Previous Page Next Page 
తప్పు పేజి 19

 

    దీక్షితులు కన్నీళ్ళ తో అడిగాడు. 'కాదని అనను. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది. ఆదర్శం కోసం నువ్వు చాలా గొప్ప పని చేశావు. పెంచి పెద్ద చేసి యింటి వాడిని చేశావు. నేను కృతజ్ఞుడిని. పాత ఆచారాల్ని వదులుకోలేక ఆనాడు యెన్నో కూతలు కూశాను. మారుతున్న కాలాన్ని చూస్తూ వుంటే కోడలు మంచి పని చేసిందనే అనిపించింది. నా యింటి దీపం ఆరిపోయింది. మళ్ళీ ఆ చీకట్ల లోకి వీడు వెలుగు నిస్తూ రావాలని నేను ఆశ పడుతున్నాను.
    'డెబ్బై యేళ్ళు దాటిపోయాయి నాకు. బ్రతికి నన్నాళ్ళు బ్రతకను నేను. కాడు రమ్మని పిలిస్తుంటే వూరు వదల నంటోంది. ఆస్తి పాస్తుల కోసం అయిన వాళ్ళందరూ గెద్దల్లా యెగరవేసుకు పోయేందుకు సిద్దంగా వున్నారు నా మనవడు నీ దగ్గర పెరుగుతున్నాడని హైదరాబాదు లో చెప్పారు. నీ అడ్రసు తెలుసుకుని వచ్చేందుకు ఎంతో శ్రమ పడ్డాను. నీకు....చిన్న వాడివైనా నీ చేతులు పుచ్చుకుని ప్రార్ధిస్తున్నాను. ఈ పిల్లాడిని నాతొ పంపేయి. నీ చాయలకి వచ్చి నీ పరువు బజార్లో వేలం వేయాలని నా వుద్దేశ్యం కాదు బాబూ. రక్తపు మమకారం పెద్ద వాడినైనా యింతదూరం లాక్కు వచ్చింది. ' అయన కాళ్ళా వెళ్లా పడసాగాడు.
    చటర్జీ భూమి మీద పాదాల్ని బలంగా మోపి పట్టుజారి పోకుండా నిలదొక్కుకుంటూన్నట్లు శరీరాన్ని నిలబెట్టాడు.
    శ్రీకాంత్ కి స్పృహ వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు వృద్దుడు. కూజాలో నీళ్ళు తీసుకువచ్చి మొహం మీద చిలకరించాడు . కాగితాలతో విసరసాగాడు.
    చటర్జీ యీ దృశ్యాన్ని భరించలేక పోతున్నాడు. అతని కళ్ళ ముందు యెన్నో చిత్రాలు కదులుతున్నాయి. శ్రీకాంత్ మూడు నెలల బిడ్డగా వున్నప్పుడు అతని వొళ్ళో 'వూ' 'ఆ' అనేవాడు. ఆరు నెలలప్పుడు ప్రతిరోజూ తన ఖరీదైన పాంట్లన్నిటినీ తడిపేశేవాడు. యేడాది పిల్లాడప్పుడు 'నాన్నగాలూ' అనేవాడు. తన మెడ చుట్టూ చేతులు వేసి మొహం లోకి కొంటెగా చూస్తూ, కిలకిలా నవ్వేవాడు. అలా పెరిగి పెరిగి యింత వాడయ్యాడు. యిప్పుడు ఒక్క క్షణం తనని చూడనిదే వుండలేడు. తానంటే అనురాగం, ఆప్యాయతా, మాటల్లో వర్ణించేందుకు వీలు కానంతటివి. అటువంటి శ్రీకాంత్ ని వదిలి తను వుండగలడా?
    యెంతకీ హల్లో కి వెళ్ళిన తండ్రి కొడుకులు రాకపోయేసరికి గోవింద మెట్లు దిగి వచ్చింది. హల్లో మావగారిని చూస్తూనే నిర్ఘాంత పోయింది. అయన కోడలి వైపు దృష్టిని సారించాడు. గోవింద ద్వితియంగా చటర్జీ ని చేసుకుంది. తృతీయం మరెవరి నైనా చేసుకుంటుంది అని ఒకప్పుడు కోడలి గురించి చిత్రంగా అనుకునేవాడు. ఆ కోడలి గురించే .... ఆవిడకేం? ఆ యింట అందరూ సనాతనాచరాల్ని వదులుకున్న వాళ్ళు. క్లబ్బుల కి వెళ్ళే విధంగా సగం వీపు మీదికి చేతులు మీదికి వున్న జాకెట్లు వేసుకుని దేవతా వస్త్రాలు కట్టుకుని యెర్ర రంగు పెదాలకీ, మొహానికి పులుముకుని భర్తతో 'టింగు రంగా' అంటూ కారుల్లో వూరేగుతుంటుంది అని. కానీ ప్రత్యేక్షంగా గోవింద ని చూడగానే అనుకోకుండా 'అమ్మా ....నేను వచ్చాను." అన్నాడు. గోవింద నుదట పెద్ద బొట్టుతో, ఖరీదైన నేత చీరలో పసుపు రాసుకుని పరిశీలించి చూస్తె వ్యధలన్నిటినీ మొహం లో భద్ర పరుచుకుని ఆలంబన లేని లత కొంత చితికి పోయాక ఏడో ఆధారం దొరకగానే పట్టుసరిగా లేక ఎండ కీ, వానకీ వోడిలినా అసలు ప్రాణంతో వున్నట్లూ కనిపిస్తోంది. చటర్జీ భార్య వైపు చూశాడు.
    దీక్షితులు కోడలికి దగ్గరగా వెళ్ళి : 'నీ కాపురం వీధిలో పెట్టి యేకి యెగతాళి చేసి 'నిన్ను నానా మాటలూ అనేందుకు రాలేదు. వీడు....' అయన కొంచెం ఆగి సోఫా లో వున్న శ్రీకాంత్ ని చూపిస్తూ 'వేడిని అడిగి మీరు ఒప్పుకుంటే నాతొ తీసుకు వెళ్లాలని వచ్చాను. నాతొ పంపండి. మీ బిడ్డకి యెటువంటి అపకారమూ చేయను.' అన్నాడు.
    గోవింద నోరు మెదపలేదు. అయన భార్యాభర్తల నిద్దరినీ అడుగుతున్నాడు. చటర్జీ కి యే మీ పాలు పోవడం లేదు. శ్రీకాంత్ లేచి కూర్చున్నాడు. తల్లీ తండ్రి నూతన వ్యక్తీ హల్లో నిలబడి పోయారు. తల్లీ తండ్రి కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లుతున్నాయి. అయన దాదాపు యేడుస్తున్నాడు కుర్రవాడిలా.
    'చెప్పు బాబూ.'
    చటర్జీ కొడుకు వైపు చూశాడు.
    దీక్షితులు మనవడి వైపు దృష్టిని సారించి 'నాతొ రా బాబూ' అంటున్నాడు.
    శ్రీకాంత్ పటుత్వం లేనట్లు అయిపోయాడు.
    'డబ్బు కోసం కాదు. చచ్చిపోయేముందు యీ ముసలి వాడి గొంతులో తులసి తీర్ధం పోయించుకోవాలనే స్వార్ధంతో వచ్చాను. వస్తావా!'
    శ్రీకాంత్ ఆలోచించాడు. రెండు లక్షలు ఒక వైపు, చటర్జీ మరో వైపు ధర్మపు తులా త్రాసులో నిలుచున్నారు. యెటు వైపు ధర్మం గెలుస్తుందో పరికిస్తున్నాడు అతడు.
    చటర్జీ....తల్లీ తండ్రి అన్నీ తనే అయి యిన్నేళ్ళు పెంచాడు. పెంచాననే భావం  వున్నవాడైతే తనని పెద్ద చదువులు దేనికి చదివిస్తాడు? సవతి కొడుకు అనే ఈ శంక వున్నట్లయితే ఉమేష్ తో సరిగా తనని చూడగలిగేవాడా/ ఫారిన్ కూడా పంపేందుకు సిద్దంగా వున్నాడు. ఈ ఆస్తి పాస్తులన్ని ఉమేష్ కి వోక్కడికీ రాసేసి తనని వట్టి చేతుల్తో నడి వీధిలో నిలుచొ బెట్టలేక పోయేవాడా?
    ఆయన్ని యెవరూ వేలెత్తి చూపకుండానే వున్నారా యిన్నాళ్ళూ. అయినా అతను తననెంత దయనీయంగా చూశాడు. ఈనాడు రెండు లక్షలతో 'నువ్వు నా మనవడివి .' అంటూ వచ్చిన పెద్దమనిషి యిన్నేళ్ళూ యేమైపోయాడు? పురిట్లో నే తనని తీసుకు వెళ్ళి వుంటే యిన్ని సమస్యలు యేడురయ్యేవి కావే? ఆచూకీ తీసిందుకు ఆరు నెలలు పట్టాయి అంటున్నాడు. యిన్నేళ్ళూ ఆచూకీ తీయాలని తోచనే లేదా?
    రెండు లక్షల కోసం తను వెళ్ళిపొతే చటర్జీ కి గుండెలు ఆగిపోవూ? పెంచిన తండ్రి పట్ల కర్తవ్యం అవిశ్వాసం కృతఘ్నుడిగానూ వుండమనే బోధించి నట్లయితే యీ చదువూ , విజ్ఞానమూ దేనికీ? కల్చిందుకా? డబ్బు కాదు ప్రధానం. మనిషి మంచి తనానికి కృతజ్ఞత కావాలి. చటర్జీ పట్ల ఆ క్షణం లో శ్రీకాంత్ కి వల్లమాలిన గౌరవాభిమానాలతో  బాటు భక్తీ భావం కూడా కదిలింది. దీక్షితులు అడుగుతుంటే గొంతు సవరించుకుని శ్రీకాంత్ చెప్పబోయేది కుతూహలంగా వినిందుకు ఆయత్త పడుతున్నారు గోవింద చటర్జీ.
    'నేను మీతో రానందుకు నన్ను క్షమించండి. నాకు రెండు లక్షలూ వొద్దు. మా నాన్న ఆయనే అని యిన్నేళ్ళూ నేను దృడ విశ్వాసంతో నమ్మాను. యిప్పుడు మీరు కాదన్నా నేను నమ్మలేను. తండ్రి మొహం ఎలా వుంటుందో కూడా నాకు తెలీదు. మీ నాన్న యెవరో అని ప్రశ్న వేస్తె ముందు నాకు స్పురించేది యీయనే.'
    'యిరవై యేళ్ళు దాటిపోయాయి. యిప్పుడు .....యింత ఆలశ్యంగా వచ్చారు మీరు మీతో నేను వచ్చినా అది నాకు మానసికంగా తృప్తి ని యివ్వక పోగా రంపపు కోత కొస్తుంది. న్యాయం మీరు చెప్పండి. పెంచిన వారి పట్ల నన్ను అవిదేయుడై వుండమంటారా.'
    'పోనీలే నాయనా మంచితనానికి నా కొడుకుని మరోసారి గుర్తుకు తెస్తున్నావు. ఆస్తి చూసుకో యిక్కడే వుండి.'
    శ్రీకాంత్ రెండు చేతులూ జోడించాడు. 'ఒద్దు . నన్ను బుణగ్రస్తుడిని చేయద్దు. డబ్బు తీసుకున్నాక నా అంతరాత్మ వూరుకోదు. మీకు ఏదో ఒకటి చేసి యీ బుణ భారాన్ని తగ్గించుకో మంటుంది. నేను రాలేను కనుక ఆ విధంగా చేయలేను. నీటి మీది తెప్ప పైన వో కాలూ, ఒడ్డున వో కాలూ వేసి నేను ప్రయాణం చేయలేను, యిన్నేళ్ళూ ఈ సమాజం అమ్మనీ, నాన్నగారినీ గురించి పరోక్షంగా యెన్నో మాటలంది. ఈ కలకత్తా నగరం లో యెవరూ ప్రత్యక్షంగా అనేందుకు అవకాశం కలగలేదు.'
    'నేనే మీతో వస్తే నాన్నగారి పరువు ప్రతిష్టలు గాలిలో కలిసి పోతాయి. అయన పరువు కాపాడడం నా విధి. యిక్కడో అక్కడో వుండాల్సిన వాడిని నేను. యిక్కడా అక్కడా కూడా వుంటే యిప్పుడు నేనే ఆయన్ని బజారు కెక్కించిన వాడిని అవుతాను. నేనాపని చేయలేను. నన్ను క్షమించండి. ' అనేసి కళ్ళల్లో నీళ్ళు పైకి రాకుండా శ్రీకాంత్ వీధిలోకి వెళ్ళి పోయాడు.
    దీక్షితులు సర్వమూ పోగొట్టుకున్నవాడి మాదిరిగా చేతి సంచీ తో చటర్జీ యెంత బ్రతిమాలాడుతున్నా వినిపించు కోకుండా కదిలి వెళ్ళిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS