Previous Page Next Page 
అగ్ని కెరటాలు పేజి 18


    "ఆడదానికి పుట్టింటి మీద వుండే మమకారంరా ఇది! సంప్రదాయమూ అని విర్రవీగిన వాళ్లముందు ఇప్పుడు నేను పొందిన అంతస్తు ఐశ్వర్యంతో ఠీవిగా వెళ్లి నిలబడాలని వుంది. అప్పుడేమంటారో చూడాలని వుంది!"

    "అయితే నీ ఆటలో నన్నెందుకు పావుగా ఉపయోగించుకోవాలను కొంటున్నావు" చిరాకుగా అడిగాడు నవీన్.

    "పావు లేకపోతే ఆటే వుండదు. కాబట్టి అన్నయ్యకి పెళ్లీడు ఆడపిల్లలున్నారు!  నాకు పెళ్లీడు అబ్బాయున్నాడు. ఈ అబ్బాయిని పావుగా ఉపయోగిస్తే ఆట రసవత్తరంగా వుంటుందని! అయితే ఆ అమ్మాయి మీకు నచ్చినేతే చేసుకో!"

    "సరే! ఎలాగూ ఈ సంవత్సరం పై చదువులు స్టేట్స్ కి వెళ్ళిపోతాను! ఈ కొద్ది రోజులు గడపడానికి  ఏ ఊరయితేనేం? అయితే నాదొక షరతు!"

    "ఏమిట్రా అది?"

    "మీ వాళ్లని ఒక చిన్న పరీక్ష చెయ్యనివ్వాలి!" వాళ్ళేమీ మారలేదు అని రుజువైతే, వాళ్లతో వియ్యమందే ఆలోచన నువ్వు మానుకోవాలి!"

    "ఏం చేస్తావో చెప్పు"

    "......" నవీన్ ఆలోచన విని శంకరి నవ్వసాగింది. "సరే! నువ్వు చెప్పినట్లే నేను వింటాను!" ఒప్పుకొంది.

    నవీన్ మెడిసిన్ పూర్తి చేశాడు. అతడికి పల్లెపట్నం కాని  ఊళ్ళో పోస్టింగ్ వచ్చింది. ఆ ఊరు తన అమ్మమ్మ గారి ఊరని, ఆ ఊరికి పోస్టింగ్ రావడం ఏదో కాకతాళియంగా  జరుగలేదని, దీని వెనుక తన తల్లి ప్రోద్బలంతో తండ్రి వ్యవహారం నడిపాడని  తెలిసి ఈరోజు తల్లితో లడాయి పెట్టుకొన్నాడు నవీన్.



                     *    *    *    *   


   
    జయలక్ష్మి వంటింట్లో ఏదో పనిలో వుంది. మూడో కూతురు కాత్యాయని పరిగెత్తు కొచ్చింది. "ఎవరో వచ్చారమ్మా."

    "ఎవరే?"

    "ఏమో, నాకేం తెలుసు! వాళ్లనెప్పుడూ నేను చూడలేదు. ఆవిడకి నలభయ్యేళ్లుంటాయి" అతడికి పాతికేళ్లుంటాయి! తల్లీ కొడుకులట!  చిన్న సంచీతో దిగాడు! అన్నయ్యున్నాడా! వదినుందా?" అని అడుగుతుందామె.

    కొడుకుతో వచ్చిన ఈ మరదలెవరా అనుకొంటూ చెయ్యి తుడుచుకొంటూ వచ్చిన జయలక్ష్మి గుమ్మంలో టక్కున ఆగిపోయింది. ఆమె ముఖంలో ఇందాక వున్న ప్రసన్నత ఎగిరిపోయి పెనం మీద చిటపటలాడే పేలంగింజలా అయింది.

    మళ్లీ మళ్లీ వచ్చి నీ పాపిష్టి ముఖం చూపిస్తే  తప్ప నీ మనస్సుకు  తృప్తిగా వుండదేమో, పాపిష్టిదానా?" ఆవిడ కర్కశంగా అంది.

    "అన్నయ్య బయటికెళ్లాడా, వదినా." ఆవిడ దురుసుతనాన్ని పట్టించుకోనట్టుగా అడిగింది శంకరి.
 
     "అన్నయ్యట అన్నయ్య! నోరెట్లా వస్తుందో పిలవడానికి! మళ్లీ ఎందుకే తగులబడ్డావు" "నువ్వెంత తిట్టినా ఈసారి అన్నయ్యని చూడకుండా మాత్రం వెళ్లను!"

    "శంకరి కట్టుకొన్న చీర చాలా పాతగా, అక్కడక్కడ చిరుగులు పడి వుంది! ఒంటిమీద మాంగల్యాలు తప్ప వీసమెత్తు బంగారం లేదు! కాని ఆ ముఖంలో కళ, మనిషిలో హుందాతనం చూస్తే లక్ష్మిదేవికి తమాషా చేద్దామనిపించి పేద ముత్తయిదువ రూపం ధరించి వచ్చినట్లుగా అనిపిస్తుంది!

    ఆ అబ్బాయి అందంగా వున్న లొడుగుబొడుగు దుస్తుల్లో బఫూన్ లా వున్నాడు.
    "అ...అ ...అమ్మా! ఈ... ఈ... ఈమేనా మా... మా... మామయ్య భార్య?" అనడిగాడు నవీన్.

    ఆ నత్తి, మాట్లాడుతుంటే ఆ మనిషి వంకర తిరిగి పోవడం, ఆ ముఖంలో అర్దం పర్దంలేని న్వవు చూసి ఫకాలున నవ్వింది కాత్యాయని!

    లేచిపోయిన ఈ మేనత్త గురించి ఈ ఇంట్లో అందరికీ తెలుసు. ఆవిడకు ఓ నత్తి కొడుకు కూడా ఏడ్చాడన్న మాట.

    ఆ పిల్ల నవ్వుకు నవీన్ ముఖం కోపంగా మార్చేసి రోషంగా అడిగాడు! "ఎ....ఎ....ఎందుకు ... న... న.... నవ్వుతున్నావ్?"

    "స.... స... సర్కస్ లోంచి బ... బ..... బపూన్ తప్పించుకొని మా... మా.... యింటికి వచ్చాడేమిటా అని!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS