Previous Page Next Page 
మూసిన తలుపులు పేజి 19


    "మీకు నాన్నగారి పై ఎందుకంత మమకారం?"
    "మనిషికి మనిషి పై మమకారం లేనప్పుడు మానవత్వాని కే అర్ధం లేదు."
    "ప్రతి మనిషికి ఇతరుల నాదుకోలానే ఆత్రుతా, పరాయి వారికి సహాయం చెయ్యాలనే కోరికా ఉంటాయా?"
    'అది వారి వారి మనస్తత్వాలను బట్టి ఉంటుంది. తమ వారికి గూడా రవంత సహాయం చేయలేని మూర్ఖులూ ఉన్నారు, పరాయి వారిని సైతము తనవారిగా ఎంచి ఆదుకునే పుణ్యాత్ములు ఉన్నారు. అదే మానవత్వాన్నీ, సంఘీ బావాన్నీ చాటుతుంది. మానవులలోనే కాదు; పశు పక్ష్యాదులలో కూడా ఈ భావాలుంటాయి.'    
    వసంత మరి మాట్లాడలేదు. కారును బంగళా లోనికి త్రిప్పింది. తన కూడా వస్తున్న వసంతను, నిలబడి ఒక విధంగా చూశాడు. అర్ధం చేసుకొన్న వసంత నిస్పృహ ను సూచించే ఒక చిరునవ్వు విసిరి తన గదికి వెళ్ళిపోయింది.
    "ఏమిటోయ్ , అప్పుడే వచ్చేశావు?' అడిగారు ఆనందరావు గారు, చెప్పాడు రాజ్.
    "మరి అమ్మాయి కూడా వచ్చిందా?"
    "వచ్చిందండీ! పాపం మీరు కేక లేశారని చాలా బాధపడి ఏడుస్తోంది."
    ఆనందరావు గారి లో పుత్రికా వాత్సల్యము, జాలి పుట్టుకొచ్చాయి. నౌకరు ను పిలిచి అమ్మాయిని పిలుచుకు రమ్మని చెప్పాడు. అది విని ఆశ్చర్యపోయినా తిరిగి ఏం ఉపద్రవం వాటిల్లనున్నదో అని భయపడింది వసంత.
    "ఇలా రా అమ్మా! కూర్చో" అని అయన ప్రేమతో పిలవగానే మొదట నమ్మలేక పోయింది. నమ్మి ఉప్పొంగి పోయింది. మెల్లిగా అతని ప్రక్కనే కూర్చుంది.
    "నిన్ను కోపంలో ఏమేమో అన్నాను కదూ? ఎన్నడూ పల్లెత్తు మాట అనలేదు. ఈనాడు నిన్ను నోటి కొచ్చినట్లు తిట్టాను. తల్లిలేని దానివని ముద్దుగా పెంచి ఈనాడు నిన్ను కష్ట పెట్టాను" అంటుండగా అయన కంట్లో గిర్రున నీళ్ళు తిరిగాయి.
    రాజ్ వారి ప్రేమను అర్ధం చేసుకొన్నాడు.
    "నాపై కోపమొచ్చింది కదూ? నాకు చావైనా రాదు."
    ఆ మాటలు విని వసంత తన పై తండ్రి కెంత ప్రేమ ఉందొ అర్ధం చేసుకొంది. తనపై తనకే కోపం రాగా దుఃఖం పెల్లుబికి "నాన్నా!     అలాంటి మాటలనకు." అని అతని మీద వాలిపోయింది.
    ఇక అక్కడ ఉండలేక పోయి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు రాజ్. వారిద్దరి వాత్సల్యం అతనిలో కలవరాన్ని రేపింది. తనకు తల్లీ, తండ్రి ఎవరూ లేరు. తల్లితండ్రుల ప్రేమకు నోచుకోలేని నిర్భాగ్యుడు తను. అందరిలా తన కష్టాలను వారి ఓదార్పు లో, లాలన లో మరిచిపోయి హాయిగా ఉండే అదృష్టం తనకు లేదు. తప్పు చేసినప్పుడు కోపగించుకొని, బాధపడగానే దగ్గర తీసి ఓదార్చే వారు తనకీ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. పాపాత్ముడైన తనను ఈ లోకంలో వదిలి తమ దారి తాము చూసుకున్నారు. తోడు నీడ లేక ఆదరణాప్యాయతలు కరువై , ప్రేమతో దగ్గర తీసి లాలించే వారు లేక తనవారున్నారంటూ గర్వంగా చెప్పుకోలేని ఈ బ్రతుకును ఇన్నాళ్ళు ఎలా గడుపు కొచ్చాడో తనకే తెలియదు.
    ఆ సాయంకాలం డాక్టరు గారి సలహా ప్రకారం వారిని షికారు తీసి కెళ్ళాడు రాజ్. తనూ, రజియా కలిసికొని పోయే స్థలానికి పోయారు వారిని.
    "ఇక్కడ మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందోయ్" అన్నారు ఆనందరావు గారు.  చుట్టూ చూస్తూ.
    వసంత కూడా ఆ ప్రకృతి కి ముచ్చట పడింది. వారితో మాట్లాడుతూ రాజ్ అటు వైపే వచ్చిన రజియా ను పరిశీలించాడు. ఆమె మొహం లో కళ లేదు. దేనిపైన శ్రద్ధ లేక దీనమైన చూపులతో ఏదో ఆలోచిస్తుందామె కళకళలాడుతూ ఉండే రజియాను ఆ పరిస్థితిలో చూసి కలుక్కుమంది రాజ్ హృదయం.
    వారిని దాటిపోతూ అటు చూసిన రజియా రాజ్ ను చూసింది. ఆమె హృదయం ఎగిరి గంతేసింది. ఆమె కళ్ళు మిలమిల మెరిశాయి. ఒక్కసారిగా అతని మీద వాలిపోయి ఇన్నాళ్ళూ కలిగిన దుఃఖాన్ని పోగొట్టు కోవాలని గబగబా వచ్చి ప్రక్కనే ఉన్న వారిని చూసి ఆ ప్రయత్నానికి స్వస్తి చెప్పింది.
    "కూర్చో రజియా" ఆన్నాడు రాజ్ చిరునవ్వుతో.
    అతనిలో ఏదో మార్పు వచ్చిందని గ్రహించింది రజియా. ఎండకోరం ఎదురుచూసిన చంద్రోదయమయి తిరిగి కనబడకుండా మబ్బుల్లో అంతమయినప్పుడు తపించే విధంగా తపించింది ఆమె హృదయం.
    ఎంత వద్దనుకున్నా 'ఈ మూడు రోజు లెక్కడి కెళ్లావు, రాజ్" అని అడుగులేకుండా ఉండలేక పోయింది ఆమె.
    రాజ్ ఏదో చెప్పబోతుండగా వసంత ఆమె బాధను అర్ధం చేసుకొని 'నే చెప్తానుండండి" అని జరిగిన విషయాలు చెప్పింది. అది విని నవ్వుకొన్నాను ఆనందరావు గారు.
    రాజ్, రాజియాను వారికి పరిచయం చేశాడు.
    రజియాను చూసిన ఆనందరావు గారు ఆమె ముఖ కవళికలు ఎవరినో జ్ఞాపకానికి తేగా 'అమ్మాయ్ , మీ తల్లి పేరు సరోజినీ కదూ!" అన్నాడు.
    "కాదండి, మేము ముస్లిము లము. అదీ కాక మా తల్లి పేరేమిటో నాకింత వరకూ తెలియదు."
    "పేరును చూసి అదే అనుకున్నాను. కానీ, ఎందుకో నా కళ్ళు నన్ను మోసగించలేవు కదా అని, కోరి ఆ పేరు పెట్టుకుని ఉండవచ్చని సందేహ మొచ్చి అడిగాను. అయినా పాత పాట్లు సహజమేగా" అని నవ్వారు అయన.
    చీకటి పడుతుండగా అందరూ లేచారు. ఆనందరావు గారి మాటలు రాజ్ మనసులో ఒక ఆలోచనా తరంగాన్ని లేపినా అప్పటిలో వాటికంత ప్రాముఖ్యా న్నివ్వ లేకపోయాడు.
    కారు డ్రైవ్ చేస్తున్న వసంత అప్పుడప్పుడు ప్రక్కనే కూర్చున్న రజియాను పరిశీలిస్తుంది.
    'అమ్మాయ్, ఆమెను వారింటి దగ్గర  దిగబెట్టు" అన్న తండ్రి గారి మాటలు విని దారెటు అని రజియా వైపు చూసింది వసంత. రజియా చెప్పింది. ఆమెను ఇంటి దగ్గర దిగబెట్టి మిగతా వారితో కారు ఆనందరావు గారింటి వైపు దూసుకు పోయింది. కారు నుండి దిగుతూ "రాజ్ , రేపు తప్పక వస్తావు గదూ" అన్న రజియా మాటలు రాజ్ చెవుల్లో గింగురు మంటున్నాయి. ఎందుకొచ్చింది తనకీ విషమ పరిస్థితి? అమాయకమైన రజియాను మోసగించాలి. అది కాకుంటే మిత్రుడికి దూరం కావాలి. ఇద్దరి మనస్సులూ నొప్పించకుండా ఉండేందుకు మార్గమేదైనా చూపించలేవా, దేవుడా అని మనసులోనే ప్రార్ధించాడు.
    "ఏమిటోయ్ , ఆలోచిస్తున్నావు?" అన్న ఆనందరావు గారి పిలుపుతో ఆ ఆలోచనలకు స్వస్తి చెప్పాడు.
    "ఏమీ లేదండీ" అన్నాడు తనలోని భావాలు బయటపడకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ నవ్వుకున్నారు ఆనందరావు గారు.
    
                                     14
    "రండి." ఆహ్వానించింది లత.
    చిరునవ్వుతో ఆమె ననుసరించాడు రాజ్. అతన్ని సోఫాలో కూర్చో బెట్టింది లత.
    ఇందిరను పిలిచి అతనికి పరిచయం చేసింది. ఆమెను చూడగానే వయసు కు మించిన అనుభవాలను గడించిందని ఊహించాడు రాజ్.
    "లత మిమ్మల్ని గురించి ఎప్పుడూ చెపుతుంటుంది" అంది ఇందిర చిరునవ్వుతో.
    "మరి మిమ్మల్ని గురించి నాకెప్పుడూ చెప్పలేదే? ఏం లతా?' అన్నాడు రాజ్.
    "ఊ" అని ఏం చెప్పాలో తెలియక తికమక పడింది లత. నవ్వొచ్చింది ఇందిరకు ఆమె స్థితి చూసి.
    "కాలేజీ లో ఆ విషయం జరిగినప్పటి నుండి ఇంట్లో ఎప్పుడూ ఏడుస్తుంటుంది. ఆమెను ఓదార్చలేక నే బాధపడి పోయేదాన్ని. మీ సహాయం వల్ల ఆ కష్టం తీరింది. ఆనందంగా ఉంటోంది. అందుకు మీకు మా కృతజ్ఞత."
    "మీరిలా మాట్లాడతారని తెలిసి ఉంటె నేనసలు వచ్చేవాడినే కాదు. నన్ను పిలిచి చిన్నబుచ్చినట్లవుతుంది."
    "క్షమించండి. మీ కది ఇష్టం లేకుంటే మానేస్తాను."
    "ఒకరి అదృష్టాన్ని మనం బాగుచేయగలమా, చెప్పండి?"
    "ఇది నిజంగా వారికదృష్ట్యమే నంటారా?"
    "ఆ నిర్ణయం చేసుకోవలసిన బాధ్యత వారిపై నుంది. విత్తనములు వేస్తె మొక్క మొలిచింది. కానీ పెద్దదై ఫలదాయకం కాక ముందే ఎండి పోయింది అంటే మనం ఏం చెయ్యగలం, చెప్పండి?' అని ఆమె నిగూడ ప్రశ్నను అర్ధం చేసుకొని జవాబు చెప్పాడు.
    "అందుకు మన అజాగ్రత్త కూడా కారణం కావచ్చు గా?"
    "కాదని చెప్పలేము. అదేకాదు పరిసరాల ప్రభావం కూడ ఒక కారణం అని ఒప్పుకోవాలి. కానీ మీలాంటి సహోదరి ఉండగా లత జాగ్రత్తగానే ప్రవర్తించగలదని నాకు నమ్మక ముంది. ఏం, లతా ఏమంటావు?"
    "అక్కయ్య సలహా పాటిస్తే నా జీవితాన్ని ఏ అడ్డంకు లూ లేని పూల బాటగా మార్చుకో గలవనే ధైర్యం నాకూ ఉంది."
    "బాగుంది. నామీద అంత నమ్మకం మీ కేలా కలిగిందో తెలుసుకోవచ్చా?"
    "కొందరిని చూస్తె చాలు వారెంత గొప్పవారైందీ చెప్పవచ్చు."
    'అది అందరికీ సాధ్యం కాదు. మీలాంటి వారికే అది కరతలామలకం."
    ఇంతలో వాళ్ళమ్మ అక్కడికి వచ్చింది.
    "వారు మా అమ్మ. అమ్మా, వీరు మన లత క్లాస్ మెట్" అని పరిచయం చేసింది ఇందిర.
    "నమస్కారమండీ" అన్నాడు రాజ్.
    లతా వాళ్ళమ్మ రాజ్ ను పరీక్షగా చూడసాగింది. అది లతకు, ఇందిరకూ కష్టంగా ఉంది.
    "నీకు తల్లీ, తండ్రి ఉన్నారా నాయనా?" అని అడిగిందామె.
    "ఆ ప్రశ్నతో తల్లిపై కూతుళ్ళు ఇద్దరికీ కోపం వచ్చింది. రాజ్ తమను ఎక్కడ అపార్ధం చేసుకుంటాడో నని బాధపడ్డారు. వారి దృష్టి లో ఆమె అలా చూడడం ఆశ్చర్యంగా లేకపోయినా బహుశా తన తల్లి దండ్రులెవరైనా తెలిసే ఉండవచ్చేమో అనుకొన్నాడు.
    'అంత అదృష్టానికి నోచుకోలేదండి."
    "మీ నాన్నగారి పేరు?"
    "రామమూర్తి."
    "తల్లి పేరు?"
    ఆమె ప్రశ్నలు వింటుంటే ఇందిరకూ, లతకు కోపం వస్తుంది. ఇంటికి వచ్చిన అతిధిని అలా అడగడం బాగులేదని వారు బాధ పడుతున్నారు. ఏమీ చేయలేక ఒకరి మొహాలు ఒకరు చూసుకొన్నారు.
    ఆమె ప్రశ్న విని సందిగ్ధావస్థలో పడ్డాడు రాజ్. విచిత్రమే తనకు తన తల్లి పేరే తెలియదు. నవ్వుకొన్నాడు. ఆ మాటే చెప్పాడు.
    "మీయింటి పేరైనా తెలుసా?"
    "కందుకూరి వారండీ!"
    అది విని ఆమె మొహం వికసించింది. మొహంలో ఆనందం వ్యక్త మైంది. ఏదో ఆశ నిశ్చయానికి వచ్చింది. కానీ వెంటనే ఆమె మోహంలో బాధ, పాప భీతి కొట్ట వచ్చినట్లు కనబడుతున్నాయి. రాజ్ ను సరిగ్గా చూడలేక పోయింది.
    "అమ్మా, నువ్వెళ్ళమ్మా! ఇంట్లో పనులు...." అని తల్లి ముఖ కవళికలు చూసి ఆగిపోయింది లత.
    "ఔనామ్మా! నేనిక్కడ ఉండ తగను . పాపాత్మురాలిని. చేసిన పాపానికి నావారిని నా వారనే చెప్పుకొనే యోగ్యత లేనిదాన్ని."
    "ఏమిటమ్మా, నీ మాటలు?' అని అడిగింది ఇందిర ఆత్రుతగా.
    "ఔను ఇందిరా! నే చేసిన పాపాలకు ఈనాడు నా అన్న కుమారుడైన ఇతడిని రక్త బంధువని చెప్పుకొనే అదృష్టాన్ని పోగొట్టుకొన్నాను."
    ఆశ్చర్యపోయారా ముగ్గురూ.
    "ఏమిటమ్మా, నువ్వన్నది ?" అర్ధం కాక అడిగింది ఇందిర.
    "నిజమే ఇందూ! వీడు నా మేనల్లుడు."
    రాజ్ బావ అవుతాడని తెలుసుకొన్న లత ఆనందానికి హద్దు లేకపోయింది.
    నమ్మాలో లేదో అర్ధం కాలేదు రాజ్ కు.
    "నువ్వు మీ నాన్న ను గుర్తు పట్టగలవా, బాబూ!"
    "లీలగా గుర్తున్నాడు."
    "అయితే ఇలా రా. ఈ ఫోటో చూడు" అంది ఆమె ఒక గోడ కున్న పెద్ద ఫోటో ను చూపిస్తూ.
    రాజ్ ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి చూశాడు. ఆ ఫోటోలో నవ దంపతులు ఉన్నారు. వారిలో పెళ్లి కొడుకు స్థానం లో ఉన్న తండ్రిని పోల్చుకో గలిగాడు. అతని ప్రక్కనే ఉన్న తల్లిని కూడా చూశాడు. ఒక్క క్షణం అతని హృదయం బాధతో నిండిపోయింది. తల్లిని ప్రత్యేక్షంగా చూడలేకపోయినా వీరి దయ వల్ల ఫోటో లోనైనా చూడ గలుగుతున్నాడు అనుకొన్నాడు. మనసులోనే వారికీ చేతులెత్తి నమస్కరించాడు. వారి వెనుక ఒక యువతి, ముసలి దంపతులు నిలబడి ఉన్నారు. ఆ యువతిని లతా వాళ్ళమ్మ గానూ, ఆ ముసలి దంపతులను తన అవ్వా, తాత గాను ఊహించుకోగలిగాడు.
    వెనుతిరిగి మేనత్త మొహంలోకి చూశాడు. ఆ కళ్ళలో ఏదో అపేక్ష మెదులుతుంది. ఆవేదన గూడు కట్టుకొని ఉంది.
    "అత్తయ్యా!" అని ఆమె పాదాలకు నమస్కరించ బోయాడు. మధ్యలోనే అతణ్ణి లేపి 'అంత భాగ్యానికి అర్హిరాలు కాదు, నాయనా, ఈ పాపత్మురాలు." అని రాజ్ ను ఆలింగనం చేసుకొంది. ఆమె కన్నీరు ఆనంద భాష్పాలుగా మారిపోయింది.
    అత్తయ్య ను కలుసుకొన్న రాజ్ కు తల్లి తండ్రులను కలుసుకోన్నంత సంబర మయింది. ఆ ఆనందం అతనిలో దుఖాన్నే తెచ్చింది. అతని కనులు ఆర్ద్రమయినాయి.
    "అత్తయ్యా! ఇన్నాళ్ళూ నేను బ్రతికి ఉన్నానని తెలిసి గూడా మౌనం వహించావా? తల్లీతండ్రుల ప్రేమకు నోచుకోని ఈ దౌర్భాగ్యుడికి నీ ప్రేమను గూడా దూరం చేశావా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS