"ఇంక నువ్వేమీ ఆలోచించకు బావా! రేపోక్క పూట సెలవు పెట్టేయ్. వెళ్ళి మాట్లాడోచ్చేద్దాం. మొత్తం డబ్బులన్నీ ఒక్కసారే కట్టక్కర్లేదట. పైగా మనోడి మార్కులు చూసి డిస్కౌంటు కూడా ఇస్తారు." అన్నాడు వంశీ.
* * *
మధ్య తరగతి మారుతీ కారులో ముగ్గురూ కాలేజీ క్యాంపస్ లో కెళ్ళారు. అతి కష్టం మీద ఓ చెవర్లేట్ కీ బెంజి కారుకి మధ్య కూసింత పార్కింగ్ జాగా దొరికింది. ఆన్ని కార్లున్నాయి మరి.
ముగ్గురూ లోపలికెళ్ళారు. పెద్ద హాలు . గందరగోళంగా ఎవరి గోలలో వాళ్ళున్నారు.
అందమైన ఓ ముప్పై ఏళ్ళ యువతి వచ్చి మూర్తికి షేక్ హ్యాండిచ్చి చిరునవ్వు నవ్వింది. టక్ చేసుకుని, టై కట్టుకున్న ఒకతను ఇందిరకు నమస్తే చెప్పాడు. పద్దెనిమిదేళ్ళ ఓ అమ్మాయి వంశీ భుజం మీద చెయ్యేసి "రండి" అంది చనువుగా. నడుస్తూనే పరిచయాలు అయ్యాయి.
మూర్తి పక్కనున్న యువతి అడిగింది "ఏ గ్రూపు?"
"ఎ పాజిటివ్ " అన్నాడు మూర్తి కాస్త తడబడుతూ. ఆమె నవ్వి "బ్లడ్ గ్రూప్ కాదు. మీ అబ్బాయి తీసుకునే గ్రూపు " అంది.
"అదా ! ఏమ్ పీసీ ' చెప్పాడు.
ఓరగా ఇందిర వైపు చూశాడు మూర్తి. జీవితంలో ఇక పరాయి మొగాడితో మాట్లాడం కుదరదేమో అన్నంత ఉత్సాహంగా నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుతోంది టైగాడితో. వంశీ అయితే అసలీ లోకంలోనే లేడు.
ఇరవై రెండేళ్ళ వెధవ ..... ఇంకా జీవితంలో సేటిలవలేదు. ఏమిటీ ఇకిలింపులు సకిలింపులు ఆ అమ్మాయితో?
"అసలు ఈ కార్పోరేట్ కళాశాలల పద్దతే వేరు. ఎంత గొప్పగా రిసీవ్ చేసుకున్నారో చూశారా ?" అంది ఇందిర మూర్తి చెవిలో రహస్యంగా.
ఎమ్ డి రూమ్ దగ్గర సోఫాల్లో ఓ పాతిక మంది వెయిట్ చేస్తున్నారు. చేతుల్లో టోకెన్లు పెట్టుకుని, వీళ్ళు కూడా టోకెన్ తీసుకున్నారు. మూర్తితో వచ్చినావిడా, ఇందిరతో వచ్చినాయనా సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. వేరే జంట అన్వేషణలో, వంశీ పక్కన అమ్మాయి వాళ్ళతో "మీరెళ్ళండి. నేను వీళ్ళకు క్యాంపస్ అంతా చూపించి వస్తాను." అంది. తన పేరు పుష్యగామిట.
అదేం పేరు? జలాంతర్గామిలా అనుకున్నాడు మూర్తి.
"మనవంతు వచ్చేసరికి ఇంకా గంట పడుతుంది. రండి. అలా తిరిగొద్దాం' అంటూ లేచి వంశీకి చెయ్యందించింది. వంశీ చటుక్కున లేచాడు. ఆ అమ్మాయి చెయ్యి వదలకుండానే "పధండక్కాయ్ " అన్నాడు.
వరండాలో నడుస్తున్నారు. అటూ ఇటూ క్లాసు రూములు. చాలా నిశ్శబ్దంగా ఉంది.
"ఇదేమిటి? టీచర్లు పాఠాలు చెప్పట్లేదా? క్లాసులన్నీ సైలెంటుగా ఉన్నాయి?" అన్నాడు మూర్తి.
పుష్యగామినవ్వి ఒక క్లాసు రూము విండో దగ్గర ఆగింది. టీచరమ్మ జాకెట్టుకి గుచ్చి, ఒక కాలర్ మైక్ ఉంది. అది వైర్ లెస్ మైకుట. స్టూడెంట్లందరికీ తల మీద చిన్న సైజు హెల్మెట్ లాగా ఇయర్ ఫోన్లున్నాయి. ఆవిడ రహస్యంగా పాఠాలు చెపుతోంది. మూడో చెవి వాడికి వినబడకుండా. ఆవిడ మాటలు స్టూడెంట్స్ చెవుల్లో బాగానే వినపడతాయట. ఎందుకిలా అంటే సౌండ్ పోల్యుషన్ తగ్గించటానికట.
మూర్తి గమనించాడు. సగం మందికి పైగా పిల్లలకి కళ్ళద్దాలున్నాయి.
తను చిన్నప్పుడు చదువుతున్న స్కూలు జ్ఞాపకం చేసుకున్నాడు మూర్తి. హాయిగా , ఓ పెంకుటింట్లో ..... పిల్లల సందడి, టీచరమ్మ గదమాయింపులు, కిటికీ లోంచీ బయటకు చూస్తె పచ్చటి చెట్లూ, క్లాసు రూముల్లో గూడులు కట్టుకుని స్వేచ్చగా లోపలికి వస్తూ పోతూ కిచకిచమని శబ్దాలు చేసే పిచ్చుకలు ..... ఇక్కడేంటి? మాటా పలుకూ లేకుండా! ఈ ఇంటర్ మీడియట్ పిల్లలకు పెద్దబాల 'శిక్ష' లాగుంది.
హాస్టల్ దూరంగా కనిపిస్తోంది. కిందకు దిగారు. ఇందాక కనిపించలేదు గానీ, ఒక గది ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఆ గది పై గడపకి "కొట్టుడుగది' - అని రాసి వుంది. లోపల ఓ నలబై ఏళ్ళ ఆవిడ కూర్చుని ఉంది. వెనకాల గోడలకి పూర్వకాలంలో రాజుల కోటల్లో గోడలకి ఇంటూ మార్కులాగా ఖడ్గాలు వ్రేలాడుతున్నట్లు బెత్తాలు వ్రేలాడుతున్నాయి. ఆవిడ ఒక బెత్తానికి షార్పుగా పదను పెడుతోంది.
అప్పుడే ఒక విద్యార్ధి లోపలకు వచ్చాడు. బిక్కమొహం వేసుకుని, వాళ్ళ క్లాసు టీచర్ ఇచ్చిన చీటీ ఆమెకు చూపించాడు.
ఆవిడ టేబుల్ పక్కన కన్ ఫేషన్ బాక్సు లాంటిది ఉంది. ఆమె సౌంజ్జ చేయగానే ఆ బాక్సులో కెళ్ళి నిలబడ్డాడు ఆ కుర్రాడు.
"ఊ .... చెప్పు ఏం చేశావు?' అంది. ఆ కుర్రాడు భయపడుతూ "ఈరోజు క్లాసుకి జామెట్రీ బాక్సు తెచ్చుకోలేదు మేడమ్" అన్నాడు.
"ఊ.... ఇంకా ?"
"లంచ్ బాక్సులో కంపల్సరీగా ఓ యాపిల్ పండు తెచ్చుకోవాలని రూలుంది గదా మేడమ్! మా డాడీ పొద్దున్నే స్కూటరేసుకుని ఊరంతా తిరిగారు. ఎక్కడా దొరకలేదు . అందుకనీ ...."
'అంతేనా? ఇంకేమైనా చేశావా!"
"టీచర్ ల్యాబ్ కెళ్ళి ఐదు నిమిషాల్లో తిరిగొచ్చారు. ఆ లోపల నేను నరేష్ ని రాంగోపాల్ వర్మ భూత్ చూశావా అని అడిగానండీ"
"ఊ.... సరే బయటకురా" అని చాలా కూల్ గా, ప్రొఫెషనల్ గా బెత్తం తీసుకుని తొమ్మిది సార్లు ఎడాపెడా కొట్టింది. తర్వాత ఓ స్లిప్పు మీద ఏదో రాసి, స్టాంపు వేసి, "మీ టీచర్ కివ్వు' అని మళ్ళీ బెత్తం సాన పెట్టుకుంటోంది. ఆ కుర్రాడు నీళ్ళు నిండిన కళ్ళతో వెళ్ళిపోయాడు.
