అలా మా అమ్మ తన ఆయుర్దాయం మాకూ, మా నాన్నకీ ఇచ్చి, తను యాబైఏళ్ళు వచ్చేటప్పటికి చనిపోయింది.అప్పటినుంచి ఇంటిభారం అక్కయ్యమీద పడింది. చదువు మాన్పించారు నాన్న. అమ్మ స్థానం అక్క భర్తీ చేయాల్సివచ్చింది. అమ్మలాగే వంటచేసి, ఇల్లు చూసుకొని, మమ్మల్నందరినీ చూసుకున్న అవిడలాగా అక్కయ్య త్యాగం మాత్రం చేయలేకపోయింది.
ఏడాది కూడా తిరక్కుండానే ఇంటి పక్కనే వుండే కుర్రాడితో మెడ్రాస్ పారిపోయింది. "అతను సినిమాల్లో వేషం ఇప్పిస్తానని తీసుకెళ్ళాడనీ, ఎక్ స్ట్రా వేషాలేసుకుంటూ, ఏపూట తిండి ఆ పూట సంపాదించుకుంటున్నానని, తీసుకెళ్ళినవాడు ఏడాదిగా పత్తాలేడనీ, తన గురించి ఎవరికీ చెప్ప్దద్ద "నీ, రెండేళ్ళ తర్వాత ఉత్తరం రాసింది నాకు. అది వేరేసంగతి.
అన్నయ్య మెట్రిక్ తప్పాడు. అయినా పిల్లనివ్వడానికి మగాడైతేచాలని ఎదురుచూసిన పిల్లతండ్రి అన్నయ్యను అల్లుడిగా చేసుకుని మా అందరికీ దూరంగా తీసుకెళ్ళిపోయాడు. మా చెల్లెళ్ళల్లో ఒకతి పెళ్ళికాకుండానే పదహారేళ్ళకే గర్బవతి అయి ఆత్మహత్య చేసుకుంది.మరో చెల్లి కొంచెం మెతక,వేర్రిబాగులది. దాన్ని ఓ ముసలాడికిచ్చి తూతూ మంత్రంగా పెళ్ళిచేశాడు నాన్న. మరొకడు చిన్నాచితకా పనులుచేస్తూ బతకటం ప్రారంభించాడు. ఇదీ మా కుటుంబ చరిత్ర. ఇంక నా చరిత్ర చెబుతాను విను."
అనూష కుతూహలంగా వింటోంది. వింటున్న కొద్దీ వీణమీద సానుభూతి వెల్లువలా పొంగింది. తను రోజూ చూసే వీణకాకుండా మరో వీణ కనిపించసాగింది. ఆ చలాకీతనం, తెగింపు,విచ్చలవిడి మాటలు ఏమీ లేవు. జీవితంలో ఆటుపోట్లకు గురై అలసట తీర్చుకుంటున్నట్లుగా మంచం మీద పడుకుని చెప్పసాగింది.
"మా నాన్న తన సంతానాన్ని చూసి ఎంతగా కుమిలిపోయాడో తెలియదుగానీ, అందరూ తలా ఒకదారి వెళ్ళిపోయాక ఆయనని కనిపెట్టుకుని వుంటూ, ఎస్సె స్సీ పాసైన నాతో ఓసారి మనసు విప్పి మాట్లాడాడు.
"వీణా!ఏ జన్మలో ఏ పాపం చేశానో నా కుటుంబం చెల్లాచెదరైంది. దీనిక్కారణం మన పేదరికం. మీకెవరికీ కడుపునిండా తిండి పెట్టలేకపోయాను. మంచి బట్టలు కుట్టించలేకపోయాను. కనీసం అరటిపండు కూడా కొనివ్వలేకపోయాను. అందుకే వీళ్ళంతా ఎవరిదారిన వాళ్ళు వాళ్ళ సుఖం, సంతోషం వెతుక్కుంటూ వెళ్ళిపోయారెమో. భగవంతుడు ఇంకా నామీద ఈమాత్రం దయతల్చాడు కాబట్టి నినైనా మిగిల్చాడు. నువ్వు మాత్రం ఇలాగే ఎలాగో కష్టపడి పరీక్షలు పాసై కనీసం డిగ్రీ అన్నా చదువుకో. మంచి పిల్లవాడిని చూసి పెళ్ళిచేసుకో. సదాశివం పిల్లలో కనీసం ఒక్కళ్ళన్నా పైకి వచ్చారని నలుగురూ అనుకునేలా బతుకు. నేనూ,మీ అమ్మా పైనుంచి చూసి సంతోషిస్తాం తల్లి" అన్నాడు
నాకు బాగా ఎడుపు వచ్చింది చాలా సేపు వెక్కి వెక్కి ఏడ్చాను. నా తల నిమురుతూ ఉన్న నాన్న చేయి మరి కదలలేదు.
ఆ తరువాత నేను, మా తమ్ముడూ ఆ ఇల్లు ఖాళీ చేసి విజయవాడ వెళ్ళిపోయాం. వాడు అక్కడ మెకానిక్ షాపులో పని చేస్తూ తనక్కావల్సిన డబ్బు తను సంపాదించుకునేవాడు ఇల్లు గడపాల్సిన భారం మాత్రం నామీద పడింది. నేను ఉద్యోగం చూసుకోవాలని ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో చాలా ఇబ్బందులు, అవమానాలు ఎదురైనాయి. ఉద్యోగం కావాలంటే ఏం చేయాలో చాలా ప్రాక్టికల్ గా చెప్పేవాళ్ళు. మొదట్లో వాళ్ళని తిట్టి వచ్చేసేదాన్ని. తరువాత తరువాత కడుపులో ఆకలి నాలో తెగింపు కలగచేసింది. అలా ముందు ఆకలి తీర్చుకోడానికి, తరువాత లా చదవాలన్న నా కోరిక తీర్చుకోడానికి నాపతనం ప్రారంభమైంది. తమ్మడు పెద్దవాడయ్యాడు. నా ప్రవర్తన నాడికి అసహ్యం వేసిందో, లేక నానుంచి విడిపోయి తను సుఖంగా బతకాలనుకున్నాడో తలియాడు గానీ వాడు వెళ్ళిపోయాడు.
ఆ విధంగా నేను చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ప్రేవేటుగా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి లా కూడా చేశాను. ఉద్యోగంలో సంపాదించేది తక్కువ అయినా నా అందం ద్వారా, నా వయసు ద్వారా నేను సంపాదించింది నా చదువుకి, బట్టలకీ, సరదాలకీ సరిపోయేది.బార్ కౌన్సిల్ లో రిజిష్టర్ చేయించుకుని ఓ సీనియర్ లాయర్ దగ్గరకెళ్ళాను. నన్ను తన జూనియర్గా చేర్చుకోటానికి మూల్యం అడిగాడు. ఒప్పుకున్నాను. నా ద్యేయం అంతా నేను పెద్ద లాయర్ని అవాలి. నాముందు ఒక లక్ష్యం వుంది. నేనా లక్ష్యాన్ని చేరడానికి నాకు రహదారి మూసుకుపోయింది. దానిక్కారణం నేను అనాథని.రెండు నాదరిద్రం. అందుకే నేను నడిచేదారిలో పెంటకుప్పలెదురైనా కళ్ళుమూసుకుని వెళ్ళిపోయాను. ఇవాళ నాకు హొదా వుంది, ఇల్లుంది, కారుంది, సంఘంలో పేరు ప్రతిష్టలున్నాయి. ఇవన్నీ ఎలా సంపాదించావాని నన్నెవరూ ప్రశ్నించలేదు."
అనూష అవునన్నట్టు చూసింది. వీణ లేచి అనూష ఒళ్ళో తలపెట్టుకుంది. "అనూ! అప్పుడంతా నేను అనుభవించింది జీవితం కాదు నరకం ముసలాళ్ళు, అందవిహీనులు, వెర్రి వెధవులు.... ఇలా ఎవడుపడితే వాడు అనుభవించిన శరీరం తగలబెట్టేశాను. నాకు నచ్చినవాడు, మనసారా నేను శృంగారా రసాస్వాదనలో కరిగిపోయేలా చేయగలిగినావాడు.దొరికాడనుకుని, తోటి లాయరు విశ్వనాథ్ ని ప్రేమించాను. మా ప్రేమ పెళ్ళిదాకా వచ్చింది. అతన్ని మోసం చేయడం ఇష్టంలేక జరిగిందంతా చెప్పేశాను. అంతే -ఆ తరువాత అతను పత్తాలేడు దాంతో నామనసు బాగా దెబ్బతిన్నది. నా జీవతానికింక పెళ్ళి, సంసారం,పిల్లలు వగైరా వుండవన్న సంగతి స్పష్టమయింది. అలా అనుకున్న తరువాత నేనెవరికోసం పవిత్రతను అరువు తెచ్చుకోవాలి? ఎవరికోసం క్రమశిక్షణతో బతకాలి? అనుకన్నాను. అందుకే అప్పటినుంఛీ నాకు నచ్చినవాడు, నేను మెచ్చినవాడు కనిపిస్తే చాలు, మనస్పూర్తిగా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాను."
అనూష వీణ తల మీద చేయివేసి నిమురుతూ, ఆప్యాయంగా అంది, "పిచ్చిదానా! మనం జీవించేది ఒకళ్ళకోసం కాదు, మనకోసం.సెల్ఫ్ డిసిప్లిన్ అలవాటుచేసుకోవడం జీవితం సుఖంగా సాగిపోవటానికి చాలా అవసరం. ఇక నుంచి అయినా ఈ పద్దతికి స్వస్తిచెప్పు. ఎవరో ఆదర్శమూర్తులు దొరక్కపోతేపోరు. నా మాట విని పెళ్ళిచేసుకో."
వీణ చిరునవ్వు నవ్వింది. "పెళ్ళా! ఆ మాట మాత్రం అనకు."
"పెళ్ళి చేసుకోకుండా ఎలా బతుకుతావు వీణా?"
"ఇలాగే నా ఇష్టం వచ్చినట్టు జీవితం అనుభవించాలి. రేపోమాపో పోయేదాన్ని. భర్త, పిల్లలు అనే బంధాలు ఎందుకు? నన్నిలా బతకనీ అను! నాకీ జీవితం బాగుంది."
