'అమ్మా, ఇక్కడ చిత్రలేఖనం గూడా నేర్పుతారా?' అని అడిగింది రజియా ఆ ఆశ్చర్యంలో.
అమ్మా; అన్న పదం విని ఉలిక్కిపడింది సరోజినీ దేవి. ఆ పిలుపు ఆమెలో నిద్రాణమైన కోరికను లేపింది. ఆపుకోలేని ఆత్రుత , ఆనందం ఆమెను ఆవరించాయి. ఆవేదన కలత పెట్టగా దాన్ని ఆనందంతో అణిచి వేసింది. ఏ శక్తీ ఆమె ఆనందానికి అడ్డు రాలేక పోయింది. దేనికేసమో తహతహలాడుతుంది ఆ ఎండ బారిన మనసు. "మిమ్మల్ని అమ్మా అని పిలవాలని ఉంది. అభ్యంతరమా?" అంది రజియా.
ఆమె నుండి జవాబు రాకపోవడంతో ఆమె పరిస్థితిని చూసి తనేమన్నది తెలుసుకొని "రజియా" అంటూ ఆమె రజియాను ఆలింగనం చేసుకొంది. ఆ ఆలింగనం లో మితి లేని ఆనందముంది ఇద్దరికీ. ఆ హాయినీ , ఆ సుఖాన్నీ ఎన్నడూ పొంది ఉండలేదేమో! ఆ సుఖం ఎక్కడ దూరమవుతుందోనని ఆత్రుతతో ఒకరినొకరు గట్టిగా ఆలింగనం చేసుకొని ఉండిపోయారు. రజియా ఆమె హృదయం పై తలపెట్టి ఆ సుఖంలో పులకరించి పోయింది. అదొక క్రొత్త సుఖం, ఆనందం. అది ఎటువంటి ఆనందం? మాతృమూర్తి కన్నబిడ్డ కిచ్చే క్రొత్త సుఖాన్ని అనుభవిస్తుంది రజియా. తన బిడ్డను తన కౌగిలి లో తీసుకొని ఆనందించినట్లుంది సరోజినీ దేవికి. ఎందుకో ఆ ఆనందం? ఎన్నాళ్ళ దో ఆ బంధం?
"ఏమేమి చూశావమ్మా?' అడిగారు ఖాన్ గారు రాజియాను. అన్నీ విడిచి పెట్టకుండా చెప్పి "నాన్నా, ఆమె ఆలింగనం లో చిన్నప్పుడు నేను దేనికై మారాం చేస్తుంటినో ఆ సౌఖ్యం లభించింది." అంది.
"ఊ" అని దీర్ఘంగా నిట్టుర్చారు ఖాన్ గారు.
"నీకు కోపమా, నాన్నా?"
"ఆమె నీకు తల్లితో సమానురాలు. నువ్వామెకు బిడ్డవు. అటువంటి మీ ఆనందాన్ని రోజూ ప్రత్యక్షంగా చూసి ఆనందించే వ్రాత భగవంతుడు నా నొసట తప్పించాడమ్మా! నా కెందుకు కోపం' అని తన మొహం త్రిప్పేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఖాన్. తండ్రి మోహంలో బాధ, కన్నీరు చూసి అర్ధం కాక అతని మాటలను మననం చేసుకొని ఒక నిర్ణయానికి రాలేక పోయి అక్కడే కూలబడింది రజియా.
13
రాజ్ విధీ విరామం లేకుండా ఆనందరావు గారి ప్రక్కనే కూర్చుని పరిచర్యలు చేయసాగాడు. అతని సేవలో కాస్త కోలుకొన్నారు ఆనందరావు గారు. సాయంకాలం "ఎలా వుంది నాన్నా?' అంటూ వచ్చింది వసంత.
"నా తలకాయలా ఉంది. ఎలా ఉంటె నీకెందుకు? నే చస్తే నీకెందుకు? ఫో" అన్నారాయన కోపంగా.
ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది వసంత.
ఆవేశం ఎక్కువ కాగా అలాగే ప్రక్కపై పడుకోబెట్టాడు రాజ్ ఆయన్ను. బయటికి వెళ్ళాడు. వసంత సోఫా లో కూర్చొని మొహం చేతులతో కప్పుకొని ఏడుస్తుంది. ఆమె స్థితికి జాలిపడ్డాడు రాజ్.
'వసంతా, నాన్నగారు త్వరగా కోలుకోవాలంటే రెండు రోజులు వరకు వారి కంట పడకు" అన్నాడు.
తలెత్తి అతని కళ్ళలోకి చూసింది వసంత. నిస్సహాయత చూపిస్తూ తప్పదంటున్నాయి ఆ కళ్ళు.
"భయపడుతున్నావా, వసంతా!"
"లేదు. మీరు వారి ప్రక్క నుండగా వారి కెలాంటి భయం లేదని నాకు తెలుసు. మీ చెయ్యి పడితే చాలు, వారికీ జబ్బు నయమవుతుంది."
అక్కడి నుండి తిరిగి వచ్చేశాడు రాజ్.
గదిలోకి వెళ్ళి పడుకొన్న వసంత కు చదువు కోవాలని పించి పుస్తకాలు తీసింది కాని ఆ పని చేతకాక తిరిగి పడుకొంది. నిద్ర రావడం లేదు. కడకు తండ్రి చేత కూడా అసహ్యింప బడింది తను. తన ఎదుటే తనను గౌరవిస్తున్నారు తన మిత్రులు. అదీ తన అందాన్ని చూసి, తన వెనుక తన గురించి ఎటువంటి మాటలు, విమర్శలు జరుగుతున్నాయో తను ఊహించుకోగలదు. ఛీ; పాడు బ్రతుకు! అని నిద్రకు ఉపక్రమించింది.
వసంత కు పెళ్లి నిశ్చయం చేశారు ఆనందరావు గారు. ఆనాడు ఆమె పెళ్లి. పెళ్ళి పందిరి కోలాహలంగా ఉంది. వసంత మరోకరిదై పోయింది. ఒకరి పాదదాసి . ఎవరా ఒకరు? రాజశేఖరం. ఆ పెళ్లి ఆమె కిష్టమో లేదో ఆమెకే తెలియదు. ఆమె స్వేచ్చ అరికట్ట బడింది.

కానీ అది ఆమె కిష్టం లేదు. తన స్వేచ్చను వదులుకో లేదు. తన ఆనందాని కడ్డు రాకూడదని ప్రతిఘటించింది. ఏమీ అనలేక పోయాడు రాజ్ తన యిష్టం వచ్చినట్లు తిరిగింది. తన కిష్టమైన వారితో స్నేహం చేసికొంది. అడ్డు చెప్పే అధికారం రాజ్ కు లేదు. ప్రతిఫలంగా అవమానాల పాలయ్యాడు . మానవత్వపు సహనానికి హద్దులను మించి ఓర్పు వహించాడు. దుర్భరమై పోయింది జీవితంలో విసిగిపోయాడు. యౌవానం లో అనుభవించవలసిన ఆనందం బదులు నరకాన్నే అనుభవించాడు. ఎవరి కోసం ఈ మౌనాన్ని వహించాలి? ఎందుకీ పాడు జీవితం? ఆలోచించాడు. మనశ్శాంతి అనే చావును వెతుక్కుంటూ ప్రయాణ మయ్యాడు. తన తప్పు తెలుసుకొని క్షమాపణ కై అతన్ని వేడుకొంది. కానీ అదివరకే అతని హృదయాన్ని కఠిన శిలగా మార్చిన ఆమెకు క్షమాపణ దొరకలేదు. ఎక్కడికో [పోతున్నాడు. ఎత్తైన కొండల నుండి తనను దాచుకొమ్మని అగాధమైన లోయలలోకి వెళ్ళిపోయాడు.
కలవరపాటుతో ఉలిక్కిపడి నిద్ర మేల్కొంది వసంత. గదిలో దీపం వెలుగుతుంది . కలను తలుచుకొని భయపడింది. క్రిందికి వచ్చి చూసింది. తండ్రి గదిలో రాజ్ చదువు కుంటున్నాడు. అక్కడే సోఫాకు జేరగిల బడి నిద్ర పోయింది.
ఎక్కడో సైరన్ మ్రోత ఆమెను నిద్ర లేపింది. టైం చూసుకొంది. అయిదయింది. తండ్రి గదిలో రాజ్ ఇంకా మేల్కొనే ఉన్నాడు. ఆశ్చర్య పోయింది.
ఎందుకంత మమకారం? అతనెవరు? నాన్నగారికీ, అతనికీ గల సంబంధ బాంధవ్యా లేమిటి? ఏమీ లేవు. అతని చదువుకు సహాయం చేస్తున్నాడు తండ్రి. అందుకని నాన్నగారి పై అంత భక్తీ ఉందా? అర్ధం కాని అంతర్యమే. కన్న కూతురైనా తను ఆ సేవలు చేయలేదు. తన కంత ఓపిక లేదు. రక్తాన్ని పంచుకును పుట్టిన బిడ్డలకే లేని మమత , మమకారాలను ఎవరికో ఇచ్చి వారి చేత పరిచర్యలు చేయిస్తున్నాడు భగవంతుడు. "నీ లీలలు అమోఘం!" అనుకోని వేను తిరిగింది.
ఉదయానికి పూర్తిగా కోలుకొన్నారు ఆనందరావు గారు. డాక్టరు గారు వచ్చి చూసి పొయ్యారు.
"నువ్వు కాలేజీ కి కెళ్ళవోయ్! నాకేం ఫర్వాలేదు" అన్న అయన గారి అజ్ఞ కాదనే ధైర్యం లేక కాలేజీ కి బయలు దేరాడు రాజ్. కాలేజీ లో మూడవ పీరియడు క్లాసు లేకపోవడంతో ఇంటికి తిరిగి బయలుదేరాడు. ఆనంద్ తనను చూసి తల త్రిప్పుకొని పొయ్యాడు. అది తనకు బాధాకరంగా ఉంది.
"ఏమండీ?' అన్న పిలుపు విని వెనుతిరిగి చూశాడు. లత.
"ఏం, లతా!" అని ఆమెను కాసేపు ఉడికించాలనుకొన్నాడు మనసులో.
"మీరు ఒకసారి మా యింటికి రావాలి."
"ఎందుకూ?' ఆశ్చర్యపోయాడు రాజ్.
"మీకు కాఫీ ఇవ్వాలని ఉంది."
"ఇక్కడే క్యాంటిన్ లో ఇప్పిస్తే సరిపోతుందిగా!"
'అది కదండీ! ఇంట్లోనే ఇవ్వాలని మా అక్కయ్య తీసుకు రమ్మంది." అంది లత, ఎక్కడ రానంటాడో నని.
ఇందులు ముఖ్య పాత్ర దారులు కూడా ఒకరున్నారా అని ఆశ్చర్యపోయాడు. కొంపదీసి వీళ్ళక్కయ్య కూడా ఏదైనా చిక్కుల్లో పడి సలహా కోసం ఈవిడ గారి రికమెండేషన్ పై అడ్వాన్సు గా కాఫీ లంచంగా పడేస్తుందా అని అనుమానపడి తన ఊహకు తనే నవ్వుకున్నాడు. అయినా ఈ మధ్య తాను సలహాల రావు అయిపోయాడేమిటి? తన పేరైనా మార్చుకుంటే బావుంటుంది.
"ఏమంటారు? సాయంకాలం వస్తారా?"
"ఇంతకూ ఏ సందర్భం లో ఈ ఆహ్వానం జరుగుతుందో తెలుసుకోవచ్చా?' ఎందుకైనా మంచిదని ముందుగానే అడిగేశాడు.
'మీరు నా జీవితానికో మార్గం చూపించారు. అందుకు కనీసం కృతజ్ఞత నైనా తెలుపుకోవాలిగా?"
"ఇది నాకు లంచమా!"
"ఎలాగైనా అనుకోవచ్చు" నవ్వింది లత.
"కొంపదీసి అలా ఎవ్వరితో నైనా చెప్పేరు. అవినీతి నిరోధక శాఖ అని ఒకటి బయలుదేరిందీ మధ్య మన కాలేజీ లో. నేను మీ దగ్గర లంచం పుచ్చుకున్నానని వారు తెలుసుకుంటే నామీద దాడి చేసి ఎంక్వయిరీలంటూ పలుమార్లు వచ్చి ఒక కాఫీకి బదులుగా ఏ అయిదారు కాఫీలైనా మర్యాద అనే లంచంగా తీసుకొని మరీ విడిచి పెడతారు. ముందే బీదవాడ్ని . అంతపని చేయకండి. భరించలేను."
అతని మాటలకు నవ్వకుండా ఉండలేక పోయింది లత. "మీరు చాలా తమాషా గా మాట్లాడుతుంటారే!"
'అది అప్పుడప్పుడు మనకొచ్చే జబ్బు. ఇంతకూ రాక తప్పదంటావా?"
"ఊహూ. ఏం లాభం లేదు."
"సరే , రేపు అడిరామ వస్తాను" అని ఆమె దగ్గర సెలవు తీసుకొని ముందుకు నడిచాడు.
కారు హరన్ వినిపించింది. అదేవరిదో గ్రహించగలిగేంత లో ఆ కారు అతని ప్రక్కనే ఆగింది.
"ఇంటి కోస్తున్నారా?" ప్రశ్నించింది వసంత. ఔనని తల ఊపాడు.
'అయితే కారేక్కండి' అని తలుపు తీసింది వసంత. ఆమెను నిరుత్సాహ పరచడం ఇష్టం లేక కారెక్కాడు.
"మీకూ క్లాసులు లేవా?' అడిగింది వసంత.
'అంటే మీకు గూడా లేవా?' తిరిగి ప్రశ్నించాడు రాజ్.
"మా క్లాసు వారు స్ట్రైక్ చేస్తున్నారు."
"కారణం?"
"క్రొత్తగా వచ్చారు, భానుమూర్తి గారని లెక్చరర్ గారు . తెలుసా?"
"ఆ వామనరావు గారి వెంట ఉండేవారే కదా?' తెలుసు."
'అయన ఉన్నట్లుండి ,ఆ క్లాసు తీసుకోవడం మానేశారు. మాకు ఆయనే కావాలని విద్యార్ధులు స్ట్రైక్ చేశారు. అయన ససేమిరా అని మొండి కేశారు."
"ఆయన మీ క్లాసు తీసుకోక పోవడానికి కారణమేమిటో నీకు తెలుసా?"
"ఆ ప్రశ్న విని కంగారు పడి స్టీరింగ్ వదిలేసి తిరిగి సంబాళించుకోంది వసంత. అది చూసి అనుమానంగా ఆమె మొహం లోని భావాలను కనిపెట్టడానికి ప్రయత్నించాడు రాజ్. ఏదో దాచ ప్రయత్నిస్తుంది వసంత. మోహంలోనికి చిరునవ్వు తెచ్చుకొని "నాకెలా తెలుస్తుంది?' అంది.
రాజ్ మౌనం వహించాడు.
"రాత్రి కాసేపయినా నిద్ర పోయారా?' అడిగింది వసంత.
"ఊ."
"అబద్దాలాడటం కూడా అలవాటుందా?"
"తెలిసి అడగడం దేనికి?"
"ఒక విషయం అడుగుతాను చెప్తారా?"
"ప్రయత్నిస్తాను."
