వర్రీడ్! ఆమె మనసులో నీకు స్థానంలేదని ఎందుకనుకుంటున్నావో అర్దం కావటం లేదు! ఆమె పరిస్థితి నువ్వెప్పుడయినా ఆలోచించావా? మాధురితండ్రి కోటీశ్వరుడు! సంఘంలో పరపతి హోదా, గౌరవం అన్నీ వున్న వ్యక్తి అతను! మన కాలేజీ ప్రిన్స్ పాల్ ఆయనకి మంచి ఫ్రెండ్! వాళ్లిద్దరూ క్లబ్ లో దాదాపు రోజూ కలుసుకుంటూ వుంటారు. మన ప్రిన్స్ పాల్ గారి కూతురు గిరిజ చాలా డేంజరస్ పర్సనాలిటీ! ఆమె నోట్లో నువ్వు గింజ నానదు! అన్ని విషయాలు టెలికాస్ట్ చేసినంత స్పష్టంగా తన డాడీతో చెబ్తుంది! ఆయన మాధురి తండ్రితో చెబుతాడు! మాధురి తండ్రి చంఢశాసనుడు! ఆ భయంతోనే ఆమె...." రుక్మిణి మాటలు పూర్తికాలేదు.
ప్రశాంత్ కి కోపం ఏమాత్రం తగ్గలేదు.
"ఈ విషయం నాతో ఆమె చెప్పింది! ఇంగ్లీష్ లెక్చరర్ సమక్షంలో నా ప్రేమలేఖని బట్టబయలు చేసి నన్ను తొలిసారిగా అవమానించిన తర్వాత... మాధురి నన్ను కలిసి క్షమాపణలు కోరినప్పుడు ఆమె మాటలు నమ్మాను. కానీ ఈ రోజు కాలేజీలో అలా మాట్లాడంతో ఆమె ఉద్దేశ్యం ఏమిటో బోధపడలేదు! నేనామెవెంట పడ్తున్నానని అబద్దం చెప్పి నన్ను అవమానించింది!...."'అంటున్నాడు ప్రశాంత్.
రుక్మిణి అతడి చెయ్యి పట్టుకుంది.
"మనం అటువైపు నడుస్తూ మాట్లాడుకుందాం!"అందామె.
అతనామెను అనుసరించాడు.
కొంత దూరం పేవ్ మెంట్ మీదకి నడిచారు.
"ప్రశాంత్!" నిశ్శబ్దాన్ని ఆమె భగ్నం చేస్తూ అంది.
"గిరిజకి మీరిద్దరూ కలుసుకున్న విషయం తెలిసింది" అంది రుక్మిణి.
"అదెలా?" ఆశ్చర్యపోయాడు ప్రశాంత్.
"అదే మాధురికి కూడా అర్దంకాని విషయం. గిరిజ అడిగిందట.... ఏమిటి మళ్లీ ఆ అబ్బాయిని కలుసుకున్నట్లున్నావూ, అని...." అంది రుక్మిణి.
ఆశ్చర్యపోయాడు ప్రశాంత్.
"అందుకే మాధురి అలా నాటకం ఆడింది!"
"నో! నేను నమ్మను!" అన్నాడు ప్రశాంత్.
"ఔను! నువ్వు నమ్మవనే మాధురి కూడా బోధపడ్తోంది! ఆమె ఏడ్చింది కూడా! నీకు నమ్మకం కలగాలంటే .. రేపామెని గెస్ట్ హౌస్ లో కలువు! నీకోసం ఆమె కాలేజీ ఎగ్గొట్టి.... ఎదురుచూస్తూ వుంటుంది!" అంది రుక్మిణి.
"నిజంగా?"
