24వ. సర్గ
1. "సీతా! నీవు - రాముని దలుచుట
నీకై నీవు క | ష్టాలు కోరుట |
అడవుల దిరిగెడు - వల్కలధారి
నిను కాపాడ ఏ | మున్నది దారి ?
ఇంతట రాముని - మరుచుట మేలు
ఇకపై నిన్ను - రావణుడేలు |"
అని బెదరించిరి - రాక్షస వనితలు
సీతను వేచిరి - క్రూర కర్మలు .... ||శ్రీ||
2. "మా పలుకులు స | మ్మతింపవేని
నీ మనసును మ | రల్చు కొనవేని |
నిన్ను హింసించి - వధించెదము
ముక్క ముక్కలుగ - పంచుకొందుము |
మధువు గ్రోలుచు - ఆరగించెదము
ఊరగాయవలె - నంచుకొందుము |"
అని బెదరించిరి - రాక్షస వనితలు
సీతను వేచిరి - క్రూర కర్మలు
__: 24 వ. స. సంపూర్ణము :__
25 వ. సర్గ
సీత రాక్షస వనితలతో :-
1. "ఓ నిశాచర - వనితల్లారా
లోక విరుద్ధపు - మాటలికేలా?
మేము మానవుల | ము మీరు దానవులు
మీ రాజుకు నే - భార్యగా తగను |
పతియే దైవము - సతికి సర్వము
చెదరని బంధము - అది మా ధర్మము |"
అని పల్కె సీత - దీనస్వరమున
రాక్షస వనితల - క్రూర వలయమున ..... ||శ్రీ||
2. "నను వధింపుడు - మీ శ్రమ తొలగు
నను భక్షింపుడు - ఆకలి తీరు |
నను హింసించి వ | ధించి వేసినను
దశకంఠుని వ | రింప నోల్లను |
ఏ మాత్రము మీ - మాటలు వినను
ఏ నాటికి మీ - మాయల బడను" |
అని పల్కె సీత - దీనస్వరమున
రాక్షస వనితల - క్రూర వలయమున ..... ||శ్రీ||
3. "ఓ రామా ! ల | క్షణా వినరాదా
ఈ సీత కధ - కష్టాలే కదా |
రావణుండు నను - హరియించినాడు
లంకాపురమున - బంధించినాడు |
క్రూర రాక్షసుల - నియమించినాడు
అడుగడుగున హిం | సించు చున్నాడు !"
అని శోకించుచు - జానకి తూలెను
రాక్షస వనితల - క్రూర వలయమున ..... ||శ్రీ||
4. "ఏ పూర్వ పాప - ఫలితమో కాని
ఈ పాపాత్ముల - పాలబడితిని |
లఘుకులోత్తముడు - నను బ్రోవునని
వేచి వేచి వే | సారి పోతిని |
ఎంత కాలమీ | వృధా ప్రయాసము
ఆత్మహత్యయే - నాకు శరణ్యము |"
అని శోకించుచు - జానకి తూలెను
రాక్షస వనితల - క్రూర వలయమున ..... ||శ్రీ||
__: 25 వ. స. సంపూర్ణము :__
26 వ. సర్గ
1. "రావణుడు నాకు - ఒసగిన గడువు
రెండు నెలలలో - తీరిపోవు |
క్రూర రాక్షసులు - ఆపై నన్ను
హింసించెదరు - కసి తీరగను |
ఈ పాపులచే - బలియౌటకన్న
ఏ విషమోతిని - పోవుట మిన్న |"
అని శోకించుచు - జానకి తూలెను
రాక్షస వనితల - క్రూర వలయమున ..... ||శ్రీ||
__: 26 వ. స. సంపూర్ణము :__
27వ. సర్గ
1. " ఓ సీతా! నీ | వెంత తెగువరివే
మాటకు మాట | ఎదురాడగలవే |
నిను గోరుకొను - లంకేశ్వరునే
కాదన గలిగియు - బ్రతికి యుంటివే |
ఎంతకు నీవు - మాకు లొంగవని
వెంటనే బోయి - విన్నవింతు" మని
కావలియున్న - రాక్షస వనితలు
కొందరు వెడలిరి - రావణుకడకు ..... ||శ్రీ||
2. అందున్న ఒక - వృద్ధరాక్షసి
తోటి రాక్షసుల - ఆవల ద్రోసి |
"కావలెనన్న - నన్ను వధింపుడు
సీతను మాత్రము - హింసింపకుడు
దారుణమైన - కలగంటి నేను
దానవులకది - ప్రళయం మేను |"
అనిదెల్పె త్రిజట - స్వప్న వృత్తాంతము
భయకంపితలై | రి రాక్షసీ గణము ..... ||శ్రీ||
