Previous Page Next Page 
చీకట్లో నల్లపులి పేజి 18

    "ఏమో మరి....కాని వారం రోజుల కిందట వాళ్ళిద్దరూ అదిగో ఆ బెంచీ మీదే కూర్చుని పావు గంట సేపు మాట్లాడుకున్నార్సార్. నేను బాగా చూశాను." అన్నాడు వీరయ్య.

    రాజారాం మరోసారి ఆలోచించాడు. 'అసంభవం' అని మరోసారి అనుకున్నాడు.

    సాలోచనగా నడుస్తూ తమ ఇంటి దారి పట్టాడు. దారిలో బీటు కానిస్టేబిల్ ఒకడు కన్పించాడు. రాజారాం కి విష్ చేస్తూ- మీ యింటిని ఓ కంట కనిపెడ్తున్నా సార్" అన్నాడు.

    "థాంక్యూ" అని అంతలోనే ఏదో ఆలోచన వచ్చినట్టు తన చేతిలోని పేపర్ని పోలీసుకి ఇస్తూ ఫోటో చూపించాడు. "ఇతన్ని మీరెక్కడైనా చూశారా? అనడిగాడు.

    పోలీస్ కానిస్టేబుల్ కళ్ళు చిట్లించి అటు చూశాడు. అంతలోనే గుర్తు పట్టినట్టు మొహం నిండా నవ్వాడు.

    "చూడకేం సార్... శ్రీ కృష్ణా మాసేజ్ పార్లర్ రెగ్యులర్ కస్టమర్..."అని ఆగి మళ్ళీ నవ్వుతూ నడుంకి ఉన్న బెల్టు బిగించుకున్నాడు. బిగించుకుంటూనే అన్నట్టు మిమ్మల్ని మాత్రం ఒక్కసారే అక్కడ చూసాను సార్" అన్నాడు.

    "అవును పనుండి వెళ్ళాను. వస్తా" అంటూ ముందుకి నడిచాడు రాజారామ్. అతని చెయ్యి పట్టుకుని రమణి అనుసరించింది.

    రాజారామ్ మనస్సులో కోట్లాది బల్బులు వెలుగుతూ ఆరుతున్నాయి.

    అప్పారావుకి సుందరి బాగా తెలుసు! ఎంత బాగా తెలుసు?

    'అదే తెలుసుకోవాలి." అనుకుంటూ ఆటోరిక్షా కోసం కేకేశాడు రాజారామ్.


                                   6


    ఆటోరిక్షా వెళుతూ ఉంటె రాజారామ్ మనసులోకి రకరకాల ఆలోచనలు వచ్చాయి. నిన్న డెస్క్ రూం లో జరిగిన సంఘటన అతని కళ్ళముందు మెదిలింది. అప్పారావు తనని కావాలని అవమానించలేదు. సుందరి ఫోటో "ఆంధ్రా టైమ్స్" లో పడకుండా చేద్దామన్న తాపత్రయంతోనే అతనలా మాట్లాడాడు. అలా పిచ్చిగంతులు వేశాడు. సుందరి ఫోటోని కసికసిగా ముక్కలు చేశాడు.

    అప్పారావుకి సుందరి బాగా తెలుసు!

    "డేడీ....ఆంటీ నన్ను షాపింగ్ కి తీసుకువెళ్తుంది గదూ?" అన్న రమణి మాటలకి రాజారామ్ ఈ లోకంలో పడ్డాడు.

    'ఆంధ్రా టైమ్స్' ఆఫీసు ముందు ఆటో ఆగింది. ఇద్దరూ మెట్లు ఎక్కి రెండో ఫ్లోర్ లోకి వెళ్ళారు. ఒక పక్క ఎడిటర్ చాంబర్స్ ఆ పక్కనే చైర్మన్ చాంబర్. కుడిచేతివేపు వరుసగా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ళు. దాన్ని అనుకుని డెస్క్ రూం టెలి ప్రింటర్లు ఒకటే మోత చేస్తూ వార్తల్ని తెస్తున్నాయి. టైప్ రైటర్లు టకటక మంటున్నాయి.

    అప్పుడే అటు వచ్చిన అప్పారావు తన గదిలోకి వెళ్ళబోతూ రాజారామ్ ని చూసి ఆగాడు.

    "హలో....రాజా..."

    "హలో...."

    "ఎవరూ...మీ అమ్మాయా?"

    "అవును"

    అప్పారావు రమణి వంక ఓసారి చూసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాజారామ్ రమణి చెయ్యిపట్టుకుని డెస్క్ వేపు నడిచాడు. తన సీట్లో కూర్చుని, రమణిని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు.

    "అదేమిటి డేడీ" అంది టెలిప్రింటర్ వేపు చూస్తూ.

    "దాన్ని తెలిప్రిన్తర్ అంటారు. ఎక్కడెక్కడనుంచీ వార్తలు అందులోంచే వస్తాయి. అంటే బొంబాయి ఉందనుకో. అక్కడొక టైప్ మిషన్ ఉంటుంది. అక్కడ టైప్ చెయ్యగానే ఇక్కడి మిషన్ లోకి అవి వచ్చేస్తాయన్న మాట అది సరే....కానీ ఇందాక చూడు ఒకాయన హలో అంటూ నన్ను విష్ చేశాడే..."

    "అవును"

    "అతన్ని చూశావా?"

    "ఆఁ చూశాగా!"

    "ఇప్పుడు కాదులే... ఇంతకు ముందు ఎప్పుడయినా...ఎక్కడయినా?"

    రమణి కాసేపు ఆలోచించింది. "అంటే నిన్న మధ్యాహ్నం సంగతా...డేడీ?" అనడిగింది.

    "నిన్నటి సంగతనే కాదు....అసలు ఇంతకు ముందు అతన్నెక్కడయినా చూసిన జ్ఞాపకం ఉందా?"

    "ఉఁ హుఁ ...ఆయన్ని చూసినట్టు లేదు డేడీ!"

    "సరేలే ఆ విషయం ఇక మర్చిపో!"

    సరిగ్గా అదే సమయానికి రాజేశ్వరి అక్కడికి వచ్చింది. ఆమెను చూస్తూనే 'ఆంటీ' అంటూ రమణి రాజేశ్వరి చుట్టూ చేతులు వేసి అల్లుకుపోయింది.

    "రెడీయా రమణి?" అంది రాజేశ్వరి రమణి తలమీద చెయ్యి వేస్తూ.

    "డబల్ రెడీ!"

    "ముందు 'కంచి క్లాత్ హౌస్' కి వెళ్దాం. ఆ తరువాత "బేబీస్ యూనివర్స్' అదయ్యాక 'వండర్ లాండ్'లో నీకు మంచి జీన్స్ తీసుకుంటాను."

    "థాంక్యూ ఆంటీ!"

    "అసలు బట్టల సెలక్షన్ లో మంచి థ్రిల్ ఉంటుంది..." అంటూ రాజేశ్వరి రాజారామ్ వేపు ఓరగా చూసింది.

    "ఏమో మరి చాలా విషయాల్లో నేను అజ్ఞానిని..." అంటూ జేబులోంచి పర్స్ తీశాడు.

    "అదేమిటి....? ముందా పర్స్ ని జేబులో పెట్టండి. లెక్కలు తర్వాత చూసుకుందాం!"

    "అదికాదు...ముందీ డబ్బు నీ దగ్గర ఉంచు, ఎందుకయినా పనికొస్తుంది."

    "మీ పాపకి నచ్చే బట్టలు కొంటాను. మీ కంటికి నచ్చిన చీర నాకు కొనండి. అక్కడికి ఎకౌంట్ క్లోజ్ అవుతుంది."

    "అంతేనంటావా"?

    "అంతే మరి!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS