వారం రోజులు గడిచాయి
కృష్ణారావు పరిస్థితి రోజు రోజుకూ క్షీణిస్తూంది. ధైర్యాన్ని కోల్పోయిన అతడు రంగనాధాన్ని పట్టుకొని ఏడవసాగాడు. ఓనాటి రాత్రి.
"పారును ఓ అయ్య చేతిలో పెట్టకుండానే వెళ్లిపోతున్నానురా! నేను పోయాక నా తల్లికి దిక్కెవరు చెప్పు! దానికి ఎన్ని కష్టాలు రాసిపెట్టి ఉన్నాయో!"
"కృష్ణా! నేనొక మాట చెబుతాను వింటావా?"
"చెప్పు!"
"ఈ సలహా నాకై నే నివ్వడం ఒక విధంగా నన్ను చిన్న బుచ్చుకోవడం లాంటిది! నీ దగ్గర నాకు చిన్నతనం, మొహమాటం ఏమిటి? నువ్వు నా బాల్య స్నేహితుడివి! నీ మంచిచెడ్డలు నీకష్టసుఖాలు నావి. ఆ ఉద్దేశ్యంతో చెబుతున్నాను"
"అబ్బ! ఊరిస్తున్నావు!"
"దీనికి నువ్వు అంగీకరిస్తే కూతురినీ అల్లుడినీ చూచుకొని తృప్తిగా కళ్ళుమూయొచ్చు. కూతుర్ని ఓ ఇంటిదాన్ని చెయ్యకుండానే వెళ్ళిపోతున్నా నన్న బెంగనుండి నీకు విముక్తి కలుగుతుంది."
"రేయింబవళ్ళు నా కదే బెంగ రంగా! ఈ బెంగ నుండి నన్ను విముక్తుణ్ణి చేసి పంపు. చచ్చి నీకడుపున పుడతాను" అతడి శుష్క నేత్రాలలో ఆశాదీపం వెలిగింది, ఆ వెలుగు అతడి ముఖమంతా పరుచుకొంది.
"పారును నాకివ్వు! నాకోడల్ని చేసుకొంటాను సంతోషంగా!"
ఆశాదీపం చప్పున ఆరిపోయింది. చీకటి పరుచుకొంది కృష్ణారావు ముఖంలో.
"నువ్వు కోరుకొన్నట్టు కోటీశ్వరుల సంబంధం కాదు ఉన్నంతలో పరువుగా, మర్యాదగా బ్రతుకున్న కుటుంబీకుడిని! ఇక గిరిధర్ నువ్వు చూడనివాడు కాదు. డిగ్రీచదువులు లేకపోయినా చిన్న సంపాదన పరుడయ్యాడు! ఒక కుటుంబమనేది ఏర్పడితే పోషించుకోలేని అసమర్ధుడు కాదు. నీ కూతురంత అందమైనవాడు కాకపోయినా ఆమె ప్రక్కన నిలబెడితే ఎబ్బెట్టుగా మాత్రం కనిపించడు."
కృష్ణారావు ఒక దీర్ఘమైన నిట్టూర్పుఅణచుకొన్నాడు.
"గిరిధర్ కు పిల్ల దొరకదని కాదు! నీ మీద ఉన్న అభిమానంతో పారు అంటే మాకున్న మమకారంతో చెబుతున్నాను. నువ్వు ఏవో కలల మైకంలోపడి కూతురికి గొప్ప ఇంటి సంబంధం చేయాలని ఆశపడుతున్నావు! కాని, అది చాలా అసంభవమైన సంగతి కేవలం రూపం చూసి చేసుకొనే రోజులు రాలేదు. నా శ్వార్ధంకొద్ది నేనిలా బోధిస్తున్నానని అపార్ధం చేసుకోవద్దు."
కృష్ణారావు కళ్ళు నిండుకొని టపటప క్రింద రాలి పడ్డాయి .కన్నీళ్ళు. "రంగా! నిన్ను నేను అపార్ధం చేసుకొంటానా! పిల్లనిస్తానని నేననలేదు. సాంప్రదాయవిరుద్దంగా పిల్లనిమ్మని నువ్వే ఆడుతున్నావు. ఇందులో నీ స్వార్ధం కాక నీ స్నేహం, నీ మంచితనమే గోచరిస్తూంది! అవును ఇన్నాళ్ళు అర్హతలేని ఆశలు పెంచుకొన్నాను. ఈ ఆసలు వుయ్యాలలో ఊగుతూ కళ్ళెదుటే ఉన్న నీ కొడుకు నాకు కనిపించలేదు. గిరిధర్ కు ఏం లోపే లేదు. బుద్దిమంతుడు నెమ్మదైనవాడు."
"పారును నువ్వు కోరుకొన్నట్టు పూలలో పెట్టి పూజ చేయకపోవచ్చు. కాని, ఆపిల్లని ప్రేమతో చూచుకొంటాడు గిరిధర్. ఇక మీ వదిన సంగతి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? పారు సగం ఆమె చేతిలోనే పెరిగింది కదా? నీ పిల్లకు ఎలాంటి కష్టమూ రాదని హామీ ఇస్తున్నాను"
"అలాగే చెయ్యి రంగా? చిన్నప్పటినుండి ఎరుగున్న మీ చేతుల్లోనే నా కూతురిని పెడితే నాకింక అంతా నిశ్చింతే."
"పారుని కూడా ఒకమాట అడుగు! అది మరీ చిన్న పిల్లేంకాదుగా. ఆలోచించే వయసొచ్చింది ఆమెకు."
"మంచిది"
రంగనాధం వెళ్ళిపోయాడు.
లలిత దగ్గర కాస్సేపు కూర్చుని అప్పుడే వచ్చింది పారిజాత.
"ఇలారా, పారూ!"
"ఏం నాన్నా, మంచి నీళ్ళివ్వనా?"
"వద్దమ్మా! నీతో ఒకమాట చెప్పాలి!"
"ఏం నాన్నా?" తండ్రి ప్రక్కన కూర్చొంది పారిజాత.
