మాధురికి తనమీద ద్వేషం లేదా?
మాధురికి తనంటే ప్రేమా?
ఇదంతా కేవలం ఆత్మరక్షణకోసం ఆడిన నాటకమేనా? -
అయితే ....
మాధురి... .తనని... ప్రేమిస్తోందన్నమాట!
ఆ ఆలోచనే ఎంతో ఉపశమనం కలిగించింది ప్రశాంత్ కి.
"మాధురీ... నీకు నేనంటే ఇష్టం వుంటే, నాకు జరిగిన అవమానాన్ని బహుమానంగా భావిస్తాను...." అన్నాడు ఉద్వేగంగా.
"ఐ లవ్ యు ప్రశాంత్ . ఐ లవ్ యు సోమచ్.... "అందామె.
ఆనందంతో అతని మొహం వెలిగిపోయింది.
"రా.... కారెక్కు..." అంది ఆమె ఆప్యాయంగా.
అతను మంత్రముగ్దుడిలా ఆమెను అనుసరించాడు.
కారు కాలేజీవైపు వెళ్లలేదు.
ఇందిరా పార్క వైపుకి వెళ్తోంది.
"ఈ రోజు కాలేజీ.... ఫట్! జాలీడే!" అందామె నవ్వుతూ.
ఎంత అందంగా, అధ్బుతంగా, అపూర్వంగా, అపూర్వంగా నవ్వగలదు మాధురి!
ఆ రోజు వాళ్లిద్దరూ కాలేజీకి వెళ్లలేదు.
ఇందిరాపార్కులో పచ్చని గడ్డిలో కూర్చుని ఆ రోజు ఎన్ని కబుర్లు చెప్పుకున్నారో ప్రశాంత్ కి జీవితమంతా గుర్తుంటుంది.
రెండు గంటల తర్వాత... ఆమె అతనికి చెయ్యి వూపి వెళ్లిపోయింది. ఆ రాత్రంతా ప్రశాంత్ కలల్లో మాధురి!
అతని మనసంతా ఎంతో ప్రశాంతంగా వుందిప్పుడు!
తుఫానులోంచి బైటపడిన తర్వాత కలిగే ఉపశమనంలా ఎంతో హాయిగా, మనసు తేలిగ్గా వుంది.
ఆ మర్నాడు....
ప్రశాంత్ కాలేజీలోక అడుగుపెట్టగానే స్వర్గంలోకి అడుగు పెడ్తున్నాననే భావన కలిగింది.
క్లాస్ రూంలోకి వెళ్లగానే....
అతని చూపు అప్రయత్నంగా మాధురిమీద పడింది. అంతటి సౌందర్యరాసి.. .తనకి క్షమాపణ చెప్పి.... తన సొంతం కావటానికి సిద్దంగా వుంది అంటే ఎంత గ్రేట్!
మరుక్షణం తల తిప్పుకుని, సరాసరి అతని సీట్లోకి వెళ్లి కూర్చున్నాడు.
సెకండ్ పీరియడ్ లెక్చరర్ రాలేదు. సెలవు పెట్టాడు.
క్లాస్ రూంలోంచి అందరూ బైటికి వెళ్లిపోతున్నారు -
ఓ నలుగురైదుగురు స్టూడెంట్స్ మాత్రం నోట్స్ రాసుకుంటున్నారు.
మాధురి నవ్వు వినిపించింది.
ఆమె సీట్లో వెనక్కివాలి నవ్వుతోంది గట్టిగా.
"నోరు ముయ్యవే!" ఒక స్నేహితురాలు.
"ఆముదం మొహంగాడిని నేను ప్రేమించడమా? నాన్సెన్స్!" అంటోంది మాధురి."
అదిరి పడ్డాడు ప్రశాంత్.
"మొన్న జరిగిన అవమానానికి సిగ్గులేకుండా ఇంకా నీ వెంట పడ్తున్నాడా?" అడిగిందో అమ్మాయి.
"వెంట పడటమేమిటి? ప్రాధేయపడుతున్నాడు!" అంది మాధురి.
"పాపం ప్రేమభిక్ష కోరివచ్చాడే! ఓ పావలా కాసు పడెయ్యకపోయావా?" అంది మరో అమ్మాయి.
గొల్లుమని నవ్వులు...
ప్రశాంత్ మొహం ఎర్రగా మారిపోయింది.
అతని దవడ ఎముక బిగుసుకుంది.
నుదుటి మీద స్వేదబిందువులు ప్రత్యక్షమయ్యాయి.
పిడికిళ్లు ఆవేశంతో బిగుసుకున్నాయి....
ఉద్వేగంతో అతని ఛాతీ ఎగిరెగిరి పడుతోంది....
మాధురివైపు చూసాడు...
చివాలున లేచి నిల్చున్నాడు ప్రశాంత్.
వేగంగా ఆమెవైపు కదిలాడు....
"ఏయ్! ప్రేమ బిచ్చగాడొస్తున్నాడే!" అంటోంది ఓ అమ్మాయి.
అతని కళ్ళల్లో ఎర్ర జీరలు! చేతికి పిడికిళ్లు బిగుసుకొంటున్నాయి!?ముక్కు మీద చిరు చెమట బిందువులు..... మెరుస్తున్నాయి!!!
ప్రశాంత్... మాధురి టేబిల్ దగ్గరకి వెళ్లాడు.
అందరి చూపులు అతనివైపుకి తిరిగాయి.
మాధురి అతని కళ్లలోకి చూసింది నిర్లక్ష్యంగా.
జంకు, భయం, ప్రేమ. మొహమాటం.... ఇటువంటి ఫీలింగ్స్ ఏవీ ఆమె మొహంలో కనిపించడం లేదు.
"యస్? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ మిస్టర్ ప్రశాంత్?" ఆమె గొంతులో ఎగతాళికి ప్రశాంత్. ఒంట్లో రక్తం వేగంగా ప్రవహించసాగింది.
ఆమె పెదవులపైన తొంగిచూస్తున్న చిరునవ్వులో ఒక వ్యంగ్యరేఖ లాస్యమాడుతోంది.
"యస్! యు కెన్ డూ మనీథింగ్స్ ఫర్ మీ!ఐనో ఇట్ మాధురీ! కానీ.... కానీ ఎందుకిలా చేస్తున్నావ్? నేను నిన్ను ఏం చేసానని ఇలా ప్రవర్తిస్తున్నావ్? అసలు నీ ఉద్దేశ్యం ఏమిటి? వాట్ ఈజ్ రాంగ్ విత్ యు...? నీకు నేనేమైనా అపకారం చేసానా? ఏదైనా ద్రోహంచేసానా? దెన్ వై...." ఆవేశంగా అన్నాడు ప్రశాంత్, పిడికిలి బిగించి బల్లమీద గుద్దుతూ.
