13
తండ్రి మరణించిన తరువాత ఆరు మాసాలు గడిచిపోయాయి. దేవదాసుకు ఇంటి మీద పూర్తిగా విరక్తి కలిగింది. శాంతి లేదు, సౌఖ్యం లేదు. జీవితంలో మార్పు లేదు. పార్వతి చింత కారణంగా మనస్సు నిలకడ లేకుండా పోయింది. పైగా ఇప్పుడు ఆమె చేసిన ప్రతి పనీ, ఆమె ప్రదర్శించిన ప్రతి హావభావమూ నిత్యం అతడి కళ్ళ ముందు ప్రత్యక్షంగా చిత్రంలాగా నర్తిస్తూ వున్నాయి. దానికితోడు అన్నా వదినెల నిర్లిప్తమైన వ్యవహారాలు దేవదాసు సంతాపాన్ని మరింతగా అధికం చేశాయి.
తల్లి స్థితి కూడా దేవదాసు స్థితి లాగానే వుంది. భర్త మరణంతో పాటు ఆమె సుఖాలన్నీ అంతరించి పోయాయి. పరాధీనతతో ఈ ఇంట్లో వుండటం ఆమె కూడా సహించలేకపోతూ వుంది. ఇప్పుడు అనేక రోజుల నుంచి ఆమె కాశీ వాసాన్ని గురించి ఆలోచిస్తూ వుంది. కేవలం దేవదాసు అవివాహితుడుగా ఉన్న కారణంగా ఆమె ఇప్పుడే వెళ్ళలేకపోతూ ఉంది. "దేవదాస్, ఇక నీవు పెళ్ళి చేసుకో, నా కోరిక నెరవేరుతుంది" అని ఆమె అప్పుడప్పుడు అంటూ వుంటుంది. కాని అది ఇప్పుడు ఎలా సాధ్యమవుతుంది? ఒకటేమో తండ్రి కబ్ధికం పూర్తి కాలేదు. రెండోది అభిరుచికి అనుకూలమైన కన్య లభించలేదు. పార్వతి పెళ్ళి ఇప్పుడైతే బాగుండేదని దేవదాసు తల్లి అప్పుడప్పుడు దుఃఖిస్తూ ఉంటుంది. ఒక రోజు ఆమె దేవదాసును పిలిచి "ఇప్పుడు నేను ఇక్కడ వుండదలచుకోలేదు. కొన్ని రోజుల పాటు కాశీలో ఉండి వద్దామని కోరికగా ఉంది" అని చెప్పింది. దేవదాసు కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. "నా అభిప్రాయం కూడా అదేనమ్మా. ఆరు మాసాల తరువాత తిరిగి రా" అన్నాడు.
"అలాగే చెయ్యి. నేను తిరిగి వచ్చిన తరువాత ఆయనగారి ఆబ్ధికం అయిపోయిన తరువాత, నీ పెళ్ళి చేసి, నీవు గృహస్థుడివి కావడం చూసి నేను మళ్ళీ కాశీకి వెళ్ళిపోతాను!"
దేవదాసు ఆమె అభిప్రాయంతో ఏకీభవించి, కొన్ని రోజుల పాటు ఉండటం కోసం ఆమెను కాశీకి చేర్చి, తాను కలకత్తాకు వెళ్ళిపోయాడు. ద్కలకత్తా వచ్చిన దేవదాసు నాలుగైదు రోజుల వరకూ చున్నీలాల్ ను వెతుకుతూ వున్నాడు. ఆయన లభించలేదు. ఆ మెస్ విడిచిపెట్టి మరో చోటకు వెళ్ళిపోయాడని తెలిసింది ఒకరోజు సాయంకాలం దేవదాసుకు, చంద్రముఖి సంగతి జ్ఞాపకం వచ్చింది. ఒకసారి చూసి రావడం బాగుంటుంది అనుకొన్నాడు. ఇన్ని రోజుల వరకూ ఏమీ గుర్తు కూడా రాలేదు. అంచేత కొంచెం సిగ్గుపడ్డాడు కూడా. ఒక బాడుగ బండి మాట్లాడుకొని వెళ్ళాడు. కొంచెం చీకటి పడిన తరువాత చంద్రముఖి ఇంటి ముందుకు వచ్చి బండి ఆగిపోయింది. చాలా సేపు పిలిచి, పిలిచి అరిచిన తరువాత లోపల నుంచి ఒక స్త్రీ "ఇక్కడ లేదు" అని జవాబు చెప్పింది. ఎదురుగా ఒక విద్యుత్ స్తంభం ఉంది. దేవదాసు దానికి దగ్గరగా వెళ్ళి నిలబడి "ఆమె ఎక్కడకు వెళ్ళిందో చెప్పగలవా?" అన్నాడు. కిటికీ తెరిచి ఆమె ఎక్కడకు వెళ్ళిందో చెప్పగలవా?" అన్నాడు. కిటికీ తెరిచి ఆమె కొన్ని క్షణాలు చూసిన తరువాత "మీరు దేవదాసు గారా?" అన్నది.
"అవును."
"ఉండండి....తలుపు తీస్తాను" అని తలుపు తీసి "రండి" అన్నది. ఆమె కంఠస్వరం పరిచితమైనదిగా అన్పించింది. అయినా గుర్తుపట్టలేక పోయాడు. అందులో కొంచెం చీకటి పడింది కూడా. సంశయిస్తూ "చంద్రముఖి యెక్కడ ఉంటుందో ఏమైనా చెప్పగలవా?" అన్నాడు.
ఆ స్త్రీ తియ్యగా నవ్వుతూ "ఆఁ మీరు పైకి వెళ్ళండి" అన్నది. ఈసారి దేవదాసు గుర్తుపట్టాడు. "ఆఁ! నీవేనా?"
"అవును, నేనే. దేవదాస్ నన్ను పూర్తిగా మరచిపోయారా?"
పైకి వచ్చి దేవదాసు చూశాడు. చంద్రముఖి నల్లని అంచుగల ఓ మురికి చీర కట్టుకొని ఉంది. చేతులకు కేవలం రెండు మురుగులు తప్ప ఆ వంటి మీద మరే ఆభరణమూ లేదు. ఆమె శిరోజాలు అటూ ఇటూ చెదిరిపోయి వున్నాయి. దేవదాసు ఆశ్చర్యపోయి, "నీవే?" అన్నాడు. బాగా పరీక్షగా చూసాడు. చంద్రముఖి పూర్వం కన్నా బాగా బలహీన పడిపోయి వుంది.
"నీవు జబ్బు పడ్డావా?" అడిగాడు దేవదాసు.
"శారీరకంగా ఏమీ జబ్బు పడలేదు. చక్కగా కూర్చో."
దేవదాసు మంచం మీద కూర్చొని చూశాడు. ఇంట్లో పూర్వం కన్న మార్పు వచ్చింది. అప్పటికీ ఇప్పటికీ, ఆకాశానికీ పాతాళానికీ వున్నంత తేడా వుంది. గృహ యజమానురాలు మాదిరిగానే దాని దుస్థితికి మేర లేకుండా పోయింది. ఇంట్లో సామాను ఒక్కటి కూడా లేదు. ఆల్ మైరాటేబుల్, కుర్చీ మొదలైనవాటి స్థానాలన్నీ పడివున్నాయి. కేవలం ఒక మంచం మాత్రం మిగిలివుంది. దుప్పటి బాగా మురుకిపట్టి వుంది. గోడ మీద వుండే పటాలన్నీ ఒక్కటి గూడా లేవు. ఇనుప మేకులు మాత్రం ఇంకా గోడలో దిగబడే వున్నాయి. ఒకటి రెండు ఎర్రని పట్టీలు మాత్రం ఇటూ అటూ వ్రేలాడుతున్నాయి. పూర్వపు ఆ గడియారం మాత్రం బ్రాకెట్ మీద పెట్టి వుంది. కాని మౌనంగా వుంది. అక్కడక్కడ మూలల్లో బూజు పట్టి వుంది. ఒక మూల నూనె దీపం కాంతి లేకుండా వెలుగుతూ వుంది. ఆ గుడ్డి దీపం వెలుగులోనే దేవదాసు ఆ యింటి ప్రస్తుత పరిస్థితి అంతా చూశాడు. నివ్వెరపోయి "చంద్రా! ఏమిటీ దురదృష్టం? ఎందుకు సంభవించింది?" అన్నాడు. చంద్రముఖి కళా హీనంగా నవ్వి, "దురదృష్టమని ఎవరు చెప్పారు మీకు? ఇది నా అదృష్టమే అనుకోవాలి" అన్నది.
దేవదాసు అర్ధం కాలేదు. నీ ఆభరణాలన్నీ ఏమయ్యాయి?" అన్నాడు.
"అమ్మేశాను."
"సామానులు?"
"అవి కూడా అమ్మేశాను."
"ఇంట్లో పటాలు కూడా అమ్మేశావా?"
ఈసారి చంద్రముఖి నవ్వి ఎదురుగా వున్న ఒక ఇంటిని చూపించి "ఆ యింటి యజనానికి అమ్మేశాను" అన్నది.
దేవదాసు కొంచెం సేపు ఆమె ముఖంవైపు చూసి "చున్నీబాబు ఎక్కడున్నాడు?" అన్నాడు.
"చెప్పలేను. రెండు మసాలయింది. పోట్లాడి వెళ్ళిపోయాడు. మళ్ళీ అప్పటి నుంచి రాలేదు."
దేవదాసు ఇప్పుడు మరీ ఆశ్చర్యం కలిగింది. "పోట్లాట ఎందుకొచ్చింది?" అని అడిగాడు.
"ఏం పోట్లాట జరగదా?" అన్నది చంద్రముఖి.
"జరుగుతుంది, కాని ఎందుకు?"
"దలారి పని చేయడానికి వచ్చాడు. అంచేత తొలగించాను."
"ఎవరికి దలారి పని?"
చంద్రముఖి నవ్వి "విటులకు. నీవు తెలియదులే ఒక గొప్ప మనిషిని పట్టుకొచ్చాడు. నెలకు రెండువందల రూపాయలు, ఒక సెట్ ఆభరణాలు, వాకిలి ముందు ఒక కాపలావాడు. లభిస్తాడు. తెలిసిందా!"
ఇదంతా తెలుసుకున్న తరువాత దేవదాసు నవ్వి "వాటన్నిటిలో ఒకటి కూడా కన్పించడం లేదే?" అన్నాడు.
"వుంటే గదా కన్పించడానికి? నేను వాళ్ళను తొలగించేశాను."
"వాళ్ళ అపరాధమేమిటి?"
"వాళ్ళ అపరాధం అంత ఎక్కువేమీ లేదు. కాని నాకు నచ్చలేదు."
దేవదాసు బాగా ఆలోచించి "ఆ రోజునుంచి ఇక్కడకు మరెవ్వరూ రాలేదా?" అన్నాడు.
రాలేదు. ఆ రోజు నుంచే ఏమిటి? నీవు వెళ్ళిన దగ్గర నుంచే ఇక్కడకు ఎవ్వరూ రాలేదు. మధ్య మధ్యలో కేవలం చున్నీలాల్ మాత్రం వస్తుండేవాడు. అయితే రెండు మాసాల నుంచి ఆయన కూడా రావడం లేదు."
దేవదాసు ప్రక్కమీద పడుకొన్నాడు. మరో వైపు చూస్తూ వున్నాడు. చాలా సేపటివరకు మౌనంగా వున్న తరువాత నెమ్మదిగా "అయితే వ్యాపారం అంతా ఎత్తేశావన్న మాట!" అన్నాడు.
"అవును, దివాలా తీశాను."
దేవదాసు యీ మాటకు ప్రత్యుత్తరమియ్యకుండా "అయితే తిండీ తిప్పలు ఎట్లా జరుగుతున్నాయి?" అన్నాడు.
"అందుకే వున్న ఆభరణాలన్నీ అమ్మేశాను."
"అందులో ఇప్పుడు ఎంత మిగిలి వుంది.
"ఎక్కువగా లేదు. ఎనిమిది, తొమ్మిది వందలు వున్నాయి. అవి ఒక దుకాణదారుని వద్ద వుంచాను. అతడు వాటి మీద నెలకు ఇరవై రూపాయలు ఇస్తాడు."
"ఇరవై రూపాయలతో ఇదివరకు నీకు జరిగేది కాదే?"
"జరిగేది కాదు. ఇప్పుడు కూడా బాగా జరగడంలేదు. మూడు మాసాలనుంచి యింటి అద్దె బకాయిపడి వుంది. అందుకే యీ రెండు మురుగులూ అమ్మేసి అప్పులన్నీ తీర్చి మరెక్కడికైనా వెళ్ళిపోదామను కుంటున్నాను."
"ఎక్కడికి వెళతావు?"
"అది యింకా నిశ్చయించుకోలేదు. ఏదైనా చౌక ప్రదేశానికి, ఏ పల్లెటూరుకో వెళతాను. నెలకు ఇరవై రూపాయలతో జరిగే చోటుకు."
"ఇన్ని రోజుల నుంచి ఎందుకు వెళ్ళలేదు. ఒకవేళ నిజంగా మరో ఉద్దేశ్యం లేకపోతో మరి యిన్నిరోజులు ఇక్కడ వుండి వ్యర్ధంగా అప్పు ఎందుకు పెంచుకున్నావు?"
చంద్రముఖి తల వంచుకొని ఏదో ఆలోచిస్తూ వుంది. ఆమె జీవితములో సంభాషించడంలో సిగ్గుపడవలసి వచ్చిన మొట్టమొదటి అవకాశము ఇదే. "మాట్లాడవేం?" అన్నాడు దేవదాసు.
చంద్రముఖి మంచంమీద మరో సంకుచిత భావంతో కూర్చొని నెమ్మదిగా "కోప్పడవద్దు, వెళ్ళే ముందు నిన్ను కలుసుకొనడం బాగుంటుందని అనుకున్నాను. ఒకసారి నీవు తప్పకుండా రాగలవని ఆశిస్తూ వున్నాను. ఈరోజు నీవు వచ్చావు. ఇక రేపే వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కాని ఎక్కడకు వెళ్ళేది ఏమయినా చెప్పగలవా?" అన్నది.
