Previous Page Next Page 
కౌగిట్లో జాబిల్లి పేజి 18

    భయపడుతూనే బయలుదేరింది గాయత్రి!

    ఆ రాత్రి కనీసం పన్నెండు గంటలు దాటేవరకూ పనివారు మేలుకుని వుంటారు. వర్ధని అయితే మరీ రాక్షసిలా కాపలా కాస్తుంది! యువకులు ఎటునించి అయినా విరుచుకుపడతారని!

    వారిని తప్పించుకుని వెళ్ళటం ఎలాగా అని ముందుగానే ప్లాన్ చేసింది ఆమని! అది విశాలమయిన భవనం కాబట్టి బండ్లు లారీలు కాంపౌండులోకి వచ్చేందుకు ఇంటి వెనుక భాగంలో ఒక గేటు వుంది. దాని తాళం చెవులు పగలే తీసి తన దగ్గర దాచుకుంది. వెడుతోంది దొంగల దోపిడికి కాబట్టి దొంగతనంగానే ఇంటిలోంచి బయటపడ్డారు. వెలుపలకు వెళ్ళాక ఊచల మధ్య నుంచే చేయిదూర్చి తాళపు చెవిని యధాస్థానంలో బిగించింది. ఆ కాస్త అలికిడి విని బ్యాటరీలైటు ఫోకస్ చేసింది వర్ధని!

    అప్పటికే వారు ప్రక్కకు తప్పుకున్నారు.

    తాళం యధాస్థానంలో కన్పించటంతో వర్ధని వెళ్ళిపోయింది. వీధినపోతూ వుంటే ఇళ్ళన్నీ తలుపులు బిగించి కన్పించాయి. యువకులు తప్ప ఇంకెవరూ బయట తిరిగేందుకు సాహసించని పరిస్థితి కన్పిస్తోంది. అనుకున్న చోటుకి అక్కను తీసుకుని వెళ్ళింది ఆమని!

    గాయత్రి భయంభయంగా నడుస్తోంది.

    వారిని చూచిన తరువాత చెట్టు చాటు నుంచి వచ్చాడు వాల్మీకి!

    "మా అక్క గాయత్రి" అంటూ పరిచయం చేసింది ఆమని!

    "నమస్కారం అండీ!" అని పలకరించాడు! అతడు అలా అనటం గాయత్రికి చాలా సిగ్గుగా అనిపించింది. తనకి నమస్కారం పెడతాడేవిటి?

    "మా అక్క ఇంకా టాకీ సినిమాల్లోకి రాలేదు. మూకీ సినిమాల కాలంలోనే వుంది. మగవాళ్ళతో మాటాడాలంటే భయం. మీరేమీ అనుకోకండి" అంది ఆమని?" వాల్మీకి సరదాగా నవ్వేశాడు.

    "అలా వుండటం మంచిదే! మనచుట్టూ వున్న మనుషుల్ని బట్టి మనం ప్రవర్తించటం నేర్చుకోవాలి. ఇది పల్లెకదా!" అన్నాడు.

    చాలా తెలివయిన వారే! వెంటనే గ్రహించేశారు. తను ఇలా ఉండటమే ఆయనకు కూడా కష్టం కాబోలు అనుకుని లోలోపల సంబరపడి పోయింది గాయత్రి.

    "మన ప్రోగ్రాం ఏమిటో చెప్పలేదింకా" ఆమని వాల్మీకిని ప్రశ్నించింది.

    "ఏదో ఒక కొంటె పని చేయటమే దొంగల దోపిడి పండుగలో పరమార్ధం"

    "మనం ఎలాంటి పని చేద్దామంటారు?"

    "అదే ఆలోచిస్తున్నాను. మీ అక్కగారు కూడా వచ్చారు కదా?"

    "మన వెంట నిలబడి వుంటే చాలు! అదేమీ చేయలేదు. పెద్దగా ఆశలు పెట్టుకోకండి! మీరే నిర్ణయించండి" ఆమని.

    "తెలుస్తూనే వుందికదా! మీ అక్కగారు చాలా నెమ్మది స్వభావం" అన్నాడు. మనిషిని చూడగానే అన్నీ పసిగట్టేస్తారు అనుకుంది గాయత్రి!

    "ముందు ఎవరు ఎవరేం చేస్తున్నారో చూద్దాం! ఆ తరువాత వీలయితే మనం కూడా ఒక కొంటె పని చేద్దాం. లేదంటే చూచి ఆనందించి వెళ్ళిపోదాం" అని తన అభిప్రాయాన్ని చెప్పాడు.

    "అలాగే! కాని ఈ రోజు మాత్రం జీవితమంతా శాశ్వతమయిన గుర్తుగా నిలిచిపోవాలి. ఒక తీయని జ్ఞాపకం! ఇలాంటివే జీవితమంతా వెన్నంటి వస్తాయి. మనుషులు పెద్దయిన తరువాత డబ్బు సంపాదిస్తారు. కాని చిన్నతనంలో అంతకన్నా విలువయిన జ్ఞాపకాలను సంపాదించుకుంటారు. బ్రతికి వున్నంత కాలం జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనసుకి గిలిగింతలు కలుగుతాయి. అలాంటి జ్ఞాపకమే మీరు నాకు ఇవ్వాళ ఇవ్వాలి! సారీ! నాకు కాదు. సవరించుకోండి. మాకు అని అర్ధం చేసుకోండి!" అన్నది ఆమని!

    ఆమె అలా గల గల మాటాడుతోంటే అంతో ఇంతో మరదలి చురుకుకూడా చూపుతోంటే చాల సంతోషించాడు వాల్మీకి.

    "దీనికి అసలు మగవాళ్ళంటే భయంలేదు. ఎలా బ్రతుకుతుందో పాపం. పిచ్చితల్లి! కాదు పిచ్చి చెల్లి" అనుకుంది గాయత్రి!
   
    వెంట ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కోతిమూకలు చూచాయంటే అల్లరి మొదలెడతాయి. అంతేకాక ఈ విషయం దివాణం వరకూ పోవచ్చు. గుట్టు బయట పడవచ్చు.

    రాణి సుమిత్రగారు కూతుళ్ళని కేకలుపెట్టి ఊరుకోరు. తనని గురించి అంతో ఇంతో తక్కువగా అనుకుంటారు.

    ఇవన్నీ అలోచించి తమ ఉనికి బయటపడకుండా రహస్యంగానే ఉండాలని తీర్మానించుకున్నాడు. దొంగలకు కూడా తెలియని దొంగదారుల వెంట వారిని గ్రామంలోని మారుమూల వీధికి తీసుకుపోయాడు. ఆమని బాగా హుషారయిపోయింది.

    గాయత్రి మాత్రం బితుకు బితుకుమంటూ అనుసరిస్తోంది!

    ఆ చిన్నవీధి అంతటితో ఆసాంతం అయిపోయినట్టుగా ఒక రాతి గోడ వారికి అడ్డువచ్చింది. అది పురాతన కాలపు గోడ.

    గోడ అవతల నించి గుసగుసలు వినిపిస్తున్నాయి.

    అప్పటికే కొన్ని కోతులు గోడ అవతలకు చేరినాయి. తాము చేయవలసిన కొంటె కోణంగి పనిని వారు చర్చించుకుంటున్నారు. గోడ మీదికి ప్రాకి వారి మాటలు ఆలకించాడు వాల్మీకి!

    "ఈ పూటతో గజలక్ష్మి గల్లంతు అయిపోవాలి" ఒక యువకుడు ప్రతిపాదించాడు. సుందరకాండలో శింశుసావృక్షం కొమ్మమీద వ్రేలెడంత అయిపోయి కూర్చుని అశోకవనం విశేషాలన్నీ వింటున్న హనుమంతుడయి పోయాడు వాల్మీకి కూడ!

    గజలక్ష్మి అంటే భర్త చనిపోయిన ఒక దురదృష్టవంతురాలు. గ్రామంలోకి పది సంవత్సరాల క్రితం ప్రవేశించింది. వయసులో భర్తను పోగొట్టుకున్న ఆమె సుమిత్రాదేవి గారిని ఆశ్రయించింది.

    కొంతడబ్బు సాయంచేసి ఒక చిల్లరకొట్టు నడుపుకోమని ఆదేశించింది సుమిత్ర. డబ్బు తీసుకుని గజలక్ష్మి వ్యాపారం ప్రారంభించింది. అసలే బొద్దు శరీరం! నల్లని రూపం! త్రాచుముందు కూర్చుంటే అతికించినట్టు సరిపోయింది. క్రమంగా మాటలు నేర్చుకుంది.

    వ్యాపారంలో ఆయువు పట్టులు అర్ధం చేసుకుంది.

    ఒక ఇల్లు నాలుగు కొండ్రల భూమి కొంది. వడ్డీ వ్యాపారం కూడ చేస్తోంది అని వినికిడి. ఈ విషయం సుమిత్రగారికి తెలిస్తే చీరేస్తారు కాబట్టి  చాలా రహస్యంగా జరుపుతోంది.

    డబ్బు చేరిన తరువాత ఆమె జీవితంలోకి చాలా మార్పులు వచ్చాయని చుట్టుప్రక్కల గ్రామాల యువకులు గమనిస్తున్నారు. మగవాడు లేని యింటిమీదికి దాడిపోవటం మంచిది కాదని ఊరుకున్నారు.

    కాని ఇవాళ అవకాశం దొరికింది!

    దొంగలదోపిడిలో ఒక సమాజ శ్రేయస్సు ఉంది. మామూలు రోజులలో అయితే మా గొడవలు మీకు అనవసరం అని బుకాయించే వీలుంది. ఇలాటి రోజున అలాంటి వారికి బుద్ధి చెప్పవచ్చు!

    మరునాడు అది ఒక నేరంగా పంచాయితీలో పెట్టినా ఏదో పండుగ రోజు అని కుర్రవాళ్ళు ముచ్చట పడ్డారు. అంత మాత్రానికే ఇంత బాధ పడాలా? అయినా ఆ ధోరణిలో ఎవరెవరున్నారో ఇప్పుడెలా తెలుస్తుంది పోనిద్దూ అని పెద్దవాళ్ళు కొట్టి పారేయటానికి వీలు అవుతుంది.

    అందుకే కొందరు యువకులు ఈరోజు గజలక్ష్మికి బుద్ధిచెప్పే కార్యక్రమం చేపట్టారు.

    "ముందువెళ్ళి తలుపులు తట్టేది ఎవరు?" ఒకరు ప్రశ్నించారు.

    "నేను! నేను" అంటూ చాలా మంది ముందుకు వచ్చారు.

    కిటికీలోంచి తొంగి చూడకుండా గజలక్ష్మి తలుపు తీయదు. అందువల్ల మిగిలిన వారంతా దూరంగా వుండాలి అని నిర్ణయించారు. వారంతా వీధి మలుపు పందిళ్ళ క్రీనీడలో కాపు కాచారు.

    ఒక యువకుడు ముందుకు వెళ్ళాడు.

    కాని గజలక్ష్మి వ్యాపారస్తురాలు! భారీ కాయం! అంత తేలికగా కదలలేదు. కదిలి వచ్చినా నమ్మి తలుపు తీయదు.

    కనుక వారికి పరాభవం ఎదురు అవుతుందని ముందుగానే గ్రహించాడు వాల్మీకి! అతని మనసులోకి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది.

    "వారిని ఫాలో చేద్దాం! ఏదో జరుగుతుంది. మాంచి హుషారులో కుర్రకారు ఉరకలు పెడుతున్నారు. త్వరగా రండి! దిగిరండి!" అంది ఆమని! గాయత్రి భయంగా చూస్తోంది.

    ఇలాంటి దుందుడుకు పనుల్లో పాల్గొంటే అల్లరి అయి తెల్లవారి అమ్మగారిదాకా వస్తే తన పరిస్థితి ఏమిటా? అని అలోచించి మహా దిగులు పడిపోతూ ఉందామె.

    ఆ తమాషా చూడాలంటే వారితో వెళ్ళి ప్రయోజనం వుండదు. మీరుకూడా గోడమీదికి వస్తే మనమంతా ఒక చోటుకి వెడదాం" అన్నాడు వాల్మీకి! అతడా మాట అన్నదే ఆలస్యంగా చరచరమని గోడమీదికి ఎగబ్రాకింది ఆమని!

    "అమ్మో! పడిపోతావ్! జారి పడిపోతావ్!" అంటూనే వుంది గాయత్రి! ఆమె కంగారు పూర్తి అయేలోగా హెచ్చరికలు ముగిసేలోగా పూర్తిగా పైకి చేరుకుంది ఆమని! వాల్మీకి ప్రక్కనే గోడమీద నిలబడింది.

    "అక్కా! నువ్వుకూడా వచ్చెయ్యి!" అంది.

    "అమ్మో! అక్కడికా? నేను కూడానా?" గాయత్రి అడిగింది.

    "నువ్వేలే! ఏం అంత భయమా? త్వరగా వచ్చెయ్యి! అంది ఆమని.

    గాయత్రి సందేహంగా నిలబడింది! ఆమె అనుమానం ఏమిటో గుర్తించాడు వాల్మీకి!క్రిందికి వంగి చేయి అందించాడు.

    మరో వైపు నుంచి ఆమని కూడా చేయి అందించింది.

    చిక్కున పడిపోయింది గాయత్రి తప్పలేదు.

    సిగ్గుతో చితికి వారికి రెండు చేతులు అందించింది. బరువుకి తూలి ముందుకి పడిపోకుండా ఒక చేత్తో ఆమనిని కూడా పట్టుకున్నాడు. రెండవ చేయి గాయత్రి పట్టుకుంది.

    ఇద్దరూ కలిసి బొమ్మలా వ్రేలాడ పడిపోయిన గాయత్రిని గోడ మీదికి చేర్చారు! అక్కడ నుంచి గోడ మీద కొంత దూరం ముందుకు పోవాలి! ఆ తరువాత ఇంటి మీదకి చేరుకోవాలి! రెండు ఇళ్ళు దాటి పై కప్పుల మీదుగా నడిచిపోవాలి!
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS