"ఓ ష్యూర్! స్పెషల్ ఐటమ్ చేయిస్తాలే తప్పకుండా రా."
ఫోన్ పెట్టేసి అనూష హాస్పిటల్ కి వెళ్ళడానికి తయారవసాగింది.
సాయంత్రం త్వరగా వచ్చేసింది అనూష ఇంటికి. వీణ కూడా చెప్పిన ప్రకారం ఆరున్నరకల్లా వచ్చేసి అనూషకోసం ఎదురుచూస్తోంది.
"చాలా కాలానికి నా డార్లింగ్ తో ఈ రాత్రి గడపడానికి వచ్చాను అంది వీణ.
"ఏం? ఇవాళ బాయ్ ప్రెండ్స్ ఎవరూ రావడంలేదా?"
"ఉహూ....సెలవిచ్చాను."
"నీకసలు సిగ్గులేదు వీణా! ఎంతకాలం ఇలా తెగిన గాలిపటంలా తిరుగుతావు? పెళ్ళిచేసుకోకూడదూ !"
అనూష మాటలకి పగలబడి నవ్వింది-"పెళ్ళా? నేనా....అంటూ.
"ఎందుకలా నవ్వుతావు? మతి చలించిందా?" కోపంగా అడిగింది అనూష.
"ఏం లేదు అనూ! పెళ్ళంటే నవ్వొచ్చింది. నేను పెళ్ళిచేసుకోవడం ఏమిటి? ఈ విషయం వింటే నాకు చాలా హస్యాస్పదంగా అనిపిస్తుంది. వివాహం గురించి, భర్త గురించి నేనెప్పుడూ ఆలోచించను. ఈ జన్మకి నాకు పెళ్ళి అనే తంతుతో సంబంధంలేదు. ఏడాదికో బాయ్ ఫ్రెండుని మార్చే నేను పెళ్ళిచేసుకుంటే నాతో కాపురం చేసే సహనం ఏ మగాడికుంది
ప్రపంచంలో?"
ఇన్ని అభ్యుదయ భావాలున్నదానిని. పెళ్ళి కాకుండా సెక్స్ చేయడం పాపంగా భావిస్తున్నావా?"
"పాపం, పుణ్యం అనేది కాదు సమస్య. డిసిప్లిన్. అంతే. ఎవరో మోసం చేసారనే, మరెవరో ఏదో అన్నరనో వాళ్ళమీద కోపంతో జీవితం ఎందుకు పాడుచేసుకుంటున్నావు? ఇవాళ నీతో ఎంజాయి చేసిన వాళ్ళంతా రేపు నీకేదన్నా కష్టంవస్తే ఆదుకుంటారా? నిన్నెంత చులకనగా చూసి మాట్లాడతారో తెలుసా?"
"డిసిప్లిన్...."వీణ దిండు మీద వెనక్కి వాలింది. "అనూ! పెళ్ళిచేసుకుని కాపురాలుచేస్తున్న వాళ్ళంతా నువ్వన్నట్లు డిసిప్లిన్ డ్ గా ఉన్నారా? భార్య భర్తనీ, భర్త భార్యని మోసం చేసుకుంటూ, కపట ప్రేమలతో, నాటకాలతో బతికేవాళ్ళను నేను ఎంతమందినో చూశాను"అంటూ ఇంకా ఇలా అంది.
"నా చిన్నప్పుడు మా ఇంటిపక్క పోర్షన్ లో కొత్తగా పెళ్ళయిన దంపతులు దిగారు. నాకప్పుడు పద్నాలుగేళ్ళు
వుంటాయి. నాళ్ళు చాలా అన్యోన్యంగా వుండేవాళ్ళు. అతను ఇంట్లో వున్నంతాసేపూ తలుపులు వేసే వుండేవి.
ఒక రోజు అతను ఆఫీసుకి వెళ్ళాడు. అమ్మ వాళ్ళింటికి వెళ్ళి గ్లాసుడు పంచదార తెమ్మని పంపించింది నేను గ్లాసు తీసుకుని బయలుదేరాను. వీధి తలుపు వేసి వుంది. ఆయన ఆఫీసుకి వెళ్లడం చూశాను. ఆవిడ లోపల ఉందేమో, వీధి తలుపు వేసిందేమో అని పక్కన ఓ సందులా వుండేది. ఆ సందుగుండా వెళితే పెరడు. అటునుంచి వంటగది వైపు తలుపు వుండేది. వెళ్ళాను.పెరట్లో కొన్ని చెట్లు, మరికొన్ని మొక్కలు వుండేవి.
మొత్తం కాంఫౌండ్ వాల్ ఎత్తుగా వుండేది. ఎవరితో సంబంధం లేదు. నేను వంటగది తలుపు తీసి ఉండటం చూసి, లోపలికి వెళ్ళాను. వంటగదిలో లేదావిడ. అందులోంచి నడవాలోకి దారి. నడవాగుండా వెళితే పడక గది, వరండా. నేను నడవాలోకి వెళ్ళేటప్పటికి పడక గదిలోంచి నవ్వులు వినిపించాయి. ఎవరోచ్చారబ్బా అని ఒరగావేసి వున్న తలుపులోంచి తొంగిచూశాను. ఆవిడా, ఇంకొకవ్యక్తి వున్నారు కానీ అతను ఆమె భర్తకాదు. ఎలాంటి స్థితిలో వున్నారో చెప్పమంటావా?" అడిగింది వీణ.
"వద్దులే"అనూష వీణ నోరు మూసింది.
"వినడానికే నీకంత కష్టంగా వుందే,నేనలాంటి సీన్లు కొన్ని వందలు చూశాను నేపుట్టి పెరిగిన వాతావరణంలో అనూ! మన ఈ స్నేహంలో నేనెన్నడూ నీ పర్సనల్ విషయాలు అడగలేదు. నాపర్సనల్ విషయాలు చెప్పలేదు. ఎందుకో తెల్సా? నీ పర్సనల్ విషయాలు నేనడిగితే నా అసహ్యకరమైనా జీవితం గురించి నేను చెప్పాల్సి వస్తుందని, అది విని నువ్వు నామీద జుగుప్ప పెంచుకుంటావేమోనని.
కానీ ఆరోజు నీరజ ఆశ్రమాన్నుంచి తప్పిపోయిన రోజు నీకు ఏమాత్రం మోరల్ సపోర్ట్ ఇవ్వకుండా, నేనుతాగి, ఎంజాయ్ చేసిన ఆరాత్రి తల్చుకుంటే నామీద నాకే రోత పుట్టింది. అప్పుడే అనుకున్నాను నాగతం నీకు చెప్పాలని. నేను నిన్నెప్పుడూ 'ఇంత వయసు వచ్చినా పెళ్ళెందుకు చేసుకోలేదు' అని అడగలేదు. నువ్వు రోజూ పూజించే ఆ పోటో చూసి, మీ అమ్మగారు, నాన్నగారులేరని అర్ధం చేసుకున్నాను."
అనూష దృష్టి తల్లిదండ్రుల పోటోమీదకిపోయి చిన్నగా నిట్టూర్చింది.
"అలాగే నీ ఈ ఆస్తి, ఈ ఇల్లు, నువ్వు బతికే విధానం,ఆశ్రమానికి ఉదారంగా నువ్విచ్చిన ప్లాట్లు, కట్టించిన గదులు,విరాళాలు, ఇవన్నీ చూస్తే మీ నాన్నగారు నీకు చాలా ఆస్తి యిచ్చి వెళ్ళారని తెలుసుకున్నాను.
నీకు తెలుసా!నాకు పదహారేళ్ళు వచ్చేదాకా మాకు రెండు పూటలా కడుపునిండా తిండి కూడా వుండేదికాదు. మానాన్న బడిపంతులుగా చేసేవాడు. మేం ఏడుగురం పిల్లలం. అందులో పెద్దవాడు అన్నయ్య. రెండు అక్క, మూడు నేను. తరువాత ఇద్దరు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. ముందు మా అన్నదమ్మల గురించి, అక్కచేల్లిళ్ళ గురించి చెప్తాను. ఆ తరువాత నా గురించి చెబుతాను. ఎందుకంటే నా గురించి చెప్పుకోవాడానికేంలేదు. చరిత్రకారుల గురించి చెప్పుకుంటాంగానీ చరిత్రహీనుల గురించి చెప్పుకోలెంకదా!
నాన్నగారికి ఎంత జీతం వచ్చేదో మాకు తెలీదుకానీ మమ్మల్ని అందరినీ గవర్నమెంటు స్కూల్స్ లో చేర్పించారు నాన్న. అమ్మతను తినకుండా మాకు,నాన్నకి పెడుతుండేది. అది కూడా మాకు సరిపోయేది కాదు. ఒకపూట కడుపునిండా తింటే, మరోపూట పెట్టింది తిని,సరి పెట్టుకోవాల్సి వచ్చేది.
