Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 19


    వేలంపాటదారు నిరాశపడిపోయాడు. "ఇరవైకి పాడాడండీ ఆ పెద్ద మనిషి. ఇరవై రూపాయలకు ఇంత పెద్ద దుప్పటిని మీకిచ్చేస్తే రేపటినుంచి నేను తిరుమల కొండమీద అడుక్కోవాలి" అని దుప్పటిని విసురుగా వెనక్కు లాక్కున్నాడు. దుప్పటి ఇవ్వకపోవడం వల్ల ఇరవై రూపాయల పాట పాడిన వ్యక్తికి అతను ఓ సబ్బు పెట్టె యిచ్చాడు. 

 

    మొదట్లో వేలంపాటదార్లు అంతే. ఎంత పాడినా దుప్పట్లు ఇవ్వరు. పెద్ద మొత్తంలో పాడితే తప్ప దుప్పటి రాదన్న భ్రమను జనానికి కలిగిస్తారు. ఇక ఆ తరువాత వరుసగా దుప్పట్లు యిచ్చేస్తుంటారు.

 

    తన మావయ్య రామయ్య, ఆనందరావు తల్లి సరస్వతమ్మ ఇద్దరూ వేలంపాటలో మునిగిపోయి వున్నారని కనిపెట్టిన రమణి జనం వెనక నుంచి మెల్లగా బయటపడింది.

 

    పెద్దవాళ్ళిద్దరూ మరో రెండు గంటలకు గానీ రారు. ఈలోగా... ఇహ వూహించలేకపోయింది ఆమె. రెండు ఏనుగులను కలిపి కట్టేసి నట్లుండే జాకెట్టు ఇబ్బందిగా తోస్తోంది. అటూ ఇటూ బరువుల్ని మోసీ మోసీ చిక్కిపోయిన కావడి కొయ్యలాగా వుండే నడుమూ మరొకరి చేతిలో మరింత సన్నబడాలని తొందరపెడుతున్నట్లుంది. మంత్రనగరి సరిహద్దులో వుండే చమ్కీ తలుపులాంటి బొడ్డు తన నగ్నత్వాన్ని మరింత పచ్చిగా ప్రదర్శించడానికి ఉవ్విళ్ళూరుతున్నట్లు అనిపిస్తోంది. అంతకుమించి ఆలోచిస్తే నరాలు పగిలిపోతాయేమోనని అంతటితో వూహించడం ఆపేసింది.

 

    తన ఇల్లు ఎలా చేరుకుందో కూడా తెలియదు. అటూ ఇటూ చూసి నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ పక్కింటి కెళ్లింది.

 

    "సరస్వతత్తా... సరస్వతత్తా" రెండుసార్లు పిలిచింది.

 

    ఎవరూ పలకలేదు. కొంపదీసి ఈ మానవుడు నిద్రపోయాడా అనుకుంటూ మరోసారి పిలిచింది.

 

    ఎలాంటి రెస్పాన్సూ లేదు.

 

    ఇంకాస్త ధైర్యం చేయమని అవయవాలన్నీ పోరుతున్నాయి. నెమ్మదిగా మంచం దగ్గరికి వచ్చింది. ఆనందరావుని పిలవాలనిపించింది గానీ ధైర్యం చాలటం లేదు.

 

    అందుకే నిశ్శబ్దంగా అతని పక్కనున్న ఖాళీస్థలంలో పడుకోవడానికి కూర్చుని నడుం వాల్చబోయింది.  

 

    అప్పటికే గాఢనిద్రలో వున్న ఆనందరావు తన పక్కన మెత్తగా తగలడంతో భయంతో గావుకేక పెట్టాడు. దుప్పటి తొలగిస్తూనే తన పక్కనున్న మరో మనిషి ఖచ్చితంగా దెయ్యమని అనిపించి మరింత బిగ్గరగా కేకలు పెట్టాడు.

 

    పొలాల్లో పంటలు నూర్పిళ్ళు అయినప్పుడు కాపలా కోసం రైతులు వెళుతుంటారు. అలా పొలాల్లో పడుకుని వున్నప్పుడు ఆడదెయ్యాలు వచ్చి తమతో ఎలా పరాచికాలు ఆడిందీ, వాటిని ఎంత ధైర్యంగా తాము వెళ్ళగొట్టిందీ కొందరు ముసలాళ్ళు కుర్రకారుకు కథలు కథలుగా చెప్తుంటారు. అలాంటి కథలు వినీ వినీ రాత్రి తన పక్కన స్త్రీ చేరితే అది ఖచ్చితంగా దెయ్యమే అని నమ్మే స్థితిలో వున్న ఆనందరావు ఆమెని రమణిగా గుర్తించలేకపోయాడు.   

 

    మొదట్లో అతని కేకలకు గాభరాపడ్డ రమణి క్షణంలోనే తేరుకుంది. రానున్న ప్రమాదాన్ని పసిగట్టింది.

 

    "నేను... నేను" అంది అతని భుజాలు గట్టిగా వూపుతూ. కానీ దెయ్యం భయంతో గజగజ వణికిపోతున్న ఆనందరావు ఆమె తన పక్క ఇంటి రమణిగా పోల్చుకోలేకపోయాడు.

 

    "అయ్యో దెయ్యం... రండి.... ఓ పెదనాయనా... ఓ రంగమ్మ అత్తో...." అని అరవడం కూడా ప్రారంభించాడు.

 

    దాంతో పక్కింట్లో పడుకున్న వాళ్ళు నిద్ర వదిలింది. ఒక్కొక్కరే గాభరాతో అక్కడికి వస్తున్నారు.

 

    ఏ ప్రమాదాన్ని ఊహించిందో అదే జరుగుతోంటే రమణికి కాళ్ళూ చేతులు ఆడటం లేదు.

 

    పారిపోవడానికి వీల్లేకుండా పోయింది. నాలుగు వైపుల నుంచీ జనం వస్తున్నారు. మూలింటి చెంగయ్య తాత అయితే బిగ్గరగా ఆంజనేయ దండకం చదువుతూ వస్తున్నాడు.... 'శాకినీ, ఢాకినీ, గాలి దెయ్యంబులన్ నీదు వాలంబున్ చుట్టి, నేలంపడం కొట్టి....'

 

    అంత చలిలోనూ రమణికి చెమటలు పట్టాయి. రెడ్ హ్యాండెడ్ గా దొరకడమంటే అంతకంటే పరువు తక్కువ పని మరొకటుండదు.

 

    ఆనందరావు అసలు విషయం గ్రహిస్తే ఇప్పుడైనా తప్పించుకోవడం కష్టం కాదు. కానీ అతనికి దెయ్యం తప్ప మరొకటి తట్టడం లేదు. ఈ గండం నుంచి బయటపడాలంటే ఏదో ఒకటి చేయాలి. అందుకే ఆమె అతని చెవిలో 'నేను రమణిని... రమణిని' అని చెప్పింది.

 

    అతడు దీన్ని మరోవిధంగా అర్థం చేసుకున్నాడు. "రంగమ్మత్తో... చెంగయ్యతాతో ఇది రమణట. దెయ్యం పేరు కూడా చెబుతోంది.... రంగమ్మత్తో ... నన్ను కాపాడు" అతడు లబోదిబోమని అరుస్తూ మంచం మీద నుంచి కిందకు దూకాడు.

 

    తన పేరు చెబితే తెలుసుకుని అరవడం మానేస్తాడనుకుంటే ఏకంగా తన పేరే అందరికీ అరిచి చెప్పేస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే తను ఊబిలో కూరుకుపోతున్నట్టు అనిపించింది రమణికి.

 

    అంతలో నలుగురైదుగురు అక్కడికి చేరిపోయారు. వాళ్ళు మరో రెండు అడుగుల్లో తమని సమీపిస్తారనగా ఇక అక్కడ వుండటం శ్రేయస్కరం కాదనిపించింది. ఏది అయితే అదే అవుతుందన్న మొండి ధైర్యముతో పరుగులాంటి నడకతో అక్కడి నుంచి ఇంటి వెనక్కి తప్పుకుని, చుట్టూ తిరిగి వీధిలోకి వచ్చింది. అప్పటికి తగ్గింది ఆమె వణుకు, ఆయాసాన్ని అణుచుకోవడానికి ఓ క్షణం నిలబడిపోయింది.  

 

    ఆమె అదృష్టం కొద్దీ వేలంపాట ఇంకా కొనసాగుతూనే వుంది. ఈ గందరగోళం మధ్య తన మామ రామయ్య వచ్చుంటే ఇక అంతే సంగతులయి పోయి వుండేది. తన మామ ఆవులిస్తే పేగులు లెక్కపెట్టే రకం. మొత్తం ఏం జరిగి వుంటుందో చూసినట్లు వూహించేసేవాడు. సరస్వతమ్మ కూడా అంతే! తన బ్రతుకుని నాలుగురోడ్ల కూడలిలో నిలబెట్టేసేవారు. అలాంటి ప్రమాదం జరక్కుండా పోలేరమ్మ దేవతే తనని కాపాడిందనిపించింది.  

 

    ఆమె నెమ్మదిగా ఇంట్లోకి నడిచింది. ఇంకా పక్కింట్లో సద్దుమణగ లేదు. చెంగయ్య తాత అంటున్నాడు -

 

    "ఏరా ఆనంద్! ఇదిగో విభూది. ఇది మంత్రించిన విభూది. దీన్ని చిటికెడు నోట్లో వేసుకుని, ఇంకో చిటికెడు నుదుటున పెట్టుకో. రమణి, గిమణిలాంటి దెయ్యాలు నీ జోలికిరావు"

 

    రంగమ్మత్త సాగదీస్తూ మాట్లాడుతోంది - "కలికాలం - లేకుంటే చెట్లల్లో, చేలల్లో వుండే దెయ్యాలు ఊర్లోకి వచ్చి వయసులో వున్న అబ్బాయిల మీద పడిపోతాయా? అందుకే నా కొడుకుతో చెబుతూ వుంటా - అరేయ్ ఆంజనేయస్వామి తాయెత్తు మొల్లో కట్టుకోరా అని. వాడు వింటేనా!"    

 

    ఆనందరావు సర్దుకుంటున్నాడు. ఒక్కొక్కరే అక్కడ్నుంచి బయల్దేరుతున్నారు. కొద్దిసేపటికి టెన్షన్ కి బాగా అలసట కమ్మిన రమణి మంచం మీద పడుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS