అతడు తురగా రామయ్య మాటల వలలో పడిపోయి వున్నాడు. ఇప్పటికే రాచవేముని మాట శాసనంలా చలామణి అవుతోంది.
అతని దారుణమైన శాసనాలు ప్రజలకు కంటకంగా ఉన్నాయి. పురిటిమీద, వివాహాల మీద పన్ను విధించారు. అగ్రహారాల మీద కూడ పన్ను విధించారు. నగరంలో బానిసలుగా కందుకూరు యుద్ధం నుండి కొని రాబడిన వీర బలిజలు గుర్రమెక్కి తిరగరాదు. ఈ శాసనాన్ని ఆ యువకుడు ఉల్లంఘించాడు. రాచవేముని బంట్లు అతనిని దారుణంగా హత్యచేశారు. నవిరం ఎల్లయ్యకీ విషయం తెలిసి అతడూ అప్పుడే అక్కడికి చేరి ఈ దృశ్యం చూచాడు.
"ఒరేయ్ బానిస! నీవు ఆ శవాన్ని చూడటానికి వీలులేదు" అంటూ సైనికులు అతని అటకాయించారు.
"ఎందుకు?" అన్నాడు నవిరం ఎల్లయ్య.
"నీవు బానిసవు కనుక" సైనికుల సమాధానం.
"పుట్టుకతో ఎవరూ బానిసలు కారు. మీరు విధించే పన్నుల భారం భరించలేక మేము విప్లవం లేవదీశాం. కందుకూరు వద్ద మీరు కుట్రతో మమ్మల్ని బంధించి బానిసలను చేశారు. మేము ధర్మ యుద్ధంలో బందీలుగా చిక్కిన బానిసలం కాదు. మీరు పొట్టకూటికి ఆశపడి ఆ తురగా రాముడి చేతిలో చిక్కి బానిసలయ్యారు. కనుక మీరే బానిసలు అంటూ ఎదిరించాడు. సైనికులు ఒక్కుమ్మడి కత్తులు దూశారు. ఒకేసారి సందకత్తులు అతన్ని తునాతునకలుగా నరికివేసేవి. అప్పుడే సైంధవాశ్వాన్ని దిగిన యువకుడు అక్కడికి చేరి వాళ్ళను ఆపివేశాడు.
"నీవెవరు? మమ్మల్ని ఆపేందుకు?" సైనికుల ప్రశ్న.
"నవిరం ఎల్లయ్యకు చంపేందుకు మీరెవరు? మీకేమధికారముంది" అంటూ ప్రశ్నించాడు యువకుడు.
"ఇటువంటి వానిని, విప్లవకారుల్ని చూచిన వెంటనే నరికి వేయమని ఆజ్ఞ!" సైనికుల సమాధానం.
"ఎవరిచ్చారు మీకీ ఆజ్ఞలు రాజివ్వలేదే!" యువకుడిలా ప్రశ్నించటంతో చుట్టూ చేరిన వారిలో కలకలం బయలుదేరింది. సైనికుల ధైర్యంకూడా రవ్వంత సడలిపోయింది. యువకుడు వదలిపెట్టలేదు.
"ఎవరిచ్చారు మీకీ ఆజ్ఞ" అంటూ రాజఠీవి ఉట్టిపడేలా గద్దించాడా యువకుడు.
"యువరాజు రాచవేముని అనుమతిని తురగా రామయ్యగారిచ్చారు" సైనికులు క్రుంగిపోయారు.
"జగనొచ్చిగండ అరిమరాయలభాళ, సర్వజ్ఞ కొండవీటి రాజ్య రమా ధురంధరులైన చినకోమటి వేములు సింహాసనంపై ఉండగా మీరు తురగా రాముని మాటను ఆజ్ఞగా పాటిస్తారా? ఇది రాజ దోహం కాదా? మీకేమిటి శిక్ష? ఉరిమాడతను. ఈ మాటతో సైనికుల గుండెలు తల్లడిల్లాయి. ప్రజలకూ, సవిరం ఎల్లయ్యకూ ఎక్కడలేని ధైర్యం వచ్చింది. సవిరం ఎల్లయ్య కనుసైగతో ప్రజలు సైనికులను ముట్టడించడం ప్రారంభించారు. ఈ దృశ్యానికి హడలిపోయిన సైనికులు బలిజ వీరకిశోరాల ధాటికి తట్టుకోలేక పారిపోసాగారు. బలిజవీరులంతా వెంబడించి తరుముతూ పోయారు.
ఇక అక్కడ మిగిలింది శవం మీదపడి విలపించే వృద్ధురాలైన తల్లీ, సవిరం ఎల్లయ్యా, సైంధవాశ్వం ఎక్కి వచ్చిన సుకుమారుడైన యువకుడూ, రెండు గుర్రాలు మాత్రమే.
"వీరకిశోరమా! నీ పేరేమిటో అడగవచ్చునా?" అన్నాడు సవిరం ఎల్లయ్య. ఆ యువకుడు తల అడ్డంగా త్రిప్పి కూడదని సైగ చేశాడు.
ఆ వృద్ధురాలైన తల్లి దగ్గరకు వెళ్ళి మోకాళ్ళమీద కూర్చుని "అమ్మా!" అని సంభోదించాడు. ఆ పిలుపుతో చనిపోయిన కుమారుడు బ్రతికి వచ్చినట్లే భ్రాంతిపడి ఆ తల్లి తలెత్తి చూసింది.
"అమ్మా నీకు జరిగిన నష్టం ఎవరూ తీర్చలేనిది. కాని ఈ విషయాన్ని నీవు రాజు దృష్టికి తీసుకుని వెళ్ళాలి. ఇకముందైనా ఇటువంటి అవాంచితాలు జరగకుండా ఉండాలంటే అంతకుమించిన దారిలేదు" అంటూ ఆమె వద్ద శలవు పుచ్చుకుని లేచాడు.
"మీ ప్రయాణం ఎక్కడికో అడగవచ్చునా?" ప్రశ్నించాడు సవిరం ఎల్లయ్య జంకుతూనే.
"మోటుపల్లి యుద్ధరంగానికి" అంటూనే చెంగున గుర్రం వీపుమీదికి గెంతాడు.
"మోటుపల్లి వరకూ కొండవీటి సైన్యాలు పోలేదు. నిన్నటి సంధ్యా సమయానికి కొండవీటి సైన్యాలు సోమదేవుని నాయకత్వంలో ఇనుకొల్లు వరకే వెళ్ళాయి (చౌండ సామాత్యుడు) చౌండవనాయకుడు ఇనుకొల్లు వద్దనే సోమదేవుని ఎదిరించాడు. విజయనగరవీరులు రణోత్సాహంతో ఉన్నట్లు వినికిడి" అని వివరించాడు సవిరం ఎల్లయ్య. ఆ మాట వింటూనే గుర్రంమీద కూర్చున్న వీరకిశోరం సింహగర్జన చేసి గుర్రాన్ని నగరానికి ఆగ్నేయంగా దౌడు తీయించింది. రెండు గడియల ప్రొద్దెక్కేసరికి ఆ యువకుడు ఇనుకొల్లు వద్ద యుద్ధరంగంలో వున్నాడు.
చౌండవ నాయకుడు వ్యూహరచనలో ధురీణుడు. అతనికతనేసాటి. అతని వ్యూహరచనా చమత్కారంతోనే బహమని సుల్తానులు విజయనగరం మీద కాలుమోపకుండా రక్షిస్తున్నాడు. అందువల్ల ప్రౌఢదేవరాయలుకు అతడత్యంత ప్రీతిపాత్రుడు కూడా. యువకుడయినప్పటికీ సోమదేవుడు అసాధారణ వ్యూహరచనా నైపుణ్యం కలవాడు.
యువకుడు యుద్ధరంగంలో కాలుమోపే సమయానికి విజయనగర సైన్యాలు వైష్ణవ వ్యూహంలోనూ, కొండవీటి సైన్యాలు శైవ వ్యూహంలోనూ కొట్లాడుతున్నాయి. వైష్ణవమంటే గారుడ వ్యూహం. విజయనగర రాజులు అన్ని సాంప్రదాయాలుగా గౌరవిస్తూ వచ్చేవారు. కొమరగిరి, కాటయవేముల కాలంలో కొండవీటి ప్రభువులూ వైష్ణవులే! కాని కోమటివేముడు శైవుడు. అది ఒకవిధంగా మతాలమధ్య వైమసస్యమని కూడ చెప్పవచ్చు. కానప్పుడు పలనాటి సీమను పాలించే వెలుగోటి రాయప నాయకుడు కొండవీటిని సమర్థించడు. అతని అండ కొండవీటికి కొండంత!
