అయితే అప్పటికి వెలుగోటి రాయపనాయకుడు రాజమండ్రి వద్ద అల్లా రెడ్డి (కాటయవేమునితో వియ్యమందిన దువ్వూరి రెడ్డిరాజు)తో సతమతమౌతున్నాడు. పోలవరానికి రాజైన అన్నెచోరుడు (సోమదేవుని తండ్రి) కూడా రాజమండ్రి రాజకీయాలలోనే మునిగి తేలుతున్నాడు. అందువల్ల సోమదేవుడు అనివార్యంగా యక్కటి వీరుడయినాడు. అతడు సహజంగానే యక్కటివీరుల్లో సమర్థుడనిపించుకున్నవాడు.
విజయనగర సైన్యాలు అశ్వప్రధానంగా వున్నాయి. బహమనీ సుల్తానులు అశ్వప్రధానమయిన సైన్యబలంతో యుద్ధాలు చేస్తారు. వారిని ఎదిరించటానికి కావలసిన అశ్వబలాన్ని విజయనగరం వారూ అప్పటికి వృద్ధిచేస్తున్నారు. అప్పటి యుద్ధ తంత్రమది.
కాని కొండవీడు వారికి అశ్వబలం తక్కువ. యక్కటి వీరునికి జీతగాండ్రూ, నగర రక్షక దళమూ అందరూ సాధారణ యుద్ధం (నేలమీద నిలచి పోరాటం) లో నిపుణులే. కాని అశ్వాలమీద వారిని చంపటం వీరికి కష్టసాధ్యమైన విషయం.
సోమదేవుడు అశ్వంమీద అధిరోహించి సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నాడు. చౌండ సామత్యుని ఖడ్గ ప్రహారానికి కొండవీటి సైన్యాలు కూడా కకావికలమయిపోతున్నాయి. సోమదేవునితో ద్వంద్వయుద్ధానికి చౌండవ నాయకుడూ, చౌండవ నాయకునితో యుద్ధానికి తలపడాలని సోమదేవుడూ ఉవ్విళ్ళూరుతున్నారు. ఆ సమయం ఆసన్నమయింది.
"అఖండ విజయనగర మహాసామ్రాజ్య సేనానులకు స్వాగతం. సుస్వాగతం" వ్యంగ్యంగా కవ్వించాడు సోమదేవుడు.
"రసిక రాజులకు రణరంగ మెందుకో" అన్నాడు చౌడప నాయకుడు. సోమదేవుడు సూర్యునివలె మండిపడ్డాడు. "కాటయవేముడు, కొమరగిరితోనే కొండవీటిలో రసిక రాజ్యం అంతమయింది. మీ ప్రౌఢదేవరాయలు కొండవీటి చేవ తెలిసినవాడే! అందువల్లనే ఆనాడు కుమార్తె హరిహరాంబిక నిచ్చి కాటయవేమునితో కలిశాడు. ఇప్పుడు మీరు మాకిచ్చే బహుమానమేదయినా ఉన్నదా?" అంటూ యెత్తిపొడిచాడు సోమదేవుడు. చిటపటలు ఇప్పుడు చౌండపనాయకుని వంతయింది. మౌనముఖంతో సమర్థించుకునే దారిలేక ఉగ్రుడై తారసిల్లాడు. 'మీకు మేమిచ్చే బహుమతి స్వర్గప్రాప్తి మాత్రమే" అంటూ సోమదేవునిపై విరుచుకు పడ్డాడు. అతని ఖడ్గ ప్రహారం బలంగా వచ్చి దక్షిణ హస్తాన్ని ఛేదించేది. లిప్తపాటున ఆగంతుడయిన వొక యువకుని కరవాలం సోమదేవుని దక్షిణ హస్తాన్ని కాచింది. లేకపోతే బలమయిన ఆ దెబ్బకు సోమదేవుని కుడిచేయి తునాతునకలై వెళ్ళి కొండవీటిలో పడేది. అంతటితో ఆ యుద్ధానికీ, కొండవీటి యుద్ధానికీ భరతవాక్యం పలికేది. కాని ఆగంతకుడై వచ్చిన వీరకిశోరం సోమదేవుని ప్రమాదపాటును తప్పించింది. చౌండవ నాయకుడు ఆశించినది జరగకపోవటంతో నిశ్చేష్టుడయ్యాడు. ఒక క్షణంలో తేరుకుని జరిగినది గ్రహించాడు. అతని కోపం మిన్నుముట్టింది. చేతిలోని కరవాలాన్ని ఆ వీరకిశోరం మీదికి కసిగా విసిరాడు. అప్పటికే వెనుదిరిగి వెళ్ళిపోతున్న వీరకిశోరం వామపార్శ్వాన తొడలో నుండి సైంధవాశ్వం డొక్కలోకి దిగింది. కాని అది వెనుకంజ వేయలేదు. ప్రాణాలను బిగపట్టసాగింది. సోమదేవుడు చౌండవ నాయకుణ్ని వదలి ప్రాణదాత అయిన యువకుణ్ని వెంబడించాడు.
దివిటీలు వెలుగుతున్నాయి. నిశ్శబ్దమయిన అంధకారం దిక్కులవెంట రాజ్యం చేస్తోంది. ఒక గుడారంలో నుండి సన్నని మూలుగు వినిపిస్తోంది. ఆరోజు రణరంగంలో జరిగిన లాభనష్టాలను అంచనా వేసి, చారులు తెచ్చిన వార్తలు విని రేపటి కార్యాలను పురమాయించాడు సోమదేవుడు. యుద్ధంలో రెండుప్రక్కల వారికీ నష్టం సమంగా ఉన్నది. రేపటి యుద్ధానికి విజయనగర రాజులకు రాచకొండ, దేవరకొండల నుండి సహాయక సైన్యాలు రావాలి. మాచారెడ్డి కొండవీటి నుండి సహాయక సైన్యాలు తమకు రావాలి. ఈ సైన్యాలు యెవరికి ముందుగా వస్తే యీ యుద్ధంలో గెలుపు వారిదే! కొండవీటి రాజ్యానికి ఉన్న ఒకేఒక్క రేవు పట్టణం మోటుపల్లి. కనుక కొండవీటి వారికి యీ యుద్ధం ప్రతిష్టను తేల్చివేసే విషయం. ఈ ఆలోచనలన్నీ ముగిశాక అందరూ వెళ్ళిపోయారు. సోమదేవునికి చప్పున ఒక విషయం జ్ఞాపకానికొచ్చింది. పగలు తన ప్రాణాలను కాపాడిన యువకుడు గుర్రం మీదనే మూర్ఛపోయాడు. అతనిని ఆ సంరంభంలో సైనికులకు నప్పగించి గుడారంలో భద్రంగా చూడమని పంపాడు. ఆ వీరకిశోరాన్ని చూడాలనిపించిందిప్పుడు. అతని ముఖం చూస్తుంటే ఏదో అనుబంధం పెనవేసుకుంటున్నది. కాని వేగిరపాటుతో యీ విషయాలన్నీ తను అప్పుడాలోచించలేకపోయాడు. ఒక సేవకుడు దివిటీతో దారి చూపగా ఆ గుడారానికి బయలుదేరాడు సోమదేవుడు.
గుడారంలో నుండి మూలుగు వినిపిస్తోంది. సోమదేవుడు సేవకుడిని ద్వారం వద్ద వేచి వుండమని, తను లోనికి వెళ్ళాడు. లోపల కావలసినంత వెలుగు!
