త్రిజట - స్వప్న వృత్తాంతము :-
3. "గజ దంతములచే - నిర్మితమైన
వేయి హంసలతో - ఒనరుగ నున్న |
గగన మార్గమున - ఎగురుచుండిన
శ్రేష్టమైన ఒక - శిబిక యందున |
శుక్లాంబరముల - దాల్చినవారు
రామ లక్ష్మణులు | అగుపించినారు |"
అనిదెల్పె త్రిజట - స్వప్న వృత్తాంతము
భయకంపితలై | రి రాక్షసీ గణము ..... ||శ్రీ||
4. "నాల్గు దంతముల - ఏనుగు పైన
రామ లక్ష్మణులు | ఏ తెంచినారు |
వైదేహికి ఇరు | వంకల నిలచి
దివ్యతేజమున | వెలుగొందినారు |
మువ్వురతో ఆ - మహాగజము
లంకాపురిపై - చేసెను పయనము |"
అనిదెల్పె త్రిజట - స్వప్న వృత్తాంతము
భయకంపితలై | రి రాక్షసీ గణము ..... ||శ్రీ||
5. "సాగరమందున - ఉన్నతమైన
స్వచ్చమైన గిరి - శిఖరము పైన |
శుక్లాంబరము ధ | రించిన సీతను
రామచంద్రుడు - అంకము జేర్చెను
అవనీజాత - రవి చంద్రులను
చేతులారగ - తాకుచుండెను |"
అనిదెల్పె త్రిజట - స్వప్న వృత్తాంతము
భయకంపితలై | రి రాక్షసీ గణము ..... ||శ్రీ||
6. "పాలకడలిలో - తెల్లని ఒక గిరి
గిరిపై గిరివలె - తెల్లని ఒక కరి |
కరిపై మంగళ | కరమౌ అంబారి
అంబారి పైన | శ్రీరామమూర్తి |
చిరునగవులతో | ఆసీనుడయ్యె
జగదభి రాముడు | పూర్వాభి ముఖుడై |"
అనిదెల్పె త్రిజట - స్వప్న వృత్తాంతము
భయకంపితలై | రి రాక్షసీ గణము ..... ||శ్రీ||
7. "దేవతలందరు | పరిసేవింప
ఋషి గణంబులు - అభిషేకింప |
గంధర్వాలు - సంకీర్తింప
బ్రహ్మాదులు మును | ముందు నుతింప |
సీతారాముడు - విష్ణుదేవుడై
శోభిల్లెను కోటి - సూర్యతేజుడై |"
అనిదెల్పె త్రిజట - స్వప్న వృత్తాంతము
భయకంపితలై | రి రాక్షసీ గణము ..... ||శ్రీ||
8. "బ్రహ్మము, సత్యము - జ్ఞానము, తపము
బీజము, క్షేత్రము - మూలకారణము |
సరసిజనాభుడు - చతుర్భుజుడు
శంఖచక్ర గ | దా యుధ ధరుడు |
శ్రీవత్సాంకిత | విశాల వక్షుడు
శ్యామసుందరుడు - సీతారాముడు |"
అనిదెల్పె త్రిజట - స్వప్న వృత్తాంతము
భయకంపితలై | రి రాక్షసీ గణము ..... ||శ్రీ||
(కలలో రావణాదులు )
9. "తైలమలదుకొని - రావణాసురుడు
నూనె ద్రాగుచు | అగుపించినాడు |
కాలాంబరమును - ధరియించినాడు
కర వీర మాల - దాల్చినాడు |
పుష్పకమందుండి - నేల బడినాడు
కడకొక స్త్రీ చే - ఈడ్వబడినాడు |"
అనిదెల్పె త్రిజట - స్వప్న వృత్తాంతము
భయకంపితలై | రి రాక్షసీ గణము ..... ||శ్రీ||
10. "రావణుండు వ | రాహము పైన
కుంభకర్ణుడు - ఒంటె పైన
ఇంద్రజిత్తు - మకరము పైన
దక్షిణ దిశగా | పడిపోయినారు |
రాక్షసులందరు - గుంపు గుంపులుగ
మన్నున గలిసిరి - సమ్మూలమ్ముగ |"
అనిదెల్పె త్రిజట - స్వప్న వృత్తాంతము
భయకంపితలై | రి రాక్షసీ గణము ..... ||శ్రీ||
11. "వరాహముపై - పోవు రావణుడు
భయపడి బెదిరి - జారిపడినాడు |
వెర్రివాని వలె - కేకలిడినాడు
వస్త్రహీనుడై - పరుగిడినాడు |
దుర్గంధ పంక - కూపమందున
దుర్గతిపాలై - తూలిపడినాడు |"
అనిదెల్పె త్రిజట - స్వప్న వృత్తాంతము
భయకంపితలై | రి రాక్షసీ గణము ..... ||శ్రీ||
12. "తెల్లని మాలలు - వలువలు దాల్చి
తెల్లని గంధము - మేన బూసికొని |
నృత్య మృదంగ మం - గళ ధ్వనులతో
చంద్రకాంతు లెగ | జిమ్ము ఛత్రముతో |
తెల్లని కరిపై - మంత్రి వర్యులతో
వెడలె విభీషణు | డు దివ్యకాంతితొ |"
అనిదెల్పె త్రిజట - స్వప్న వృత్తాంతము
భయకంపితలై | రి రాక్షసీ గణము ..... ||శ్రీ||
