Previous Page Next Page 
ఏటిలోని కెరటాలు పేజి 18


    ఇద్దరం కూర్చొందాం. తింటూ కబుర్లుచెప్పు. సుబ్బయ్యగారూ, దేవతకు కూడా వడ్డించండి.

    "అమ్మో! నిస్సంగులకు కబుర్లు కావలసివచ్చాయే!" ఆశ్చర్యం అభినయించింది దేవదాసి.

    "నీది కానీ, బావా! తరువాత."

    "మాటలకేంగానీ, కూర్చో..... సుబ్బయ్యగారూ!"

    "అలాగే. బాబూ!" బావ మరదళ్లకు దోస్తీ బాగా కుదిరినట్లుందని నవ్వుకొంటూ బావగారికి ఎదురుగా మరదలికి వడ్డన చేశాడు సుబ్బయ్య.

    దేవదాసి భోజనం పూర్తిచేసి లేచేటప్పటికి, భార్గవరామ్ తన ప్లేటు ఖాళీచేశాడు, ఆడివచెప్పే కబుర్లకు మధ్యముఖ్య ఆసక్తి వ్యక్తం చేస్తూ ఊకొడుతూ; ఈ వాతావరణం అతడికెంతో ఆహ్లాదంగా ఉందీనాడు. అమ్మకూడా అలా ఎదుట కూర్చొని ఏవో ముచ్చట్లు చెబుతూ ఆప్యాయంగా తినిపించేది. నిర్లిప్తంగా ఊకొట్టి గబగబా తిండి పూర్తికానిచ్చి లేచి వెళ్ళిపోయేవాడు. అప్పుడు అమ్మమనసు ఎంత నొచ్చుకొనేదో జాలివేసింది భార్గవరామ్ కు. బాధ అనిపించింది, ఇక నుండి అమ్మను నొప్పించే విధంగా తన ప్రవర్తన ఉండకూడదనుకొన్నాడు.

    ఒక స్త్రీపై జనించే ప్రేమ సమస్త మానవాళిపై ప్రవహించే అవకాశమున్నదని ఒక ఆంగ్ల రచయిత చెప్పిన మాట గుర్తువచ్చి నవ్వుకొన్నాడు భార్గవరామ్. ఈ నిర్మోహిని ప్రేమమూర్తిగా మార్చివేస్తావా, దేవదాసి!"

    చేతులు, మూతీ కడుక్కొని వెళ్ళి దేవదాసి కొంగు అందుకొని గబగబా మూతీ, చేతులు తుడుచుకొని వదిలిపెట్టాడు, ముసిముసి నవ్వులు ఒలకబోస్తూ.

    "ఇదేం పని? చిలిపితనం చిన్నగా నేర్చుకొంటున్నారు, బావగారు! ఎందుకో మరి!" కన్నెపిల్ల చిరుకోపంలోని అందాలను చూస్తూ హాయిహాయిగా నవ్వుకొన్నాడు. భార్గవరామ్ "తాంబూలం వేసుకుంటావా? అలవాటుందా!"

    తమలపాకు ఈనెలు తీస్తూన్న దేవదాసి కొద్దిగా సిగ్గుపడింది. "నాన్నకు అమ్మ కట్టిస్తుంటే అదేదో సరదాగా నేనూ కట్టించుకొనేదాన్ని. అదికాస్త అలవాటై కూర్చుంది అది లేకపోతే ప్రాణం ఎలాగో అయిపోతుంది..... కట్టివ్వనా నీకూ!"

    "ఉఁ." అడకత్తెర అందుకొని పోక కత్తిరిస్తూ అక్కడే కూర్చొన్నాడు భార్గవరామ్.
     
     " ? ? "

    ఆకుల్లో కావలసినవన్నీ వేసి, మడిచి లవంగం గుచ్చి ఒకటి ప్లేటులో పెట్టేసి, ఒకటి తను తీసుకొంది దేవదాసి.

    "అక్కడ పెట్టకపోతే యివ్వకూడదా?"

    "నాతో నిష్ఠూరమెందుకుగాని, యిచ్చేవాళ్ళు ముందరొస్తారు" నవ్వింది.

    "ఊహూఁ?" ఎవరో?" కనుబొమ్మలు ఆశ్చర్యంగా ఎగురవేశాడు గుమ్మం దగ్గరికి వెళ్ళి అన్నాడు." తిథి ఏమిటి దేవతా, యీ వేళ? వెన్నెల చక్కగా కాస్తున్నది. కాస్సేపు తోటలో తిరిగివద్దాంరా."

    తన కొంగు వదలని బావనిచూచి లోలోన ఆశ్చర్యపోతున్నది దేవదాసి. "అత్తయ్య బండ అని నామకరణం చేస్తే బండ అనుకొన్నాను. కాదు నా సహవాసం అతడి హృదయంలో స్పందన కలుగజేస్తున్నది. దారికి వస్తున్నాడు అబ్బాయి! శ్రావణ మేఘాన్ని చూచి వర్తించని మయూరి, తేనేలందించే విరినిచూచి రెక్కలాడించని తుమ్మెద. నాగస్వరానికి బద్ధంకాని సర్పం, కన్నెపిల్ల వయోలావణ్యాలకు వశంకాని యువక హృదయం ఉండబోదు! ఈ మార్పు అసహజమెందుకౌతుంది? జరుగవలసిందిది!" అతడిని వశం చేసుకోగల శక్తి తనలో ఉందన్న గుర్తింపు కలగడంతో దేవదాసిలో కొద్దిగా గర్వం అతిశయించింది!

    "పద" అన్నది లేస్తూ.

    రావుగారి పశువుల కాపరి ఇంటి నుండి తెచ్చుకొన్న అన్నం గిన్నె వాకిట్లో పెట్టుకుకూర్చున్నాడు. "సావీఁ, ఓ మామిడి ముక్కిటు పడేయండి. నోరు సప్పబడ్డది. ఇంటిదానికి బొత్తిగా ఒల్లు బరువైంది, సావీఁ! మిరపకారం నూరిముకాన కొట్టింది" అన్నాడు. వరండాలో బీడీ త్రాగుతూ కూర్చొన్న సుబ్బయ్యతో.

    "ఇవాళ శుక్రవారం కదరా? ఆవ తీయడానికి వీల్లేదు. కాస్త పప్పు వేస్తానుండు." లోనికి వెళ్లి పప్పు తెచ్చివేశాడు గిన్నెలో, సుబ్బయ్య.

    ఆవ బదులు పప్పు ప్రాప్తించిందన్న సంతోషం ముఖంలో నర్తిస్తూంటే "సావీఁ, సావీఁ అటు సూడండి? పుంజు పెట్టెంట పడినట్టుంది. హెఁహెఁహెఁ!" అని నవ్వాడు పశువుల కాపరి.

    "ఉష్!" వేలు మూతి మీదుంచి సైగ చేశాడు సుబ్బయ్య. తోటలోనికి ప్రక్క ప్రక్కనే నడిచి వెడుతూన్న దేవదాసీ భార్గవరామ్ లను చూస్తూ, మెల్లగా అన్నాడు : ఇద్దరికీ దోస్తీ కలిసినట్టుందిరా!"

    "సినబాబుకు అట్లంటి ఊహలుకూడా ఉన్నాయేంటి, సావీఁ? బొత్తిగా బుద్దావతారమాయే!"   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS