Previous Page Next Page 
మిస్టర్ 'యూ' పేజి 20

 

    నాకు అర్ధం కావడం లేదు సర్"
    "అప్లయ్ యువర్ మైండ్! నీ మెదడు వుపయోగించు! బాడీలోకి ఈ నోనోబోట్లని ఇంట్రడ్యూస్ చేస్తాం. అవి ఆ ఆపరేషన్స్ కి ఎన్ని కోట్లు రోబోలు కావాలో తమకు తామే నిర్ణయించుకుని , ఆ సంఖ్యకి సరిపడే కొత్త రోబోలని తయారుచేసుకుని, పని పూర్తి చేస్తాయి.
    'అలా కాకుండా ...." అని సగంలో ఆగదు జ్ఞాని.
    ప్రశ్నార్ధకంగా చూశాడు అసిస్టెంట్ అనుచర్.
    మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు జ్ఞాని. 'ఆపరేషన్ కి సరిపడా రోబోలని తయారుచేసుకున్న తర్వాత, ఇంకా వాటి తయారీ ఆగిపోవాలి. ఒకవేళ అంతటితో రోబోల తయారీ ఆగకుండా అట్లా సాగిపోతూనే ఉందనుకుందాం - అప్పుడు బయోలాజికల్ కేన్సర్ బదులు బాడీకి మెకానికల్ కేన్సరు వస్తుంది ."
    "పాజిబుల్ " అన్నాడు అసిస్టెంటు.    
    "ఇంకో ప్రాబ్లం వుంది " అన్నాడు ప్రొఫెసర్ జ్ఞాని.
    శ్రద్దగా వింటున్నాడు అసిస్టెంటు.
    "ఈ రోబోలు బాడిలోకి ప్రతి ఇండివిడ్యువల్ కణాన్ని టాకిల్ చేస్తాయి. కణాలలోని మాలిక్యూలర్ స్ట్రక్చర్ ని కూడా అవి ఆవిధంగానే మర్చేయగలవు. కొన్ని ఎలిమెంట్స్ కొన్ని రకాలుగా కలిస్తేనే కదా పదార్ధాలు ఏర్పడతాయి. ఉదాహరణకు రెండు హైడ్రోజన్ అణువులూ , ఒక ఆక్సిజన్ అణువూ కలిస్తే నీరు ఏర్పడుతుంది.
    అలా కాకుండా , రెండు హైడ్రోజన్ అణువులూ, ఒక సల్పర్ అణువూ , నాలుగూ ఆక్సిజన్ అణువులూ కలిస్తే సల్ప్యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది.
    అట్లాగే కణాల మాలిక్యూలర్ స్ట్రక్చర్ ని మార్చేసి , ఈ మైక్రో మినీ రోబోలు యాపిల్ పండుని మనిషిగా మార్చగలవూ - మనిషిని యాపిల్ పండుగా మార్చగలవు కూడా.
    ఆ మాటకి వస్తే మనిషి శరీరంలోని కణాల మాలిక్యులార్ స్రక్చర్ ని మార్చేసి, మనిషిని రాక్షసుడిగా మార్చగలవు కూడా !" అన్నాడు సైంటిస్టు జ్ఞాని, డ్రమెటిక్ గా !
    

                           *    *    *

    "రా....క్ష....సు...డు " అంది కలలో కలవరిస్తున్నట్లుగా సృష్టి.
    మాట్లాడకుండా ఆటే చూస్తున్నాడు రాజు.
    అక్కడ వుంది నిజంగా రాక్షసుడేనా?
    లేక తన కళ్ళు తనని మోసగిస్తున్నాయా?
    ఇదంతా భ్రమా?
    కళ్ళు నులుముకుని చూశాడు రాజు.
    వాళ్ళు ఎక్కిన చెట్టు బాగా ఎత్తుగా వుంది.
    అక్కణ్ణుంచి చూస్తె టెలిస్కోప్ లో నుంచి చూసినట్లుగా కొన్ని కోలోమీటర్ల దూరం స్పష్టంగా కనబడుతోంది.
    అడవిలో ఒక వైపు నుంచి చిన్న ఏరు ప్రవహిస్తిన్న జాడ కనబడుతోంది.
    దాని ఒడ్డున --
    కనీసం ఏడెనిమిది అడుగుల ఎత్తు ఉందనిపించే ఒక ఆకారం !
    తల మీద జుట్టు ఒక ముళ్ళ కంపలాగా ఉంది !
    కనుబొమ్మల పై నుంచి పొడుచుకుని వచ్చిన కొమ్ములు !
    ఒళ్ళంతా ఎలుగ్గొడ్డుకు వున్నట్లు వెంట్రుకలు !
    బాన పొట్ట! కాళ్ళు దూలాల్లాగా వున్నాయి !
    మొలకు ఆకులూ, అలములతో చేసిన స్కర్టులాంటిది కట్టుకుని ఉంది.
    మెడలో మానవ కపాలాల మాల !
    అప్పుడు ఇంకో దృశ్యం కూడా కనబడింది రాజుకి.
    ఇంకొంతదూరంలో
    ఇందాక ఒక యువకుడు కావడి లో మోసుకు వెళ్తూ ఉండిన వృద్ద దంపతులు వున్నారు.
    ఉన్నట్లుండి పెద్దగా ఏడుపు మొదలెట్టారు వాళ్ళు.
    మరి -- ఆ యువకుడు ఏడీ?
    రాక్షసుడు ఆ వృద్ద దంపతుల వైపు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నడవడం మొదలెట్టాడు.
    "సృష్టి ! నువ్విక్కడే ఉండు -- నేను వెళ్ళి ఆ ముసలి వాళ్ళను కాపాడతా!' అన్నాడు రాజు.
    "నీకేం పిచ్చి! వాడు రాక్షసుడు! ఉత్త చేతులతో వెళ్ళి వాడితో తలపడతావా?" అంది సృష్టి కంగారుగా.
    "ఉత్త చేతులే అని చేతులు ముడుచుకు కూర్చోకూడదు సృష్టీ! చేతలు మొదలెడితే చేతులకి బలం దానంతట అదే వస్తుంది " అన్నాడు రాజు.
    "అయితే నేనూ నీతోనే వస్తాను !"
    "నా సలహా అయితే వద్దనే !"
    అంటూనే త్వరత్వరగా చెట్టు దిగి , రాక్షసుడు ఉన్న వైపు వేగంగా పరిగెత్తడం మొదలెట్టాడు రాజు. అతని వెంటే పరిగెత్తింది సృష్టి.
    వాళ్ళకి వ్యతిరేక దిశలో వడివడిగా వస్తున్న ఇందాకటి యువకుడు వాళ్ళని తగిలాడు. ముగ్గురూ కింద పడ్డారు.
    లేచి నిలబడ్డాక , "ఏమయింది ?" అని అడిగాడు రాజు అతన్ని.
    "అన్నా , మా అమ్మా నాయనలని రాక్షసుడెత్తుకెళ్ళి పోయాడన్నా !" అన్నాడతను ఏడుపు గొంతుతో.
    "అవును -- అది నాకూ కనబడింది. - పద -- రక్షిద్దాం! " అని పరిగెత్తాడు రాజు.
    కొద్ది నిమిషాల తర్వాత రాక్షసుడు ఉన్న చోటుకి చేరుకున్నారు.
    ఏదో ప్రమాదం ముంచుకొచ్చిందని గ్రహించిన వృద్దులు రోదిస్తున్నారు.
    పక్కన నిలబడి వాళ్ళని చూస్తున్నాడు రాక్షసుడు . తప్పించుకోలేకుండా దొరికిపోయిన కప్పని పాము చూస్తున్నట్లుగా.
    ఒడుపుగా రాక్షసుడిమీదకి లంఘించాడు రాజు.
    ఆ ఫోర్స్ కి చచాన్రోయ్ దేవుడోయ్ ! అని కేక పెట్టి మొదలు నరికిన చెట్టులాగా విరుచుకు కింద పడ్డాడు రాక్షసుడు !"
    "అరె! రాక్షసుడికి తెలుగొచ్చే!" అంది సృష్టి ఆశ్చర్యంగా.
    కాలుతో రాక్షసుడిని పుట్ బాల్ ని తన్నినట్లు ఒక్క తన్ను తన్నాడు రాజు.
    "మనుషుల్ని పొట్టన బెట్టుకుంటావురా - అందులోనూ ముసలి వాళ్ళని!' అన్నాడు ఆగ్రహంగా.
    ఒణుకుతూ లేచి కూర్చున్నాడు రాక్షసుడు.
    "నేను మనుషుల్ని తినడం ఏమిటి సార్! నేను ప్యూర్ వెజ్ . కోడి గుడ్డు కూడా తినను. ఇందాక లంచ్ బ్రేక్ లో కూడా ఉత్త పప్పు అన్నమూ, పెరుగన్నమూ తిన్నా -- నన్ను వదలండి బాబో నాకు షూటింగుకి టైమయిపోతోంది." అన్నాడు ఏడుపు గొంతుతో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS