Previous Page Next Page 
డేంజర్ డేంజర్ పేజి 19

   
    "నిజమే కాని....కాని...."    
    "ప్లీజ్ చెప్పవా? పోనీ ప్రమాదం ఎవరివల్లోచెప్పు."    
    "గోమతి నిన్ను నే ప్రేమిస్తున్నాను అయినా ఎప్పుడూ లిమిట్ దాటలేదు. అలాగే నేనో జాబు చేస్తున్నాను వాళ్ళని మోసగించలేను."    
    "నీ మాటలు నాకర్ధం కావటం లేదు కమల్."    
    "కాకపోవటమే మంచిది."    
    "అలా అనకు కమల్ ఏ క్షణంలో మనం కల్సుకున్నామో అప్పుడే నేన్నీ అర్ధభాగాన్ని అయ్యాను. నీమంచి చెడుల్లో నన్నూ భాగం పంచుకోనివ్వు. నా స్వీట్ కమల్ ప్లీజ్ కమల్ చెప్పవా?" గోమతి ముద్దులు పలుకుతూ కీర్తి మెడచుట్టూ చేతులేసి బలంగా తనకేసి అదుముకుని రెచ్చగొట్టేటట్లు చూసింది.    
    కీర్తి నిజమైన మగాడిలా ఆవేశం పట్టలేనట్లు గోమతిని మరింత దగ్గరగా లాక్కుని నుదుటిమీద గాఢంగా ముద్దు పెట్టుకుంది "నే చెప్పింది విని నాకు దూరం కావద్దు గోమతీ నే భరించలేను" అంది.    
    "నీవు నా ప్రాణం కమల్, చెప్పు ఏదయినా సరే భరిస్తాను" కీర్తి వడిలోకి జారిపడుకుంటూ అంది గోమతి.    
    గోమతి తల నిమురుతూ గోమతే సర్వస్వం అన్నట్లు ముఖంపెట్టి కీర్తి చెప్పటం మొదలుపెట్టింది.    
    "గోమతి! నేను ఇదివరకు నీకు చెప్పిన కధ అబద్దం, నిజమైన నా కధ ఇది....మొదట్లో నేనేమీ లేనివాడిని. వారాలు చేసుకుని బి.ఏ పాసయ్యాను. ఉద్యోగం లేదు ఎన్ని విధాల కష్టపడాలో అన్ని విధాల కష్టపడ్డాను. కడుపు నిండేది కాదు. ఓ రోజు అన్యాయంగా దొంగతనం నాపై మోపబడి జైలు కెళ్ళాను. అక్కడ డాంగే అనేవాడు నా మిత్రుడయ్యాడు. మంచితనం కన్నా వంచనా మోసం బ్రతుకు తెరువు చూపిస్తాయని గ్రహించాను. జైలు నుంచి బయటకు రాగానే డాంగే చూపిన జాబ్ లో చేరాను"    
    "ఏమిటా జాబ్!" ఆతృతగా అడిగింది గోమతి.    
    "దేశాన్ని సుభిక్షం చేసేది, నిరుద్యోగులకు కల్పతరువు, మరో ప్రభుత్వం సమయం చూసి ఈ మరో ప్రభుత్వం ఇప్పుడున్న వాళ్ళను పడగొట్టి గద్దె ఎక్కేది."    
    "మరో ప్రభుత్వం అంటే దీనికో వూరు పేరు లేదా?"    
    "ఉంది." అని ఆలోచిస్తున్నట్లు ఆగి పోయి నెమ్మదిగా అంది కీర్తి "స్పైడర్".    
    "ఏమిటి?" ఆశ్చర్యంతో కనుగుడ్లు పెద్దవి చేసి అడిగింది గోమతి.
    "స్పైడర్ అంటే అర్ధం కాలేదా? సాలెపురుగు మా బాస్ చేసేదంతా మంచిపనులే అందరూ బాస్ అడుగుజాడల్లో నడిస్తే చాలు దేశంలో నిరంకుశత్వం వుండదు. నిరుద్యోగం వుండదు బాస్ సాలెపురుగు లాంటివాడు. బాస్ నివాసం పేరేమిటో తెల్సా! కాబ్ వెబ్ అంటే సాలెగూడు. మా బాస్ మీదకు ఎవరైనా వెళితే అదీ దొంగచాటుగా సాలెగూటిలో ఇరుక్కున ఈగలా చావాల్సిందే. మాబాస్ స్పైడర్ వద్ద ఓ యంత్రముంది. ఆ యంత్రంలో చిక్కుకుంటే ఇంతే సంగతులు మరి. మన దేశంలో కొత్త ప్రభుత్వం రావాలని ఎందరో ఎదురు చూస్తున్నారు. వారిలో నేనొకడిని. నాలాంటి వారిని బాస్ చేరదీసి మంచి ఉద్యోగాలిప్పిస్తాడు. నేనిప్పుడు మంచి జాబ్ చేస్తున్నాను. ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టిలో మా బాస్ మేము దేశ ద్రోహులం. అంతే చాలుగా వివరాలు గోమతి."    
    నొసలు ముడివేసి కళ్ళార్పకుండా కీర్తిని చూస్తూ కీర్తి చెప్పేది శ్రద్దగా వింటున్న గోమతి "విమానంలో ఎందుకు ప్రయాణిస్తున్నట్లు?" అంది.    
    "ముందు నా ప్రశ్నకి జవాబివ్వు నేచేస్తున్నది తప్పా నా కధ విని నీకేమని పిస్తున్నది."    
    "కొత్త ప్రభుత్వం నాకూ ఇష్టమే. నీవు నడిచిన మార్గమే నాది. నీ ప్రేమ తప్ప మరేం లేదుకమల్."    
    "నా స్వీట్ బ్యూటీ గోమతి మనలో మనకిఅపార్ధాలు లేకపోతే చాలుప్రయాణం సంగతి అడిగావు కదూ! వివరంగా చెప్పక పోయినా టూకీగా చెపుతాను. మావాళ్ళం కొందరం బాస్ ఆజ్ఞమీద తలోదేశం బయలుదేరాము. మధ్యలో మాకు సమాచారం అందింది. మిమ్మల్ని సి.ఐ.డి.లు వెంటాడుతున్నారు మార్గం మల్లించండి అని ఏ విధంగా చేయాలో వివరాలు తెలిపారు. టకటక అందరం వేషాలు మార్చుకున్నాము. నాతో ఇదే విమానంలో వచ్చే ఇరువురు మిత్రులు ఏ వేషం ధరించారో తెలియదు. అయితే మా సంకేతం "కాబ్ వెబ్" అదీగాక మా వద్ద కొన్ని వస్తువులున్నాయి. వాటిమీద చచ్చిన సాలెపురుగు వుంటుంది. కొత్తగా చూసిన వాళ్ళకి మామూలుగా సాలీడు చచ్చిపడిందను కుంటారు. అలాగే చాలా గుర్తులున్నాయి."    
    కీర్తి మాటలకు అడ్డం తగులుతూ గోమతి అంది.    
    "ఈ బాజారావు ఎవరంటావు కమల్?"    
    "సాంతం వినకుండా అడ్డం తగలకు. వేషాలు మార్చుకుని బాస్ ఆదేనుసారం మరోవిమానం ఎక్కాము. ఎవరో కనిపెట్టి విమానంలో మంటలు సృష్టించి వుంటారు. మొండి ఘటాన్ని కాబట్టి బ్రతికి బయట పడ్డాను, ఇహ బాజారావు అంటావు పక్కా సి.ఐ.డి. అతను మారువేషంలో వున్నా గుర్తించాను బాజారావు అసలు పేరు నందకుమార్."    
    "ఆ" అంటూ తెల్లబోయి నోరు తెరిచింది గోమతి"    
    "బాజారావు అనబడే ఈ నందకుమార్ ఆవులిస్తేపేగులు లెక్కపెట్టగలడు. ఎత్తుకు పైఎత్తు వేయటం నాటకం ఆడికూపి లాగటం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. నాపైకూడా అనుమానం కలిగిందని గ్రహించాను. ఇతని ప్రాణంతీసి ఇక్కడినుంచి పారిపోవటం కన్నా మార్గంలేదు. నాతో వచ్చిన వాళ్ళు విమాన ప్రమాదంలో మరణించారు. అయితే వీడు మాత్రం నా ఖర్మ కొద్దీ బతికాడు పక్కలో బల్లెంలా నా వాళ్ళ కొన్ని వస్తువులు దొరికాయి అవే....తర్వాత చూపిస్తాలే."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS