వాసన లేని పూలు
శ్యామలా జయరామ రెడ్డి

అనుభవం అనేది బట్టతల వాడికి లభించిన దువ్వెన వంటి దంటారు. అ దువ్వెన దొరికేప్పటికీ అతని తల బోడిదై వుంటుంది. దాని వలన అతనికేమీ ఉపయోగం ఉండదు. పోనీ ఎవరికైనా ఇద్దామంటే పరులు పయోగించిన పాత దువ్వెన క్రింద తీసి పారేస్తారు. అందువల్ల అన్నిటి కన్నా స్వానుభవమే విశిష్టమైంది. కాని జీవితంలో కష్ట నష్టాలనేకం సహించి స్వానుభవం గడించే సరికి దాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం గాని, జీవితశేషం గాని ఎవరికీ మిగలదు.
.jpg)
రాజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సంపన్నుల ఇంట జన్మించాడు. ఆ కుటుంబం గౌరవ ప్రతిష్టల్లోనేమి, ధనధాన్యాల్లోనేమి ఆ చుట్టూ ప్రక్కల కంతా పేరు మోసింది. రాజు తండ్రి గారైన సత్యన్నారాయణ గారు సాంఘిక రంగంలోనే కాక, రాజకీయ రంగంలో కూడా ప్రసిద్ది కెక్కిన వ్యక్తీ. పరోపకార సంస్థల కేన్నిటికో దాత. అనాధుల నేందర్నో చేరదీసి ఆదరించే వాడు. ఆరోజుల్లో అయన మాటకు ఎదురు లేదు. అటువంటి వ్యక్తికీ ఏకైక పురుష సంతానం రాజు.
రాజు బి.యస్. సి. పూర్తీ చేయగానే ఎం.బి.బి.యస్ లో సీటు దొరికింది. వెంటనే ఆర్ట్స్ కాలేజీ వదిలేసి విశాఖపట్నం మెడికల్ కాలేజీ లో చేరాడు. చక్కగా చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకొంటుండేవాడు.చేతి నిండా డబ్బు, కంటి కింపైన రూపం. చెడి పోవటానికి బోలెడన్ని అవకాశాలు ఉండి కూడా చెడిపోని యువకుల్లో అతనొకడు. అతని విలాస జీవితమంతా ఖరీదైన మంచి బట్టలు, స్నేహితుల్తో వారానికి ఒకటో రెండో సినిమాలు చూడటానికి మాత్రమే పరిమితమై ఉండేది. అపారమైన ఆస్తి పాస్తులతో జీవిత భాగస్వామిని గా రావటానికి అక్క కూతురు పద్మ సిద్దంగా ఉంది. నేడో, రేపో డాక్టరు డిగ్రీ , తరగి పోనీ భాగ్యం -- పున్నమి వెన్నెల లాంటిది అతని జీవితం..
అటువంటి ప్రశాంత జీవితంలో పెను తుఫాను లాగ ప్రవేశించింది ఒక యువతి. ఆమె పేరు వనజ. పరిచయం కావటం కూడా తమాషా గానే జరిగింది.
ఒకానొక దుర్దినాన పరధ్యానంగా తల వొంచుకొని ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న రాజు ఎదురుగా వచ్చే యువతిని చూడక వరండా మలుపులో టకీమని డీ కొన్నాడు. ఆ యువతి "అబ్బా" అని నొసలు పట్టుకొని నమిలి మింగేద్డామన్నంత కోపంతో తల పైకెత్తింది. కాని అంతలోనే రాజును గుర్తించి లజ్జా పూరితయై "ఓ మీరా!" అన్నది.
ఒకానొకనాడు హటాత్తుగా కలుసుకొని, రైలు ప్రయాణికుల్లాగ మళ్ళీ హటాత్తుగానే విడిపోయారు. అప్పట్నుంచి ఆ అమ్మాయిని మళ్ళీ ఒకసారి కలుసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న రాజుకి ఈ వాడిలా అనుకోకుండా ఆ అమ్మాయి కనుపించేసరికి ఎంతో సంతోషమేసింది. పరిచయమున్న యువతి కాబట్టి సరిపోయింది. లేకపోతె ఆ హాస్పిటలు వరండా లో. అటూ ఇటూ వచ్చిపోయే వందల మంది జనం ఎదుట ఎన్ని చివాట్లు తినవలసి వచ్చేదో ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పినా ఎవరు నమ్ముతారు? నవ్వుతూ ఆ అమ్మాయితో ఆ మాటే అన్నాడు. మీరు కాబట్టి సరిపోయింది. మరొకరైతే నా చెంప గతి మయ్యేదో"
"దానికేం లెండి. ప్రమాదాలు ఎవరికైనా జరుగుతాయి- ఎటూ కావాలనిచేస్తే తప్ప --" అన్నది ఆ అమ్మాయి కోమల స్వరంతో.
"వెధవ ప్రొద్దున్నే లేచి మా అప్పలరాజుగాడి ముఖం చూశాను. అందువల్లే ఇంత పని జరిగింది. ఇంటి కెళ్ళి గాని చెప్పను వాడి పని."
అలా గెందు కనుకోవాలి? ఆ అప్పలరాజు ఎవరో గాని అతని ముఖం చూసినందు వల్లే -- మీరన్నట్లు -- చెంప దెబ్బలు తప్పాయని ఎందుకనుకోకూడదు?" అన్నది నవ్వుతూ.
"అదీ నిజమేననుకోండి -- ఇంతకూ కారియరు పట్టు కేళ్తున్నారు హాస్పిటల్లో బంధువు లెవరైనా ఉన్నారా?"
"ఔనండి. అక్కయ్యను హాస్పిటల్లో చేర్చం" అన్నది.
"అక్కయ్యా? అంటే ఆ వేళ మీతో పాటు ఎగ్జిబిషన్ కొచ్చి నావిడేనా?"
"ఔను. ఆవిడే. ఐతే మమ్మల్నింకా బాగానే గుర్తుంచుకున్నారన్న మాట?' చక్రాల్లాంటి ఆమె కళ్ళు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ పద్మాల్లాగా విచ్చుకున్నాయి.
"నేనే విషయాన్నీ అంత త్వరగా మర్చిపోనులెండి. ఇంతకూ ఆవిడగారికేం జబ్బు?"
ఆ అమ్మాయి నవ్వింది. దానిమ్మ గింజల్లాటి తెల్లని పలువరుస తళతళలాడింది." అది తెలుసుకోటానికే ఇక్కడి డాక్టర్ల అంతా నాలుగు రోజుల్నుంచీ శ్రమ పడ్తున్నారు. ఇక నాకేం తెలుస్తుంది. చెప్పండి?' అని. వెంటనే నాలుక కొరుక్కుంటూ "క్షమించండి మీరూ డాక్టరే నన్న సంగతి మర్చిపోయాను" అన్నది.
రాజు కూడా నవ్వకుండా ఉండలేక పోయాడు. "ఫర్వాలేదు నేనింకా డాక్టర్ని కాలేదు. అదీ కాక ఇక్కడి డాక్టర్లు శక్తి సామర్ధ్యాలు మీరు కరెక్టు గానే గ్రహించారు. మీరు అతిశయోక్తి ఏమీ చెప్పలేదు కనుక క్షమార్పణ చెప్పుకోనక్కర్లేడు. పదండి . నేను వచ్చి మీ అక్కగార్ని పలుకరించి వస్తాను."
ఆ అమ్మాయి బయలుదేరింది. రాజు పక్కనే నడవటం మొదలు పెట్టాడు.
గడచిన జూన్ లో మెడికల్ కాలేజి సైన్సు ఎగ్జిబిషన్ జరిగింది. బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. ప్రతిదినమూ వేలకువేలు జనం వచ్చి చూసి పోయారు. రాజు ఎగ్జిబిషన్ కమిటీకి సెక్రటరీ. అందువల్ల ఏర్పాట్లన్నీ అతనే చూసుకోవాల్సి వచ్చింది. ఆ సందర్భంలోనే ఒకరోజు ప్రిన్సిపాల్ గారి గది ముందు నిలబడి , రాజూ మరి కొంతమంది వాలంటీర్లు ఆయనతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలోనే ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరూ ఎటు వెళ్ళవలసింది తెలియక కాబోలు అటు వైపు వచ్చారు. వాళ్ళను చూసి ప్రిన్సిపాల్ గారు ఏదో చెప్తున్న వాడల్లా హటాత్తుగా అపివేశాడు. వెంటనే వాలంటీరు ఆ అక్క చెల్లెళ్ళ నుద్దేశించి "యేమండీ , ఎగ్జిబిషను ఇటు కాదు. మీరు కుడివేపుకు వెళ్ళాలి" అన్నాడు.
ఆ అమ్మాయి విసుగుతో "అబ్బ ఏమిటండి ఇది, అటు వెళ్తే ఇటన్నారు. ఇటు వస్తే అటు వెళ్ళమంటున్నారు. ఇదేదో పద్మవ్యూహం లా ఉంది బాబూ" అన్నది.
అసంఖ్యాకమైన మెడికల్ కాలేజీ వరండాల్లో దోవ తప్పటం ఏమంత విచిత్రమైన సంగతేమీ కాదు, కాని అది గ్రహించని వాలంటీరు "పద్మ వ్యూహమేమీ కాదు. ప్రేక్షకులు ఎటు వెళ్ళవలసింది బాణాలతో సహా గుర్తులు వేశాం. వాటిని సరిగ్గా చూడకుండా ఎటు పడితే అటు వెళ్ళటం మీదే తప్పు. అదిగో చూడండి" అంటూ బాణం వేపు చెయ్యి చూపించి, వెంటనే సిగ్గుపడుతూ "ఐయామ్ సారీ" అన్నాడు.
ప్రేక్షకులకు దోవ తెలియటానికి బాణం ఆకారం లో కత్తిరించి వెదురు బొంగుకు కట్టిన రేకు ముక్క గాలికి కాబోలు ఇటు తిరిగి వాళ్ళు నిలబడి ఉన్న వేపే చూపిస్తోంది. ఆ అక్క చెల్లెళ్ళు ఇద్దరూ వస్తున్న నవ్వును పెదాలతో అణచి వేసుకొన్నారు. వాళ్ళను దబాయించ పోయిన వాలంటీరు గంబీరంగా ఉండాలని కాసేపు వ్యర్ధ ప్రయత్నం చేసి, అక్కడున్న వాళ్ళందరి తో పాటు ప్రిన్సిపాల్ గారు కూడా నవ్వటం తో అతనూ నవ్వేశాడు.
"That shows the bad shape of our arrangements . Why dont you take them round. please do!"అన్నాడు ప్రిన్సిపాల్.
రాజు "నేను చూపిస్తాను రండి" అంటూ వాళ్ళిద్దర్నీ వెంట బెట్టుకుని బయలుదేరాడు.
ఆ అక్క చెల్లెళ్ళ తో పరిచయం ఆ విధంగా మొదలైంది.
రెండు మూడు గంటల సేపు అన్నీ వర్ణించి చెప్తూ వాళ్ళకు ఆ ఎగ్జిబిషన్ అంతా తిప్పి చూపించాడు. ప్రిన్సిపాల్ గారి విమర్శ కు కారణ భూతులైన ఆ యువతుల పై రాజుకు లోలోపల కోపంగా ఉన్నా, ఆ అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ తమాషాగా, కలుపుగోలుతనంగా కబుర్లు చెప్తూ ఆ కోపాన్ని కాస్తా యిట్టె కరిగించి వేశారు. పెద్దావిడ ఏదో స్కూల్లో టీచరు, చిన్నావిడ పి.యూ.సి. పాసై బి.యస్.సి లో చేరానని చెప్పింది. పంతులమ్మ కొంచెం మితభాషిణి చిన్నావిడ మాత్రం చాలా కలుపుగోలు మనిషి. కృత్రిమ సంకోచాలనే నేమీ లేకుండా ఆనతి కాలంలోనే దీర్ఘకాల పరిచయస్తు ల్లా ఎంతో ఆత్మీయులై పోయారు. రాజు వారిని కాంటీను కు తీసుకెళ్ళి డ్రింక్స్ ఇప్పించాడు.
"ఇవ్వాళ నేను చాలా తొందర పడ్డాను, నన్ను క్షమించాలి" అన్నది చిన్నావిడ ద్రాక్ష సిప్ చేస్తూ.
