Previous Page Next Page 
ఏటిలోని కెరటాలు పేజి 19


    "వసంతంలో చిగర్చని చెట్టెక్కడరా? వయసు!" గంభీరం ఒలకబోశాడు సుబ్బయ్య.

    "మన దొరసానికి మేనగోడలేగంద! చేసుకుంటానికి అబ్బెంతరముండదు"

    "ఆఁ. దేవతమ్మ ఈ ఇంటికోడలైతే మన కృష్ణవేణమ్మ తల్లి దుఃఖం తుడిచిపెట్టుకుపోతుందిరా!"

    "అవును. సావీఁ! ఈడూ జోడూ సక్కగుంటది, సావీ హేఁహేఁహెఁ." ఇకిలించాడు.
   

   
                                    5



    "కొంచెం ముందుకు జరిగి కూర్చో దేవీ!"

    "ఏం?"

    "ముఖంమీద కొమ్మనీడ పడుతూంది."

    "పడితే?" చిలిపితనం తొంగిచూసింది.

    "నువ్వు సరిగా కనబడడంలేదు."

    "కనబడకపోతే?" పెంకెగా అంది.

    "ఏం చెప్పేది?" తోచనివాడిలా అన్నాడు.

    హాసరేఖ ఒకటి పెదవులమధ్య అణచిపెట్టి ముందుకు జరిగి కూర్చొంది దేవదాసి.

    వెన్నెల వెలుగు పడి తరు పత్రాలు తళతళలాడుతున్నాయి. ఆ వెన్నెల్లో దేవదాసి విగ్రహంకూడా ఒక తళతళగా మారిపోయి వెన్నెల రేఖగా కనబడుతున్నది భార్గవరామ్ కంటికి. తోట, వెన్నెల. తరుణ- ఈ వాతావరణం అత్యంత ఆహ్లాదంగా ఉంది అతడికి. ఇంతకు ముందు ఇటువంటి అనుభూతులు మధురిమ లేవీ అతడిని సోకలేదు. హఠాత్తుగా వచ్చిపడ్డ ఈ చైతన్యానికి అతడు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. ఉప్పెనలా వచ్చిపడ్డ వరదకు ప్రవాహం మంచిచెడ్డలు తెలీకుండా వెర్రిగా ఎలా పరుగులు పెడుతుందో ఈ నూతన చైతన్యం వల్ల అతడి మతిస్థితీ అలా తయారైంది.

    అస్థిమితం వల్ల అశాంతి తప్పదు. ఆనంద అనుభవమైనా అశాంతి అతడిని కలత పెడుతున్నది. మనసు సంఘర్షణపడుతూనే ఉన్నదింకా. "ఒకప్పుడు భ్రాంతిలో ఉన్నానా, ఇప్పుడు? మాయ ఈ స్త్రీ రూపంలోనన్నాడిస్తుందా?"

    తను సాలెగూటిలో చిక్కుకొన్న పురుగులాగానూ, తను తప్పించుకు వెళ్ళకుండా దేవదాసి తనచుట్టూ పటిష్టమైన వల అల్లుతున్న సాలీడుగా భావన కలిగి, ఉలిక్కిపడే దేవదాసి వంక పరిశీలనగా చూశాడు.

    దేవదాసి ఎటో చూస్తూ అంది : నేను మా ఊరికి మనిషిని పంపుదామనుకొంటున్నాను రేపు?

    "ఎందుకు."

    "బండి పంపమని."

    కలవరంగా అడిగాడు 'ఎందుకు?'

    "ఇక నాకిక్కడేం పని? ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలని అత్తయ్య నన్నిక్కడ ఉంచింది. నువ్వొచ్చావు కదా?"

    "వస్తే?"

    "నువ్వు చూచుకోలేవూ, ఇంటిని?"

    "అబ్బే, నాకేం తెలుసు?"

    "మరి, ఏం తెలుసు?"

    "ఏం తెలుసో, ఏం తెలియదో నాకే తెలీకుండా ఉంది దేవదాసీ!" బరువుగా, వ్యధగా అన్నాడు భార్గవరామ్ తలొంచుకొని.

    "ఎన్నాళ్ళిలా బాధ్యతలు తెలీకుండా బ్రతుకుతావు బావా? ఏ అడవిలోనో మానో, మాకో ఐ పుట్టితే సరిపోయేది, అష్టభాగ్యాలు కలిగిఉన్న పుణ్యదంపతులకు ఒక్కగానొక్క కొడుకువై పుట్టి నువ్వు తప్పుచేశావు. నీకు ముందూ వెనుకా మరో యిద్దరు మగపిల్లలున్నా, నువ్వెక్కడ ముక్కు మూసుకు కూర్చొన్నా అడిగేవాళ్ళు, పట్టించుకొనేవాళ్ళు ఉండకపోదురు."

    నిజమే. దేవతా! నా పుట్టుకలోనే లోపమున్నది. విచారంగా అన్నాడు. నా మనస్తత్వానికి సరిపడ్డ జీవితంకాదు. ఆత్మీయులను నొప్పించకూడదంటే నా మనుసును చంపుకోవాలి."

    "చేసేది ఒక మంచి పని అనుకొన్నప్పుడు మనసును చంపుకోవడం అంత దుఃఖంగా పరిణమించదేమో?" అని నవ్వి తిరిగి అన్నది : 'కరుణ; ప్రేమ, మమత, మానవత్వమన్నవి మోక్ష సాధనాలుగా చేసుకొని తరించిన మహానుభావులెందరో ఉన్నారు. బావా! మనసు చంపుకోవడమంటే తెలివి తక్కువగానే కనబడుతున్నది నాకు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS