Previous Page Next Page 
పరిహారం పేజి 19


    రంగనాధం చెప్పిన సంగతి చెప్పి,  "నా క్షోభ తెలిసి భగవంతుడే అతడి నోట ఈమాట పలికించినట్టున్నాడు తల్లీ! నిన్నో ఇంటిదానిగా చూసి వెళ్ళిపోతాను?" అన్నాడు కృష్ణా రావు. అతడికి ఇప్పుడే నిశ్చింతలాంటిది ఏర్పడింది.
    పారిజాత వద్దనగలదని ఆయన అనుకోలేదు. కూతురికి వేరే ఆలోచనలున్నాయనీ ఆయన ఎంత మాత్రం ఊహించలేదు..
    కూతురు,  "వద్దు, నాన్నా!" అని చెప్పేసరికి ఆయన తెల్లబోయాడు.
    "ఎందుకమ్మా?"
    "ఎందుకో చెప్పలేను. కాని, ఈ సంబంధం మాత్రం వద్దు. రంగనాధం మామయ్యకు నువ్వు మాట ఇచ్చెయ్యలేదుకదా?" ఆ అడగడంలో ఇంచుక ఆత్రుత వ్యక్తమైంది.
    "మాట ఇవ్వలేదు. వాడే నిన్ను ఒక మాట అడగమన్నాడు. రేపు వాడికేమని చెప్పను?"
    ఇరుకున పడ్డట్టుగా తల వంచుకొంది పారిజాత.
    "చెప్పమ్మా! నీ మనసులో మాట చెప్పు! ఎందుకు వద్దంటున్నావు?"
    ".........................."
    "రంగనాథం తనంత తాను తన కోడల్ని చేసుకొంటాననడం మన అదృష్టం కాదా, పారూ? కానీ కట్నం ఇవ్వలేని ఈ పేద తండ్రి ఇంతకంటే గొప్ప సంబంధం ఎక్కడినుండి తెస్తాడు? రంగడికి మన మీదున్న స్నేహాభిమానాల చేత ఈ మాత్రమైనా నాకు దారిచూపుతున్నాడు! నీకన్నె చెర వదిలించి నన్ను నిశ్చింతగా వెళ్ళిపోనివ్వమ్మా!" రుద్ధ స్వరంతో అర్ధిస్తున్నట్టుగా అడిగాడు కృష్ణారావు.
    "మనూకి నేనంటే........నేనంటే ఇష్టం. నాన్నా!"
    "ఇష్టమంటే?"
    ".................."
    "పెళ్ళి చేసుకొంటానని చెప్పాడా?"
    "ఉహుఁ చెప్పలేదు"
    "ప్రేమించానని చెప్పాడా?"
    "ఉహుఁ"
    "ప్రేమించానని చెప్పలేదు, పెళ్ళి చేసుకొంటానని చెప్పలేదు. మనోహర్ మీద నువ్వు ఎలా ఆశలు పెంచుకొన్నావమ్మా?"    
    "కొన్ని సంగతులు పెదవులు చెప్పకపోయినా మనసులు చెబుతాయి నాన్నా!"
    "మనోహర్ ని పిలిచి నేనడగనా?"
    కంగారుగా, "ఆ పని మాత్రం చేయకు! నా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది" అంది పారిజాత.
    "అదృష్టం!" కృష్ణారావు పెదవులమీద పేలవమైన నవ్వొకటి కదిలింది.  "ఈ అదృష్టంమీద నమ్మకంచేతే నీ రూపంచూసి ఏ కాలేజీ యువకుడైనా నిన్ను పెళ్ళి చేసుకోడానికి రాడా అని ఆశపడ్డాను! వెర్రి తండ్రిని అదృష్టం ఆశపడితే వచ్చేదా? అది ఎవరిని వరిస్తుందో, ఎలా వరిస్తుందో తెలియనిది! అదృష్టంమీద నమ్మకం పూర్తిగాపోయింది పారూ"
    తండ్రి ముఖంలోకి నిశ్శబ్దంగా చూడసాగింది పారిజాత!
    "చిట్టితల్లీ! నేనొకమాట చెప్పనా?"
    "ఏమిటి నాన్నా?"
    "పరిగెత్తి పాలు త్రాగేకంటే నిలబడి నీళ్ళు త్రాగడం సుఖమన్నారు పెద్దలు, ఎండమావుల వెంట పరిగెత్తి భంగపడకు పారూ! మనోహర్ మీద నీ ఆశలు........ప్చ్! అందని చందమామ అమమా అతడు నీకు! తల్లికి ఒక్కగానొక్క కొడుకు. తల్లి మనసు నొప్పించని బుద్ధిమంతుడైన కుర్రవాడు అతను, అతడి చుట్టూ లక్షల కట్నమిస్తామని తిరుగుతున్నారు ఆడపిల్లల తలిదండ్రులు!"    
    "నిజమే, నాన్నా!"
    "ఇంకా ఎందుకమ్మా అతడిమీద ఆశలు?"
    "ఆశపడడం మనిషికి సహజమైందిగా నాన్నా?"
    "ప్చ్, ఇక నీ యిష్టం. ,పారూ! నేనేం చెప్పను! కాని, కాళ్ళ దగ్గరికి వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకొని బాధపడే అవసరం వస్తుందనే నా బాధ! చివరికి నీ పెళ్ళి చేయకుండా అనాధపక్షిలా వదిలిపోతున్నాననే నా బెంగ"
    ఆ సంఘటన జరిగిన తరువాత ఒక నాటి సంగతి.
    "తక్షణం ఇల్లు ఖాళీ చేయండి! ఇది అద్దె ఇల్లుకానీ, ధర్మసత్రం కాదు. ఇప్పటికే మూడు నెలల అద్దె బాకీ పడ్డారు, ఇక తీరుస్తారన్న ఆశకూడా లేదు" కఠినంగా అంది కోమలమ్మ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS