Next Page 
మూసిన తలుపులు పేజి 1


                                    మూసిన తలుపులు
                                                                                                        సి. అశ్వర్ధ

                             


    స్వాప్నిక జగత్తు కూ, వాస్తవపు జీవితానికి పొత్తు కలగడం యుగాంతం లోని మాటే. భవిష్యత్తు ను గురించి చేసుకున్న నిర్ణయాలకూ, ఆశయాలకూ , కోరికలకూ మారు రూపం స్వప్నం. అందుకే స్వప్నాలు ఫలించవు అన్నారు. అయితే కలలు గనని జీవులు ఎవరైనా ఉన్నారా? వారి కలలు ఎప్పటికీ వాస్తవిక జీవితంలో ఫలించవా?
    మానవుని మనస్సు పీడికిలి వంటిదైనా కడలి ని మించిన కోరికలకు నిలయం. తన జీవితం సుఖంగా జరిగిపోవాలని కోరికలు కోరకుండా ఉండడం మానవుని వ్యక్తిత్వం కాదు. ఫలితాలు ఎలా ఉన్నా అంతులేని కోరికలతో తమ భవిష్యత్తు సౌఖ్య ప్రదంగా ఉండాలని విరీ విరామం లేక తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. అదే మంచి చెడ్డలు విస్మరించబడే సమయం. ఆ దౌర్భల్యానికి లొంగక తప్పదు.
    అదృష్టం ఒకరి సొత్తు కాదన్నట్లు దురదృష్టానికి గూడా నిబంధనలు ఉండవు. అందరినీ వరిస్తుంది. అదృష్టానికి నోచుకోని దురదృష్ట వంతులు; దాన్ని తెలుసుకోలేని దౌర్భాగ్యవంతులు; చాలా తెగలు గలది మానవజాతి . ఏదైనా సరైన సమయంలో చేసిననాడే దానికి విలువ. కలువ సూర్యుడ్నీ , పద్మం చంద్రుడ్ని చూసి వికసించవు.
    అదృష్టం తెలుసుకొని ,అందుకొనే లోపలే అంతరించి పోవొచ్చు. అప్పటి మానవ హృదయ పరిస్థితి వర్ణించాలని ప్రయత్నించడం వ్యర్ధమే. అదృష్ట వంతులకూ లభించేది దుఖమే , దురదృష్ట వంతులకూ మిగిలేది తీరని బాదే! దీనిమీ విముక్తి ఎప్పుడు? అది లేనినాడు ఎందుకీ బ్రతుకు అనిపిస్తుంది.
    అందరాని , అందుకొలేని ఆశలకు లోనై తలపుకు రాని తలపులను తెచ్చుకోవాలనే వెర్రి ఆందోళన పడుతూ అందరినీ బాధించడం కన్నా ఆ ప్రయత్నం విరమించు కోవడమే మేలు. అందిన ఆనందం పై అంతులేని ఆశలు కల్పించు కొని గాలిబుడగలా ప్రేలిపోయిన వాడు భరించ లేక, నిలద్రోక్కుకోగలిగే శక్తి లేక కృశించి , నశించి పోవడం కన్నా ఆశలను చంపు కొన్ననాడే ఈ కృత్రిమ లోకంలో కృత్రిమ ఆనందాన్ని అనుభవించగలరు. ఈ కృత్రిమ పాపపు లోకంలో అతీతమైన  , నిజమైన ఆనందం అనుభవించాలనుకొన్నప్ప్జుడు అంతకన్నా ఎక్కువ కష్టాలను ఎదుర్కోనవలసి ఉంటుంది.

                                *    *    *    *
    "నమస్కారమండీ."
    తలెత్తి చూశారు ఆనందరావు గారు. "ఓ! నువ్వటోయ్ , రాజశేఖరం! రా కూర్చో" అన్నారాయన ఆదరంగా. ఆ యువకుడు వినయంగా అక్కడ ఉన్న సోఫాలో కూర్చున్నాడు. అతనికి పందొమ్మిది సంవత్సరాలు ఉంటాయి. సాధారణమైన దుస్తులలో ఉన్నాడు. అతని మొహం లో ఎదుటి వారి నాకర్షించే కళ ఉట్టి పడుతుంది. చూపులలో వినయము, గౌరవ భావము, కనిపిస్తున్నాయి. వాటి వెనుక దాగి ఉన్న గంబీర్యము, నిశ్చలత్వము అతని అందమైన మొహానికి మరింత శోభ నిస్తున్నాయి.
    'ఏమోయ్! బి.ఎ. యూనివర్శిటీ ఫస్టున పాసయ్యావు! ఇక మీదట ఏం చేయ దలచుకున్నావు?' అడిగారు ఆనందరావు గారు కళ్ళద్దాలు తీసి తుడుచుకుంటూ.
    "ఏదైనా ఉద్యోగం చూచుకోవాలని అనుకొంటూన్నానండి.'" జవాబిచ్చాడు తలవంచుకొని ఆ యువకుడు.
    'ఛ, ఛ! బి.ఎ . యూనివర్శిటీ ఫస్టున పాసయి ఉద్యోగం చేసుకొంటానంతున్నావు. నీకు ఏ ఉద్యోగం దొరికినా ఈ రోజుల్లో ఏ గుమస్తా ఉద్యోగం కన్నా మంచిది దొరకదు. అటువంటి పిచ్చి పనులు చేయకుండా హాయిగా పై చదువులు చదువుకో."
    "మీ దయ వల్ల ఇంతవరకైనా చదువు కోగలిగాను. అనాధనైనా నన్ను చిన్నప్పటి నుండి ఆప్యాయత తో, ఆదరంతో ఏ లోటూ కలగనీయ కుండా పెంచి పెద్ద చేసి విద్యా బుద్దులు చెప్పించారు. జీవితంలో నన్నూ ఒక మనిషిగా చేయగలిగారు. ఇక మీదట ఇంకా మీకు శ్రమ కలిగించదలచుకోలేదు."
    "శ్రమా లేదు, గిమా లేదు. నీ మొండి వాదన మాని నా మాట విను. నీకేలాగూ స్కాలర్ షిప్ వస్తుంది. ఆ మీదట నేను ఎలాగూ ఉన్నాను. ఎమ్. ఎ . కానీ నీకు ఏది మంచిదని తోస్తే ఆ కోర్సు చదువుకో."
    యాన అధికారపూరితమైన కంఠస్వరం విని రాజశేఖరం మారు మాట్లడలే క పోయాడు.
    ఇంతలో అక్కడికి ఓ యువతి వచ్చి రాజశేఖరాన్ని చూసి, "హల్లో, మిస్టర్ రాజశేఖరం! కంగ్రాచ్యులేషన్స్" అంటూ చేయి ముందుకు చాపింది.
    "థాంక్స్" అని రాజశేఖరం నమస్కారం చేశాడు. అది చూచి ఆమెకు కోపంతో పాటు విసుగు కూడా కలిగింది.
    రాజశేఖరం , ఆనందరావు గారి వద్ద శలవు తీసుకొని వెళ్ళిపోయాడు.
    "మ్యానర్ లెస్ బ్రూట్" అంటూ ఆ అమ్మాయి ఆనందరావు గారి ప్రక్కనే కూర్చుంది.
    ఆనందరావు గారు ఒకసారి తీక్షణంగా ఆమెను చూసి "మర్యాద తెలియని వాడు అతను కాదు. సభ్యత, సంస్కారాలు తెలిసిన యువకుడు.' అన్నాడు కాస్త కోపంగానే.
    "అది కాదు, నాన్నా! అతగాడికి యూనివర్శీటీ ఫస్టు ననే అహంభావం ఎక్కువగా ఉంది." అంది తండ్రి కోపాన్ని చూసి.
    "పొరపడ్డావమ్మా! ఇప్పుడే కాదు . ఈ ప్రపంచానికి అంతటికి అధికారి అయిననాడు కూడా అతనిలో అహం భావమనే మాటకు తావు లేదు."
    "లేకపోతె ఏమిటి, నాన్నా! నేను ఎప్పుడైనా కాలేజీ లో పలుకరిస్తే ముక్తసరిగా మాట్లాడతాడు. తాను తెలివైన వాడిననే గర్వం, పొగరు కాకపొతే మరేమిటి?'
    "పోనీ, నీ తోటి ఆడవారితో ఎవరితో నైనా అతడు సంతోషంగా మాట్లాడడం చూశావా?'
    "ఉహు. అసలు ఆడవారంటే నే ఆమడ దూరంలో ఉంటాడు. చాలామంది అతన్ని ఆకర్షించ ప్రయత్నించి విఫలుల య్యారు. అసలు అదొక జడ పదార్ధమని మా నిశ్చయం."
    "అందరితో ఎలా ప్రవర్తిస్తున్నాడో నీతో అలాగే ఉన్నాడు. అందుకు నువ్వతడ్ని ద్వేషించడం లో అర్ధ మేమిటి?'
    " నా ఉద్దేశ్యం అది కాదు, నాన్నా..."
    "చూడు వసంతా. నువ్వేం చేసినా సహించగలను కాని అతడిని గురించి ఏమైనా అంటే నాకు బాధ కలుగుతుంది." అని అక్కడి నుండి లేచి లోపలికి వెళ్ళిపోయారు.
    వసంత నివ్వెర పోయింది. తండ్రికి అతడి పై గల అడరాభిమానాలకు కారణం అర్ధం చేసుకో లేక పోయింది. లేచి తన గదిలోకి పోయి నిలువుటద్దం ముందు నిలబడి తన అందాన్ని, అలంకరణ ను చూసుకో సాగింది.
    క్రేపు సిల్కు చీరే, జార్జేట్ జాకెట్టు తన అందాన్ని ద్విగుణీకృతము చేస్తున్నాయి. తన అవయవ సౌష్టవం , తన ఆకర్షణీయమైన మొహం, తన సౌందర్యం ఒక్కొక్కసారి తనకే పిచ్చి ఎత్తిస్తాయి. ఇక మగవారి విషయం చెప్పనక్కర లేదు.
    అందుకే కాలేజీ లోని యువకు లందరినీ ఆకర్షించు కొని తన చుట్టూ త్రిప్పుకొని ఆనందిస్తుంటుంది. తనకు వచ్చే ప్రేమలేఖలను ఒక బీరువాలో భద్రంగా ఉంచుతుంది. త్వరలో ఆ బీరువా నిండి పోతుంది. అదే ఆమె కానందం. కాలేజీ కి వేళ కావడంతో కారెక్కి కాలేజీ కి వెళ్లిపోయింది.
    కారు  కదిలిపోయిన శబ్దం వినగానే ఆనందరావు గారు తిరిగి హాల్లోకి వచ్చి కూర్చున్నారు. అక్కడే గోడకు వ్రేలాడ తీయబడిన ఓక ఫోటో పై తన దృష్టి ని నిలిపారు. ఒకసారి ఆయన కన్నులు ఆర్ద్రము లైనాయి. కారణ మేమిటో?
    ఆ ఫోటో లోని వ్యక్తీ ఆనందరావు గారి గుమస్తా. పేరు రామ మూర్తి. నమ్మిన బంటు. అంటే రామ మూర్తిని మించినవారు ఉండరన్న సత్యాన్ని అన్నదరావు గారు తెలుసుకొన్నారు. రామమూర్తి, అతని భార్య వారి యింట్లో నే తోటలో ఒక చిన్న గదిలో ఉంటుండేవారు. కాని కొద్ది రోజులకే అతని భార్య చనిపోతూ అతనికొక పసివాడిని భారంగా విడిచి మరీ పోయింది. అప్పటి నుండి వారి యింట్లో నే భోజనం చేస్తూ కాలం గడప సాగాడు. ఏనాడు కూడా తను చేసిన పనికి తన కింత డబ్బు రావాలని అడిగి ఉండలేదు. ఆనందరావు గారు లక్షాధికారి. అతనిని నమ్మినాడు. ఒకోసారి అయన ప్రక్క పల్లెలకో, లేక ఏదైనా పని మీద ఊరికి వెళ్లాలని ప్రయాణమైనా తన సర్వస్వాన్నీ అతని చేతులలో ఉంచి మరీ పోయేవాడు. కానీ, నమ్మక ద్రోహాన్ని కలలో గూడా తలంచలేని రామమూర్తి ఒక్క నయా పైసా కూడా తీసుకొనేవాడు కాదు. ఒక వేళ అతడే వారికి ద్రోహం తలపెట్టి ఉంటె ఇనప్పెట్టె లో ఎంత డబ్బుందో కూడ తెలియని ఆనందరావు గారిని భిక్షాది కారిగా చేసి ఉండేవాడే. కానీ, నమ్మకానికి కట్టుబడిన రామమూర్తి ని ఆ దురాశ లొంగ దీయలేదు.
    ఒకసారి అన్నదరావు గారికి తన ఇనప్పేట్టెలో ఎంత నగదు ఉందొ చూసుకోవాలనిపించింది. రామమూర్తి ని పిలిచి లెక్కలు చూశాడు. ఇనప్పెట్టె లోని డబ్బు లెక్కపెట్టాడు. అయిదు వేలు తక్కువగా ఉంది. ఆశ్చర్యపోయాడు ఆనందరావు గారు. కంగారు పడ్డాడు రామమూర్తి. తను నమ్మినందుకు తననే మోసం చేశాడేయని తలంచాడాయన. డబ్బు ఏమైనదీ అర్ధం కాక తికమక పడ్డాడు రామమూర్తి. ఇక యిక్కడ నీకు స్థానం లేదు . వెళ్ళిపో."
    ఎంతగానో ప్రాధేయ పడ్డాడు. రామమూర్తి. ఫలితం శూన్యం. ఆరేడు సంవత్సరాల పసివాడితో వెళ్ళిపోయాడు.
    అతడు పోయిన తరవాత ఆనందరావు గారు సిగరెట్టు కోసం జేబు లోకి చెయ్యి పెట్టాడు. సిగరెట్టు పాకెట్టు తో పాటుగా ఒక కాగితం పైకి వచ్చి క్రింద పడింది. అదేమిటా అని చూశాడు. ప్రోనోటు. ఒక మిత్రుడికి అర్జెంటు గా అవసరం వస్తే తనే స్వయంగా అతనికి అయిదు వేలిచ్చాడు. ఆ విషయం రామమూర్తికి తెలియదు.
    అప్పుడు ఏడవాలని పించింది ఆయనకు. ఆప్తుడిని కోల్పోయినట్లు గిలగిలలాడి పోయాడు. చింతిస్తూ రామమూర్తి కోసం వెదికాడు. కానీ కనిపించలేదు.
    ఒక సంవత్సరం తర్వాత ఒకనాడు హటాత్తుగా ఊడి పడ్డాడు రామమూర్తి. అతన్ని చూచి ఆనందించాడాయన. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. రామమూర్తి గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. డాక్టరు కోసం కబురెట్టాడు. సరైన మందులు లేక అతని ప్రాణాలు తీయడానికి సిద్దంగా ఉందా జబ్బు.
    అతను కొడుకును ఆనందరావు గారి పాదాల వద్ద ఉంచి, "బాబూగారూ! జీవితంలో మిమ్మల్ని ఏ కోరికా కోరలేదు. నేను పొతే వీడు దిక్కు లేని వాడై పోతాడు. తల్లీ తండ్రి లేని నా బిడ్డ గతి లేక, దరి కానక వీధుల వెంట బిచ్చమెత్తు కొంటుంటే నా ఆత్మ శాంతించదు. వీడిని మీ కప్పగిస్తున్నాను. వీడు జీవితంలో ఓ గొప్పవాడు కావాలనే ఆశ నాకు లేదు. వాడు తన బ్రతుకు తాను బ్రతికేటట్లుగా ఉంటె చాలు. ఈ ఒక్క కోరిక తీరిస్తే మీకు జన్మ జన్మాలకు ఋణపడే ఉంటాను." అని కళ్ళు మూశాడు. డాక్టరు కు చేతకాని పని ఆ కళ్ళు తెరిపించడం.
    ఆ పసివాడిని ఒక ప్రయోజకుడుగా తయారు చెయ్యాలని నిశ్చయించు కొన్నాడు ఆనందరావు గారు. అతనికి విద్యాబుద్దులు చెప్పించాడు. నాటి ఆ పసివాడే నేటి రాజశేఖరం. అతన్ని తండ్రి కోరిక విధంగా కాక ఒక గొప్ప వ్యక్తిగా సంఘంలో చూడాలని ఆనందరావు గారు నిశ్చయించు కొన్నారు.


Next Page 

WRITERS
PUBLICATIONS