Previous Page Next Page 
దేవదాసు పేజి 18

    "పత్తో!"   
    "ఏమిటి?" అన్నది పార్వతి నోటికి అడ్డంగా పెట్టుకున్న చీర చెంగు తొలగించుకోకుండానే.
    "నీ మీద నాకు చాలా కోపం వస్తున్నది."
    ఈసారి దేవదాసు కంఠస్వరం వికృతమైపోయింది_"నాన్నగారు లేరు. ఇది నేను ఆపదలో వున్న కాలం. అయినా నీవు వుంటే నాకు ఏమీ చింత వుండదు. వదినగారి విషయం నీకు తెలిసే వుందికదా? అన్నగారి స్వభావం నీకు తెలియదేమీ కాదు! నీవే ఆలోచించు! అమ్మను తీసికొని నేను ఏం చేసేది? నా విషయం ఏమవుతుందో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. నీవు వుంటే అంతా నీ చేతికి ఒప్పగించి నేను నిశ్చింతగా వుండిపోతాను. ఏం పత్తో?"
    పార్వతి బోరున ఏడ్చింది." ఏడుస్తున్నావా ఏం? అయితే ఇక ఏమీ చెప్పను" అన్నాడు దేవదాసు.
    పార్వతి కళ్ళు తుడుచుకొంటూ "కాదు, చెప్పు" అన్నది.
    దేవదాసు ద్వారాన్ని సరిచేసికొని "పత్తో! ఇప్పుడు నీవు పూర్తిగా గృహిణివై పోయావు గదూ?" అన్నాడు.
    ముసుగు లోపలే పెదవులు పంటితో నొక్కుకుంటూ, మనసులోనే అనుకున్నది_"గృహిణిని ఏమయ్యానో! బూరుగు పువ్వును ఎన్నడైనా దేవుని సేవకు ఉపయోగిస్తారా?"
    దేవదాసు నవ్వుతూ "నాకు బాగా నవ్వు వస్తుంది. నీవు ఎంత చిన్నదానివి, ఇప్పుడు ఎంత పెద్దదానివై పోయావు? గొప్ప భవంతి, పెద్ద జమీందారీ, పెద్ద పెద్ద కొడుకులూ, కూతుళ్ళూ వున్నారు. అందరికన్నా పెద్దవారు చౌదరిగారు. ఏం పత్తో?" అన్నాడు.
    చౌదరిగారు పార్వతికి బాగా నవ్వుకొనే వస్తువు. అయన గుర్తుకు రాగానే ఆమెకు నవ్వు వస్తుంది. అంచేతనే ఇంత దుఃఖంలో కూడా ఆమెకు నవ్వు వచ్చేసింది. దేవదాసు తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో "ఏం, ఒక ఉపకారం చేసి పెట్టగలవా?" అన్నాడు.
    పార్వతి తలెత్తి "ఏమిటీ?" అన్నది.
    "మీ గ్రామంలో మంచిపిల్ల ఎవరైనా లభించగలదా?"
    పార్వతి కొంచెం దగ్గి "మంచి పిల్లా? ఏం చేసుకుంటావు?"
    "లభిస్తే పెళ్ళి చేసుకొంటాను. ఒకసారి గృహస్థుణ్ణి కావాలని కోర్కె కలుగుతున్నది."
    "బాగా అందమైనది కదూ?" అడిగింది పార్వతి గాంభీర్యంగా.
    "అవును. నీ మాదిరిగా."
    "మరి బాగా శాంత స్వభావం గలదిగా ఉండాలా?"
    "బాగా శాంత స్వభావంతో పనిలేదు. పైగా నీలాగా నాతో పోట్లాడగలగడానికి కొంచెం దుష్ట స్వభావం గలదిగా కూడా ఉండాలి."
    పార్వతి మనసులో అనుకొన్నది_ఇది ఎవరూ చేయలేరు దేవదాదా! ఎంచేతనంటే దీనికోసం నాతో సమానంగా ప్రేమ కావాలి" తరువాత పైకి అన్నది_"నేను దురదృష్టవంతురాలివి. నేనెంత? నాలాంటి వాళ్ళు నీ పాదధూళి తీసికొని ధన్యులు కావాలని భావించేవాళ్ళు ఎన్నో వేలమంది ఉన్నారు."
    దేవదాసు పరిహాసంగా నవ్వుతూ_"ఏం ఇప్పుడే అటువంటి అమ్మాయిని ఒక దానిని తీసుకురాగలవా?" అన్నాడు.
    "దేవదాదా, ఏం, నిజంగా పెళ్ళి చేసుకుంటావా?"
    "అటువంటి అమ్మాయినే, నేను చెప్పినట్లుగా వుంటేనే."
    ఆమె మినహా యీ ప్రపంచంలో ఆయనకు జీవిత సహచరిణిగా మరెవ్వరు కాలేరని కేవలం విప్పి చెప్పలేదు అంతే!
    "దేవదాస్! ఒక మాట చెపుతావా?"
    "ఏమిటీ?"
    "పార్వతి తనను తాను అదుపులో పెట్టుకుని "నీవు మధ్యం త్రాగడం ఎలా నేర్చుకున్నావు?" అన్నది.
    దేవదాసు నవ్వి "త్రాగడం కూడా ఎక్కడైనా నేర్చుకోవలసి వుంటుందా?" అన్నాడు.
    "అది కాకపోతే పోనీ అభ్యాసం ఎలా చేసుకున్నావు?"
    "ఎవరు చెప్పారు? ధర్మాదాసా?"
    "ఎవరైనా చెప్పనివ్వు, ఇందులో నిజం వుందా లేదా?"
    దేవదాసు దాచలేదు "కొంచెం వుంది" అన్నాడు.
    పార్వతి కొంచెం సేపే స్తబ్దంగా వున్న తరువాత "ఇంకా ఎన్నివేల రూపాయల ఆభరణాలు చేయించి ఇచ్చావు?" అని అడిగింది.
    "ఇవ్వలేదు. చేయించి వుంచాను. నీవు తీసుకొంటావా?"
    పార్వతి చేయిచాపి "ఇవ్వు, ఇదుగో చూడు, నా ఒంటిమీద ఒక్క ఆభరణం కూడా లేదు.
    "చౌదరిగారు నీకు ఇవ్వలేదా?"
    "ఇచ్చారు, కాని నేను వాటి నన్నిటినీ ఆయన పెద్దకూతురుకు ఇచ్చేశాను."
    "ఇప్పుడు నీకు అవసరం లేదన్నట్లుగా కన్పిస్తూ వుంది."
    పార్వతి ముఖం ఊపి తల వంచుకున్నది. దేవదాసు కళ్ళు చెమ్మగిల్లాయి. సాధారణమైన దుఃఖంలో వున్న స్త్రీలు తమ ఆభరణాలు తీసి ఇవ్వరు అని దేవదాసు మనసులో అనుకున్నాడు. కాని కంటి నుంచి వెలువడుతున్న అశ్రువులను ఆపుకొని నెమ్మదిగా అన్నాడు_"నేను ఏ స్త్రీని ప్రేమించలేదు, ఏ స్త్రీకీ నేను ఆభరణాలు ఇవ్వలేదు. ఇది అబద్దం."
    పార్వతి దీర్ఘంగా నిట్టూర్చి మనసులో "నా నమ్మకం కూడా అదే" అనుకొన్నది.
     కొంచెం సేపటి దాకా ఇరువురూ మౌనంగా వున్నారు. తరువాత "ఇక మధ్యం త్రాగనని ప్రతిజ్ఞ చేయి" అన్నది పార్వతి.
    "ఇది చేయలేను. నీవు నన్ను మరపించగలనని ప్రతిజ్ఞ చేయగలవా?"
    పార్వతి ఏమీ అనలేదు. ఇదే సమయంలో బయటి నుంచి సంధ్యాకాలపు శంఖధ్వని వినిపించింది. దేవదాసు కిటికీలో నుంచి బయటికి చూసి "సాయంత్రం మయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళు పత్తో!" అన్నాడు.
    "నేను వెళ్ళను, నీవు ప్రతిజ్ఞ చేయి."
    "ఎందుకు? నేను చేయలేను!"
    "ఎందుకు చేయలేవు?"
    "ఏం అందరూ అన్ని పనులు చేయగలరా?"
    "కోరుకుంటే తప్పకుండా చేయగలరు."
    "ఈ రాత్రికి లేచి పారిపోదాం, మరి నీవు నాతో పాటు రాగలవా?"
    పార్వతి హృదయ స్పందన హఠాత్తుగా ఆగిపోయినట్లే వుంది. అప్రయత్నంగానే ఆమె నోట "ఇది సాధ్యమా?" అనే మాట వచ్చింది.
    దేవదాసు కొంచెం మంచం పైకి జరిగి కూర్చొని "పార్వతీ! తలుపు తెరువు" అన్నాడు.
    దేవదాసు నిలబడి నెమ్మదిగా అంటూ వున్నాడు__పత్తో, బలవంత పెట్టి ప్రతిజ్ఞ చేయించడం మంచిదా? దాని వలన ప్రత్యేకమైన ప్రయోజనం ఏమైనా వుందా? ఇవ్వాళ చేసిన ప్రతిజ్ఞ బహుశా రేపు వుండక పోవచ్చు. ఎందుకు నన్ను అసత్యవాదిగా చేస్తావు?"
    మరికొన్ని క్షణాలు ఊరకనే నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఇదే సమయంలో ఏ ఇంట్లోనే గాని టన్ టన్ మంటూ తొమ్మిది గంటలు కొట్టింది గడియారం. దేవదాసు హడావిడిగా "తలుపు తెరువు పత్తో!" అన్నాడు.
    పార్వతి ఏమీ మాట్లాడలేదు.
    "వెళ్ళు పత్తో!"
    "నేను వెళ్ళనే వెళ్ళను." అని పార్వతి హఠాత్తుగా మైకం వచ్చిపడిపోయింది. చాలా సేపటి వరకు వెక్కి వెక్కి ఏడుస్తూ వుంది. ఈ సమయంలో గదిలో గాఢాంధకారమే వుంది. ఏమీ కన్పించడమే లేదు. దేవదాసు కేవలం తన ఊహ ప్రకారం పార్వతి నేలమీద పడి ఏడుస్తున్నదని తెలుసుకున్నాడు. "పత్తో!" అని నెమ్మదిగా పిలిచాడు.
    పార్వతి ఏడుస్తూనే "దేవదాదా, నాకు చాలా బాధ కలుగుతూ వుంది" అన్నది. దేవదాసు నెమ్మదిగా దగ్గరకు జరిగి వచ్చాడు. ఆయన కళ్ళల్లో గూడా నీళ్ళు నిండిపోయాయి కాని స్వరం మాత్రం వికృతం కాలేదు. "ఇదేమిటి, నాకు తెలియదు పత్తో!" అన్నాడు.
    "దేవదాదా నేను చచ్చిపోతాను కూడా. కాని ఎన్నడూ నీకు సేవ చేయలేక పోయాను, అది నా చిరకాల వాంఛ."
    చీకటిలో కళ్ళు తుడుచుకుంటూ "ఆ సమయం కూడా వస్తుంది" అన్నాడు దేవదాసు.
    "అయితే నాతోపాటు వచ్చేసెయ్. ఇక్కడ నిన్ను చూసే వాళ్ళు ఎవరూ లేరు."
    "నీ ఇంటికి వస్తే బాగా సేవ చేస్తావా?"
    "అది నా బాల్యకాలపు కోర్కె. ఓ స్వర్గంలోని దేవుడా! నా యీ కోర్కెను నెరవేర్చు. ఆ తరువాత నేను మరణించినా నాకేమీ దుఃఖం వుండదు."
    ఈసారి దేవదాసు కళ్ళు కూడా అశ్రువులతో నిండిపోయాయి. దేవదాస్ నా దగ్గరకు వచ్చేసెయ్!" అని పార్వతి మళ్ళీ చెప్పింది.
    దేవదాసు కళ్ళు తుడుచుకొని "సరే మంచిది, వస్తాను" అన్నాడు.
    "వస్తాను అని నా తల మీద చేయివేసి చెప్పు!"
    దేవదాసు తడుముకుంటూ పార్వతి కాలు తాకి "ఈ మాట నేను ఎన్నటికీ మరచిపోను. నేను వచ్చినందువల్లనే నీ దుఃఖం తొలగిపోతుందని భావిస్తే నేను తప్పకుండా వస్తాను. చావబోయే ముందు కూడా యీ మాట జ్ఞాపకం వుంటుంది" అన్నాడు. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS