.jpg)
వనజ ఉద్రేకం చాలావరకు చల్లబడిపోయింది. ఎక్కువగా మాట్లాడటానికి శక్తి లేకుండా పోయింది. తన ముందున్న వ్యక్తీ నిజ స్వరూపం, కుత్సిత బుద్దీ ఈనాటికీ పూర్తిగా గ్రహించగలిగింది. తన అసహాయతకు అప్రయత్నంగా కళ్ళ వెంట నీరు బొటబొట కారసాగింది. శోక రుద్దమైన స్వరంతో "మీరింత కఠినాత్ములైనారేమిటి? నన్ను సంఘంలో గౌరవ పూర్వకంగా ప్రశాంతంగా ఒక మనిషిలా బ్రతక నీయరా ఏమిటి?" అన్నది.
"లాభం లేదు వనజా, నీ కన్నీరు నన్ను కరిగించ లేదు. నేను అమాయకుడైన రాజుని కాదు. అక్కడ రాజును కని పెంచినవారు నీ కన్నా ఎక్కువగా దుఃఖిస్తూన్నారు. మీ యిద్దరి సంబంధం ఎల్లకాలం ఇలాగే వుంటుందని కలలో కూడా ఆశించవద్దు. " రెడ్డి హటాత్తుగా భావో ద్రేకంలో పడిపోయాడు. శూన్య దృష్టులతో వనజను చూస్తూ 'ఈ సంఘం మిమ్మల్ని ఈ విధంగా బ్రతకనీయదు. దానికి ఎదురు నిలిచి పోట్లాడే శక్తి మీకు లేదు. నీది కేవలం వృధా ప్రయాస తప్ప మరేమీ కాదు. నీ ఆశ ఫలించేవకాశం - ఈ శతాబ్దం లోనే కాదు-- ఈ దేశంలో ఎప్పటికి లేదు. నువ్వు ఇక్కడ్నించి వెళ్ళిపోవాల్సిందే?" అన్నాడు.
వనజ చప్పున తల పైకెత్తి సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ "వెళ్ళకపోతే?" అన్నది.
"వెళ్ళకపోతే ఎలా సాగనంపాలో నాకు తెలుసు. నేను ఈ ఊర్లో పుట్టి పెరిగిన వాణ్ణి . ఈ ఊర్లో నేను చెయ్యలేని పనంటూ ఏదీ లేదు. కాని పరిస్థితి అంత వరకూ రానీయటం నీ ఆరోగ్యానికి మంచిది కాదు. అప్పుడిక నీ మీద జాలి చూపటమంటూ జరుగదు. నిజం చెప్పాలంటే నా హృదయంలో నువ్వంటే ఇప్పటికీ కాస్తా అభిమానం లేకపోలేదు. కావాలంటే నీకింకా డబ్బిస్తాను. నాలుగు రోజుల తర్వాత నేను మళ్ళీ వస్తాను. అప్పుడు నీ ముఖం నాకిక్కడ కనిపించ కూడదు తెలిసిందా?' అంటూ నాలుగు కొత్త పది రూపాయల నోట్ల కట్టలను నిర్లక్ష్యంగా వనజ ముందుకు విసిరేసి బూట్లు టకటక లాడించుకొంటూ వెళ్ళిపోయాడు.
వనజ చాలా సేపటి వరకూ చేష్టలుడిగిన దానివలె అలాగే నిలబడి పోయింది. తర్వాత చాలా సేపటికి మెల్లగా వంగి ఒక నోట్ల కట్టను చేతిలోనికి తీసుకొని ఒక్కొక్క నోటు చిన్న చిన్న ముక్కలు చేయసాగింది.
* * * *
ఇంటర్య్వూ పదకొండు గంటలకు . రాజు మిగతా అభ్యర్ధులతో కలిసి వరండా లో బల్ల మీద కూర్చున్నాడు. ఎవరికి ఎవరి రికమెండీషను ఉన్నాయో ఘనంగా చెప్పుకొంటున్నారు. ప్రతి వారికీ ఎవరిదో ఓకే రికమెండేషన్ ఉన్నట్లుంది. ఒక్కొక్కరి నే పిలుస్తున్నారు. రాజు పేరు ఆఖర్ని వచ్చింది. గుండె దడదడ లాడుతుండగా గదిలో అడుగు పెట్టాడు. ఆఫీసరు ముందు నిలబడి నమస్కరించ బోతున్న వాడలా హటాత్తుగా ఆగిపోయాడు. ఆనాడు హైదరాబాదు రైల్లో పిల్లలతో సహా తమతో ప్రయాణం చేసిన కన్నడం ఆఫీసరు అతను! కళ్ళజోడు సర్దుకుంటూ రాజు వంక ఎగాదిగా చూసి "కూర్చో" అన్నాడు.
రాజుకు ముళ్ళ మీద కూర్చున్నట్లుంది.
ఆఫీసరు తన ఎదుట నున్న ఫైలు చూస్తూ "ఊ బి.యస్.సి పాసయ్యావన్న మాట! ఇంకా పైకేందుకు చదవలేదు" అడిగాడు.
"మూడు సంవత్సరాల పాటు మెడిసిన్ చదివానండీ" వినయంగా జవాబిచ్చాడు.
"మరి మధ్యలో ఎందుకు ఆపావు? ప్రేమ వ్యవహారంలో పడ్డావ్ కదూ?"
"లేదండీ పరిస్థితులు అనుకూలించ లేదు."
"మీ స్వగ్రామం!"
రాజు చెప్పాడు. "మరి ఇంతదూరం వచ్చావేం అక్కడేమీ ఉద్యోగం దొరకలెదా?" ఆఫీసరు మళ్ళా ప్రశ్నించాడు.
"లేదండి."
"అంతా అబద్దం. బాహుశా తెచ్చిన డబ్బు ఐపోయి వుంటుంది. అంతేనా?"
రాజు సమాధానమేమీ చెప్పలేదు. ఆఫీసరు రాజు కళ్ళలోకి చూస్తూ "ఆ అమ్మాయి నేం చేశావ్? ఇంకా వదిలెయలేదా?' అడిగాడు.
రాజు ఆశించని ఆ ప్రశ్నకు తికమక పడి పోయాడు. చప్పున సరైన సమాధానమేమీ స్పురించలేదు. "లేదండీ" అంటూ గొణిగాడు.
"ఆ అమ్మాయే నిన్ను వదిలుంచుకు పోయిందా?"
రాజు అరికాలి మంట నెత్తి కెక్కింది. ఈ ఇంటర్వ్యూ అభ్యర్ధుల శక్తి సామర్ధ్యాలు పరీక్షించటానికా లేక స్వవిషయాల్లో తల దూర్చటానికా? లేకపోతె లేకపోయింది ఈ ఉద్యోగం అనుకొన్నాడు. 'అదంతా నా స్వవిషయం. మీకు అనవసరం. నేను అర్హుడ్నని తోస్తే ఉద్యోగం ఇవ్వండి. లేకపోతె లేదు. వస్తాను." అంటూ లేచి చరచరా బయటకు నడిచాడు రాజు సాయంకాలం కృష్ణమూర్తి కనిపించినపుడు "అదీ జరిగిన సంగతి కృష్ణమూర్తి' అని చెప్పాడు రాజు.
"వెరీ బాడ్ లక్" కాని నువ్యు కొంచెం ఓర్పు చూపించి ఉండవలసింది. ఆ ఆఫీసరు కి నీ సంగతి కొంత తెలుసు కనుక నువ్వు నాలుగు అబద్దాలైనా చెప్పి అతని సానుభూతి సంపాదించి ఉండాల్సింది." అన్నాడు కృష్ణమూర్తి.
"నా స్వవిషయాల్తో అతనికేం పని చెప్పు? అదీకాక ఎంత హేళనగా మాట్లాడాడో తెలుసా" అన్నాడు రాజు తన అక్కసునంతా వెళ్ళ గ్రక్కుతూ.
"పోనీలే . ఏం చేస్తాం? ఇంతకీ దురదృష్ట దేవత నిన్ను వెంటాడుతుంది. అదీ అసలు సంగతి" అన్నాడు కృష్ణమూర్తి.
నాలుగు రోజుల తర్వాత ఆ దురదృష్టదేవత ఉత్తరం రూపంలో రాజు చేతికందింది. అది డివిజినల్ ఇంజనీరు ఆఫీసు నించి వచ్చింది. బహుశా "సెలెక్టు' కానందుకు 'విచారాన్ని ' వెలిబుచ్చుతూ వ్రాసి ఉంటారు. ఆ విషయాన్నే అక్షరాలలో చూడాలన్న అభిలషేమీ లేకపోయినా యధాలాపంగా కవరు చించాడు. అతని ఆశ్చర్యానికి మేర లేకపోయింది.
"వనజా నాకు ఉద్యోగమొచ్చింది. ఇదిగో ఆర్డరు?" అంటూ కేకలు వేయసాగాడు.
పోయి కింద మంట పెడుతూ కూర్చున్నవనజకు ఆ కేక స్పష్టంగానే వినిపించింది. హతిస్మీ! లోలోపలే అనుకోసాగింది -- ఐపోయింది అంతా తారు మారైపోయింది . రాజుకు ఉద్యోగం దొరకడంతో తన ప్లానంతా చెడిపోయింది. ఇక ఇక్కడ్నుంచీ రాజుని కదిలించటం సాక్షాత్తూ ఆ భగవంతుడికి కూడా సాధ్యం కాదు! ఇప్పుడెం చెయ్యాలి?
15
ఒకటో తారీకున జీతం డబ్బు తీసుకొని, హోటల్లో కడుపు నిండా టిఫిను తిని, ఒక గోల్డ్ ఫేక్ సిగరెట్టు కొని తృప్తిగా పీలుస్తూ యింటి దారి పట్టాడు రాజు. ఇంతటి తృప్తి ననుభవించి ఎన్నో రోజులైంది. యిక నుంచి అంత కష్టపడవలసిన పనేమీ లేదు. జీతం కాక ఇంకో కొన్ని అలేవెన్సు లు వస్తాయి కొంచెం పొదుపుగా వాడుకొంటే సుఖంగానే జీవించవచ్చు. వనజకు ఒకటి రెండు చీరెలు కొనాలి. తర్వాత ఇవ్వాళ సినిమా కెళ్ళాలి. వనజతో సినిమా కెళ్ళి ఎన్నో యుగాలైంది! ఇవ్వాళ వనజ ఎంత సంతోషిస్తుందో? ఈ మధురమైన ఊహలతో ఉత్సాహంగా నడుస్తున్నాడు రాజు. ఎన్నో రోజులకు గాను ఇవ్వాళ రాజు మనసు ఎంతో తేలికగా ఉంది.
"ఇదిగో వనజా జీతం డబ్బు."
"నాకెందుకు? మీ దగ్గరే ఉంచండి."
రాజు త్వరగా స్నానానికి సిద్దమపుతూ ఇవ్వాళ సినిమా కెళ్దాం త్వరగా తయారై ఉండు" అన్నాడు.
"నేను రాను. మీరు వెళ్ళండి."
రాజు ఉత్సాహం సగం చచ్చిపోయింది. "అదేమిటి వనజా, వెళ్దామంటుంటే ?' అన్నాడు.
"మిమ్మల్ని వెళ్ళమని చెప్పాను కదా! నాకు వంట్లో బాగాలేదు" విసుగ్గా అన్నది వనజ.
రాజు మౌనంగా స్నానం చేసి వచ్చాడు. తాను ఆశించిన ఉత్సాహమేమీ వనజలో కన్పించలేదు. అంధకారబంధురమైన తమ జీవితంలో ఇవ్వాళే వెలుగురేఖ ఉదయించింది. అది వనజకు సంతోషదాయకం కాదా? ఎందుచేత? వనజ మౌనంగా భోజనం వడ్డించింది. పూర్వపు రోజుల్లో ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకొంటూ భోజనం చేసేవారు. రాజుకు ఇవ్వాళ గతించిన సంతోషమయ దినాలన్నీ గుర్తురాసాగాయి. "నువ్వు కూడా వడ్డించుకోరాదూ, తోడుగా ?' అన్నాడు.
"మీరు కానీయండి. నేను తర్వాత తింటాను."
జీతం అందుకొని ఎంత ఉత్సాహంతో ఇంటి కొచ్చాడో ఇప్పుడంత నిరుత్సాహంగా ఉన్నాడు. తన ఉత్సాహంలో వనజ పాలు పంచు కోవటం లేదని తెలిశాక అతని శరీరమూ, మనసూ గ్లానితో నిండిపోయింది. భోజనం కాగానే చాప పరుచుకొని నిద్రకుపక్రమించాడు. కాని ఎంతకూ నిద్ర పట్టలేదు. చాలా రోజులనుంచీ వనజ విపరీత ప్రవర్తన రాజుకు అర్ధం కావటం లేదు. మనుషుల పై డబ్బు కుండే ప్రభావం రాజుకు తెలియక పోలేదు. డబ్బు చాలకపోతే సంసారంలో అశాంతి, అసంతృప్తి కలిగితే కలుగవచ్చు. కాని మరీ ఇంతగా -- డబ్బే సర్వస్వమంటే అతను నమ్మలేడు! రాజు ప్రక్కకు తిరిగి వనజ వేపు చూశాడు. పాపం, అలసిపోయి, చిరుగుల చాప మీద కేవలం ఒక దిండు మాత్రం వేసుకొని వివశయై నిద్రపోతోంది. కిరసనాయిలు దీప కాంతిలో పైపెదవి మీద స్వేద బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. ఉచ్చ్వాస విశ్వాసాలకు ఎగిసి పడుతూన్న వక్షోజాల మధ్య శూన్యాన్ని, అనంతమైన చెంపల మీది మృదుత్వాన్నంతా కూడదీసుకొని కొనదేలిన సన్నని గడ్డం, అంటీ అంటనట్లు ముద్దాడుతుంటే వెన్న వంటి చెక్కిళ్ళ మీద జారిపోతున్న చూపులు ఆ దుర్గమప్రదేశాన్ని దాటలేక అక్కడే నిల్చి పోయాయి. చాపకు అంటి పెట్టుకొని ఉన్న సన్నని నడుము హటాత్తుగా బలాన్ని పుంజుకొని , వుధృత రూపం దాల్చి అర్ధ చంద్రా కారంగా పైకి లేచి, కోపాన్ని తగ్గించుకుంటూ మృదువుగా పొడవుగా కాళ్ళవేపు జారిపోయింది. ఇన్ని రోజుల్నుంచీ ఈ అపూర్వమైన సౌందర్య మంతా వృధాగానే పోతుందా? చాలా రోజులుగా ఇద్దరూ విడివిడిగా పడుకొంటున్నారు. అలా పడుకోవటం ఎప్పుడు ఎలా మొదలైందో , ఆ సందర్భమేమీ రాజుకు గుర్తు లేదు. ఇవ్వాళే హటాత్తుగా ఆ విషయం గుర్తొచ్చింది. రాజు ఉద్విగ్నుడై మెల్లగా ఆమెను తన వేపుకు లాక్కోసాగాడు. వనజ రాజు చేతులు తీసివేసి, నిద్ర మత్తుతో మరో వేపు తిరుగుతూ "దయచేసి కాస్త ఊరుకోండి. నన్ను నిద్ర పోనియరా ఏమిటి?" అన్నది విసుగ్గా. ఆ రాత్రంతా రాజు కిక నిద్ర పట్టలేదు.
తెల్లవారే టప్పటికి రాజుకు భరించరాని తలనొప్పి వచ్చేసింది. నీరసం వళ్ళంతా నొప్పులు, స్నానం కూడా చెయ్యకుండానే కాఫీ తాగి ఆఫీసు కెళ్ళిపోయాడు. రాజు ఆఫీసు కెళ్ళి నప్పట్నుంచీ వనజ గుండె పీచు పీచు మంటూనే ఉంది. రెడ్డి ఎప్పుడు వస్తాడో, ఏమి చేస్తాడో ననే భయం ఆమెను పీడిస్తుంది. అతనిది మొరటు స్వభావమన్న సంగతి వనజకు బాగా తెలుసు. అందువల్ల బయట బూట్ల చప్పుడు వినపడేసరికి వనజకు ముచ్చెమటలు పోశాయి. కాని లోపలి కొచ్చింది రెడ్డి కాదు. ఇన్స్ పెక్టర్ గోపాలరావు!
'అయన ఇంట్లో లేరు"
ఇన్స్ పెక్టర్ ఎంతో చనువు ప్రదర్శిస్తూ "నువ్వుంటే చాలు' అంటూ బయట తలుపు గడియ వేసి గది మధ్య కొచ్చాడు. ఖరీదైన బ్రాందీ వాసన గుప్పున కొట్టింది. వనజను ఏకవచన ప్రయోగం చేయటం అదే మొదలు.
"ముందా తలుపు తెరవండి." అంటూ కోపంతో అరిచింది వనజ.
"అవసరం లేదు. అది అలాగా ఉండనివ్వు. కాని నువ్వు భయపడాల్సిన అవసరమేమీ లేదు. నీతో ముఖాముఖిగా మనసు విప్పి కొన్ని విషయాలు చెప్పి పోదామని వచ్చాను. కాబట్టి నువ్వు నిర్భయంగా, నే చెప్పేదంతా విని, నాకు సమాధాన మిస్తే నేను వెళ్ళిపోతాను."
