Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 19

 
    పది నిముషాలు గడిచినాయి. నర్శింగ్ హోం ముందు ఫియెట్ కారొచ్చి ఆగింది. మనోహర్ కారులోంచి దిగి లోపలకొస్తున్నాడు.


    అతన్ని చూసి కళ్ళతోనే పలకరించింది అవంతి.


    మనోహర్ మొహం వాడిపోయి ఉంది. బాగా అలసట చెందినవాడిలా కనిపిస్తున్నాడు.


    "అలా వున్నావే!" అడిగింది.


    "ఏం లేదు. డాక్టర్ వున్నారా!" అన్నాడు.


    "ఆ" అని లేచి వచ్చి వరండాలో అతని పక్కనే నిలబడింది.


    అతను మాట్లాడకుండా సిగరెట్ వెలిగించాడు.


    మరో అయిదు నిమిషాల తర్వాత లోపల నెంబరు పిలిచారు.    


    అవంతి లోపలికి నడవబోతూ ఓ క్షణం అతనికేసి చూసింది.


    "నాకెందుకో భయంగా ఉంది. డాక్టర్ దగ్గరికి నువ్వు కూడా రాకూడదా?" అడిగింది జాలిగా అవంతి.


    అతను అవునని కానీ, కానని కానీ సమాధానం చెప్పలేదు.


    ఆమెతో పాటే లోపలికి నడిచాడు. అవంతి కృతజ్ఞతగా అతని కళ్ళలోకి చూసింది.


    "థాంక్యూ" అంది.


    అదోలా నవ్వాడు తను.


    డాక్టర్ అడిగింది.


    "అబార్షన్ ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నారు!"


    "నేనింకా స్టూడెంటుని డాక్టర్ అంది అవంతి.


    "ఐసీ. మరి నీ హాస్ బెండ్ సంతకం కావాలి" అంది డాక్టర్.


    "నాకింకా పెళ్ళి కాలేదు" అంది అవంతి మెల్లగా.


    డాక్టర్ అదోలా చూసింది.


    "అంటే!"


    మనోహర్ కల్పించుకొని అన్నాడు.


    "అదేం లేదు డాక్టర్. మేమిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నాం. మధ్యలో ఈ పొరపాటు జరిగింది. కావాలంటే సంతకం నేను చేస్తాను."


    అవంతి అతని మాటలకి ఆశ్చర్యపోయింది. ఏమిటి అతను మాట్లాడుతుంది. అతను తనని పెళ్ళిచేసుకోబోతున్నానని అనడం అబద్ధం. అది కలలో కూడా జరగని నిజం కానీ ధైర్యంగా అతను సంతకం చేస్తాననడం మాత్రం మెచ్చుకోదగ్గ విషయమే. అక్కడ పరిస్థితిని కూల్ డౌన్ చేయడానికా మాటలంటున్నాడని అవంతి గ్రహించింది.


    "ఇట్సాల్ రైట్. ఈ కాగితంపైన సైన్ చేసి బయట వెయిట్ చేయండి" అంది డాక్టర్.


    "డాక్టరిచ్చిన కాగితంపైన మనోహర్ సంతకం చేసి బయటకెళ్ళి కూర్చున్నాడు.


    డాక్టర్, అవంతిని లేబర్ రూంలోకి తీసుకెళ్ళింది.


    మనోహర్ సిగరెట్ పైన సిగరెట్ కాలుస్తూ బయట కారు దగ్గర నిలబడ్డాడు.


    షుమారు నలభై నిమిషాల తర్వాత అవంతి నీరసంగా వచ్చి బల్లపైన కూర్చుంది.


    "వెళదామా!" అడిగాడు మనోహర్ లోపలికి వచ్చి.


    "ఊ..... బిల్ పే చేయాలి" అంది నీరసంగా.


    మనోహర్ డాక్టరు ఫీజు చెల్లించి అవంతి నడుం చుట్టూ చేతిని వేసి మరో చేత్తో ఆమెని పట్టుకొని కారు దగ్గరికి నడిపించి ఎక్కించాడు.


    డాక్టర్ రాసిచ్చిన మందులు పక్కనే వున్న మెడికల్ షాపులో కొని తీసుకొచ్చి కారు స్టార్టు చేశాడు.


    అవంతి అతని భుజంపైన తల ఆనించి కూర్చుంది.


    "థాంక్యూ మనోహర్..... థాంక్యూ సో మచ్....." అంది.


    "ముందు జాగ్రత్త పడితే ఎంత బాగుండేది!" అన్నాడు సీరియస్ గా.


    అవంతి కళ్ళ చివర నుంచి అతన్ని చూసింది.


    "నా అవసరాలకి నిన్ను వాడుకొంటున్నప్పుడు, నీ క్కావలిసిన సుఖాన్ని పూర్తిగా ఇవ్వడం నా డ్యూటీగా అనుకొన్నాను" అంది.


    "మాడ్ గర్ల్" అన్నాడు.


    అవంతి ఆ మాటకి నవ్వింది.


    "డాక్టర్ దగ్గర అలా ఎందుకు చెప్పావు" అడిగింది.


    "ఆమెని కన్ విన్స్ చేయడానికి"


    "నేను నీ భార్యననీ, నాకు అబార్షన్ చేయడం నీకు సమ్మతమేనని కాగితంపైన సంతకం చేశావు. నేనిప్పుడు నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తే?" అడిగింది.


    "నువ్వలా చెయ్యలేవు. నువ్వేమిటో నాకు పూర్తిగా తెలుసు అన్నాడు కారుని సందులోకి తిప్పుతూ.


    "నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది మనోహర్. నీకు నాపట్ల ఆ నమ్మకం ఉన్నందుకు రియల్లీ అయాం వెరీ హాపీ" అంది అతన్ని చుట్టుకుపోతూ.


    మనోహర్ ఎడంచేత్తో ఆమె తలపైన నిమిరాడు.


    "నాకు పిల్లలంటే ప్రాణం. కానీ ఏం చేయను తప్పనిసరిగా అబార్షన్ చేయించుకొన్నాను పాపో, బాబో ఎవరు పుట్టేవారో!"


    కన్నీరు చిప్పిల్లుతుండగా ఆమె గుండెలోతుల్లోంచి వచ్చాయామాటలు.


    మనోహర్ వెంటనే మాట్లాడలేదు. హాస్టర్ ముందు కారాపాడు. ఆమెకోసం ఎదురుచూస్తూ వున్నారు రమణి, కుసుమ, శ్యామల కారాపగానే పరుగెత్తుకొచ్చారు. అవంతి కారులోంచి దిగింది.


    ఆమె భుజంపైన చేత్తో తట్టి "టేకిట్ ఈజీ. దాన్ని గురించి అదే పనిగా ఆలోచించకు. మందుకు టైంకివాడు" అని కారెక్కాడు మనోహర్ కారు కదిలింది.

    
    వెళ్ళిపోతున్న ఆ కారు కేసి చూస్తూ దిగులుగా నిలబడిపోయింది అవంతి, రమణి అవంతి చేతిని పట్టుకొని లోపలికి నడిపించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS