Previous Page Next Page 
యుద్దక్షేత్రం పేజి 18

 
    "ఔను, ఆ సంగతి ఆమెకూడూ గుర్తుంచుకోవలసింది. నేను ఆమెకు రాసిచ్చిన ఉత్తరాన్ని ఇలా పదిమంది ముందు చదివి వినిపించటానికి... ఇది కోర్టు హాలుకాదు! దిసీజ్ క్లాస్ రూం!"అన్నాడు ప్రశాంత్.

    "కానీ నీ ప్రవర్తనకి... నువ్వు చేసిన ఈ పనికి నీకు ఈ శిక్ష సరిపోదు! యు మస్ట్ బీ పనిష్ డ్! ఈ  విషయాన్ని ప్రిన్స్ పాల్ గారికి చెప్పి..." అంటున్నాడు ఇంగ్లీష్ లెక్చరర్.
 
     "సర్!" అంది మాధురి.

     "యస్ బేబీ!"

    "అనవసరంగా ఈ విషయాన్ని అంతదూరం తీసుకెళ్లటం ఇష్టంలేకనే మీకు ఇచ్చాను. మీరతనికి వార్నింగ్ ఇవ్వండి. ఇకనుంచి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యవద్దని...." అంది మాధురి.

     నరనరాల్లోంచి ఆవేశం పెల్లుబికింది ప్రశాంత్ కి.

      తనని నిలువునా దహించి భస్మం చేసేలా.. .నిప్పులు కురిపిస్తున్నట్లు చూస్తున్నాడు ఇంగ్లీష్ లెక్చరర్ వెంకటాచలపతి.

     నెత్తికెక్కిన పొగరుకి ప్రతిరూపంలా, అందాన్ని కవచంలా ధరించిన సివంగిలా, తనని కనికరిస్తున్నట్లు ఒక చూపు విసిరింది మాధురి.

     అంతమంది స్టూడెంట్స్ ముందు!

     ఎంత అవమానం!

    తను రాసిన ప్రేమలేఖని ఇంతమంది ముందు  బహిరంగంగా చదివి వినిపించి, తనని నవ్వులపాలు చేసిన ఈ పొగరుబోతు పోట్లగిత్త కొమ్ములు విరిచి చేతికివ్వాలనిపించింది ప్రశాంత్ కి.

     కానీ.....

     క్లాస్ రూం!

    ఆవేశాన్ని అణుచుకోవటం కన్నా మరో మార్గం లేదు....!

    కానీ ఈ అవమానానికి తగిన గుణపాఠం నేర్పించకపోతే, ఇదే కాలేజీలో ఆమెను తల వంచుకునేలా చెయ్యకపోతే... తన పేరు ప్రశాంతే కాదు!

    "మిస్టర్ ప్రశాంత్!నీ నుంచి ఇటువంటి బిహేవియర్ ని నేను ఎక్స్ పర్ట్ చెయ్యలేదు!"...... అంటూ ఇంకా ఏదో అనబోతున్నాడు వెంకటా చలపతి.

     "ఐయాం సారీ సర్!" ఖంగుమంది ప్రశాంత్ కంఠస్వరం.
 
     క్లాస్ రూంలో నిశ్శబ్దం.

      అందరూ అతన్నే చూస్తున్నారు.

     "మాదురిగారూ! పొరపాట్లు మానవ సహజం! క్షమాగుణం దేవతల లక్షణం! నన్ను మీరు...."

    "ఇట్స్ ఆల్ రైట్...." అంటూ వెనుదిరిగింది మాధురి.

     వొయ్యారాలు వొలికిస్తూ నడుచుకుంటూ వెళ్లిపోయింది ఆమె.

     "మిస్టర్ ప్రశాంత్! దిసీజ్ ది ఫస్ట్ ఎండ్ ఫైనల్ వార్నింగ్ టు యు!మరోసారి ఇటువంటి ప్రవర్తన ఎదురైతే.... నిన్ను సస్పెండ్ చెయ్యవలసి వస్తుంది" హెచ్చరించాడు  వెంకటా చలపతి.

     "ఓ. కే. సర్!" తల వూపాడు ప్రశాంత్.
 
     "యు మే గో?"

    ప్రశాంత్ మెల్లిగా తన సీట్లోకి చేరుకున్నాడు.

     అతని పక్కనే కూర్చుని వున్న ఒక మిత్రుడు మెల్లిగా అన్నాడు.

     "యు ఆర్ ఎ ఫూల్ ప్రశాంత్. ఆ పెంటమ్మకి సారీ చెప్పటం ఏమిటి బ్రదర్!"అని.

    ప్రశాంత్ తల గిర్రున తిరుగుతోంది.

                   9

    అతనికి క్లాస్ రూం లో చెబ్తున్న పాఠం వినిపించలేదు.

     కర్ణేంద్రియాల్లో సముద్రపు హోరు!

     హృదయంలో  పెనుతుఫాను ఘోష!

     గుండెల్లో భూకంపం!!!.....

    కానీ  ఆ రోజు ఉదయం ఒక విచిత్రం  జరిగింది. ప్రశాంత్ కాలేజీకి బయలుదేరి, బస్ స్టాప్ లో నిల్చుని వున్నాడు. ఒక కారు వచ్చి...... అతనిముందు ఆగింది. అందులోంచి మాధురి బైటికి దిగటం చూడగానే, ఠక్కున తల తిప్పుకున్నాడు ప్రశాంత్... ఆమె తన దగ్గరకి నడుచుకుంటూ వస్తోంది.

     అతన్ని  సమీపించింది.

    "నన్ను - నన్ను క్షమించు  ప్రశాంత్!"

    ఆమె కంఠస్వరం గాద్గదికంగా వుండటంతో ఆశ్చర్యంగా ఆమెవైపు చూసాడు. ఆమె కళ్లు దీనంగాతనవైపు చూస్తున్నాయి. "నేనెందుకలా ప్రవర్తించవలసి వచ్చిందో నీకు తెలిస్తే...." ఆమె గొంతులో దుఃఖం.

    "మాధురీ! అన్నాడు ప్రశాంత్.

     "నువ్వు రాసిన ప్రేమలేఖ పుస్తకంలోంచి జారి క్రింద పడింది. గిరిజ దాన్ని చూసింది. గిరిజ.... మన ప్రిన్స్ పాల్ గారి అమ్మాయి ప్రిన్స్ పాల్ గారు నాన్నగారికి మంచి ఫ్రెండ్.... జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే  ఊహించి, నాకు నీ మీద ఇష్టంలేనట్లు గిరిజకి అర్దం  కావటానికి, నేరం నీ మీదికి నెట్టేసాను. నన్ను క్షమించు ప్రశాంత్. ...." అందామె.
     అతని గుండె  వేగంగా కొట్టుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS