పచ్చటి ఆకులమధ్య గాలి గిలిగింతలకి త్రుళ్లిపడే ముద్దమందారంలా వుంది కాత్యాయని అందం, చలాకీతనం ఆ పిల్లలో పోటీపడుతున్నాయి. కాని బాడ్ లక్! అందమైన చదువుకొన్న ఐశ్వర్యవంతుడయిన యువకుడు భర్తఅయ్యే ఛాన్స్ పోగొట్టుకుంది! అనుకొన్నాడు నవీన్.
"చూ.... చూ.... చూడే అమ్మా! న... న....నన్ను బ... బ.... బపూన్ అంటూంది! ఈ... ఈ..... ఈమెను నేను చే.... చే..... చేసుకోను ఫో!"
"ఏయ్! కాస్సేపు నోరుమూసుకోరా!" శంకరి కోప్పడింది.
"నీ.....నీ.... నీకు పెళ్లాం పు... పు.... పుట్టిందని చెప్పావుగా? ఆ.... ఆ.... .ఆవిడపేరు కా... కా... కాత్యాయని అని చెప్పావుగా?"
"నిన్ను తంతానురా! కాసేపు నోరు మూసుకో!"
"నీకు నేను పెళ్లాంనని చెప్పిందా మీ అమ్మా!ఎంత ఆశ" కాత్యాయని నవ్వసాగింది.
"మొండి పీనుగుల్లా ఎంతసేపు కూర్చుంటారో కూర్చోండి!" జయలక్ష్మి చీత్కారంగా అని లోపలికి వెళ్లిపోయింది.
"ఏయ్ మరదలూ... .నా.... నా.... నాకు ఆకలేస్తూంది ఏ... ఏ... .మన్నా పెట్టవా?"
"మా నాన్నొచ్చి పెడతాడుండు లడ్డూలు, జిలేబీలు...."
"మీ..... మీ.... మీ అమ్మ పెట్టినవేనా?"
"అవి కారాలు, మిరియాలు, మా నాన్న పెట్టేవి లడ్డూలు, జిలేబీలు."
"భ ....భలే భలే మా ... .మా... .మామయ్య మంచివాడన్నమాట. తొం... తొం... తొందరగా వస్తే బాగుండును."
"ఒరే నోరు మూసుకోమన్నానా?" శంకరి చిరాకుగ అంది.
బళ్లో మేస్టారు కోప్పడితే చప్పన పెదవుల మీద వేలుంచుకొని కూర్చొనే విద్యార్దిలా కూర్చున్నాడు నవీన్.
అంతలో ఆచారి వచ్చాడు.బజారునుండి ఏవో సామాను తెస్తున్నట్టుగా రెండు చేతులలో రెండు బరువైన సంచులున్నాయి.
అవి గోడకి ఆనించి పెట్టి "ఉష్షో" అంటూ అలసటగా కుర్చీలో కూర్చోబోయి, ఆ గదిలోనే తలొంచుకు కూర్చొన్న శంకరిని చూసి బిగుసుకుపోయినట్టుగా అయ్యాడు.
ఒక్క నిమిషం అలా నిలబడిపోయి తరువాత లోపలికి వెళ్లిపోతుంటే -
"బాగున్నావా అన్నయ్యా?" అని శంకరే పలుకరించింది.....
"..........."
"మాట్లాడవా? ఇంత కాలానికి కూడా నీకు నామీద కోపం పోలేదా?'
"ఏముంది మాట్లాడడానికి?" ఆయన ఉదాశీనంగా అని, "కాత్యా! సంచులు లోపలికి తీసుకురా!" అని కూతురికిచెప్పి లోపలికి వెళ్లిపోయాడు.
ఎంతసేపటికీ అన్నగారు బయటికి రాలేదు.
కాస్సేపటికి జయలక్ష్మి బయటికి వచ్చి "సిగ్గులేని ముఖం! యింకా ఏం కావాలని నిలబడ్డావు నడూ!" అంది.
"పదరా" నీరసంగా కదిలింది శంకరి.
మ్లానంగా మారిన తల్లి ముఖంచూసి జాలేసింది నవీన్ కు.
ఇద్దరూ బయటికి వచ్చారు. "ఈ హృదయం లేని మనుషుల పిల్లను నీ కోడల్ని చేసుకోవాలని ఇంకా అనుకొంటున్నావా అమ్మా?" అడిగాడు నవీన్.
శంకరి పెదవులమీదికి నవ్వుతెచ్చుకొని "పిల్ల బంగారు బొమ్మలా లేదూ?" అంది.
"బంగారు బొమ్మ అయితే మటుకు తల్లితో పాటు ఆ పిల్లా మనల్ని అవమానించడానికి పూనుకొంటుందా?"
"నీ నత్తి అవతారం చూసి నాకే నవ్వొస్తూంటే!"
"అంటే నీ ఆలోచనలో మార్పేమీ రాలేదన్నమాట!"
"అన్నయ్య చాలా బాగా వుండేవాడురా. బలంగా" దృఢంగా ఇప్పుడు చాలా చిక్కిపోయాడు. సంసారభారం పెరిగిపోయి, కృంగిపోయిన గృహస్థులా అయిపోయాడు. ఒక్క మగనలుసు కావాలని ఆరుమంది ఆడపిల్లలకి తండ్రి అయ్యాడు పాపం! అన్నయ్యనుచూస్తే జాలేస్తూంది" శంకరి మాట తప్పిస్తూ అంది.
