Previous Page Next Page 
మిస్టర్ 'యూ' పేజి 19

 

    అప్పటికే ఒకసారి ఆ చెట్టు మీదికి ఎక్కి దిగి వుండడం వల్ల సులువు తెలిసిన రాజు. ప్రయాస పడుతున్న సృష్టి ని భుజం మీద వేసుకుని చులాగ్గా చెట్టు ఎక్కేశాడు.
    తను కూడా చెట్టు మీదికి ఎగబాకపోయింది పులి. కానీ చేతకాలేదు. ఆరంగుళాల తేడాతో అతని పాదాన్ని మిస్సయి పోయి మాను మీద నుంచి మళ్ళీ నేలమీదకి దూకి, వాళ్ళ వైపే చూస్తూ ఉండిపోయింది.
    "ఇది పెద్దపులి కాబట్టి బతికిపోయాం! ఇదే గనుక చిరుతపులి అయి ఉంటే అది కూడా చెట్టేక్కేసి వుండేది. చచ్చే చావు అయి వుండేది" అన్నాడు రాజు తేలిగ్గా.    
    "భయపడ్డావా సృష్టి ?" అన్నాడు అభిమానంగా ఆమె వెన్ను నిమురుతూ.
    "పక్కన నువ్వుంటే ఇంకా నాకేం భయం ?" అంది సృష్టి ఎంతో థిలాసాగా.
    పులి కాస్త వెనక్కి వెళ్ళి ఒక తాటి చెట్టు దగ్గర ఆగి, వాళ్ళు బాగా కనబడే లాగా పొజిషన్ వెదుక్కుని కంఫర్టబుల్ గా కూర్చుంది.
    "ఈ పులి ఇక్కడే బిచాణా పరుస్తుందా ఏం?" అంది సృష్టి విసుగుగా. అంతలోనే ఏదో తట్టినట్లుగా "ఈ ప్రాంతంలో పెద్ద పులులు వుండడానికి ఆస్కారం లేదే! పెద్ద పులి అన్నదానిని కనబడకుండా చంపేశాడు మనిషి. పాపం! పులి! కొబ్బరిచెట్లూ, అరటి చెట్లూ ప్రతిభాగం మనిషికి పనికి వచ్చినట్లుగా , పెద్ద పులి కూడా అంతే! దాని తోలు తీసి ఇంటర్నేషనల్ మార్కెట్ లో లక్షలకి అమ్ముతారు.
    గోళ్ళు పీకి లాకెట్లలో పెట్టి మెళ్ళో వేసుకుంటారు.
    దాని ఎముకలతో తయారు చేసిన మందులు వాడితే మగతనం పెరుగుతుందని ఒక నమ్మకం ఉంది.  
    "పులి రక్తంతో పూజలు చేయిస్తే , పదవి దక్కుతుందని క్షుద్రపూజలు చేయించిన పాపాత్ములు కూడా వున్నారు కదా!" అన్నాడు రాజు.
    "పొతే -- ప్రాక్టికల్ కాదు గానీ , పాలన్నీటిలోకి పులిపాలు శ్రేష్టం! గేదె పాలు కంటే ఆవు పాలు, ఆవుపాల కంటే గాడిద పాలు, గాడిద పాల కంటే పులిపాలు శ్రేష్టం అంటారు" అంది సృష్జ్తి.
    "అయ్యప్పని పులిపాలు తెమ్మనే కదా అతని శత్రువులు పంపేది." అన్నాడు రాజు.
    "ఏది ఏమైనా కూడా ఇది పెద్దపులులు ఉండే ప్రాంతం కాదు. కానీ ఇక్కడ పెద్ద పులి ఒకటి కనబడుతోంది. ఇంకో విశేషం గమనించారా రాజ్?" అంది సృష్టి .
    "ఏమిటి ?"
    "ఆ పెద్దపులి మన వెంట బడింది గానీ, పులి అరుపు ఒక్కసారీ వినబడలేదు. కనీసం మనం దొరకలేదన్న డిసప్పాయింట్ మెంట్ తో నన్నా అరిచి ఉండాలి కదా!"
    "ఏమో! దాని మూడ్ ఎట్లా వుందో ! చెప్పలేం !" అన్నాడు రాజు.
    ఆలోచిస్తున్నట్లుగా పులి వైపే చూస్తూ ఉండిపోయి, తర్వాత అంది సృష్టి.  
    "పాముని చూసి , మనిషికి యెంత భయమో మనిషిని చూస్తె పాముకి అంతే భయం'! ఇవాళ మనిషి కనబడకుండా వుంటే బావుంటుంది అని పాము లేవగానే ప్రార్ధన చేసుకుంటుందిట. అట్లాగే పులి కూడానూ. మనిషికి పులిని చూస్తె ఎంత భయమో , పులికి మనిషిని చూసినా అంతే భయం! తనకి సహజ ఆహారమైన జిఅకలు దుప్పులూ మొదలైనవాటిని వేట్టాడలేనప్పుడు మాత్రమే మనిషిని తినడం మరుగుతుంది పులి.
    ఆంటే, వృద్దాప్యం వల్ల పళ్ళు వూడిపోయి , గోళ్ళు వూడిపోయి , పరిగెత్తలేని అశక్తత వల్లా జంతువులను వేటాడ లేనప్పుడు , సులభంగా దొరికే మనిషి మీదికి మళ్ళుతుంది దాని దృష్టి. ఒక్కోసారి వేటగాళ్ళు పులిని చంపాలని చూస్తారు. అది చావదు. కానీ దెబ్బలు తగిలి వుంటాయి. పరిగెత్తలెని స్థితి వస్తుంది. అదీకాకపోతే లూజుగా వుండే ముళ్ళపంది ముళ్ళు ఊడి పులి వంట్లో దిగబడతాయి. ముళ్ళపంది ముళ్ళు సూటిగా దిగబడదు. అది వంట్లోకి వెళ్ళాక అర్ధచంద్రాకారంగా మాలుపు తిరిగి అక్కడే ఇరుక్కుపోతుంది. గాయం సెప్టిక్ అవుతుంది. అందుకని ముళ్ళపందికి భయపడుతుంది పెద్ద  పులి. ఇవన్నీ ఒక పులి మాన్ ఈటర్ గా మారడానికి కారణాలు కావచ్చు" అంది.
    "అయితే ఇది మాన్ ఈటర్ అంటావా?" అన్నాడు రాజు.
    "చెప్పలేం -- అయినా ఈ పులి ఇంకెంత సేపు ఇట్లా కాపు వేస్తుంది ?" అంది సృష్టి బోర్ గా.
    అంతలో ఒక తమాషా జరిగింది.
    తాటిచెట్టు కింద పులి కూర్చుని ఉంది. ఆ తాటి చెట్టు పైనే ఒక ఎలుగు బంటి ఎక్కి వుంది. తాటి చెట్టుకి కుండ కట్టి వుంది. అందులో తాటి కల్లు వుంది. ఆ కల్లు తాగడానికే తాటిచెట్టు ఎక్కింది ఎలుగుబంటి.
    కల్లు తాగిన మత్తులో అప్పటిదాకా తాగుతున్నదల్లా పట్టుతప్పి ఒక్కసారిగా దభేలుమని కింద వున్న పులి మీద పడింది ఎలుగుబంటి.
    పులి అదిరిపడి పొదల్లోకి పరిగెత్తింది.   
    "ఇప్పుడు కూడా అరవలేదు చూశావా?" అంది సృష్టి ఆలోచనగా.
    "రాక్షసమాయ అయి వుండవచ్చును" అన్నాడు రాజు.
    ఇద్దరూ నవ్వుకున్నారు.
    హటాత్తుగా రాజు నవ్వు ఆగిపోయింది.
    "నిశ్శబ్ధం !' అన్నట్లుగా చూపుడు వేలుని నోటిమీద పెట్టుకుని సైగ చేసి, చూడమన్నట్లుగా ఒక వైపు తల ఎగరేశాడు రాజు.
    అటు వైపు చూసింది సృష్టి . తక్షణం ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి.

                                         *    *    *  

    సైంటిస్టు జ్ఞాని తో అన్నాడు అసిస్టెంటు అనుచర్.
    "సర్! మీరు అత్యంత సూక్మమైన సైజులో వుండే మైక్రో మినీ రోబోలు తయారు చేశారు. వాటిని మనిషి శరీరంలోకి పంపిస్తే అవి ప్రతి కణాన్ని పరిశీలించి, వాటిలో ఏదైనా డిఫెక్ట్ వుంటే సరి చేయగలదని చెప్పారు -- అట్లాగే అవి మినీ డాక్టర్లలాగానే కాకుండా, మినీ ఇంజనీర్టలాగా ఆనకట్టలూ, ఆకాశ హర్మ్యాలు కూడా కట్టగలదని చెప్పారు. ఆ పనులు చేయడం కోసం తమలాంటి మైక్రో మినీ రోబోలని అసంఖ్యాకంగా తయారుచేసుకోగలదని చెప్పారు. అయితే -- ఇందులోనే ఒక డేంజరు ఉందని కూడా చెప్పారు కదు సర్! ఆ డేంజరు ఏమిటి ?"
    "అనుచర్! టెక్నాలజీ తో వచ్చిన చిక్కే ఇది. ఈ నోనోబోట్ ల పవరు పోజిటివ్ గానూ పనికి వస్తుంది. నెగటివ్ గా వికటించవచ్చును కూడా!"
    "అంటే?" అన్నాడు అనుచర్.
    నిట్టూర్చి చెప్పడం మొదలు పెట్టాడు ప్రొఫెసర్ జ్ఞాని.
    "అనేకానేకమైన మెడికల్, ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ ఈ నోతోబోట్ల సామర్ధ్యం వల్ల సాల్వ్ కావచ్చును. ఇప్పుడు మనుషులని పీడిస్తున్న రోగాలన్నీ మటుమాయం కావచ్చును -- కానీ సరికొత్త మెకానికల్ జబ్బులు రావచ్చును కూడా !"
    "యెట్లా?"
    "ఉదాహరణకి - ఒక మనిషికి కేన్సరు వాస్తుంది. కాన్సరు అంటే ఏమిటి ? కారణం ఏమిటో తెలియకుండా , ఒక శరీర భాగంలోని కణాల సంఖ్య , కంట్రోలు తప్పి అపరిమితంగా పెరిగిపోవడం మొదలవుతుంది. అట్లా అసంఖ్యాకంగా పెరిగిపోమ్మని ఆ కణాలకు అజ్ఞ ఎట్లా ఏవిధంగా అందుతుందో ఇంకా పూర్తిగా అవగాహన కాలేదు. నిజమే! జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా చాలా రకాల కాన్సర్లని అదుపు చేయగలుగుతున్నారు.  అయినా ఇంకా చాలా రకాల కేన్సర్లు మనిషికి లొంగడం లేదు" అన్నాడు జ్ఞాని.
    "ఇప్పుడీ నోనోబోట్ లు బయోలాజికల్ కేన్సర్ ని అదుపులో వుంచుతాయి -- కానీ, ఈ నోనోబోట్ ల వల్లే మనిషికి మెకానికల్ కేన్సరు రావచ్చును ."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS