Previous Page Next Page 
చీకట్లో నల్లపులి పేజి 19


    "సరే మేం వెళ్ళివస్తాం!"

    "గుడ్ లక్!"


                                 0    0    0


    వాళ్ళిద్దరూ కనుమరుగవగానే సుందరి ఉదంతం రాజారామ్ మనస్సుని మళ్ళీ ఆక్రమించుకుంది.

    సుందరి లాంటి అందగత్తే చిన్న ప్రపంచంలో ఎన్నాళ్ళు దాక్కోగలుగుతుంది?

    "సార్....సుందరి ఫోటో మరొకటి తెప్పించాను.  చూడండి." అంటూ షిఫ్టు ఇన్చార్జ్ జనార్ధన్ ఫోటో ఇచ్చాడు.

    నిన్న అప్పారావు చింపేసింది ఇలాంటి ఫోటోనే!

    "రేపటి పేపర్లో స్టోరీతో పాటు ఈ ఫోటోతో కూడా వేస్తున్నాం. ఈ దెబ్బకి సుందరి ఎక్కడున్నా పైకి తేలాల్సిందే!"

    "ఎవరో ఒకరు ఆమెను చూచి గుర్తు పడతారు. దాంతో మనం మరికొంచెం ముందుకి వెళ్ళడానికి ఆస్కారం దొరుకుతుంది."

    అల్లంత దూరంలో తన వేపు వస్తున్న ఇన్ స్పెక్టర్ మహావీర్ నీ, ఒక యువతిని చూశాడు రాజారాం. దగ్గరకురాగానే ఇద్దరికీ కుర్చీలు ఆఫర్ చేశాడు.

    "ఈమె భవాని. డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ భవాని...మిస్టర్ రాజారామ్" అంటూ పరిచయం చేశాడు.

    "మీ రమణికి రక్షణ కల్పించడం భవాని డ్యూటీ. ఆమె హేండ్ బాగ్ లో రివాల్వర్ ఉంటుందెప్పుడూ దాన్ని చాలా మంది కన్నా బాగా ఉపయోగించడం భవానీకి తెలుసు. అన్నాడు" మహావీర్ నవ్వుతూ.

    "అన్నట్టు...మీ అమ్మాయి ఏదండీ?"

    "మా కొలిగ్ తో కలిసి ఇప్పుడే అబిడ్స్ వేపు వెళ్ళింది.....ఏవో బట్టలు అవీ కొందామని మూడు గంటలకల్లా తిరిగి వచ్చేస్తాం అన్నారు."

    "ఓకే" అంటూ టేబిలు మీదున్న మాగజైన్ ఒకటి అందుకుని తిరగ వెయ్యసాగింది భవాని.

    ఇంతలో ఆఫీసు బాయ్ వచ్చి "ఎడిటర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు సార్!" అన్నాడు.

    "ఇప్పుడే వచ్చేస్తా" అని భవానీకి చెప్పి ఎడిటర్ గదివేపు నడిచాడు రాజారాం.

    గదిలోకి వెళ్ళగానే అప్పారావు తలెత్తి రాజారామ్ వేపు చూశాడు. మొహంలో ఎలాంటి భావం వ్యక్తం కావడంలేదు. "కూర్చో రాజా!" అన్నాడు.

    రాజారామ్ కూర్చోగానే సిగరెట్ వెలిగించుకున్నాడు. ఒక దమ్ములాగి టేబిలుమీదున్న పేపర్ వెయిట్ ని అటూ ఇటూ కదిపాడు.

    "నీకు క్షమాపణ చెప్పుకోమని విరించిగారు అన్నారు. ఆలోచిస్తే అయన మాటే కరెక్టనిపించింది. సారీ రాజా! నన్ను క్షమించు"

    "సరే దానిదేముంది? నిన్నటి పరిస్థిని బట్టి నువ్వు చాలా వర్రీ డ్ గా వున్నావని గ్రహించాను."

    "వర్రీ ఏమిటి?"

    "ఆ అమ్మాయి నీకు తెలుసు...అదే సుందరి!" అంటూ రాజారామ్ రియాక్షన్ కోసం అప్పారావు మొహంలోకి సూటిగా చూశాడు.

    ఆ మాటతో అప్పారావు మొహం తెల్లగా పాలిపోయింది. కత్తి వేటుకి నెత్తురు చుక్క రాదేమోనన్నంత తెల్లగా...ఏదో పెద్ద షాక్ తిన్నవాడిలా!

    అంతలో తేరుకుని..."వాట్ నాన్సెన్స్" అన్నాడు.

    "విజయనగర్ కాలనీలో సుందరి ఇంటికి దగ్గరగా ఫాన్సీ కార్నర్ అన్న శాపుంది. సున్ధరితో నిన్ను చూశానని ఆ షాప్ ప్రొప్రయిటర్ నాతో చెప్పాడు."

    "వాడెవడో పిచ్చి వెధవలా ఉన్నాడు. సుందరి ఎవరో నాకు తెలీదు ఇంతకీ నువ్వనేదేమిటి?"

    "నిన్న మన పేపర్లో సుందరి స్టోరీతో పాటు ఫోటో వేద్దామనుకున్నాను నేను. అంతలో నువ్వొచ్చి పెద్దహంగామా చేశావు. అంత హంగామా ఎందుకుచేశావో తెలుసుకోవాలనిపించింది నాకు. అంతలో నాకో విషయం గుర్తొచ్చింది. మొన్న మొన్నటి వరకూ నువ్వు విజయవాడలో పనిచేశావు. ఆ అమ్మాయిది కూడా విజయవాడే!"

    "గొప్ప కథ అల్లేవు కానీ.... స్టాపిట్! విజయవాడలో కానీ, ఇక్కడ కానీ సుందరిని నేనెరగను. నాకు తెల్సిందల్లా సుందరి అనే అమ్మాయి కృష్ణా మాసేజ్ పార్లర్ లో పనిచేస్తుంది. మగాళ్ళు ఒళ్ళు బాగా మర్ధనా చేస్తుంది అంతే! దట్సాల్!!" అంటూ అప్పారావు కోపంగా తన చేతిలోని సిగరెట్ ని ఏష్ ట్రేలో నలిపాడు. "నా కిప్పుడు ఒకటి అర్ధమవుతోంది. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడలేవు." అంటూ సూటిగా రాజారామ్ కళ్ళలోకి చూశాడు.

    "అవును ఏదో ఒక కత్తి మరో అరణి వెతుక్కోవాలి. ఏ కత్తి అన్నది ఇక్కడ ప్రశ్న! ఒక్కటి మాత్రం గుర్తుంచుకో....నా విషయంలో పిచ్చి పిచ్చి ఎత్తులు వేస్తే నువ్వు చిత్తు కాక తప్పదు!" అన్నాడు రాజారామ్.

    "చైర్మన్ గార్ని కాకా పడితే సరిపోతుందనుకుంటున్నావు...ఆ పప్పులేం ఉడకవు!"

    "ఉడికించి చూపిస్తాను"

    "చూద్దాం!"

    రాజారామ్ ధీమాగా కుర్చీలోంచి లేచాడు. స్వింగ్ డోర్ తెరుచుకుని తన సీటు వేపు నడవసాగాడు. అంతలో అతనికో ఆలోచన వచ్చింది. 'సుందరి - అప్పారావు'ల గురించి ఇన్ స్పెక్టర్ మహావీర్ తో చెప్తెనో!

    తీరా చూస్తే మహావీర్ అప్పటికే వెళ్ళిపోయాడు. వాచ్ చూసుకున్నాడు. ఇంకా రెండు గంటలు కాలేదు. మరో గంటకి కాని రాజేశ్వరి, రమణీ రారు....


                                                                    0    0    0


    రెండు మూడు బట్టల షాపులు తిరిగాక చివరగా "బేబీస్ యూనివర్స్ షాపులోకి వెళ్ళారు రమణీ, రాజేశ్వరి.

    ఆ బట్టల షాపుని చాలా వింతగా చూస్తూ, లోపలికి అడుగు పెట్టింది రమణి. ఒక పక్క కౌంటర్లో అన్నీ నెక్ టైలే ఉన్నాయి. మరో కౌంటర్లో పిల్లల రెడీమేడ్ బట్టలు. ఇంకో కౌంటర్లో ఆడవాళ్ళ డ్రెస్ మెటీరియల్...రమణి వాటిని చూస్తూ, ఆశ్చర్యంగా ఒక్క క్షణం అలా నిలబడిపోయింది. అంతలో ఆమె దృష్టిని బంగారం రంగులో మెరిసిపోతున్న ఒక గౌను ఆకర్షించింది. రాజేశ్వరి చేతినిపట్టుకుని" ఆంటీ....ఆంటీ అటు చూడు..."అని అటువేపు చూపించింది.

    "ఏం బాగుందా?"

    "చాలా బాగుంది."

    "పద, అడుగుదాం"

    కౌంటర్ దగ్గరికి వెళ్ళారిద్దరూ. ఆ గౌను ఖరీదు మూడు వందల రూపాయలు! ఆ మాట వినగానే రమణి మొహంలో నిరాశ ఆవరించింది. అంత ఖరీదైన గౌను కొంటారో....కొనరో! అంతకు ముందే కొన్న బట్టల సంచీ రమణి చేతికి ఇచ్చి.."ఇక్కడే ఉండు...ఇప్పుడే వస్తా" అంటూ మరో కౌంటర్లో ఉన్న షాపు మేనేజర్ దగ్గరికి వెళ్ళింది రాజేశ్వరి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS